కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇదిగో! అద్భుతమైన వెలుగు!

ఇదిగో! అద్భుతమైన వెలుగు!

ఇదిగో! అద్భుతమైన వెలుగు!

మీరు చీకట్లో ఎప్పుడైనా తడబడుతూ నడిచివుంటే అలా నడవడం ఎంత విసుగుపుట్టిస్తుందో మీకు తెలుసు. వెలుగు ఎంత ఉపశమనాన్నిస్తుందో కదా! మీరు కటిక చీకట్లో ఉన్నారనే భావన కలిగించిన పరిస్థితిని కూడా మీరు ఎదుర్కొని ఉండొచ్చు. మీరొక సమస్యను పరిష్కరించుకోలేకపోయినప్పుడు మీకు అలా అనిపించివుండవచ్చు. ఆ తర్వాత మీరు క్రమంగా వెలుగును చూశారు, మీకు పరిష్కారం దొరికింది. అలాంటి చీకటి నుండి వెలుగులోకి రావడం ఒక అద్భుతమైన అనుభూతి.

మొదటి శతాబ్దంలో చాలామంది ఆధ్యాత్మిక చీకట్లో ఉన్నారు. తమ పాత నమ్మకాలను విడిచి క్రైస్తవత్వాన్ని స్వీకరించినవారిని సంబోధిస్తూ అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన [దేవుడు] మిమ్మల్ని పిలిచాడు.” (1 పేతురు 2:⁠9, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అలా స్వీకరించడంవల్ల, కటిక చీకట్లో నుండి ప్రకాశవంతమైన వెలుగులోకి వచ్చినట్లు వారికి అనిపించింది. ఆ మార్పును, ఎలాంటి నిరీక్షణ లేకుండా ఒంటరిగా ఉన్న వ్యక్తి ఆ తర్వాత సురక్షితమైన భవిష్యత్తున్న ఒక కుటుంబ సభ్యునిగా మారడంతో కూడా పోల్చవచ్చు.​—⁠ఎఫెసీయులు 2:​1, 12.

“మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి”

తొలి క్రైస్తవులు “సత్యమును” అంటే నిజమైన క్రైస్తవ విశ్వాసాన్ని కనుగొన్నారు. (యోహాను 18:​37) వారు అద్భుతమైన సత్యపు వెలుగును చూసి ఆధ్యాత్మిక చీకటిలో నుండి ప్రకాశవంతమైన వెలుగులోకి వచ్చారు. అయితే సమయం గడిచేకొద్దీ, కొంతమంది క్రైస్తవుల్లో మొదట్లో ఉన్న ఉత్సాహం సన్నగిల్లింది. ఉదాహరణకు మొదటి శతాబ్దాంతానికల్లా ఎఫెసు సంఘంలో తీవ్ర సమస్య ఏర్పడింది. పునరుత్థానం చేయబడ్డ యేసుక్రీస్తు ఆ సమస్యను గుర్తించాడు, ఆయన ఇలా అన్నాడు: “మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది. నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము.” (ప్రకటన 2:​4, 5) ఎఫెసులోని క్రైస్తవులు దేవునిపట్ల, సత్యంపట్ల తమకున్న ప్రేమను పునరుజ్జీవింపజేసుకోవాలి.

మరి మన విషయమేమిటి? మనం కూడా వెలుగును చూడడంవల్ల, దేవుని వాక్యంలోని అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోవడంవల్ల కలిగే ఆనందాన్ని చవిచూశాం. మనం సత్యాన్ని ప్రేమించడం ప్రారంభించాం. కానీ మానవులుగా మనం ఎదుర్కొనే సమస్యలు సత్యంపట్ల మన ప్రేమను తగ్గించగలవు. దానితోపాటు “అంత్యదినములలో” ప్రత్యేకంగా ఎదురయ్యే సమస్యలు కూడా మనకు ఎదురవచ్చు. “అపాయకరమైన కాలముల” ద్వారా గుర్తించబడే లోకంలో, “స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు” వంటి గుణాలున్న ప్రజలమధ్య మనం జీవిస్తున్నాం. (2 తిమోతి 3:​1, 2) వారి ప్రభావం మన ఉత్సాహాన్ని నీరుగార్చి, యెహోవాపట్ల మనకున్న ప్రేమ సన్నగిల్లేలా చేయవచ్చు.

మొదట్లో ఉన్న ప్రేమను మనం కోల్పోతే, మనం ‘ఏ స్థితిలోనుండి పడ్డామో అది జ్ఞాపకము చేసుకొని మారుమనస్సు’ పొందాలి. మన మొదటి ఆధ్యాత్మిక స్థితికి తిరిగి చేరుకోవాలి. అంతేకాక, సత్యంపట్ల మనకున్న ప్రేమ సన్నగిల్లకుండా జాగ్రత్తపడాలి. మనమందరం ఆశాజనకమైన, ఉత్సాహపూరితమైన దృక్పథాన్ని కాపాడుకుంటూ, దేవునిపట్ల, ఆయన సత్యంపట్ల మనకున్న ప్రేమను సజీవంగా ఉంచుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా!

‘మనల్ని స్వతంత్రుల్ని చేసే సత్యం’

వేలాది సంవత్సరాలుగా మానవులను కలవరపెడుతున్న ప్రాముఖ్యమైన ప్రశ్నలకు బైబిలు జవాబిస్తుంది కాబట్టి, లేఖనాధార సత్యపు వెలుగు అద్భుతమైనది. ఆ ప్రశ్నల్లో కొన్ని: మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? జీవిత సంకల్పమేమిటి? దుష్టత్వం ఎందుకు ఉంది? మరణానంతర జీవితం ఉందా? యెహోవా అద్భుతమైన సైద్ధాంతిక సత్యాల గురించిన జ్ఞానాన్ని మనకిచ్చాడు. వాటిని మనకు ఇచ్చినందుకు మనమాయనపట్ల నిజంగా కృతజ్ఞతతో ఉండవద్దా? మనం నేర్చుకున్న విషయాలను ఎన్నడూ తేలిగ్గా తీసుకోకుండా ఉందాం!

యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “మీరు . . . సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” (యోహాను 8:​31, 32) యేసు విమోచన క్రయధన బలి ద్వారా పాపమరణాల నుండి విముక్తి పొందే మార్గం మనకు ఏర్పడింది. అయితే ఈ అమూల్యమైన సత్యాలు అంధకారం అలుముకున్న లోకంలో ఉన్న అజ్ఞానం, అనిశ్చిత పరిస్థితుల నుండి కూడా మనల్ని స్వతంత్రులను చేశాయి. మనం నేర్చుకున్న విషయాలను కృతజ్ఞతతో ధ్యానించడం యెహోవాపట్ల, ఆయన వాక్యంపట్ల మనకున్న ప్రేమ బలపడేందుకు దోహదపడుతుంది.

అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకలోని క్రైస్తవులకు ఇలా రాశాడు: “మీరు దేవునిగూర్చిన వర్తమానవాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి . . . ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.” (1 థెస్సలొనీకయులు 2:​13) థెస్సలోనీయులు దేవుని వాక్యాన్ని విని ‘ఆనందముతో దానిని అంగీకరించారు.’ వారు ఇక “చీకటిలో” లేరు. బదులుగా వారు “వెలుగు సంబంధులు”గా మారారు. (1 థెస్సలొనీకయులు 1:​4-7; 5:​4, 5) యెహోవా సృష్టికర్త అని, ఆయన సర్వశక్తిగల, తెలివి, ప్రేమ, దయగల వ్యక్తి అని ఆ క్రైస్తవులు తెలుసుకున్నారు. యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి ద్వారా తమ పాపాలను తుడిచివేసే ఏర్పాటు చేశాడని క్రీస్తు ఇతర అనుచరుల్లాగే వారు కూడా తెలుసుకున్నారు.​—⁠అపొస్తలుల కార్యములు 3:​19-21.

థెస్సలొనీయులకు బైబిలు సత్యానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లేకపోయినా, జ్ఞానం కోసం ఎక్కడ పరిశోధించాలో వారికి తెలుసు. ప్రేరేపిత వాక్యాలు, దైవజనుడు “సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు” చేయగలవు. (2 తిమోతి 3:​16, 17) థెస్సలొనీకలోని క్రైస్తవులు దేవుని వాక్య అధ్యయనాన్ని కొనసాగించి, దేవుని నుండి వచ్చిన వెలుగు నిజంగా అద్భుతమైనదనే అనుభూతిని పదేపదే పొందవచ్చు. అన్ని సమయాల్లో సంతోషంగా ఉండేందుకు వారికి కారణముంది. (1 థెస్సలొనీకయులు 5:​16) అలాగే మనకు కూడా కారణం ఉంది.

మన త్రోవకు వెలుగు

వెలుగు అద్భుతంగా ఉండడానికిగల కారణాన్ని తెలియజేస్తూ కీర్తనకర్త ఇలా పాడాడు: “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.” (కీర్తన 119:​105) దేవుని వాక్యం నుండి మనకు లభించే దైవిక నిర్దేశం మన జీవనగమనాన్ని నిర్ణయించుకోవడానికి, ఒక సంకల్పంతో జీవించడానికి మనకు సహాయం చేస్తుంది. మనం ప్రవాహంలో కొట్టుకొనిపోయే ఓడలా ఉండనక్కరలేదు. సత్యాన్ని తెలుసుకొని, దానిని అన్వయించుకోవడం “కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడి” పోకుండా మనల్ని రక్షిస్తుంది.​—⁠ఎఫెసీయులు 4:​14.

“రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి” అని బైబిలు చెబుతోంది. అలాగే అది “ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు” లేక సంతోషంగా ఉంటాడు అని కూడా చెబుతోంది. (కీర్తన 146:​3, 5) అంతేకాక, యెహోవాపట్ల నమ్మకముంచడం మనం భయాన్ని, ఆందోళనను అధిగమించేందుకు సహాయం చేస్తుంది. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:​6, 7) దేవుని వాక్య వెలుగు ద్వారా నడిపించబడితే మనకు నిజంగా ప్రయోజనం చేకూరుతుంది.

లోకంలో జ్యోతుల్లా కనబడండి

దేవుని వాక్య వెలుగు అద్భుతంగా ఉండడానికి మరో కారణం, మానవులు అతి ప్రాముఖ్యమైన నియామకాన్ని పొందే అవకాశాన్ని అది కల్పిస్తుంది. యేసు తన అనుచరులకు ఇలా ఆదేశించాడు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” వారికి ఆ ఆజ్ఞ ఇచ్చేముందు ఆయనిలా చెప్పాడు: “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.”​—⁠మత్తయి 28:​18-20.

సువార్త ప్రకటించే పనిలో, సమస్త జనులకు బైబిలు సత్యాలను బోధించే పనిలో నిజ క్రైస్తవులకు ఎవరు సహాయం చేస్తున్నారో ఆలోచించండి. తాను వారితో ఉంటానని యేసు తన అనుచరులకు వాగ్దానం చేశాడు. వారు ఆ విధంగా ‘తమ వెలుగును ప్రకాశింపజేస్తుండగా,’ మరితర “సత్క్రియలను” చేస్తుండగా ఆయన వారికి తమ పరిచర్యలో సహాయం చేస్తూ, మద్దతిస్తూ ఉన్నాడు. (మత్తయి 5:​14-16) దేవదూతలు కూడా సువార్త ప్రకటనా పనిలో పాల్గొంటున్నారు. (ప్రకటన 14:⁠6) మరి యెహోవా దేవుని విషయమేమిటి? అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే.” “దేవుని జతపనివారి”లో ఒకరిగా ఉండడం ఎంత గొప్ప ఆధిక్యతో కదా!​—⁠1 కొరింథీయులు 3:​6, 9.

దేవుడు నియమించిన ఈ పనిలో మనం చేసే ప్రయత్నాలు ఎలా ఆశీర్వదించబడుతున్నాయో కూడా ఆలోచించండి. “లోకమందు జ్యోతులవలె” కనబడడమనే దేవుడు ఇచ్చిన ఆధిక్యతను మరి ఏ ఇతర ఆధిక్యతతోనూ పోల్చలేం. మన మాటల్లో, చేతల్లో దేవుని వాక్య వెలుగును ప్రతిబింబించడం ద్వారా యథార్థహృదయులకు మనం నిజమైన సహాయం చేయగలుగుతున్నాం. (ఫిలిప్పీయులు 2:​14-16) అంతేకాక, మనం ఉత్సాహంగా ప్రకటిస్తుండగా, బోధిస్తుండగా మనం సంతోషించవచ్చు, ఎందుకంటే, ‘మనం చేసిన కార్యమును, తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు.’​—⁠హెబ్రీయులు 6:​10.

‘మీ కన్నులకు కాటుక కొనండి’

మొదటి శతాబ్దపు లవొదికయ సంఘానికి ఇచ్చిన సందేశంలో యేసు ఇలా అన్నాడు: “నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుము . . . నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను.” (ప్రకటన 3:​18, 19) యేసు బోధలు, క్రమశిక్షణ అనే “కాటుక,” ఆధ్యాత్మిక గ్రుడ్డితనానికి సరైన మందు. మనం ఆధ్యాత్మికంగా సరైన దృక్పథాన్ని కాపాడుకోవాలంటే మనం ఆయన సలహాను అంగీకరించి, దానికి లోబడడంతోపాటు బైబిల్లో ఉన్న నిర్దేశానికి కూడా లోబడాలి. మనం క్రీస్తులాంటి మనోవైఖరిని అవలంబించి ఆయన మాదిరిని కూడా అనుకరించాలి. (ఫిలిప్పీయులు 2:⁠5; 1 పేతురు 2:​21) కన్నులకు కాటుక ఉచితంగా దొరకదు. యేసు “[దానిని] నాయొద్ద కొనుము” అని చెప్పాడు. దానిని కొనడంలో మన సమయం, కృషి ఇమిడివుంది.

మనం చీకటిగా ఉన్న ప్రాంతం నుండి వెలుతురున్న గదిలోకి ప్రవేశించినప్పుడు మన కళ్లు ఆ మార్పుకు సర్దుకోవడానికి కొంతసేపు పట్టవచ్చు. అలాగే దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి సత్యపు వెలుగును చూడడానికి సమయం పడుతుంది. మనం నేర్చుకుంటున్నవాటిని ధ్యానించి, సత్యం ఎంత అమూల్యమైనదో ఆలోచించడానికి సమయం పడుతుంది. అయితే దానికయ్యే ఖర్చు ఎంతో కాదు. ఎందుకు? ఎందుకంటే, వెలుగు అద్భుతమైనది!

[14వ పేజీలోని చిత్రం]

“నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుము”