కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హఠాత్తుగా ఆరోగ్యం పాడైతే ఏం చేయాలి?

హఠాత్తుగా ఆరోగ్యం పాడైతే ఏం చేయాలి?

 ఉన్నట్టుండి మీ ఆరోగ్యం పాడైందా? అయితే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఎంత నిరుత్సాహంగా అనిపిస్తుందో, హాస్పిటల్‌కు మందులకు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలిసేవుంటుంది. మరి, అలాంటి పరిస్థితిని ఎలా తట్టుకోవచ్చు? ఒంట్లో బాగోలేని కుటుంబ సభ్యులకు గానీ, స్నేహితులకు గానీ మీరెలా సహాయం చేయవచ్చు? బైబిలు వైద్య పుస్తకం కాకపోయినా, కష్టమైన పరిస్థితుల్ని ఎలా తట్టుకోవాలో తెలిపే చక్కని సలహాలు అందులో ఉన్నాయి.

ఆరోగ్యం బాలేనప్పుడు ఉపయోగపడే సలహాలు

  •   డాక్టర్‌ దగ్గరకు వెళ్లండి

     బైబిలు ఇలా చెప్తుంది: “ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు వైద్యుడు అవసరం లేదు రోగులకే అవసరం.”—మత్తయి 9:12.

     ఎలా పాటించవచ్చు: అవసరమైనప్పుడు డాక్టర్‌ని కలిసి ఆయన సలహాలు తీసుకోండి.

     ఇలా చేసి చూడండి: మీకు అందుబాటులో ఉన్న మంచి హాస్పిటల్‌కు వెళ్లండి. కొన్నిసార్లు సలహా కోసం మరో డాక్టర్‌ దగ్గరకు వెళ్లడం (second opinion) కూడా మంచిదే. (సామెతలు 14:15) డాక్టర్ల దగ్గర ఏదీ దాచకుండా మీకు ఒంట్లో ఎలా అనిపిస్తుందో వాళ్లకు అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పండి. (సామెతలు 15:22) మీకొచ్చిన అనారోగ్యం ఏమిటో, దానికి ఎలాంటి ట్రీట్‌మెంట్‌లు ఉన్నాయో తెలుసుకోండి. ఆ ట్రీట్‌మెంట్‌లు ఎలా పనిచేస్తాయో, మీ అనారోగ్యం ఎంతవరకు నయం అవుతుందో తెలుసుకోండి. అలా చేస్తే మానసికంగా సిద్ధపడగలుగుతారు, మీ ఆరోగ్యం గురించి మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు.

  •   ఆరోగ్యానికి మంచి చేసే అలవాట్లు పెంచుకోండి

     బైబిలు ఇలా చెప్తుంది: “శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది.”—1 తిమోతి 4:8, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

     ఎలా పాటించవచ్చు: క్రమంగా ఎక్సర్‌సైజ్‌ చేయడం లాంటి మంచి అలవాట్లు మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

     ఇలా చేసి చూడండి: రోజూ ఎక్సర్‌సైజ్‌ చేయండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. ఒకవైపు మీకొచ్చిన కొత్త అనారోగ్య సమస్యకు అలవాటుపడుతూనే, మరోవైపు కొంచెం సమయం తీసుకుని ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. కాకపోతే ఏవైనా ఎక్సర్‌సైజ్‌లు ఎంచుకునే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని మనసులో ఉంచుకోండి. అవి మీరు తీసుకునే ట్రీట్‌మెంట్‌కు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తపడండి.

  •  స్నేహితుల సహాయం తీసుకోండి

     బైబిలు ఇలా చెప్తుంది: “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.”—సామెతలు 17:17.

     ఎలా పాటించవచ్చు: కష్టమైన పరిస్థితుల్ని తట్టుకోవడానికి మీ స్నేహితులు సహాయం చేస్తారు.

     ఇలా చేసి చూడండి: మీకు ఎలా అనిపిస్తుందో మీరు బాగా నమ్మే మీ స్నేహితునితో మనసువిప్పి చెప్పండి. దానివల్ల మీ గుండెల్లో బరువు తగ్గి కాస్త హాయిగా అనిపిస్తుంది. మీకు సహాయం చేయాలని స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉన్నా ఏం సహాయం చేయాలో వాళ్లకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీకెలాంటి సహాయం కావాలో దాపరికం లేకుండా వాళ్లను అడగండి. కానీ వాళ్లు చేయలేనివి మాత్రం అడగకండి. అలాగే, వాళ్లు చేసినవాటికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకండి. అయితే, మీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో స్నేహితులు చేసే కొన్ని పనులు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి మిమ్మల్ని కలవడానికి ఏయే సమయాల్లో రావచ్చో, ఎంతసేపు ఉండవచ్చో ఖచ్చితంగా చెప్పండి.

  •  నిరుత్సాహపడకండి.

     బైబిలు ఇలా చెప్తుంది: “సంతోష హృదయం మంచి ఔషధం, నలిగిన మనస్సు ఒంట్లో శక్తినంతా లాగేస్తుంది.”—సామెతలు 17:22.

     ఎలా పాటించవచ్చు: జీవితం మీద ఆశ కోల్పోకుండా ఉత్సాహంగా ఉంటే మానసికంగా బలంగా ఉంటారు, మీకు వచ్చిన అనారోగ్య సమస్యను తట్టుకోగలుగుతారు.

     ఇలా చేసి చూడండి: మీరు చేయగలిగే వాటి మీదే మనసు పెట్టండి. మీ చేతుల్లో లేని వాటి గురించి ఆలోచించకండి. మిమ్మల్ని వేరేవాళ్లతో పోల్చుకుని లేదా ఒకప్పుడు మీరు ఎంత బలంగా, ఆరోగ్యంగా ఉండేవాళ్లో గుర్తు చేసుకుని బాధపడకండి. (గలతీయులు 6:4) మీ ఆరోగ్యం సహకరించే పనులు చేయడానికి మాత్రమే ప్రయత్నించండి. అప్పుడు నిరుత్సాహపడకుండా జీవితాన్ని కొనసాగించగలుగుతారు. (సామెతలు 24:10) మీరు చేయగలిగితే వేరేవాళ్లకు సహాయం చేయండి, అప్పుడు మీకున్న సమస్యలు మర్చిపోయి సంతోషంగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఇవ్వడంలో సంతోషం ఉంది.—అపొస్తలుల కార్యాలు 20:35.

మీ అనారోగ్య సమస్యను తట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడా?

 అనారోగ్య సమస్యలు తట్టుకోవడానికి యెహోవా దేవుడు a సహాయం చేస్తాడని బైబిలు చెప్తుంది. దేవుడు అద్భుతం చేసి మన ఆరోగ్యాన్ని బాగు చేయకపోవచ్చు. కానీ తనను ఆరాధించేవాళ్లకు ఆయన సహాయం చేస్తాడు. అది ఎలాగంటే:

 మనశ్శాంతి. ‘మానవ అవగాహనకు మించిన దేవుని శాంతిని’ యెహోవా మీకు ఇవ్వగలడు. (ఫిలిప్పీయులు 4:6, 7) అతిగా ఆందోళన పడకుండా ఉండటానికి దేవుడిచ్చే శాంతి సహాయం చేస్తుంది. దానివల్ల మీరు మనశ్శాంతిగా ఉంటారు. మరి అలాంటి శాంతిని పొందాలంటే ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి, మనసులో ఉన్న ఆందోళనంతా ఆయనకు చెప్పాలి.—1 పేతురు 5:7.

 తెలివి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన తెలివిని యెహోవా ఇస్తాడు. (యాకోబు 1:5) ఆ తెలివిని పొందాలంటే బైబిల్లో ఉన్న సూత్రాల్ని తెలుసుకోవాలి, వాటిని పాటించాలి. ఎందుకంటే, మనకాలానికి కూడా ఉపయోగపడే సూత్రాలు బైబిల్లో ఉన్నాయి.

 జీవితం మీద ఆశ నింపే నిరీక్షణ. భవిష్యత్తులో ఎవ్వరూ, “‘నాకు ఒంట్లో బాలేదు’ అని అనరు” అని యెహోవా మాట ఇచ్చాడు. (యెషయా 33:24) ఈ నిరీక్షణ ఇచ్చే ఊరట వల్ల, చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు కూడా నిరుత్సాహపడకుండా ఉంటున్నారు.—యిర్మీయా 29:11, 12.

a దేవుడు పేరు యెహోవా అని బైబిలు చెప్తుంది.—కీర్తన 83:18.