భర్తలారా, క్రీస్తు శిరస్సత్వాన్ని గుర్తించి అనుసరించండి

భర్తలారా, క్రీస్తు శిరస్సత్వాన్ని గుర్తించి అనుసరించండి

భర్తలారా, క్రీస్తు శిరస్సత్వాన్ని గుర్తించి అనుసరించండి

“ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు.”​—⁠1 కొరింథీయులు 11:⁠3.

ఒక భర్త విజయాన్ని మీరు దేనితో కొలుస్తారు? ఆయన మానసిక, శారీరక సామర్థ్యాల ఆధారంగానా? డబ్బు సంపాదించగల ఆయన సామర్థ్యం ఆధారంగానా? లేక ప్రత్యేకంగా ఆయన తన భార్యాబిడ్డలను ప్రేమానురాగాలతో చూసుకోవడం ఆధారంగానా? ఈ చివరి ఆధారాన్నిబట్టి చూస్తే చాలామంది భర్తలకు తక్కువ మార్కులు వస్తాయి, ఎందుకంటే వారు లోకాత్మచేత, మానవ ప్రమాణాలచేత ప్రభావితం చేయబడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే వారు చాలామేరకు వివాహ స్థాపకుణ్ణి, ‘నరుని నుండి ప్రక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించిన’ దేవుణ్ణి గుర్తించడంలో, ఆయన ఇస్తున్న నిర్దేశాన్ని అన్వయించుకోవడంలో విఫలమవుతున్నారు.​—⁠ఆదికాండము 2:​21-24.

2 దేవుడు ఏర్పాటుచేసిన ఈ వివాహానికి సంబంధించిన బైబిలు వృత్తాంతాన్ని బలపరుస్తూ యేసుక్రీస్తు తనకాలంలోని విమర్శకులతో ఇలా అన్నాడు: “సృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు​—⁠ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు [వివాహమందు] జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” (మత్తయి 19:​4-6) వాస్తవమేమిటంటే, వివాహానికి దైవిక మూలముందని, దాని విజయం దేవుని వాక్యమైన బైబిల్లో కనిపించే ఉపదేశాన్ని అన్వయించుకోవడంపై ఆధారపడి ఉందని గుర్తించడమే వైవాహిక విజయానికి కీలకం.

భర్త విజయానికి కీలకం

3 భర్తగా విజయం సాధించేందుకు, యేసు చెప్పినదాన్ని అధ్యయనం చేసి, ఆయన చేసింది అన్వయించుకోవడం సహాయం చేస్తుంది. యేసు మొదటి మానవ జత సృష్టించబడినప్పుడేకాక, వారి వివాహమప్పుడూ ఉన్నాడు కాబట్టి, ఈ విషయంపై ఆయనకున్న జ్ఞానం అపారం. యెహోవా దేవుడు ఆయనతో ఇలా అన్నాడు: “మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము.” (ఆదికాండము 1:​26) అవును, దేవుడు అందరికన్నా, అన్నింటికన్నా ముందుగా సృష్టించినవానితో, ‘తనయొద్ద ప్రధాన శిల్పిగావున్న’ వానితో మాట్లాడుతున్నాడు. (సామెతలు 8:​22-30) ఆయన “సర్వసృష్టికి ఆదిసంభూతుడు.” ఆయన భౌతిక విశ్వం సృష్టించబడడానికి పూర్వమే ఉనికిలోవున్నాడు, ఆయన “దేవుని సృష్టికి ఆది.”​—⁠కొలొస్సయులు 1:​15; ప్రకటన 3:​14.

4 యేసు “దేవుని గొఱ్ఱెపిల్ల” అని పిలవబడి, సూచనార్థక భర్తగా వర్ణించబడ్డాడు. ఒక దేవదూత ఓ సందర్భంలో ఇలా అన్నాడు: “ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదను.” (యోహాను 1:​29; ప్రకటన 21:⁠9) అయితే ఆ పెండ్లికుమార్తె లేదా భార్య ఎవరు? క్రీస్తుతోపాటు పరలోక పరిపాలనలో భాగంవహించే ఆయన నమ్మకమైన ఆత్మాభిషిక్త అనుచరులు “గొఱ్ఱెపిల్లయొక్క భార్య”గా ఉంటారు. (ప్రకటన 14:​1, 3) కాబట్టి, భర్తలు తమ భార్యలను ఎలా చూసుకోవాలనే విషయంలో, యేసు భూమ్మీద ఉన్నప్పుడు తన అనుచరులను చూసుకున్న విధానం ఒక మాదిరిని ఉంచుతుంది.

5 నిజమే, యేసు తన అనుచరులందరికీ మాదిరి ఉంచాడని బైబిలు చెబుతోంది, అందులో మనమిలా చదువుతాం: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” (1 పేతురు 2:​21) అయితే ఆయన ప్రత్యేకంగా పురుషులకు ఒక మాదిరిగా ఉన్నాడు. బైబిలు ఇలా చెబుతోంది: ‘ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తుకు శిరస్సు దేవుడు.’ (1 కొరింథీయులు 11:⁠3) పురుషునికి శిరస్సు క్రీస్తు కాబట్టి, భర్తలు ఆయన మాదిరిని అనుకరించాలి. అందువల్ల, కుటుంబం విజయవంతమై, సంతోషంగా ఉండాలంటే, శిరస్సత్వపు సూత్రాన్ని తప్పక అన్వయించుకోవాలి. ఆ సంతోషం దక్కాలంటే యేసు తన సూచనార్థక భార్యగావున్న తన అభిషిక్త శిష్యులతో ఎలా వ్యవహరించాడో అలాగే భర్తలు కూడా తమ భార్యలతో ప్రేమపూర్వకంగా వ్యవహరించాలి.

వైవాహిక సమస్యలతో వ్యవహరించే విధానం

6 నేటి కలవరభరిత లోకంలో, భర్తలు ప్రత్యేకంగా ఓర్పు, ప్రేమ, నీతిసూత్రాలకు స్థిరంగా హత్తుకునే విషయంలో యేసు మాదిరిని అనుకరించాలి. (2 తిమోతి 3:​1-5) యేసు ఉంచిన మాదిరి గురించి మనం బైబిల్లో ఇలా చదువుతాం: “అటువలెనే పురుషులారా, . . . జ్ఞానము చొప్పున వారితో [మీ భార్యలతో] కాపురము చేయుడి.” (1 పేతురు 3:⁠7) అవును, యేసు జ్ఞానంతో శ్రమలను ఎదుర్కొన్నట్లే, భర్తలు తమ వైవాహిక సవాళ్లను జ్ఞానంతో ఎదుర్కోవాలి. ఆయన వేరెవరికన్నా ఎక్కువగా తీవ్రమైన శ్రమలు అనుభవించాడు, అయితే ఆ శ్రమలకు సాతాను, అతని దయ్యాలు, ఈ దుష్ట లోకం కారణమని ఆయనకు తెలుసు. (యోహాను 14:​30; ఎఫెసీయులు 6:​12) శ్రమలు వచ్చినప్పుడు యేసు ఆశ్చర్యపోలేదు, అలాగే దంపతులు కూడా “శరీరసంబంధమైన శ్రమలు” వచ్చినప్పుడు ఆశ్చర్యపోకూడదు. వివాహం చేసుకునేవారు అలాంటి శ్రమలొస్తాయని ఎదురుచూడవచ్చని బైబిలు హెచ్చరిస్తోంది.​—⁠1 కొరింథీయులు 7:​28.

7 భర్తలు తమ భార్యలు ‘ఎక్కువ బలహీనమైన ఘటములని వారిని సన్మానించి, జ్ఞానము చొప్పున వారితో కాపురము’ చేయాలని బైబిలు చెబుతోంది. (1 పేతురు 3:⁠7) పురుషుల సాధారణ ప్రవర్తన గురించి బైబిలు ముందే చెప్పినట్లుగా భార్యపై కఠినంగా అధికారం చెలాయించే బదులు, దేవుని ఆమోదంపొందే భర్త ఆమెను గౌరవిస్తాడు. (ఆదికాండము 3:​16) తనకు లభించిన సంపదగా ఆమెను చూసుకొనేందుకు ఇష్టపడుతూ, ఆమెకు హాని కలిగేలా అధికంగావున్న తన శారీరక బలాన్ని ఉపయోగించడు. బదులుగా, ఆయన ఆమె భావాలను పరిగణలోకి తీసుకుంటూ ఆమెనెల్లప్పుడూ గౌరవమర్యాదలతో చూసుకుంటాడు.

8 భర్తలు తమ భార్యలను ఎందుకు తగిన రీతిలో సన్మానించాలి? దానికి బైబిలు, ‘జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు’ అని జవాబిస్తోంది. (1 పేతురు 3:⁠7) యెహోవా, తనను ఆరాధించే పురుషుడు, తనను ఆరాధించే స్త్రీకన్నా ఉన్నతుడని పరిగణించడని భర్తలు అర్థం చేసుకోవాలి. దేవుని ఆమోదానికి అర్హులుగా పరిగణించబడే స్త్రీలు పురుషులతో సమానంగా నిత్యజీవమనే ప్రతిఫలం పొందుతారు. వారిలో చాలామంది పరలోక జీవాన్నికూడా పొందుతారు, అక్కడ “పురుషుడని స్త్రీ అని లేదు.” (గలతీయులు 3:​28) కాబట్టి నమ్మకత్వమే ఒక వ్యక్తిని దేవుని ఎదుట ప్రశస్తమైనవానిగా చేస్తుందని భర్తలు గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి పురుషుడా లేక స్త్రీనా, భర్తా లేక భార్యా లేదా పిల్లవాడా అనేది ప్రాముఖ్యం కాదు.​—⁠1 కొరింథీయులు 4:⁠2.

9 భర్త తన భార్యను గౌరవించాల్సిన అవసరత, “మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు” అని అపొస్తలుడైన పేతురు పలికిన మాటల్లో నొక్కిచెప్పబడింది. అలా అభ్యంతరం కలగడమెంత ప్రమాదకరం కాగలదో కదా! గతంలో నిర్లక్ష్యపరులైన కొంతమంది దేవుని సేవకుల విషయంలో జరిగినట్లే, అది భర్తయొక్క ప్రార్థనలు అడ్డగించబడేందుకు కూడా దారి తీయగలదు. (విలాపవాక్యములు 3:​43, 44) క్రైస్తవ పురుషులు వివాహితులైనా, వివాహం గురించి ఆలోచిస్తున్నా యేసు స్త్రీలను ఎలా గౌరవించాడో అధ్యయనం చేయడం జ్ఞానయుక్తం. ఆయన తనతోపాటు పరిచర్యలో పాల్గొంటున్న గుంపులో చేరమని వారిని ఆహ్వానించడమేకాక, వారితో దయగా, గౌరవంగా వ్యవహరించాడు. ఒక సందర్భంలో, యేసు స్త్రీలకే మొదటిగా అత్యంత ఆశ్చర్యకరమైన సత్యాన్ని సహితం వెల్లడిచేసి, దానిని పురుషులకు తెలియజేయమని వారికి చెప్పాడు.​—⁠మత్తయి 28:​1, 8-10; లూకా 8:​1-3.

ప్రత్యేకంగా భర్తలకు మాదిరి

10 ఇంతకుముందు పేర్కొన్నట్లుగా బైబిలు, భార్యాభర్తల మధ్య ఉండే బంధాన్ని, క్రీస్తుకు తన “పెండ్లికుమార్తె”కు అంటే అభిషిక్త అనుచరుల సంఘానికి మధ్యనున్న బంధంతో పోలుస్తోంది. బైబిలు ఇలా చెబుతోంది: “క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు.” (ఎఫెసీయులు 5:​23) యేసు తన అనుచరులకు ఎలాంటి శిరస్సత్వాన్ని లేదా నాయకత్వాన్ని అందించాడో పరిశీలించేలా ఈ మాటలు భర్తలను ప్రోత్సహించాలి. అలా పరిశీలించినప్పుడు మాత్రమే భర్తలు యేసు మాదిరిని అనుకరిస్తూ ఆయన సంఘంపట్ల వ్యవహరించినట్లే తమ భార్యలకు నిర్దేశమిస్తూ వారిని ప్రేమించి, శ్రద్ధగా చూసుకోగలుగుతారు.

11 “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను” అని బైబిలు క్రైస్తవులకు ఉద్బోధిస్తోంది. (ఎఫెసీయులు 5:​25) ఎఫెసీయుల పత్రికలో దీని ముందరి అధ్యాయంలో “సంఘము,” “క్రీస్తు శరీరము” అని పిలవబడింది. ఈ సూచనార్థక శరీరములో, ఆ శరీరము సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడే అవయవాలుగావున్న స్త్రీపురుషులు చాలామంది ఉన్నారు. అయితే “సంఘము అను శరీరమునకు ఆయనే [యేసే] శిరస్సు.”​—⁠ఎఫెసీయులు 4:​13; కొలొస్సయులు 1:​18; 1 కొరింథీయులు 12:​12, 13, 27.

12 యేసు తన సూచనార్థక శరీరమైన “సంఘము”పట్ల, ప్రత్యేకంగా ఆ సంఘ సభ్యులుకాగల వారి ప్రయోజనార్థమై శ్రద్ధగా పనిచేయడం ద్వారా తన ప్రేమను ప్రదర్శించాడు. ఉదాహరణకు, తన శిష్యులు అలసిపోయినప్పుడు ఆయన వారితో, “మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని” చెప్పాడు. (మార్కు 6:​31) యేసు చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఆయన కార్యకలాపాలను వర్ణిస్తూ ఆయన అపొస్తలులలో ఒకరు ఇలా వ్రాశారు: “[యేసు] తనవారిని [అంటే తన సూచనార్థక శరీర సభ్యులను] ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.” (యోహాను 13:⁠1) భర్తలు తమ భార్యలను ఎలా చూసుకోవాలనే విషయంలో యేసు ఎంత చక్కని మాదిరి ఉంచాడో కదా!

13 భర్తలకోసం యేసు ఉంచిన మాదిరినింకా ప్రస్తావిస్తూ, అపొస్తలుడైన పౌలు వారికిలా ఉద్బోధించాడు: “పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. . . . ఆలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.” పౌలు ఇంకా ఇలా అన్నాడు: “మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను.”​—⁠ఎఫెసీయులు 5:​28, 29, 33.

14 పౌలు పలికిన ఆ మాటల గురించి ఒక్కసారి ఆలోచించండి! మానసికంగా మంచి స్థితిలోవున్న వ్యక్తి కావాలని తన శరీరానికి హాని చేసుకుంటాడా? ఒక వ్యక్తి, అనుకోకుండా తన కాలి బొటనవ్రేలు దేనికైనా గుద్దుకుంటే, అది తాను తడబడేలా చేసినందుకు దానిని చితకబాదుతాడా? అలా ఎంతమాత్రం చేయడు! ఒక భర్త తనను తాను తన స్నేహితుల ఎదుట అవమానపరచుకుంటాడా లేక తన పొరపాట్ల గురించి ఇతరులతో మాట్లాడతాడా? లేదే. అలాంటప్పుడు ఆయన తన భార్య ఏదైనా పొరపాటుచేసినప్పుడు ఆమెపై ఎందుకు నోరు పారేసుకోవాలి లేదా అంతకన్నా ఘోరంగా ఆమెపై ఎందుకు చెయ్యి చేసుకోవాలి? భర్తలు తమ సొంత విషయాలనేకాక, తమ భార్యల విషయాలు కూడా పట్టించుకోవాలి.​—⁠1 కొరింథీయులు 10:​24; 13:⁠5.

15 యేసు తాను చనిపోవడానికి ముందురాత్రి తన శిష్యులు మానవ బలహీనతను ప్రదర్శించినప్పుడు వారిపట్ల ఎలాంటి శ్రద్ధ కనబర్చాడో పరిశీలించండి. ప్రార్థిస్తూ ఉండమని యేసు వారికి పదేపదే చెప్పినా, గెత్సేమనే తోటలో వారు మూడుసార్లు గాఢంగా నిద్రపోయారు. అప్పుడు సాయుధులైన మనుష్యులు అకస్మాత్తుగా వారిని చుట్టుముట్టారు. యేసు ఆ మనుష్యులను “మీరెవని వెదకుచున్నారని” అడిగాడు. “నజరేయుడైన యేసునని” వారు జవాబిచ్చినప్పుడు, ఆయన వారితో “ఆయనను నేనే” అని చెప్పాడు. తాను మరణించవలసిన ‘గడియ వచ్చినదని’ ఎరిగినవాడై ఆయన వారితో, “మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని” చెప్పాడు. యేసు తన సూచనార్థక భార్యలో భాగమైన తన శిష్యుల సంక్షేమాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు, ఆయన వారు తప్పించుకోవడానికి మార్గాన్ని వెదికాడు. యేసు తన శిష్యులను చూసుకున్న విధానాన్ని అధ్యయనం చేసినప్పుడు, భర్తలు తమ భార్యలను చూసుకునే విషయంలో తాము అన్వయించుకోగల అనేక సూత్రాలను చూస్తారు.​—⁠యోహాను 18:​1-9; మార్కు 14:​34-37, 41.

యేసు ప్రేమ భావావేశంపై ఆధారపడింది కాదు

16 బైబిలు ఇలా చెబుతోంది: “యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను,” వారాయనను తరచూ తమ ఇంటికి అతిథిగా ఆహ్వానించేవారు. (యోహాను 11:⁠5) అయినా యేసు, మార్త తాను సిద్ధం చేస్తున్న ఆహారానికి అమిత శ్రద్ధనిస్తూ, ఆయన అందజేస్తున్న ఆధ్యాత్మిక ఉపదేశానికి తక్కువ సమయమిచ్చినప్పుడు ఆయన ఆమెను మందలించకుండా ఉండలేదు. ఆయనిలా అన్నాడు: “మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే.” (లూకా 10:​41, 42) మార్తపట్ల యేసుకున్న ప్రేమ ఆయనిచ్చిన ఉపదేశాన్ని అంగీకరించడం ఆమెకు సులభమయ్యేలా చేసిందనడంలో సందేహం లేదు. అదే విధంగా, భర్తలు తమ భార్యలతో దయగా, ప్రేమగా, చక్కని పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడాలి. అయితే దిద్దుబాటు అవసరమైనప్పుడు యేసులాగే నిర్మొహమాటంగా మాట్లాడడం సముచితం.

17 మరో సందర్భంలో, యేసు తాను యెరూషలేముకు వెళ్లాలని, అక్కడ తాను, “పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలుపొంది, చంపబడి, మూడవదినమున లే[పబడుదును]” అని తన అపొస్తలులకు వివరించాడు. దానికి పేతురు యేసును ప్రక్కకు తీసుకెళ్లి ఆయనను గద్దిస్తూ ఇలా అన్నాడు: “ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదు.” భావావేశంవల్ల పేతురు దృక్కోణం మసకబారిందనేది స్పష్టం. ఆయనను సరిదిద్దడం అవసరం. కాబట్టి యేసు ఆయనతో ఇలా అన్నాడు: “సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావు.”​—⁠మత్తయి 16:​21-23.

18 తాను అనేక హింసలు అనుభవించి చనిపోవాలనేది దేవుని చిత్తమని యేసు అంతకుముందే చెప్పాడు. (కీర్తన 16:​10; యెషయా 53:​12) కాబట్టి పేతురు యేసును గద్దించడం తప్పు. అవును, అప్పుడప్పుడు మనందరికీ అవసరమైనట్లే, పేతురుకు కూడా నిశ్చితమైన దిద్దుబాటు అవసరమైంది. కుటుంబ శిరస్సుగా భర్తకు తన భార్యతోసహా కుటుంబ సభ్యులను సరిదిద్దే అధికారం, బాధ్యత ఉన్నాయి. స్థిరంగా ఉండడం అవసరమైనా, ఈ దిద్దుబాటును దయగా, ప్రేమపూర్వకంగా ఇవ్వాలి. సరైన దృష్టితో విషయాలను చూసేందుకు యేసు పేతురుకు సహాయం చేసినట్లే, భర్తలు కూడా కొన్నిసార్లు తమ భార్యలకు సహాయం చేయాలి. ఉదాహరణకు, ఆమె దుస్తులు, నగలు లేదా అలంకరణ లేఖనాల్లో తగుమాత్రం అని సిఫారసు చేయబడిన దానికి దూరంగా వెళ్తుంటే, కొంత సర్దుబాటు ఎందుకు అవసరమో భర్త ఆమెకు ప్రేమతో సూచించవలసి ఉంటుంది.​—⁠1 పేతురు 3:​3-5.

భర్తలు ఓర్పు వహించడం మంచిది

19 శ్రద్ధ చూపించాల్సిన దోషమేదైనావుంటే, దానిని సరిదిద్దాలనే తమ హృదయపూర్వక ప్రయత్నాలు వెంటనే విజయవంతమౌతాయని భర్తలు అపేక్షించకూడదు. యేసు తన అపొస్తలుల దృక్పథాలను సరిదిద్దేందుకు అనేకమార్లు ప్రయత్నించాల్సివచ్చింది. ఉదాహరణకు, వారిలో పోటీతత్వం పెరగడమేకాక, యేసు పరిచర్య చివర్లోకూడా మళ్ళీ అది విశదమైంది. తమలో ఎవరు గొప్ప అనే విషయంలో వారు వాదులాడుకున్నారు. (మార్కు 9:​33-37; 10:​35-45) అలాంటి రెండవ సందర్భం తర్వాత కొద్దిరోజులకే యేసు వారితో ఏకాంతంగా పస్కాను ఆచరించే ఏర్పాటుచేశాడు. ఆ సందర్భంలో, వాడుకచొప్పున, మట్టి కొట్టుకుపోయిన ఇతరుల కాళ్లు కడిగే అల్పమైన పని చేసేందుకు వారిలో ఏ ఒక్కరూ ముందుకురాలేదు. యేసు ఆ పనిచేశాడు. ఆ తర్వాత ఆయనిలా అన్నాడు: “మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.”​—⁠యోహాను 13:​2-15.

20 యేసులాంటి వినయ దృక్పథం ప్రదర్శించే భర్తలకు వారి భార్యల సహకారం, మద్దతువుండే అవకాశాలు ఎక్కువ. అయితే ఓర్పు అవసరం. ఆ తర్వాత, ఆ పస్కా రాత్రే అపొస్తలులు మళ్లీ తమలోతాము ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. (లూకా 22:​24) దృక్పథాల్లో, ప్రవర్తనలో మార్పు వచ్చేందుకు తరచూ సమయం పట్టడమేకాక, ఆ మార్పు క్రమేణా వస్తుంది. అయితే, అపొస్తలుల్లోలాగే సానుకూల ఫలితాలు వచ్చినప్పుడు అదెంత ప్రతిఫలదాయకంగా ఉంటుందో కదా!

21 నేడు వివాహానికి ముందెన్నటికన్నా గొప్ప సవాళ్లు ఎదురౌతున్నాయి. చాలామంది వివాహ ప్రమాణాలను ఇక ఏ మాత్రం గంభీరంగా తీసుకోవడం లేదు. కాబట్టి, భర్తలారా వివాహ ఆవిర్భావం గురించి ఆలోచించండి. వివాహ ఏర్పాటును దేవుడు ఆరంభించాడని, అది మన ప్రేమగల దేవుడైన యెహోవా ఆలోచనవల్ల ఏర్పడి, స్థిరపర్చబడిందని గుర్తుంచుకోండి. ఆయన తన కుమారుడైన యేసును మన విమోచకునిగా అంటే రక్షకునిగా మాత్రమేకాక, భర్తలు అనుకరించడానికి మాదిరిగా కూడా అనుగ్రహించాడు.​—⁠మత్తయి 20:​28; యోహాను 3:​29; 1 పేతురు 2:⁠21.

మీరెలా జవాబిస్తారు?

• మనం వివాహ ఆరంభాన్ని గుర్తించడం ఎందుకు ప్రాముఖ్యం?

• భర్తలు తమ భార్యలను ఏయే విధాలుగా ప్రేమించేందుకు ప్రోత్సహించబడ్డారు?

• ఒక భర్త క్రీస్తువంటి శిరస్సత్వాన్ని నిర్వహించే విధానాన్ని యేసు తన శిష్యులతో వ్యవహరించిన ఏ ఉదాహరణలు వివరిస్తున్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) ఒక భర్త విజయాన్ని ఎలా కొలవవచ్చు? (బి) వివాహానికి దైవిక మూలముందని గుర్తించడం ఎందుకు ఆవశ్యకం?

3, 4. (ఎ) వివాహాన్ని గురించిన పరిజ్ఞానం యేసుకుందని ఎలా చెప్పవచ్చు? (బి) యేసు సూచనార్థక భార్య ఎవరు, భర్తలు తమ భార్యలతో ఎలా వ్యవహరించాలి?

5. యేసు ఎవరికి మాదిరిగా ఉన్నాడు?

6. భర్తలు తమ భార్యలతో ఎలా కాపురం చేయాలి?

7, 8. (ఎ) జ్ఞానము చొప్పున భార్యలతో కాపురం చేయడంలో ఏమి ఇమిడివుంది? (బి) భార్యలు ఎందుకు గౌరవార్హమైనవారు?

9. (ఎ) పేతురు చెప్పినదాని ప్రకారం భర్తలు ఏ కారణాన్నిబట్టి తమ భార్యలను సన్మానించాలి? (బి) యేసు ఏ విధంగా స్త్రీలను గౌరవించాడు?

10, 11. (ఎ) ప్రత్యేకంగా భర్తలు ఎందుకు యేసు మాదిరిని ధ్యానించాలి? (బి) భర్తలు తమ భార్యలపట్ల ప్రేమనెలా చూపించాలి?

12. యేసు తన సూచనార్థక శరీరంపట్ల ప్రేమనెలా ప్రదర్శించాడు?

13. తమ భార్యలను ప్రేమించాలని భర్తలకెలా ఉద్బోధించబడింది?

14. భర్త తన అపరిపూర్ణ శరీరాన్ని ఎలా చూసుకుంటాడు, ఇది ఆయన తన భార్యను చూసుకునే విధానం గురించి ఏమి సూచిస్తుంది?

15. (ఎ) తన శిష్యులు మానవ బలహీనతను కనబర్చినప్పుడు యేసు ఏమిచేశాడు? (బి) ఆయన మాదిరినుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు?

16. మార్తపట్ల యేసుకు ఎలాంటి భావముంది, అయినా ఆయన ఆమెనెలా సరిదిద్దాడు?

17, 18. (ఎ) పేతురు యేసును ఏమని గద్దించాడు, పేతురు ఎందుకు సరిదిద్దబడవలసి వచ్చింది? (బి) భర్తకు ఏ బాధ్యత ఉంది?

19, 20. (ఎ) యేసు అపొస్తలుల్లో ఏ సమస్య విశదమైంది, యేసు దానితో ఎలా వ్యవహరించాడు? (బి) యేసు ప్రయత్నాలు ఎంత సఫలమయ్యాయి?

21. నేడు సవాళ్లెదురౌతున్నా, భర్తలు ఏమి గుర్తుంచుకోవాలని, ఏమి చేయాలని ఉద్బోధించబడ్డారు?

[14వ పేజీలోని చిత్రం]

యేసు స్త్రీలతో వ్యవహరించిన విధానాల మాదిరిని భర్తలు ఎందుకు అధ్యయనం చేయాలి?

[15వ పేజీలోని చిత్రం]

యేసు తన శిష్యులు అలసిపోయినప్పుడు, వారిపట్ల శ్రద్ధ చూపించాడు

[16వ పేజీలోని చిత్రం]

భర్తలు ప్రేమతో, చక్కని పదాలతో తమ భార్యలకు ఉపదేశించాలి