కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇంతకన్నా మంచి జీవితం ఉంది

ఇంతకన్నా మంచి జీవితం ఉంది

ఇప్పుడు మన జీవితం దేవుడు అనుకున్నట్లుగా లేదు. దేవుని పరిపాలనకు ఇష్టంగా లోబడుతూ, ఆయన నిర్దేశాన్ని పాటిస్తూ, ఆయనకున్న ప్రేమను, ఇతర అద్భుతమైన లక్షణాలను చూపిస్తూ ఉండే మనుషులతో భూమి నిండిపోవాలని ఆయన కోరుకున్నాడు. వాళ్లు పిల్లల్ని పెంచుతూ, కొత్తకొత్త విషయాలు కనిపెడుతూ, కలిసిమెలిసి సంతోషంగా ఉంటూ ఈ భూమినంతా పరదైసులా మార్చాలన్నది ఆయన ఉద్దేశం.

భూమ్మీద మనుషుల జీవితాన్ని తాను అనుకున్నట్లుగా మారుస్తానని దేవుడు మాటిస్తున్నాడు

  • ఆయన భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు. కీర్తన 46:9.

  • భూమిని నాశనం చేసేవాళ్లను నాశనం చేయడానికి సమయం వచ్చింది. ప్రకటన 11:18.

  • అందులో నివసించే వాళ్లెవ్వరూ, నాకు ఒంట్లో బాలేదు అని అనరు. యెషయా 33:24.

  • నా ప్రజలు తమ చేతుల కష్టాన్ని పూర్తిగా అనుభవిస్తారు. యెషయా 65:22.

ఆ మాటలు ఎలా నిజమౌతాయి? దేవుడు తన కుమారుడైన యేసును ఒక పరిపూర్ణ రాజ్యానికి రాజుగా నియమించాడు, అది పరలోకం నుండి ఈ భూమిని పాలిస్తుంది. బైబిలు దాన్ని దేవుని రాజ్యం అని పిలుస్తుంది. (దానియేలు 2:44) దేవుడు యేసుకు ‘సింహాసనాన్ని ఇస్తాడు’ అని, ఆయన ‘రాజుగా పరిపాలిస్తాడు’ అని బైబిలు చెప్తుంది.—లూకా 1:32, 33.

యేసు భూమ్మీద ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేసి, తాను రాజుగా పరిపాలించినప్పుడు మనుషుల జీవితం ఇప్పటికన్నా ఇంకా చాలా బాగుంటుందని చూపించాడు.

దేవుని మాట వినేవాళ్ల కోసం తాను ఏమేమి చేస్తాడో యేసు చూపించాడు

  • ఆయన అన్ని రకాల జబ్బుల్ని నయం చేశాడు, అలా తాను మనుషుల జబ్బులన్నిటినీ పూర్తిగా తీసేస్తానని చూపించాడు.మత్తయి 9:35.

  • ఆయన తుఫానును ఆగిపోయేలా చేశాడు, అలా ప్రకృతి విపత్తుల నుండి మనుషులను కాపాడతానని చూపించాడు.మార్కు 4:36-39.

  • ఆయన వేలమంది ప్రజలకు ఆహారం పెట్టాడు, అలా ప్రజల అవసరాల్ని తీరుస్తానని చూపించాడు.మార్కు 6:41-44.

  • ఆయన ఒక పెళ్లిలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, అలా ప్రజలు సంతోషంగా ఉండేలా చేస్తానని చూపించాడు.యోహాను 2:7-11.

దేవుణ్ణి ప్రేమించేవాళ్ల కోసం ఆయన సిద్ధం చేస్తున్న ఈ జీవితాన్ని మీరు పొందాలంటే ఏం చేయాలి? మీరు ఒక పనిచేయాలని బైబిలు చెప్తుంది. మీరు ‘జీవానికి నడిపించే దారి’ ఏదో తెలుసుకోవాలి, అయితే “కొంతమందే దాన్ని కనుక్కుంటున్నారు” అని బైబిలు చెప్తుంది.—మత్తయి 7:14.

మెరుగైన జీవితానికి నడిపించే దారిని కనుక్కోండి

జీవానికి నడిపించే దారి అంటే ఏంటి? “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును” అని దేవుడు చెప్తున్నాడు. (యెషయా 48:17) ఆ దారిలో నడిస్తే మీ జీవితం ఇంకా బాగుంటుంది.

యేసు ఇలా అన్నాడు: “నేనే దారిని, సత్యాన్ని, జీవాన్ని.” (యోహాను 14:6) కాబట్టి మనం యేసు చెప్పినవాటిని చేస్తూ, ఆయన అడుగుజాడల్లో నడవాలి. అప్పుడే మనం దేవునికి ఇంకా దగ్గరౌతాం, మన జీవితం ఇంకా మెరుగౌతుంది.

జీవానికి నడిపించే దారిని మీరు ఎలా కనుక్కోవచ్చు? మతాలు చాలా ఉన్నాయి, అయితే యేసు ఇలా హెచ్చరించాడు: “‘ప్రభువా, ప్రభువా’ అని నన్ను పిలిచే ప్రతీ ఒక్కరు పరలోక రాజ్యంలోకి వెళ్లరు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్టాన్ని చేస్తున్నవాళ్లే వెళ్తారు.” (మత్తయి 7:21) అంతేకాదు, “మీరు వాళ్ల ఫలాల్ని బట్టి వాళ్లను గుర్తుపడతారు” అని కూడా యేసు అన్నాడు. (మత్తయి 7:16) మీరు బైబిలు సహాయంతో ఏది నిజమైన మతమో గుర్తుపట్టవచ్చు.—యోహాను 17:17.

 జీవానికి నడిపించే దారిలో మీరు ఎలా నడవవచ్చు? అందుకోసం మీరు, మనందరికీ జీవాన్ని ఇచ్చిన వ్యక్తి గురించి తెలుసుకోవాలి, ఆయన ఎవరు? ఆయన పేరేంటి? ఆయనకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? ఆయన మనకోసం ఏం చేస్తున్నాడు? మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. *

మనుషులు కేవలం పని చేయడం, తినడం, ఆడుకోవడం, పిల్లల్ని పెంచడం మాత్రమే చేయాలని దేవుడు కోరుకోవడం లేదు. మనం మన సృష్టికర్త గురించి తెలుసుకోవచ్చు, ఆయనకు స్నేహితులు అవ్వవచ్చు. ఆయన చెప్పింది చేయడం ద్వారా ఆయన్ని ప్రేమిస్తున్నామని చూపించవచ్చు. యేసు ఇలా అన్నాడు: ‘ఒకేఒక్క సత్య దేవుడివైన నిన్ను తెలుసుకోవడమే శాశ్వత జీవితం.’—యోహాను 17:3.

దేవుడు బైబిలు ద్వారా ‘మీకు ప్రయోజనం కలిగేలా’ బోధిస్తున్నాడు.—యెషయా 48:17

మొదటి అడుగు వేయండి

ఒకేఒక్క సత్య దేవుడికి ఇష్టమైన విధంగా జీవించాలంటే కొన్ని మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. అలా చేసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. కానీ నిజానికి ఒక్కసారి మనం ఆ దారిలో నడవడం మొదలుపెడితే, మన జీవితం చాలా మెరుగ్గా తయారౌతుంది. దేవుని గురించి మీకొచ్చే కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ఉచితంగా మీతో బైబిలు స్టడీ చేస్తారు. మీకు అనుకూలంగా ఉన్న సమయంలో, స్థలంలో అది జరుగుతుంది. మీరు www.jw.org/te వెబ్‌సైట్‌ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు.