కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవానుబట్టి సంతోషించుము”

“యెహోవానుబట్టి సంతోషించుము”

“యెహోవానుబట్టి సంతోషించుము”

“యెహోవానుబట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.” ​కీర్తన 37:⁠4.

“ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు, . . . కనికరముగలవారు ధన్యులు, . . . సమాధానపరచువారు ధన్యులు.” ధన్యుల గురించిన ఇంకా ఆరు వర్ణనలతో కలిపి ఈ వ్యాఖ్యానాలు, యేసు ఇచ్చిన ప్రఖ్యాత కొండమీది ప్రసంగానికి గమనార్హమైన ఉపోద్ఘాతంగా రూపొందాయి, ఈ ప్రసంగాన్ని సువార్త రచయితయైన మత్తయి నమోదు చేశాడు. (మత్తయి 5:​3-11) మనం ధన్యతను లేక సంతోషాన్ని పొందడం సాధ్యమేనని యేసు మాటలు హామీ ఇస్తున్నాయి.

2 ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన దావీదు రాజు రచించిన ఒక కీర్తన నిజమైన సంతోషానికి మూలమైన యెహోవా వైపుకు అవధానాన్ని మళ్ళిస్తుంది. “యెహోవానుబట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును” అని దావీదు అన్నాడు. (కీర్తన 37:⁠4) యెహోవాను ఆయన వ్యక్తిత్వంలోని అనేక కోణాలను తెలుసుకోవడాన్ని, ‘సంతోషకరమైనదిగా’ చేయగలిగినదేమిటి? ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఇంతవరకు చేసినవాటిని, ఇంకా చేయబోయేవాటిని పరిశీలించడం, ‘మీ హృదయవాంఛలు’ తీరే అవకాశం ఉందని ఎలా చూపిస్తుంది? కీర్తన 37లోని 1-11 వచనాలను లోతుగా పరిశీలిస్తే, ఆ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

“మత్సరపడకుము”

3 మనం “అపాయకరమైన కాలముల”లో జీవిస్తున్నాము, దుష్టత్వం పెచ్చుపెరిగిపోతోంది. “దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు” అని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు నెరవేరడాన్ని మనం చూశాము. (2 తిమోతి 3:​1, 13) దుష్టులు విజయం సాధిస్తున్నట్లు, వర్ధిల్లుతున్నట్లు కనిపించినప్పుడు దానినిబట్టి ప్రభావితం కావడం ఎంత సులభమో కదా! అదంతా, మన మనస్సును ప్రక్కకు మళ్ళించి, మనం మన ఆధ్యాత్మిక దృష్టిని సరైన విధంగా కేంద్రీకరించకుండా చేయగలదు. రాగల ఈ ప్రమాదం గురించి 37వ కీర్తన ప్రారంభ మాటలు మనల్ని ఎలా అప్రమత్తులను చేస్తున్నాయో గమనించండి: “చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.”

4 ఈ ప్రపంచ ప్రసారమాధ్యమాలు మనకు ప్రతిరోజు అనేకానేక అన్యాయాల గురించి నివేదిస్తూనే ఉంటాయి. అవినీతిపరులైన వ్యాపారస్థులు మోసంచేసి పట్టుబడకుండా తప్పించుకుంటారు. నేరస్థులు అమాయకులను దోచుకుంటారు. హంతకులు దొరకకుండా లేదా శిక్షపడకుండా తప్పించుకుంటుంటారు. న్యాయం పెడత్రోవ పట్టిందని చూపించే అలాంటి ఉదాహరణలు మనకు కోపం రేకెత్తించి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. దుష్టులకు కలుగుతున్నట్లు అనిపిస్తున్న విజయం చివరికి ఈర్ష్యా భావాలు కూడా కలిగించవచ్చు. కానీ మనం కలవరపడినంత మాత్రాన పరిస్థితి మెరుగుపడుతుందా? దుష్టులు అనుభవిస్తున్నట్లు అనిపిస్తున్న ప్రయోజనాలను చూసి ఈర్ష్యపడడం, వారికి వచ్చే పర్యవసానాన్ని మారుస్తుందా? ఎంతమాత్రం మార్చదు! కాబట్టి మనం ‘వ్యసనపడవలసిన’ అవసరమేమీ లేదు. ఎందుకని?

5 కీర్తనకర్త ఇలా జవాబిస్తున్నాడు: “వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలెనే వాడిపోవుదురు.” (కీర్తన 37:⁠2) పచ్చని గడ్డి చక్కగా కనిపించవచ్చు కానీ అది కొద్దిసేపటిలోనే ముడుచుకుపోయి వాడిపోతుంది. చెడ్డవారి విషయంలో కూడా అలాగే జరుగుతుంది. వాళ్ళు అనుభవిస్తున్నట్లు అనిపిస్తున్న సమృద్ధి శాశ్వతమైనది కాదు. వారు మరణించినప్పుడు, వారు అన్యాయంగా సంపాదించుకున్న లాభాలు వారికేమాత్రం సహాయం చేయవు. చివరికి అందరికీ న్యాయం ప్రకారమే జరుగుతుంది. “పాపమువలన వచ్చు జీతము మరణము” అని పౌలు వ్రాశాడు. (రోమీయులు 6:​23) చెడ్డవారు, దుష్కార్యాలు చేసేవారందరూ చివరికి తమ “జీతము” పొందుతారు అంతే. ఎంతటి నిష్ప్రయోజనకరమైన జీవిత విధానం!​—⁠కీర్తన 37:35, 36; 49:​16, 17.

6 కాబట్టి చెడ్డవారి తాత్కాలిక సంపదలు మనల్ని కలతపరచడానికి మనం అనుమతించాలా? కీర్తన 37లోని మొదటి రెండు వచనాల నుండి నేర్చుకోవలసిన పాఠం ఇదే: వారికి లభిస్తున్న విజయం, యెహోవా సేవ చేయాలని మీరు ఎంపిక చేసుకున్న మార్గం నుండి మీరు ప్రక్కకు మళ్ళేలా చేసేందుకు అనుమతించకండి. బదులుగా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలపై, లక్ష్యాలపై మీ అవధానాన్ని కేంద్రీకరించండి.​—⁠సామెతలు 23:​17.

“యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము”

7 “యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము” అని కీర్తనకర్త మనకు ఉద్బోధిస్తున్నాడు. (కీర్తన 37:3ఎ) చింతలైనా, సందేహాలైనా మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం యెహోవాపై స్థిరంగా నమ్మకం ఉంచాలి. సంపూర్ణ ఆధ్యాత్మిక భద్రతను ఇచ్చేది ఆయనే. “మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు” అని మోషే వ్రాశాడు. (కీర్తన 91:⁠1) ఈ విధానంలో అధికమవుతున్న అరాచకత్వాన్ని బట్టి కలత చెందినప్పుడు, మనం యెహోవాపై మరింత ఎక్కువగా ఆధారపడాలి. మనకు కాలు బెణికినప్పుడు స్నేహితుడెవరైనా చేయూతనిస్తే ఎంతో సంతోషిస్తాము. అలాగే, మనం విశ్వసనీయంగా నడుచుకోవడానికి కృషిచేస్తున్నప్పుడు మనకు యెహోవా మద్దతు అవసరం.​—⁠యెషయా 50:​10.

8 చెడ్డవారి సంక్షేమాన్ని బట్టి మనం కలత చెందకుండా ఉండేందుకు ఒక మార్గం, గొఱ్ఱెలవంటివారి కోసం వెదికి వాళ్ళు యెహోవా సంకల్పం గురించి ఖచ్చితమైన జ్ఞానాన్ని పొందడానికి వారికి సహాయం చేయడం. దుష్టత్వం పెరిగిపోతున్నదాని దృష్ట్యా, మనం ఇతరులకు సహాయం చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉండడం అవసరం. అపొస్తలుడైన పౌలు, “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి” అని వ్రాశాడు. మనం చేయగల అత్యంత గొప్ప “ఉపకారము,” ఇతరులతో మహిమాన్వితమైన దేవుని రాజ్య సువార్తను పంచుకోవడమే. మనం బహిరంగంగా ప్రకటించడం నిజంగా ఒక “స్తుతియాగము.”​—⁠హెబ్రీయులు 13:15, 16; గలతీయులు 6:10.

9 “దేశమందు నివసించి సత్యము ననుసరించుము” అని దావీదు కొనసాగిస్తున్నాడు. (కీర్తన 37:3బి) దావీదు కాలంలోని ‘దేశం’ యెహోవా ఇశ్రాయేలుకు ఇచ్చిన ప్రాంతం అంటే వాగ్దాన దేశం. సొలొమోను పరిపాలన కాలంలో దాని సరిహద్దులు ఉత్తరాన దాను నుండి దక్షిణాన బెయెర్షెబా వరకు విస్తరించాయి. అదే ఇశ్రాయేలీయుల నివాసస్థలం. (1 రాజులు 4:​25) నేడు ఈ భూమిపై మనం ఎక్కడ నివసిస్తున్నా, నీతియుక్తమైన నూతనలోకంలో ఈ గ్రహమంతా ఒక పరదైసుగా మారే సమయం కోసం ఎదురుచూస్తాము. ఈ మధ్య కాలంలో, మనం ఆధ్యాత్మిక భద్రతను అనుభవిస్తాము.​—⁠యెషయా 65:​13, 14.

10 మనం “సత్యము ననుసరించి” నడుచుకున్నప్పుడు ఏ ప్రతిఫలం లభిస్తుంది? “నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును” అని ప్రేరేపిత సామెత మనకు గుర్తుచేస్తోంది. (సామెతలు 28:​20) మనం ఎక్కడ నివసిస్తుంటే అక్కడ, మనం ప్రకటించగలిగిన వారికి సువార్త ప్రకటించడంలో నమ్మకంగా కొనసాగితే యెహోవా నుండి తప్పక ప్రతిఫలం లభిస్తుంది. ఉదాహరణకు, ఫ్రాంక్‌ ఆయన భార్య రోజ్‌ 40 సంవత్సరాల క్రితం ఉత్తర స్కాట్‌లాండ్‌లోని ఒక పట్టణంలో పయినీరు సేవా నియామకాన్ని చేపట్టారు. అంతకుముందు అక్కడ సత్యం పట్ల ఆసక్తి చూపించిన కొంతమంది మెల్లగా సత్యానికి దూరమైపోయారు. ఈ పయినీరు జంట కృతనిశ్చయంతో ప్రకటనా పనిని, శిష్యులను చేసే పనిని ప్రారంభించారు. ఇప్పుడా పట్టణంలో వర్ధిల్లుతున్న ఒక సంఘం ఉంది. ఈ జంట కనబరచిన విశ్వసనీయతకు నిజంగా యెహోవా ఆశీర్వాదం లభించింది. “మేము ఇప్పటికీ సత్యంలోనే ఉండి యెహోవాకు ఉపయోగకరంగా ఉన్నామన్నదే మాకు లభించిన అత్యంత గొప్ప ఆశీర్వాదం” అని ఫ్రాంక్‌ వినయంగా వివరిస్తున్నాడు. అవును మనం “సత్యము ననుసరించి” నడుచుకున్నప్పుడు, మనకు ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి, వాటిని మనం ఎంతో విలువైనవిగా ఎంచుతాము.

“యెహోవానుబట్టి సంతోషించుము”

11 యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలపర్చుకోవడానికి, ఆయనపై మనకున్న నమ్మకాన్ని కాపాడుకోవడానికి, మనం ‘యెహోవాను బట్టి సంతోషించాలి.’ (కీర్తన 37:4ఎ) అది మనమెలా చేస్తాము? మనం మన స్వంత వ్యవహారాల్లోనే పూర్తిగా నిమగ్నమైపోయే బదులు, కష్టమైనప్పటికీ మనం యెహోవాపైనే మన అవధానాన్ని కేంద్రీకరిస్తాము. ఇలా చేయడానికి ఒక మార్గం, ఆయన వాక్యాన్ని చదవడానికి సమయం వెచ్చించడం. (కీర్తన 1:​1, 2) బైబిలు చదవడం మీకు సంతోషం కలిగిస్తుందా? యెహోవా గురించి మరింత ఎక్కువ తెలుసుకోవాలనే లక్ష్యంతో చదివినప్పుడు తప్పక కలిగిస్తుంది. ఒక భాగం చదివిన తర్వాత కాస్సేపాగి మిమ్మల్ని మీరిలా ఎందుకు ప్రశ్నించుకోకూడదు, ‘ఈ భాగం యెహోవా గురించి నాకు ఏమి తెలియజేస్తోంది?’ మీరు బైబిలు చదివేటప్పుడు ఒక నోటుపుస్తకమో చిన్న కాగితమో దగ్గర ఉంచుకోవడం సహాయకరంగా ఉంటుంది. మీరు చదివినదాని భావం గురించి ఆలోచించడానికి ఆగిన ప్రతిసారి, దేవునికున్న ఆకర్షణీయమైన లక్షణాల్లో ఒకదాన్ని మీకు గుర్తుచేసే పదబంధాన్ని వ్రాసిపెట్టుకోండి. మరో కీర్తనలో దావీదు ఇలా పాడాడు: “యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.” (కీర్తన 19:​14) దేవుని వాక్యంపై మనమిలా అవధానం నిలపడం యెహోవాకు ‘అంగీకారమైనది,’ అది మనకు సంతోషాన్నిస్తుంది.

12 మనం మన అధ్యయనం నుండి, ధ్యానం నుండి సంతోషాన్ని ఎలా పొందవచ్చు? మనం యెహోవా గురించి ఆయన మార్గాల గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవాలన్నది మన లక్ష్యంగా పెట్టుకోవచ్చు. జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి, యెహోవాకు సన్నిహితమవండి * వంటి ప్రచురణలు మనం కృతజ్ఞతతో ధ్యానించడానికి కావలసినంత సమాచారాన్ని మనకు అందజేస్తాయి. అప్పుడు, యెహోవా ‘మీ హృదయవాంఛలను తీర్చును’ అని దావీదు నీతిమంతులకు హామీ ఇస్తున్నాడు. (కీర్తన 37:4బి) బహుశా అటువంటి నమ్మకమే అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాయడానికి ఆయనను ప్రేరేపించి ఉంటుంది: “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము.”​—⁠1 యోహాను 5:​14, 15.

13 యథార్థతను కాపాడుకునేవారిగా, యెహోవా సర్వోన్నతాధిపత్యం ఘనపరచబడడాన్ని చూడడమే మనకు అత్యంత ఆనందకరమైన విషయం. (సామెతలు 27:​11) ఒకప్పుడు ఏకపక్ష ప్రభుత్వాల క్రింద లేదా నిరంకుశ పాలన క్రింద ఉన్న దేశాల్లో మన సహోదరులు చేస్తున్న విస్తృతమైన ప్రకటనా పని గురించి విన్నప్పుడు మన హృదయాలు ఆనందంతో పొంగిపోవడం లేదా? ఈ విధానాంతానికి ముందు ఇంకా ఎలాంటి స్వేచ్ఛ లభిస్తుందో చూడడానికి మనం ఆతృతతో ఎదురుచూస్తాము. పశ్చిమ దేశాల్లో నివసిస్తున్న అనేకమంది యెహోవా సేవకులు తాత్కాలికంగా ఈ దేశాల్లో నివసిస్తూ ఆరాధనా స్వేచ్ఛను అనుభవిస్తున్న విద్యార్థులకు, శరణార్థులకు, ఇతరులకు ప్రకటించడంలో ఉత్సాహంగా భాగం వహిస్తున్నారు. వారు ప్రకటిస్తున్నది విన్నవారు తమ స్వదేశాలకు తిరిగివెళ్ళినప్పుడు, అభేద్యమైన అంధకారం కమ్ముకున్నట్లు కనిపిస్తున్న ప్రాంతాల్లో సహితం సత్యపు వెలుగు ప్రకాశించడానికి దోహదపడడంలో కొనసాగాలన్నది మన హృదయపూర్వక కోరిక.​—⁠మత్తయి 5:​14-16.

“నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము”

14 మన చింతలు, మనకు అణచివేసే భారాల్లా అనిపించేవి తొలగించబడడం సాధ్యమేనని తెలుసుకోవడం ఎంతటి ఉపశమనాన్నిస్తుందో కదా! అదెలా సాధ్యం? “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును” అని దావీదు చెబుతున్నాడు. (కీర్తన 37:⁠5) మద్దతు కోసం మనం యెహోవాపై ఆధారపడవచ్చుననే దానికి మన సంఘాల్లో విస్తృతమైన నిదర్శనం ఉంది. (కీర్తన 55:​22) పయినీర్లుగా, ప్రయాణ పైవిచారణకర్తలుగా, మిషనరీలుగా, బెతెల్‌లో స్వచ్ఛంద సేవకులుగా పూర్తికాల పరిచర్య చేస్తున్నవారందరూ యెహోవా మన గురించి తప్పక శ్రద్ధతీసుకుంటాడన్న విషయానికి దృఢంగా సాక్ష్యమివ్వగలరు. వారిలో మీకు తెలిసినవారితో మాట్లాడి యెహోవా వారికి ఎలా సహాయం చేశాడో ఎందుకు తెలుసుకోకూడదు? కష్టభరితమైన సమయాల్లో సహితం యెహోవా హస్తము ఎన్నడూ కురచ కాలేదని చూపించే ఎన్నో అనుభవాలను మీరు వింటారనడంలో సందేహం లేదు. ఆయన ఎల్లప్పుడూ జీవితావసరాలను తీరుస్తాడు.​—⁠కీర్తన 37:25; మత్తయి 6:​25-34.

15 మనం యెహోవాపై నమ్మకం ఉంచి ఆయనను పూర్తిగా విశ్వసించినప్పుడు, కీర్తనకర్త చెప్పిన ఈ మాటలను మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాము: “ఆయన వెలుగునువలె నీ నీతిని, మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును.” (కీర్తన 37:⁠6) యెహోవాసాక్షులముగా మనం తరచు తప్పుగా చిత్రీకరించబడుతున్నాము. కానీ మనం చేసే బహిరంగ పరిచర్య యెహోవాపట్ల పొరుగువారిపట్ల ప్రేమతో ప్రేరేపించబడినదని గుర్తించడానికి యెహోవా యథార్థ హృదయుల కళ్ళను తెరుస్తాడు. అదే సమయంలో, అనేకులు మనల్ని తప్పుగా చిత్రీకరించినా, మన మంచి ప్రవర్తన అందరికీ తేటగా కనిపిస్తుంది. యెహోవా మనల్ని అన్ని రకాల వ్యతిరేకతల్లో, హింసల్లో బలపరుస్తాడు. తత్ఫలితంగా, దేవుని ప్రజల నీతి మధ్యాహ్నపు సూర్యునివలె ప్రకాశిస్తుంది.​—⁠1 పేతురు 2:​12.

“మౌనముగానుండి . . . కనిపెట్టుకొనుము”

16 కీర్తనకర్త ఆ తర్వాత ఇలా అన్నాడు: “యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసనపడకుము.” (కీర్తన 37:⁠7) ఇక్కడ దావీదు, యెహోవా చర్య తీసుకునేంతవరకు మనం సహనంతో వేచివుండవలసిన అవసరతను నొక్కి చెబుతున్నాడు. ఈ విధానాంతం ఇంకా రాకపోయినా అది ఫిర్యాదు చేయడానికి కారణం కాదు. యెహోవా కనికరం, సహనం మనం మొదట్లో అనుకున్నదాని కంటే ఎంతో గొప్పవని మనం చూడలేదా? అంతం రాకముందు సువార్త ప్రకటించడంలో చురుగ్గా పాల్గొంటూ ఇప్పుడు మనం కూడా సహనంతో ఎదురుచూస్తున్నామని చూపించగలమా? (మార్కు 13:​10) మన సంతోషాన్ని, ఆధ్యాత్మిక భద్రతను దోచుకునే తొందరపాటు చర్యలకు ఇది సమయం కాదు. ఇది సాతాను లోకపు కలుషితపరిచే ప్రభావాన్ని మరింత బలంగా ఎదిరించవలసిన సమయం. ఇది, యెహోవా ఎదుట మన నీతియుక్తమైన స్థానాన్ని ఎంతమాత్రం ప్రమాదంలో పడవేసుకోకుండా మన నైతిక స్వచ్ఛతను కాపాడుకోవలసిన సమయం. మనం అనైతిక తలంపులను పూర్తిగా విడనాడి, ఇతరులతో అంటే ఆడవారితోనైనా మగవారితోనైనా ఎలాంటి అనుచిత కార్యాలు చేయకుండా ఉండడంలో కొనసాగుదాము.​—⁠కొలొస్సయులు 3:⁠5.

17 “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకుము అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు” అని దావీదు మనకు ఉపదేశిస్తున్నాడు. (కీర్తన 37:​8, 9) అవును, యెహోవా ఈ భూమిపై నుండి దుష్ప్రవర్తననంతటినీ దానికి కారకులైన వారినందరినీ నిర్మూలించే కాలం కోసం మనం నమ్మకంగా ఎదురు చూడవచ్చు, ఆ కాలం ఇప్పుడు ఎంతో దూరంలో లేదు.

“ఇక కొంతకాలము”

18 “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు; వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.” (కీర్తన 37:​10) మనం ఈ విధానాంతాన్ని, యెహోవా నుండి స్వతంత్రంగా ఉండాలన్న మానవుని దృక్పథం ఫలితంగా కలిగిన వినాశకర పరిస్థితి ముగిసే సమయాన్ని సమీపిస్తుండగా ఆ మాటలు మనల్ని ఎంతగా ప్రోత్సహిస్తాయో కదా! మానవుడు రూపొందించిన అన్నిరకాలైన ప్రభుత్వాలు లేదా పరిపాలనలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇప్పుడు మనం తిరిగి దేవుడు పరిపాలన చేసే కాలాన్ని సమీపిస్తున్నాము, అది యేసుక్రీస్తు చేతుల్లో ఉన్న యెహోవా రాజ్యం. అది లోక వ్యవహారాలన్నిటిని పూర్తిగా అదుపులోకి తీసుకొని, దేవుని రాజ్య వ్యతిరేకులందరినీ నిర్మూలిస్తుంది.​—⁠దానియేలు 2:​44.

19 దేవుని రాజ్యం క్రింద నూతనలోకంలో, మీరు వెదికినా సరే, ఒక్క ‘భక్తిహీనుడిని’ కూడా చూడలేరు. వాస్తవానికి, అప్పుడు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వారెవరైనా వెంటనే నిర్మూలించబడతారు. ఆయన సర్వోన్నతాధిపత్యంపై దాడి చేసేవారెవరూ దేవుని అధికారానికి లోబడడానికి నిరాకరించే వారెవరూ అక్కడ ఉండరు. మీ పొరుగువారంతా యెహోవాకు సంతోషం కలిగించాలని కోరుకునే మీవంటి మనస్సుగలవారే అయ్యుంటారు. అది ఎంతటి భద్రతనిస్తుందో కదా​—⁠ఇక తాళాలూ ఉండవు అడ్డు కమ్మీలూ ఉండవు, సంపూర్ణ నమ్మకాన్ని, సంతోషాన్ని పోగొట్టేదేదీ ఉండదు!​—⁠యెషయా 65:20; మీకా 4:4; 2 పేతురు 3:​13.

20 అప్పుడు, “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు.” (కీర్తన 37:11ఎ) అయితే ఈ “దీనులు” ఎవరు? “దీనులు” అని అనువదించబడిన పదం, “బాధించబడిన, న్యూనపరచబడిన, అవమానించబడిన” అనే భావాలుగల మూలపదం నుండి వస్తోంది. అవును, తమకు జరిగిన అన్యాయాలన్నింటినీ సరిచేయాలని యెహోవా కోసం వినయంగా ఎదురుచూసే వారే “దీనులు.” వారు “బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:11బి) నిజమైన క్రైస్తవ సంఘంతో సంబంధం కలిగివున్న ఆధ్యాత్మిక పరదైసులో ఇప్పుడు కూడా మనం ఎంతో సమాధానాన్ని పొందుతాము.

21 మనకు ప్రస్తుతం బాధల నుండి ఉపశమనం లభించకపోయినా, మనం ఒకరికొకరం మద్దతునిచ్చుకుంటూ కృంగిపోయినవారిని ఓదారుస్తాము. ఫలితంగా, యెహోవా ప్రజల మధ్య నిజమైన సంతృప్తి పెంపొందించబడుతుంది. కాపరులుగా నియమించబడిన సహోదరులు మన ఆధ్యాత్మిక అవసరాలను, కొన్నిసార్లు భౌతిక అవసరాలను కూడా ప్రేమపూర్వకంగా తీరుస్తూ నీతి కోసం బాధను సహించడానికి మనకు దోహదపడతారు. (1 థెస్సలొనీకయులు 2:7, 11; 1 పేతురు 5:​2, 3) ఈ సమాధానం ఎంత విలువైన సంపదనో కదా! త్వరలో రానున్న సమాధానకరమైన పరదైసులో నిత్యం జీవించే నిరీక్షణ కూడా మనకు ఉంది. కాబట్టి మనం గొప్ప దావీదు అయిన క్రీస్తు యేసును అనుకరిద్దాము, ఆయనకు యెహోవా పట్ల ఉన్న ఆసక్తి అంతం వరకు నమ్మకంగా సేవ చేయడానికి ఆయనను పురికొల్పింది. (1 పేతురు 2:​21) అలా అనుకరించడం ద్వారా, మనం సంతోషంగా ఉండడంలో కొనసాగుతాము, అలాగే మన దేవుడైన యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయనను స్తుతిస్తాము.

[అధస్సూచి]

^ పేరా 17 యెహోవాసాక్షులు ప్రచురించినవి.

మీరు సమాధానం చెప్పగలరా?

కీర్తన 37:​1, 2 నుండి మీరు ఏ పాఠాలు నేర్చుకున్నారు?

• మీరు “యెహోవానుబట్టి” ఎలా ‘సంతోషించవచ్చు’?

• మనం యెహోవాపై ఆధారపడవచ్చు అనడానికి ఏ నిదర్శనం ఉంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. నిజమైన సంతోషానికి మూలం ఎవరు, దావీదు రాజు ఈ వాస్తవం వైపుకు ఎలా అవధానం మళ్ళించాడు?

3, 4. కీర్తన 37:1లో వ్రాయబడివున్నట్లుగా దావీదు ఏ ఉపదేశం ఇచ్చాడు, నేడు దాన్ని లక్ష్యపెట్టడం ఎందుకు సముచితం?

5. చెడ్డవారు గడ్డితో ఎందుకు పోల్చబడ్డారు?

6. కీర్తన 37:​1, 2 నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

7. మనం యెహోవాపై నమ్మకం ఎందుకు ఉంచాలి?

8. క్రైస్తవ పరిచర్యలో పాల్గొనడం, చెడ్డవారి సంక్షేమాన్ని బట్టి అనవసరంగా కలత చెందకుండా ఉండడానికి మనకు ఎలా సహాయం చేయగలదు?

9. ‘దేశమందు నివసించమని’ దావీదు చేసిన ఉద్బోధను వివరించండి.

10. మనం “సత్యము ననుసరించి” నడుచుకున్నప్పుడు లభించే ప్రతిఫలమేమిటి?

11, 12. (ఎ) మనం “యెహోవాను బట్టి” ఎలా ‘సంతోషించవచ్చు’? (బి) వ్యక్తిగత అధ్యయనానికి సంబంధించి మీరు ఏ లక్ష్యాలను పెట్టుకోవచ్చు, దాని ఫలితం ఏమై ఉండవచ్చు?

13. ఇటీవలి సంవత్సరాల్లో అనేక దేశాల్లో రాజ్య ప్రకటనా పనికి సంబంధించి ఎలాంటి విస్తరణ గమనించడం జరిగింది?

14. మనం యెహోవాపై ఆధారపడవచ్చు అనడానికి ఏ నిదర్శనం ఉంది?

15. దేవుని ప్రజల నీతి ఎలా ప్రకాశిస్తుంది?

16, 17. కీర్తన 37:7 ప్రకారం, ఇది దేనికి సమయం, ఎందుకు?

18, 19. కీర్తన 37:⁠10 నుండి మీరు ఏ ప్రోత్సాహాన్ని పొందుతారు?

20, 21. (ఎ) కీర్తన 37:11లోని “దీనులు” ఎవరు, వారు ఎక్కడ “బహు క్షేమము” పొందుతారు? (బి) గొప్ప దావీదును అనుకరిస్తే మనకు ఏ ఆశీర్వాదాలు లభిస్తాయి?

[9వ పేజీలోని చిత్రం]

క్రైస్తవులు ‘దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడరు’

[10వ పేజీలోని చిత్రం]

“యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము”

[11వ పేజీలోని చిత్రం]

యెహోవా గురించి, ఆయన మార్గాల గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవడంలో సంతోషాన్ని పొందండి

[12వ పేజీలోని చిత్రం]

“దీనులు భూమిని స్వతంత్రించుకొందురు”