కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు

తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు

“నాకు ఊపిరితిత్తిలో, పెద్ద పేగులో క్యాన్సర్‌ ఉందని తెలియగానే ఉరిశిక్ష పడిన ఖైదీలా అనిపించింది. కానీ డాక్టర్‌ని కలిసి ఇంటికి రాగానే ఇలా అనుకున్నాను, ‘నిజమే, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు, అయితే ఈ పరిస్థితిని తట్టుకోవడానికి ఒక మార్గం వెతకాలి.’”—లిండా, వయసు 71.

“ముఖంలోని ఎడమ వైపున్న నరాల్ని ప్రభావితం చేసే ఒక తీవ్రమైన జబ్బు నాకుంది. దానివల్ల ఎంతో నొప్పి వచ్చేది, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేదాన్ని. చాలాసార్లు, నాకు ఎవ్వరూ లేరనిపించేది, చివరికి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను.”—అలీస్‌, వయసు 49.

మీకు గానీ, మీకు ఇష్టమైనవాళ్లకు గానీ ప్రాణాంతకమైన జబ్బు ఉందని తెలిసినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. మీరు ఆ జబ్బునే కాకుండా దాంతోపాటు వచ్చే భావోద్వేగ సమస్యల్ని, కోపాన్ని, ఆందోళనను కూడా తట్టుకోవాలి. భయాన్ని, ఒత్తిడిని కలిగించే వైద్య పరీక్షలు, సరైన చికిత్స దొరకడం కష్టమవ్వడం, దొరికినా ఎక్కువ ఖర్చు అవ్వడం, మందులు తీసుకొచ్చే చెడు ప్రభావాల వంటివాటి వల్ల అలాంటి భావోద్వేగ సమస్యలు ఇంకా పెరగవచ్చు. తీవ్రమైన జబ్బు వల్ల వచ్చే మానసిక ఆందోళన తట్టుకోవడం చాలా కష్టం.

మరి సహాయం ఎక్కడ దొరుకుతుంది? దేవునికి ప్రార్థించడం వల్ల, ఓదార్పునిచ్చే బైబిలు వృత్తాంతాలను చదవడం వల్ల తాము ఊరటను పొందినట్టు చాలామంది గ్రహించారు. కుటుంబ సభ్యుల, స్నేహితుల ప్రేమ, మద్దతు కూడా సహాయం చేస్తాయి.

 కొంతమంది ఎలా తట్టుకున్నారు?

58 ఏళ్ల రాబర్ట్‌ ఇలా చెప్తున్నాడు: “దేవుని మీద నమ్మకం ఉంచండి, మీ జబ్బును తట్టుకోవడానికి ఆయనే మీకు సహాయం చేస్తాడు. యెహోవాకు ప్రార్థించండి, మీకెలా అనిపిస్తుందో ఆయనకు చెప్పండి, పవిత్రశక్తి ఇవ్వమని అడగండి. కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహించగలిగేలా సానుకూలంగా ఉండడానికి, అలాగే ప్రశాంతంగా జబ్బును తట్టుకోవడానికి మీకు సహాయం చేయమని వేడుకోండి.”

అతను ఇంకా ఇలా అంటున్నాడు: “భావోద్వేగపరంగా మీ కుటుంబం ఇచ్చే మద్దతు చాలా సహాయకరంగా ఉంటుంది. నాకు ప్రతీరోజు, ఒకరు లేదా ఇద్దరు ఫోన్‌ చేసి ‘ఎలా ఉన్నావ్‌?’ అని అడుగుతుంటారు. వేర్వేరు చోట్ల ఉన్న నా స్నేహితులందరూ నన్ను ప్రోత్సహిస్తుంటారు. దానివల్ల కాస్త ఊరటగా అనిపిస్తుంది, జీవితం మీద ఆశ కోల్పోకుండా ఉండగలుగుతున్నాను.”

మీరు అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితుణ్ణి కలవడానికి వెళ్తుంటే, లిండా చెప్పే ఈ మాటల్ని గుర్తుపెట్టుకోండి: “అనారోగ్యంతో ఉన్నవాళ్లు అందరూ జీవించినట్టే జీవించాలని కోరుకుంటారు, ఎప్పుడూ తమ అనారోగ్య సమస్య గురించే మాట్లాడడానికి వాళ్లు ఇష్టపడకపోవచ్చు. కాబట్టి మామూలు విషయాల గురించి మాట్లాడండి.”

దేవుడిచ్చే బలం వల్ల, లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల, అలాగే కుటుంబ సభ్యుల, స్నేహితుల ప్రేమ, మద్దతు వల్ల తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా జీవితం మీద ఆశ కోల్పోకుండా ఉండవచ్చు.