యోబు 3:1-26

  • యోబు తాను పుట్టిన రోజును శపించడం (1-26)

    • తాను ఎందుకు బాధపడుతున్నానని ​ప్రశ్నించడం (20, 21)

3  ఆ తర్వాత యోబు నోరు తెరిచి, తాను పుట్టిన రోజును శపించడం మొదలుపెట్టాడు.+  యోబు ఇలా అన్నాడు:   “నేను పుట్టిన రోజు,‘మగపిల్లాడు పుట్టాడు!’ అని చెప్పుకున్న రాత్రి నశించిపోవాలి.+   ఆ రోజు చీకటైపోవాలి. పైనున్న దేవుడు దాన్ని ఏమాత్రం పట్టించుకోకూడదు;ఏ వెలుగూ దానిమీద ప్రకాశించకూడదు.   కటిక చీకటి* దాన్ని సొంతం చేసుకోవాలి. కారుమబ్బు దాన్ని కమ్ముకోవాలి. భయంకరమైన చీకటి దాని వెలుగును మింగేయాలి.   కటిక చీకటి ఆ రాత్రిని పట్టుకోవాలి;+సంవత్సరంలోని మిగతా రోజులతోపాటు అది సంతోషించకూడదు,అది ఏ నెలలోనూ చేరకూడదు.   ఆ రాత్రి ఎవ్వరూ పుట్టకపోతే బావుండేది;సంతోష ధ్వనులు వినబడకపోతే బావుండేది.   శపించేవాళ్లు, లివ్యాతన్‌ను*+ నిద్రలేపగలిగేవాళ్లుదాన్ని శపించాలి.   దాని వేకువ* చుక్కలు చీకటైపోవాలి;పగటి కోసం అది చూసే ఎదురుచూపులు వృథా అవ్వాలి,ఉదయ కిరణాలు దానిమీద ప్రసరించకూడదు. 10  ఎందుకంటే, నేను కష్టాన్ని చూడకుండా ఉండేలాఅది నా తల్లి గర్భాన్ని మూసేయలేదు.+ 11  పుట్టినప్పుడే నేనెందుకు చనిపోలేదు? గర్భం నుండి బయటపడగానే నేనెందుకు నశించిపోలేదు?+ 12  నన్నెందుకు మోకాళ్ల మీదికి తీసుకున్నారు?ఎందుకు పాలిచ్చారు? 13  లేకపోతే ఈపాటికి నేను ప్రశాంతంగా పడుకుని ఉండేవాణ్ణి;+నిద్రపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాణ్ణి;+ 14  భూరాజులతో పాటు, వాళ్ల సలహాదారులతో పాటు నిద్రిస్తూ ఉండేవాణ్ణి,వాళ్లు తమ కోసం కట్టుకున్న స్థలాలు ఇప్పుడు శిథిలాలయ్యాయి;* 15  లేదా బంగారాన్ని సంపాదించుకుని,తమ ఇళ్లను వెండితో నింపుకున్న అధిపతులతో నిద్రిస్తూ ఉండేవాణ్ణి. 16  నేను పడిపోయిన పిండంలా,ఎన్నడూ వెలుగు చూడని బిడ్డలా ఉంటే బావుండేది. 17  దుష్టులు కూడా అక్కడ ఏ ఆందోళన లేకుండా ఉంటారు;అలసిపోయిన వాళ్లు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు.+ 18  ఖైదీలంతా అక్కడ ప్రశాంతంగా ఉంటారు;తమతో బలవంతంగా పనిచేయించేవాళ్ల స్వరం వాళ్లకు అక్కడ వినబడదు. 19  సామాన్యులు, గొప్పవాళ్లు అందరూ అక్కడ సమానం,+దాసుడు తన యజమాని నుండి విడుదల పొందుతాడు. 20  ఆయన బాధల్లో ఉన్నవాళ్లకు వెలుగును,తీవ్రమైన వేదనలో ఉన్నవాళ్లకు+ జీవాన్ని ఎందుకు ఇవ్వాలి? 21  వాళ్లు చావు కోసం ఎదురుచూస్తున్నా, దాచబడిన నిధుల్ని వెదికినట్టు వెదుకుతున్నాఅది వాళ్లకు ఎందుకు దొరకట్లేదు?+ 22  అది దొరికినప్పుడు వాళ్లు ఎంతో సంతోషిస్తారు,సమాధిని చూసి చాలా ఆనందిస్తారు. 23  దారి తెలియనివాళ్లకు, తాను చుట్టూ కంచె వేసినవాళ్లకు+దేవుడు ఎందుకు వెలుగు ఇస్తున్నాడు? 24  నిట్టూర్పులే నాకు ఆహారమయ్యాయి,+నా మూల్గులు+ నీళ్లలా పారుతున్నాయి. 25  నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది,దేనికైతే భయపడ్డానో అదే నా మీదికి వచ్చింది. 26  మనశ్శాంతి, నెమ్మది, విశ్రాంతి నాకు కరువయ్యాయి,కష్టాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.”

అధస్సూచీలు

లేదా “చీకటి, మరణఛాయ.”
మొసలిని లేదా మరో శక్తివంతమైన పెద్ద నీటిప్రాణిని సూచిస్తుందని కొంతమంది అభిప్రాయం.
లేదా “సంధ్య వెలుగు.”
లేదా “వాళ్లు తమ కోసం నిర్జన స్థలాల్ని కట్టుకున్నారు” అయ్యుంటుంది.