కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 51

‘యెహోవా నిరుత్సాహపడినవాళ్లను కాపాడతాడు’

‘యెహోవా నిరుత్సాహపడినవాళ్లను కాపాడతాడు’

“విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు; నిరుత్సాహపడినవాళ్లను ఆయన కాపాడతాడు.”—కీర్త. 34:18, అధస్సూచి.

పాట 30 నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

మనం బ్రతికేది కొంతకాలమే, అది కూడా ‘కష్టాలూ కన్నీళ్లతోనే.’ ఆ వాస్తవం గురించి మనం కొన్నిసార్లు ఆలోచిస్తుంటాం. (యోబు 14:1) కాబట్టి మనం అప్పుడప్పుడు నిరుత్సాహపడడం సహజమే. ప్రాచీన కాలంనాటి చాలామంది యెహోవా సేవకులు కూడా నిరుత్సాహపడ్డారు, కొంతమందైతే చనిపోవాలని కూడా అనుకున్నారు. (1 రాజు. 19:2-4; యోబు 3:1-3, 11; 7:15, 16) కానీ వాళ్లు నమ్మకం పెట్టుకున్న యెహోవా దేవుడు వాళ్లను ఓదారుస్తూ, బలపరుస్తూ ఉన్నాడు. మనకు ఊరటనివ్వడానికి, బోధించడానికి యెహోవా వాళ్ల గురించి బైబిల్లో రాయించాడు.—రోమా. 15:4.

2 నిరుత్సాహాన్ని ఎదుర్కొన్న కొంతమంది యెహోవా సేవకుల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. వాళ్లెవరంటే యాకోబు కొడుకైన యోసేపు, విధవరాలైన నయోమి-ఆమె కోడలు రూతు, 73వ కీర్తన రాసిన లేవీయుడు, అపొస్తలుడైన పేతురు. యెహోవా వాళ్లను ఎలా బలపర్చాడు? వాళ్ల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే, “విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు, నిరుత్సాహపడినవాళ్లను ఆయన కాపాడతాడు” అనే మన నమ్మకం బలపడుతుంది.—కీర్త. 34:18, అధస్సూచి.

యోసేపు దారుణమైన అన్యాయాల్ని ఎదుర్కొన్నాడు

3-4. యువకుడైన యోసేపుకు ఏం జరిగింది?

3 దాదాపు 17 ఏళ్లు ఉన్నప్పుడు యోసేపుకు రెండు కలలు వచ్చాయి. ఆ రెండూ దేవుని వల్ల కలిగినవే. ఏదోక రోజు యోసేపు తన కుటుంబంలో గౌరవప్రదమైన స్థానంలో ఉంటాడని ఆ కలలు సూచించాయి. (ఆది. 37:5-10) కానీ, ఆ కలలు వచ్చిన కొద్ది రోజులకే యోసేపు జీవితం తలకిందులైంది. యోసేపు అన్నలు ఆయన్ని గౌరవించకపోగా ఆయన్ని దాసునిగా అమ్మేశారు. చివరికి ఆయన పోతీఫరు అనే ఐగుప్తు అధికారి ఇంట్లో బానిస అయ్యాడు. (ఆది. 37:21-28) అలా కొద్దికాలంలోనే యోసేపు తనను ఎంతో ప్రేమించే తండ్రికి దూరమై, ఐగుప్తులో అన్యుడైన ఒక అధికారి దగ్గర ఏమాత్రం విలువలేని బానిస అయ్యాడు.—ఆది. 39:1.

4 అక్కడ యోసేపు పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. యోసేపు తనను బలవంతం చేయబోయాడని పోతీఫరు భార్య తప్పుడు ఆరోపణ చేసింది. పోతీఫరు నిజానిజాలు తెలుసుకోకుండానే యోసేపును చెరసాలలో వేయించాడు. అక్కడ యోసేపును ఇనుప గొలుసులతో బంధించారు. (ఆది. 39:14-20; కీర్త. 105:17, 18) బలవంతం చేయబోయాడనే నింద తన మీద పడినప్పుడు యువకుడైన యోసేపుకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి. అంతేకాదు, ఆ నింద వల్ల యెహోవా పేరుకు ఎంత అపకీర్తి వచ్చి ఉంటుందో ఆలోచించండి. ఈ కారణాల్ని బట్టి యోసేపు ఖచ్చితంగా నిరుత్సాహపడి ఉంటాడు.

5. యోసేపు నిరుత్సాహం నుండి ఎలా బయటపడ్డాడు?

5 యోసేపు బానిసగా, ఆ తర్వాత ఖైదీగా ఉన్నప్పుడు పరిస్థితులేవీ ఆయన చేతిలో లేవు. మరి ఆయన నిరుత్సాహం నుండి ఎలా బయటపడ్డాడు? యోసేపు తన చేతిలో లేని విషయాల గురించి ఆలోచించే బదులు, తనకు అప్పగించిన పనిలో కష్టపడ్డాడు. అన్నిటికన్నా ముఖ్యంగా, యోసేపు ఎప్పుడూ యెహోవాను సంతోషపెట్టడం మీద మనసుపెట్టాడు. అందుకే యోసేపు చేసిన ప్రతీ పనిని యెహోవా ఆశీర్వదించాడు.—ఆది. 39:21-23.

6. యోసేపు తన కలల వల్ల ఎలా ఊరట పొందివుంటాడు?

6 కొన్ని సంవత్సరాల క్రితం యెహోవా తనకు చూపించిన కలల గురించి ఆలోచించడం ద్వారా కూడా యోసేపు ప్రోత్సాహం పొందివుంటాడు. యోసేపు మళ్లీ తన కుటుంబాన్ని చూస్తాడని, ఆయన పరిస్థితి మెరుగౌతుందని ఆ కలలు సూచించాయి. సరిగ్గా అలాగే జరిగింది. యోసేపుకు దాదాపు 37 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఆయన కలలు అద్భుతరీతిలో నెరవేరడం మొదలైంది!—ఆది. 37:7, 9, 10; 42:6, 9.

7. మొదటి పేతురు 5:10 ప్రకారం, కష్టాల్ని సహించడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

7 మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ లోకం మనతో క్రూరంగా వ్యవహరిస్తుందని, ప్రజలు మనకు అన్యాయం చేస్తారని యోసేపు ఉదాహరణ గుర్తుచేస్తుంది. ఒక్కోసారి మన తోటి సహోదరులే మనల్ని బాధపెట్టవచ్చు. కానీ యెహోవాను మన ఆశ్రయదుర్గంగా చేసుకుంటే, నిరుత్సాహంలో కూరుకుపోకుండా ఉంటాం, ఆయన సేవను ఆపకుండా ఉంటాం. (కీర్త. 62:6, 7; 1 పేతురు 5:10 చదవండి.) అంతేకాదు, యెహోవా ఆ కలలు రప్పించినప్పుడు యోసేపుకు దాదాపు 17 ఏళ్లు ఉండి ఉంటాయని గుర్తుచేసుకోండి. తనను సేవిస్తున్న యౌవనుల మీద యెహోవాకు ఎంత నమ్మకం ఉందో అది చూపిస్తుంది. నేడు యోసేపు లాంటి యౌవనులు చాలామంది ఉన్నారు. వాళ్లు కూడా యెహోవా మీద విశ్వాసం చూపిస్తున్నారు. కొందరు యౌవనులైతే యెహోవాకు నమ్మకంగా ఉండే విషయంలో రాజీపడనందుకు అన్యాయంగా జైలు పాలయ్యారు.—కీర్త. 110:3.

దుఃఖంలో మునిగిపోయిన ఇద్దరు స్త్రీలు

8. నయోమి రూతులకు ఏం జరిగింది?

8 తీవ్రమైన కరువు వల్ల నయోమి, ఆమె కుటుంబం యూదాలోని తమ ఇంటిని విడిచిపెట్టి మోయాబులో పరదేశులుగా స్థిరపడ్డారు. అక్కడ నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు, ఇక ఆమెకు మిగిలిందల్లా తన ఇద్దరు కొడుకులే. కొంతకాలానికి ఆ ఇద్దరు కొడుకులు రూతు, ఓర్పా అనే మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత నయోమి కొడుకులు కూడా చనిపోయారు, వాళ్లకు పిల్లలు లేరు. (రూతు 1:1-5) ఆ ముగ్గురు స్త్రీలకు ఎంత బాధగా అనిపించి ఉంటుందో ఊహించండి. కావాలనుకుంటే రూతు, ఓర్పా మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. కానీ వయసు పైబడుతున్న నయోమిని ఎవరు చూసుకుంటారు? ఒక సందర్భంలో నయోమి ఎంతగా నిరుత్సాహపడిందంటే, ఆమె “నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. ఎందుకంటే, సర్వశక్తిమంతుడు నా జీవితాన్ని చేదుమయం చేశాడు” అని అంది. విరిగిన మనసుతో నయోమి బేత్లెహేముకు బయల్దేరింది, రూతు కూడా ఆమె వెంట వెళ్లింది.—రూతు 1:7, 18-20.

నిరుత్సాహం నుండి, దుఃఖం నుండి బయటపడేలా సహాయం చేయగలనని యెహోవా రూతు-నయోమిల విషయంలో చూపించాడు. ఆయన మీ విషయంలో కూడా అలా చేయగలడా? (8-13 పేరాలు చూడండి) *

9. రూతు 1:16, 17, 22 ప్రకారం, రూతు నయోమికి ఎలా ఊరటనిచ్చింది?

9 రూతు చూపించిన విశ్వసనీయ ప్రేమ నయోమికి ఊరటనిచ్చింది. ఉదాహరణకు, రూతు నయోమిని అంటిపెట్టుకుని ఉండడం ద్వారా విశ్వసనీయ ప్రేమ చూపించింది. (రూతు 1:16, 17, 22 చదవండి.) బేత్లెహేములో రూతు కష్టపడి పనిచేసి తన కోసం, నయోమి కోసం పరిగె ఏరుకొచ్చేది. దానివల్ల యౌవనురాలైన రూతు కొంతకాలానికే మంచి పేరు సంపాదించుకుంది.—రూతు 3:11; 4:15.

10. నయోమి, రూతు లాంటి పేదవాళ్ల పట్ల యెహోవా ఏయే విధాలుగా ప్రేమ చూపించాడు?

10 నయోమి, రూతు లాంటి పేదవాళ్ల మీద కనికరంతో యెహోవా గతంలో ఇశ్రాయేలీయులకు ఒక నియమం ఇచ్చాడు. పంట కోస్తున్నప్పుడు, పొలాల గట్టు వరకు కోయకుండా పేదవాళ్ల కోసం పరిగె విడిచిపెట్టాలని యెహోవా ఆజ్ఞాపించాడు. (లేవీ. 19:9, 10) కాబట్టి రూతు, నయోమి ఆహారం కోసం ఎవ్వరి దగ్గరా చెయ్యి చాపాల్సిన అవసరం లేదు. వాళ్లు గౌరవంగా బ్రతుకుతూ తమకు కావాల్సిన ఆహారం సమకూర్చుకోవచ్చు.

11-12. రూతు-నయోమిల జీవితంలో బోయజు ఎలా సంతోషాన్ని నింపాడు?

11 రూతు పరిగె ఏరుకోవడానికి వెళ్లిన పొలం, బోయజు అనే ఒక ధనవంతుడిది. రూతు తన అత్త నయోమికి విశ్వసనీయంగా ఉండడం, ఆమెను ప్రేమగా చూసుకోవడం బోయజుకు ఎంతగా నచ్చాయంటే ఆయన వాళ్ల కుటుంబ స్వాస్థ్యాన్ని తిరిగి కొని, రూతును పెళ్లి చేసుకున్నాడు. (రూతు 4:9-13) రూతు, బోయజులకు ఒక కొడుకు పుట్టాడు. వాళ్లు ఆ బాబుకు ఓబేదు అని పేరు పెట్టారు, ఆయనే తర్వాత దావీదు రాజుకు తాత అయ్యాడు.—రూతు 4:17.

12 నయోమి పసివాడైన ఓబేదును ఎత్తుకుని, కృతజ్ఞత నిండిన హృదయంతో యెహోవాకు ప్రార్థించడం ఒకసారి ఊహించుకోండి. భవిష్యత్తులో నయోమి, రూతు ఇంకా గొప్ప ఆనందాన్ని పొందుతారు. వాళ్లు పునరుత్థానమైన తర్వాత, ఓబేదు వాగ్దాన మెస్సీయ అయిన యేసుకు పూర్వీకుడు అయ్యాడని తెలుసుకుని ఎంతో సంతోషిస్తారు!

13. రూతు-నయోమిల ఉదాహరణ నుండి మనం ఏ విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు?

13 మనం ఏం నేర్చుకోవచ్చు? కష్టాలు వచ్చినప్పుడు మనకు నిరుత్సాహంగా, మనసు విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. బహుశా ఆ సమస్యల నుండి బయటపడే మార్గమే లేదని అనిపించవచ్చు. అలాంటి సమయాల్లో మన పరలోక తండ్రి మీద పూర్తి నమ్మకం ఉంచాలి, మన తోటి విశ్వాసులకు దగ్గరగా ఉండాలి. నిజమే, యెహోవా మన కష్టాల్ని తీసేయకపోవచ్చు. నయోమి విషయానికొస్తే, యెహోవా ఆమె భర్తను, కొడుకుల్ని పునరుత్థానం చేయలేదు గానీ రూతు చూపించిన విశ్వసనీయ ప్రేమ ద్వారా ఆమెకు ఊరటనిచ్చాడు. అదేవిధంగా, మన సహోదర సహోదరీలు చూపించే విశ్వసనీయ ప్రేమ ద్వారా కష్టాల్ని తట్టుకునేలా యెహోవా మనకు సహాయం చేయవచ్చు.—సామె. 17:17.

ఒక లేవీయుడు దాదాపు యెహోవా సేవను ఆపేంతగా నిరుత్సాహపడ్డాడు

యెహోవా మీద మనసుపెట్టనివాళ్లు వర్ధిల్లుతున్నట్టు కనిపించే సరికి, 73వ కీర్తన రాసిన లేవీయుడు దాదాపు యెహోవా సేవను ఆపేంతగా నిరుత్సాహపడ్డాడు. మనకూ అలా జరగవచ్చు (14-16 పేరాలు చూడండి)

14. ఒక లేవీయుడు ఎందుకు తీవ్రంగా నిరుత్సాహపడ్డాడు?

14 73వ కీర్తన రాసిన వ్యక్తి, ఒక లేవీయుడు. అంటే యెహోవా మందిరంలో సేవచేసే గొప్ప అవకాశం ఆయనకు ఉంది. అయినప్పటికీ, ఒక సందర్భంలో ఆయన తీవ్రంగా నిరుత్సాహపడ్డాడు. ఎందుకు? ఆయన దుష్టుల, అహంకారుల చెడుతనాన్ని చూసి కాదుగానీ వాళ్లు వర్ధిల్లుతున్నట్లు కనిపించేసరికి ఈర్ష్యపడడం మొదలుపెట్టాడు. (కీర్త. 73:2-9, 11-14) ‘వాళ్లకు అన్నీ ఉన్నాయి: డబ్బు ఉంది, మంచి జీవితం ఉంది, ఏ బాధలు లేవు’ అని ఆయనకు అనిపించింది. వాళ్లు వర్ధిల్లుతున్నట్లు కనిపించేసరికి ఆ కీర్తనకర్త ఎంత నిరుత్సాహపడ్డాడంటే “నిజంగా, నేను నా హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం, నిర్దోషినని నా చేతులు కడుక్కోవడం వృథా” అని అనుకున్నాడు. ఆయన ఆధ్యాత్మికంగా ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నాడు.

15. కీర్తన 73:16-19, 22-25 ప్రకారం, ఆ కీర్తన రాసిన లేవీయుడు నిరుత్సాహం నుండి ఎలా బయటపడ్డాడు?

15 కీర్తన 73:16-19, 22-25 చదవండి. ఆ లేవీయుడు “దేవుని మహిమాన్విత పవిత్రమైన స్థలంలోకి” అడుగుపెట్టాడు. అక్కడ బహుశా తోటి ఆరాధకుల మధ్య తన పరిస్థితి గురించి ప్రశాంతంగా, సరిగ్గా, ప్రార్థనాపూర్వకంగా ఆలోచించగలిగాడు. దానివల్ల, తాను మూర్ఖంగా ఆలోచిస్తున్నానని, తన అడుగులు యెహోవాకు దూరమౌతున్నాయని ఆయనకు అర్థమైంది. అంతేకాదు దుష్టులు “జారుడు నేలమీద” ఉన్నారని, వాళ్లు ‘ఘోరంగా అంతమౌతారని’ ఆయన గ్రహించాడు. ఈర్ష్యను, నిరుత్సాహాన్ని తీసేసుకోవాలంటే ఆ లేవీయుడైన కీర్తనకర్త విషయాల్ని యెహోవా దృష్టితో చూడాలి. ఆయన అదే చేశాడు, దానివల్ల మనశ్శాంతిని అలాగే సంతోషాన్ని తిరిగి పొందాడు. ఆయన ఇలా అన్నాడు: “భూమ్మీద నేను నిన్ను [యెహోవాను] తప్ప దేన్నీ కోరుకోను.”

16. ఒక లేవీయుడి నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

16 మనం ఏం నేర్చుకోవచ్చు? దుష్టులు వర్ధిల్లుతున్నట్టు అనిపించినా వాళ్లను చూసి మనం ఎన్నడూ ఈర్ష్యపడకూడదు. వాళ్ల సంతోషం వెంటనే కనుమరుగైపోతుంది, వాళ్లు శాశ్వత కాలం జీవించరు. (ప్రసం. 8:12, 13) వాళ్లను చూసి ఈర్ష్యపడడం అంటే నిరుత్సాహాన్ని, ఆధ్యాత్మిక పతనాన్ని కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి దుష్టులు వర్ధిల్లడం చూసి మీకెప్పుడైనా ఈర్ష్యగా అనిపిస్తే, లేవీయుడు చేసినట్టే చేయండి. అంటే దేవుడు ప్రేమతో ఇస్తున్న సలహాల్ని పాటించండి, యెహోవా ఇష్టం చేసే వాళ్లతో సహవసించండి. అన్నిటికన్నా ఎక్కువగా యెహోవాను ప్రేమించినప్పుడు మీరు నిజమైన సంతోషం పొందుతారు. అంతేకాదు, ‘వాస్తవమైన జీవితానికి’ నడిపించే దారిలో కొనసాగుతారు.—1 తిమో. 6:19.

పేతురు తన బలహీనతల వల్ల నిరుత్సాహపడ్డాడు

పేతురు నిరుత్సాహంలోనే ఉండిపోకుండా దేవుని సేవ మీద మనసుపెట్టాడు. ఆ ఉదాహరణ నుండి మనం ప్రోత్సాహం పొందవచ్చు, అలాగే ఇతరుల్ని ప్రోత్సహించవచ్చు (17-19 పేరాలు చూడండి)

17. పేతురు ఏ కారణాల వల్ల నిరుత్సాహపడ్డాడు?

17 అపొస్తలుడైన పేతురు చాలా చురుకైన వ్యక్తి. కానీ ఆయన కొన్నిసార్లు దుడుకుగా ప్రవర్తించేవాడు, ముందూవెనకా ఆలోచించకుండా మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పేసేవాడు. దానివల్ల ఆయన కొన్నిసార్లు ఏదోకటి అనేసి లేదా చేసేసి, ఆ తర్వాత బాధపడేవాడు. ఉదాహరణకు, తాను బాధలు అనుభవించి చనిపోవాలని యేసు తన అపొస్తలులతో చెప్పినప్పుడు పేతురు, “నీకు అలా జరగనే జరగదు” అంటూ యేసును మందలించాడు. (మత్త. 16:21-23) అప్పుడు యేసు పేతురును సరిదిద్దాడు. ఒక గుంపు యేసును బంధించడానికి వచ్చినప్పుడు, పేతురు ఆవేశంగా కత్తి దూసి ప్రధానయాజకుని దాసుడి చెవి నరికాడు. (యోహా. 18:10, 11) యేసు మళ్లీ పేతురును సరిదిద్దాడు. మరో సందర్భంలో, మిగతా అపొస్తలులందరూ క్రీస్తును వదిలిపెట్టినా తాను మాత్రం ఎన్నడూ వదిలిపెట్టనని పేతురు గొప్పలు చెప్పుకున్నాడు. (మత్త. 26:33) కానీ ఆ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల పేతురు మనుషుల భయానికి లొంగిపోయి, యేసు ఎవరో తెలీదని మూడుసార్లు అన్నాడు. పేతురు ఎంతో నిరుత్సాహంతో “బయటికి వెళ్లి, కుమిలికుమిలి ఏడ్చాడు.” (మత్త. 26:69-75) యేసు ఎప్పటికైనా తనను క్షమిస్తాడా అని పేతురు అనుకొని ఉంటాడు.

18. నిరుత్సాహం నుండి బయటపడడానికి యేసు పేతురుకు ఎలా సహాయం చేశాడు?

18 అయితే పేతురు యెహోవా సేవను ఆపేంతగా నిరుత్సాహపడలేదు. ఆయన మొదట్లో తడబడినా, తర్వాత తేరుకుని మిగతా అపొస్తలులతో కలిసి యెహోవాను సేవించాడు. (యోహా. 21:1-3; అపొ. 1:15, 16) తిరిగి బలపడడానికి ఆయనకు ఏది సహాయం చేసింది? అంతకుముందు, పేతురు విశ్వాసం బలహీనపడకుండా ఉండాలని యేసు పట్టుదలగా ప్రార్థించాడు, అంతేకాదు పశ్చాత్తాపపడి తిరిగొచ్చిన తర్వాత సహోదరుల్ని బలపర్చమని కూడా పేతురును ప్రోత్సహించాడు. యేసు హృదయపూర్వకంగా చేసిన ఆ ప్రార్థనను యెహోవా విన్నాడు. యేసు పునరుత్థానమైన తర్వాత పేతురుకు స్వయంగా కనిపించాడు. ఖచ్చితంగా ఆయన్ని ప్రోత్సహించడానికే అలా కనిపించి ఉంటాడు. (లూకా 22:32; 24:33, 34; 1 కొరిం. 15:5) ఒకసారి, అపొస్తలులు చేపలు పట్టడానికి రాత్రంతా ప్రయత్నించినా ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు యేసు అపొస్తలులందరికీ కనిపించాడు. అంతేకాదు, తనమీద ఎంత ప్రేమ ఉందో చెప్పుకునే అవకాశాన్ని పేతురుకు ఇచ్చాడు. యేసు తన ప్రియ స్నేహితుణ్ణి క్షమించడమే కాదు, ఆయనకు మరిన్ని బాధ్యతలు అప్పగించాడు.—యోహా. 21:15-17.

19. కీర్తన 103:13, 14 ప్రకారం, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు యెహోవా ఎలా భావిస్తాడు?

19 మనం ఏం నేర్చుకోవచ్చు? యేసు పేతురుతో వ్యవహరించిన విధానం, ఆయన తన తండ్రిలాగే ఎంతో కరుణగల వాడని చూపిస్తుంది. కాబట్టి మనం పొరపాట్లు చేసినప్పుడు, యెహోవా ఇక ఎప్పటికీ క్షమించడని అనుకోకూడదు. అలా అనుకోవాలన్నది సాతాను కోరికని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ఏదైనా తప్పు చేసినా లేదా వేరేవాళ్లు మన విషయంలో తప్పు చేసినా కనికరం, ప్రేమ గల మన పరలోక తండ్రిని అనుకరించడానికి కృషిచేద్దాం.—కీర్తన 103:13, 14 చదవండి.

20. తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

20 యోసేపు, నయోమి-రూతు, లేవీయుడు, పేతురు ఉదాహరణలు, “విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు” అనే అభయాన్ని ఇస్తున్నాయి. (కీర్త. 34:18) మనం కష్టాలు అనుభవించడాన్ని, కొన్నిసార్లు నిరుత్సాహానికి లోనవ్వడాన్ని ఆయన అనుమతిస్తాడు. అయినప్పటికీ యెహోవా సహాయంతో మనం ఆ కష్టాల్ని సహిస్తే మన విశ్వాసం బలపడుతుంది. (1 పేతు. 1:6, 7) అపరిపూర్ణతల వల్ల లేదా వేరే కష్టమైన పరిస్థితుల వల్ల నిరుత్సాహపడిన తన నమ్మకమైన సేవకుల్ని యెహోవా ఇంకా ఎలా బలపర్చాడో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

పాట 7 యెహోవా, మన బలం

^ పేరా 5 యోసేపు, నయోమి-రూతు, ఒక లేవీయుడు, అపొస్తలుడైన పేతురు కష్టాల వల్ల నిరుత్సాహపడ్డారు. యెహోవా వాళ్లను ఎలా ఓదార్చాడో, బలపర్చాడో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. వాళ్ల నుండి, వాళ్లకు ప్రేమతో సహాయం చేసిన దేవుని నుండి మనం ఏం నేర్చుకోవచ్చో కూడా పరిశీలిస్తాం.

^ పేరా 56 చిత్రాల వివరణ: నయోమి, రూతు, ఓర్పా తమ భర్తలు చనిపోయిన బాధలో, నిరుత్సాహంలో మునిగిపోయారు. తర్వాత ఓబేదు పుట్టినప్పుడు రూతు-నయోమి బోయజుతో కలిసి సంతోషించారు.