కీర్తనలు 105:1-45
-
తన ప్రజల పట్ల యెహోవా నమ్మకమైన కార్యాలు
105 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి,+ ఆయన పేరున ప్రార్థించండి,దేశదేశాల ప్రజల మధ్య ఆయన కార్యాలు తెలియజేయండి!+
2 ఆయనకు పాటలు పాడండి, ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడండి,*ఆయన చేసిన అద్భుతమైన పనులన్నిటి గురించి ధ్యానించండి.*+
3 ఆయన పవిత్రమైన పేరు గురించి గొప్పలు చెప్పుకోండి.+
యెహోవాను వెతికేవాళ్ల హృదయాలు ఉల్లసించాలి.
4 యెహోవాను, ఆయన బలాన్ని వెతకండి.+
ఎప్పుడూ ఆయన దయను* వెతకండి.
5 ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల్ని,* అద్భుతాల్ని,ఆయన ప్రకటించిన తీర్పుల్ని గుర్తుచేసుకోండి.+
6 ఆయన సేవకుడైన అబ్రాహాము సంతానమా,*ఆయన ఎంచుకున్న యాకోబు వంశస్థులారా,+ గుర్తుచేసుకోండి.
7 ఆయనే మన దేవుడైన యెహోవా.+
ఆయన తీర్పులు లోకమంతటా అమలులో ఉన్నాయి.+
8 ఆయన తన ఒప్పందాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు,తాను చేసిన వాగ్దానాన్ని* వెయ్యి తరాల వరకు గుర్తుంచుకుంటాడు;+
9 అది ఆయన అబ్రాహాముతో చేసిన ఒప్పందం,+ఇస్సాకుకు ఒట్టేసి చేసిన ప్రమాణం;+
10 ఆయన దాన్ని యాకోబుకు ఒక ఆదేశంలా,ఇశ్రాయేలుకు శాశ్వత ఒప్పందంలా స్థిరపరుస్తూ
11 ఇలా అన్నాడు: “నేను కనాను దేశాన్ని నీకు ఇస్తాను,+వారసత్వ ఆస్తిగా దాన్ని మీకు పంచి ఇస్తాను.”
12 ఆయన ఈ మాట అన్నప్పుడు వాళ్లు కొద్దిమందే ఉన్నారు,+అవును, చాలా తక్కువమంది ఉన్నారు, ఆ దేశంలో పరదేశులుగా ఉన్నారు.+
13 వాళ్లు ఒక దేశం నుండి ఇంకో దేశానికి,ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యానికి తిరుగుతూ ఉన్నారు.+
14 ఆయన ఏ మనిషినీ వాళ్లకు హాని చేయనివ్వలేదు,+బదులుగా వాళ్ల కోసం రాజుల్ని గద్దించాడు;+
15 “నా అభిషిక్తుల్ని ముట్టకండి,నా ప్రవక్తలకు ఏ హానీ చేయకండి” అని వాళ్లతో అన్నాడు.+
16 ఆయన ఆ దేశం మీదికి కరువు రప్పించాడు;+వాళ్లకు ఆహారం దొరకకుండా చేశాడు.*
17 వాళ్ల కన్నా ముందు ఒక మనిషిని పంపాడు,వాళ్లు అతన్ని దాసునిగా అమ్మేశారు, అతనే యోసేపు.+
18 వాళ్లు అతని కాళ్లను సంకెళ్లతో బంధించారు;*+అతని మెడకు ఇనుప గొలుసులు వేశారు.
19 ఆయన* మాట నిజమయ్యే వరకు అలా జరిగింది,+యెహోవా మాటే అతన్ని శుద్ధీకరించింది.
20 అతన్ని విడిపించడానికి రాజు మనుషుల్ని పంపాడు,+దేశదేశాల ప్రజల పరిపాలకుడు అతన్ని విడుదల చేశాడు.
21 అతను యోసేపును తన ఇంటికి యజమానిగా,తన ఆస్తి అంతటి మీద అధికారిగా నియమించాడు.+
22 తన అధిపతుల మీద నచ్చినట్టు అధికారం చెలాయించేలా,తన పెద్దలకు తెలివిని నేర్పించేలా అతను యోసేపును నియమించాడు.+
23 అప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తుకు వచ్చాడు,+హాము దేశంలో యాకోబు పరదేశిగా నివసించాడు.
24 దేవుడు తన ప్రజల సంఖ్య ఎక్కువయ్యేలా చేశాడు;+వాళ్ల శత్రువుల కన్నా వాళ్లు బలంగా తయారయ్యేలా చేశాడు.+
25 వాళ్ల మనసు మారిపోనిచ్చాడు, వాళ్లు ఆయన ప్రజల్ని ద్వేషించారు,ఆయన సేవకుల మీద కుట్రపన్నారు.+
26 ఆయన తన సేవకుడైన మోషేను,తాను ఎంచుకున్న అహరోనును+ పంపించాడు.+
27 వాళ్లు ఐగుప్తీయుల మధ్య ఆయన సూచనల్ని,హాము దేశంలో ఆయన అద్భుతాల్ని చూపించారు.+
28 ఆయన చీకటిని పంపినప్పుడు దేశమంతా చీకటి కమ్ముకుంది;+వాళ్లు ఆయన మాటలకు ఎదురుతిరగలేదు.
29 ఆయన వాళ్ల నీళ్లను రక్తంగా మార్చి,వాళ్ల చేపల్ని చంపేశాడు.+
30 వాళ్ల దేశం కప్పలతో నిండిపోయింది,+చివరికి రాజభవనంలోకి కూడా కప్పలు వచ్చేశాయి.
31 దాడి చేయమని ఆయన జోరీగల్ని ఆదేశించాడు,వాళ్ల ప్రాంతాలన్నిట్లోకి దోమల్ని పంపాడు.+
32 వడగండ్లను వర్షంలా కురిపించాడు,వాళ్ల దేశం మీదికి మెరుపుల్ని* పంపించాడు.+
33 వాళ్ల ద్రాక్ష చెట్లను, అంజూర చెట్లను నాశనం చేశాడు,వాళ్ల ప్రాంతంలోని చెట్లను నేలమట్టం చేశాడు.
34 దాడి చేయమని మిడతలకు,లెక్కలేనన్ని మిడత పిల్లలకు ఆజ్ఞ ఇచ్చాడు.+
35 అవి దేశంలోని మొక్కలన్నిటినీ,భూమి పంటను మింగేశాయి.
36 తర్వాత ఆయన వాళ్ల దేశంలోని మొదటి సంతానమంతటినీ,వాళ్ల శక్తికి* ప్రథమఫలాన్ని చంపేశాడు.+
37 ఆయన వెండిబంగారాలతో తన ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు;+ఆయన గోత్రాల్లో ఎవరూ తడబడలేదు.
38 వాళ్లు వెళ్లిపోయినప్పుడు ఐగుప్తు సంతోషించింది,ఎందుకంటే ఇశ్రాయేలీయులంటే* వాళ్లకు భయం పట్టుకుంది.+
39 వాళ్లను సంరక్షించడానికి ఆయన మేఘాన్ని పరిచాడు,+
రాత్రిపూట వెలుగివ్వడానికి అగ్నిని ఇచ్చాడు.+
40 వాళ్లు మాంసం అడిగినప్పుడు ఆయన పూరేడు పిట్టల్ని రప్పించాడు;+ఆకాశం నుండి ఆహారం పంపించి వాళ్లను తృప్తిపరుస్తూ వచ్చాడు.+
41 ఆయన బండరాయిని చీల్చినప్పుడు నీళ్లు వచ్చాయి;+అవి ఎడారిలో నదిలా ప్రవహించాయి.+
42 ఆయన తన సేవకుడైన అబ్రాహాముతో చేసిన పవిత్ర వాగ్దానాన్ని గుర్తుచేసుకున్నాడు.+
43 అందుకే తన ప్రజలు ఉల్లసిస్తూ,తాను ఎంచుకున్నవాళ్లు సంతోషంతో కేకలు వేస్తూ బయటికి వచ్చేలా చేశాడు.+
44 వేరే ప్రజల ప్రాంతాల్ని వాళ్లకిచ్చాడు;+దేశదేశాల ప్రజల కష్టార్జితాన్ని వాళ్లు సొంతం చేసుకున్నారు.+
45 వాళ్లు తన ఆదేశాలు పాటించాలని,తన నియమాలు అనుసరించాలని ఆయన అలా చేశాడు.
యెహోవాను* స్తుతించండి!*
అధస్సూచీలు
^ లేదా “సంగీతం వాయించండి.”
^ లేదా “మాట్లాడండి” అయ్యుంటుంది.
^ అక్ష., “ముఖాన్ని.”
^ లేదా “అద్భుతమైన పనుల్ని.”
^ లేదా “వంశస్థులారా.” అక్ష., “విత్తనమా.”
^ అక్ష., “తాను ఆజ్ఞాపించిన మాటను.”
^ అక్ష., “ప్రతీ రొట్టెల కర్రను విరగ్గొట్టాడు.” ఇది రొట్టెల్ని నిల్వచేయడానికి ఉపయోగించే కర్రను సూచిస్తుండవచ్చు.
^ అక్ష., “బాధించారు.”
^ లేదా “అతని.”
^ లేదా “అగ్నిజ్వాలల్ని.”
^ లేదా “పిల్లల్ని కనే శక్తికి.”
^ అక్ష., “వాళ్లంటే.”
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “హల్లెలూయా!”