కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో గౌరవప్రదమైన వివాహాలు

దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో గౌరవప్రదమైన వివాహాలు

దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో గౌరవప్రదమైన వివాహాలు

“కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. . . . యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి.”​—⁠యోహాను 2:​1, 2.

యేసుకు, ఆయన తల్లికి, ఆయన శిష్యుల్లో కొందరికి దేవుని ప్రజల మధ్యజరిగే గౌరవప్రదమైన వివాహంవల్ల కలిగే ఆనందమెలా ఉంటుందో తెలుసు. బైబిల్లో నమోదుచేయబడిన తన మొదటి అద్భుతాన్ని చేయడం ద్వారా, క్రీస్తు ఒక వివాహ సందర్భాన్ని అసాధారణమైనదిగా చేసి, ఆ సందర్భపు ఆనందాన్ని అధికం చేశాడు. (యోహాను 2:​1-11) సంతోషభరితులైన వివాహిత ప్రజలుగా యెహోవాను సేవించాలని ఇష్టపడే క్రైస్తవుల వివాహాలకు మీరు హాజరై ఆనందించి ఉండవచ్చు. లేదా మీ వివాహం కోసం లేదా మీ స్నేహితుని లేదా స్నేహితురాలి వివాహం జయప్రదమయ్యేలా సహాయం చేసేందుకు మీరు ఎదురుచూస్తుండవచ్చు. అలా జయప్రదమయ్యేందుకు ఏమి దోహదపడగలదు?

2 ఒక పురుషుడు, స్త్రీ వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుని ప్రేరేపిత వాక్యంలోని సలహాలు అత్యంత సహాయకరంగా ఉన్నట్లు క్రైస్తవులు కనుగొన్నారు. (2 తిమోతి 3:​16, 17) నిజమే, క్రైస్తవ వివాహం కోసం బైబిలు ఖచ్చితమైన విధానాలను వివరించడం లేదు. అది అర్థం చేసుకోదగినదే, ఎందుకంటే ప్రాంతాన్నిబట్టి, కాలాన్నిబట్టి ఆచారాలతోపాటు, చట్టబద్ధ నియమాలు కూడా మారుతుంటాయి. ఉదాహరణకు, ప్రాచీన ఇశ్రాయేలులో సంప్రదాయబద్ధమైన వివాహ ఆచరణ లాంటిదేమీ ఉండేది కాదు. పెళ్లిరోజున, పెండ్లికుమారుడు పెండ్లికుమార్తెను తన ఇంటికో, తన తండ్రి ఇంటికో తీసుకెళ్తాడు. (ఆదికాండము 24:​67; యెషయా 61:​10; మత్తయి 1:​24) అందరి ఎదుట అలాంటి చర్య తీసుకోవడంవల్ల వివాహం జరిగేది, నేటి అనేక వివాహాల్లో కనిపించే లాంఛనప్రాయమైన ఏ ఆచరణా దానిలో ఉండేది కాదు.

3 ఇశ్రాయేలీయులు ఆ చర్యను వివాహంగా పరిగణించేవారు. ఆ తర్వాత, వారు యోహాను 2:⁠1 పేర్కొనబడినలాంటి వేడుకకు హాజరయ్యేవారు. అనేక బైబిలు అనువాదాల్లో ఆ వచనంలో ఇలావుంది: “కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను.” అయితే, ఆదిమ భాషాపదం “పెండ్లి విందు” లేదా “వివాహ భోజనం” అని సరైన విధంగానే అనువదించబడింది. * (మత్తయి 22:2-10; 25:10; లూకా 14:⁠8) యేసు యూదా వివాహానికి సంబంధించిన విందుకు హాజరయ్యాడని, ఆ సందర్భపు ఆనందానికి చేయూతనిచ్చాడని ఆ వృత్తాంతం స్పష్టం చేస్తోంది. అయితే, ఆ కాలంలోని వివాహ ఏర్పాట్లకూ, నేడు సామాన్యంగా చేసే వివాహ ఏర్పాట్లకూ మధ్య తేడా ఉందనేది కీలకమైన విషయం.

4 నేడు చాలా దేశాల్లో, వివాహం చేసుకోవాలనుకుంటున్న క్రైస్తవులు కొన్ని చట్టబద్ధమైన నియమాలు పాటించాలి. అలా పాటించిన తర్వాత, వారు చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన ఏ రీతిలోనైనా పెళ్లి చేసుకోవచ్చు. అది బహుశా న్యాయమూర్తి, మేయర్‌ లేదా మత పరిచారకుడు నిర్వహించే నిరాడంబరమైన వివాహ ఆచరణగా ఉండవచ్చు. చట్టబద్ధమైన సాక్షులుగా ఉండేందుకు లేదా కేవలం ఈ ప్రాముఖ్యమైన వేడుకలో తమతోపాటు ఆనందాన్ని పంచుకునేందుకు కొంతమంది బంధువుల్ని లేదా క్రైస్తవ స్నేహితుల్ని పిలిచి పెళ్లి చేసుకోవాలని కొందరు నిర్ణయించుకోవచ్చు. (యిర్మీయా 33:​10-11; యోహాను 3:​29) అదేవిధంగా, ఇతర క్రైస్తవులు ఎంతో ప్రణాళిక, ఖర్చు అవసరమైన భారీ వివాహ విందును లేదా రిసెప్షన్‌ ఏర్పాటు చేయకూడదని నిర్ణయించుకోవచ్చు. బదులుగా వారు, కొద్దిమంది సన్నిహిత స్నేహితులతో కలిసి సాధారణ భోజనం చేసేందుకు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విషయంలో మన వ్యక్తిగత ఇష్టాలు ఎలావున్నా, పరిణతిగల ఇతర క్రైస్తవుల దృక్కోణాలు మన దృక్కోణాలకు భిన్నంగా ఉండవచ్చని మనం గుర్తుంచుకోవాలి.​—⁠రోమీయులు 14:​3, 4.

5 చాలామంది క్రైస్తవ దంపతులు తమ వివాహమప్పుడు బైబిలు ఆధారిత ప్రసంగం ఉండాలని నిర్ణయించుకుంటారు. * వివాహ వ్యవస్థాపకుడు యెహోవా అనీ, వివాహం ఎలా విజయవంతమై సంతోషాన్ని తీసుకురాగలదనే విషయంలో జ్ఞానయుక్తమైన సలహాను ఆయన తన వాక్యంలో ఇస్తున్నాడనీ వారికి తెలుసు. (ఆదికాండము 2:​22-24; మార్కు 10:​6-9; ఎఫెసీయులు 5:​22-33) ఆ సంతోషకరమైన సందర్భంలో క్రైస్తవ స్నేహితులు, బంధువులు తమతో పాలుపంచుకోవాలని చాలామంది దంపతులు అనుకుంటారు. అయితే, అనేక రకాలుగావుండే చట్టబద్ధమైన నియమాలు, విధానాలే కాక స్థానికంగా నెలకొన్న ఆచారాలను కూడా మనమెలా దృష్టించాలి? వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులను ఈ ఆర్టికల్‌ పరిశీలిస్తుంది. వీటిలో కొన్ని మీకు తెలిసిన లేదా మీ ప్రాంతంలో జరిగే దానికి చాలా భిన్నంగా ఉండవచ్చు. అయినప్పటికీ, దేవుని సేవకులకు ప్రాముఖ్యమైన కొన్ని సామాన్య సూత్రాలను లేదా అంశాలను మీరు గమనించవచ్చు.

చట్టబద్ధమైన వివాహమే గౌరవప్రదమైనది

6 యెహోవాయే వివాహాన్ని ఆరంభించినా, వివాహం చేసుకునే వారిపై మానవ ప్రభుత్వాలకు కొంత నియంత్రణ ఉంది. అది సరైనదే. యేసు ఇలా చెప్పాడు: “కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి.” (మార్కు 12:​17) అదేవిధంగా అపొస్తలుడైన పౌలు ఈ నిర్దేశమిచ్చాడు: “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడియున్నవి.”​—⁠రోమీయులు 13:⁠1; తీతు 3:⁠1.

7 చాలా దేశాల్లో వివాహానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని కైసరు లేదా పై అధికారులు నిర్ణయిస్తారు. కాబట్టి, లేఖనాధారంగా అర్హులైన ఇద్దరు క్రైస్తవులు వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు, వారు స్థానిక వివాహ చట్టానికి లోబడతారు. దీనిలో అనుజ్ఞాపత్రాన్ని పొందడం, ప్రభుత్వం ఆమోదించిన వివాహ ప్రతినిధిని ఉపయోగించడం, పూర్తైన వివాహాన్ని రిజిస్టర్‌ చేయించుకోవడం ఇమిడివుండవచ్చు. కైసరు ఔగుస్తు రిజిస్ట్రేషన్‌ను లేదా ‘వ్రాయబడుటను’ ఆదేశించినప్పుడు, మరియ యోసేపులు దానికి లోబడి జాబితాలో “వ్రాయబడుటకు” బేత్లెహేముకు వెళ్లారు.​—⁠లూకా 2:​1-5.

8 ఇద్దరు క్రైస్తవులు ప్రామాణికమైన విధంగా, చట్టబద్ధంగా వివాహం చేసుకున్ననప్పుడు, వారు దేవుని దృష్టిలో పరస్పరం బాధ్యతగలవారౌతారు. అందువల్ల, యెహోవాసాక్షులు వైవిధ్యమైన చట్టబద్ధ ఆచారాలతో తమ వివాహాన్ని మళ్లీమళ్లీ జరుపుకోరు లేదా దంపతుల 25వ, 50వ వివాహ వార్షికోత్సవం వంటి సందర్భాల్లో మళ్లీ వివాహ ప్రమాణాలు చేయరు. (మత్తయి 5:​37) (కొన్ని చర్చీలు, చట్టరీత్యా ఆమోదించబడిన పౌరసంబంధ వివాహాన్ని తిరస్కరిస్తాయి, ఒక ప్రీస్టు లేదా మతగురువు మతకర్మలు ఆచరిస్తేనే లేక ఆ జంటను భార్యాభర్తలని ప్రకటిస్తేనే ఆ వివాహం సరైనదని వాదిస్తాయి.) చాలాదేశాల్లో, ప్రభుత్వం వివాహాలు జరిగించేందుకు యెహోవాసాక్షుల పరిచారకునికి అధికారమిస్తుంది. అలా సాధ్యమైనప్పుడు, ఆ పరిచారకుడే రాజ్యమందిరంలో వివాహ ప్రసంగంతోపాటు ఆ వివాహ ఆచరణను/రిజిస్ట్రేషన్‌ను నిర్వహించవచ్చు. యెహోవా దేవుడు నెలకొల్పిన వివాహ ఏర్పాటు గురించిన ప్రసంగానికి స్థానిక సత్యారాధనా స్థలమైన రాజ్యమందిరం సముచితంగా ఉంటుంది.

9 మరికొన్ని దేశాల్లో, పెళ్లిజంట సిటీ హాలు వంటి ప్రభుత్వ కార్యాలయంలో లేదా నియమిత పౌరసంబంధ ప్రతినిధి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని చట్టం కోరవచ్చు. క్రైస్తవులు ఆ చట్టాన్ని అనుసరించి పెళ్లిచేసుకొని, అదేరోజు లేదా మరుసటి రోజు రాజ్యమందిరంలో వివాహ ప్రసంగాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నిర్ణయించుకోవచ్చు. (వారు క్రైస్తవ సంఘంతోసహా దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట వివాహం చేసుకున్నారు కాబట్టి, వారు పౌరసంబంధ ఆచరణకు బైబిలు ప్రసంగానికి మధ్య చాలారోజులు గడవకుండా చూసుకుంటారు.) పౌరసంబంధ వివాహం చేసుకునే జంట, తమ వివాహ ప్రసంగం ఫలానా రాజ్యమందిరంలో ఇవ్వబడాలని ఇష్టపడితే వారు ఆ సంఘ సేవాకమిటీలో ఉన్న పెద్దల అనుమతి ముందే తీసుకోవాలి. ఈ పైవిచారణకర్తలు ఆ జంటకు మంచి పేరుందని ధృవీకరించుకోవడమే కాక, వారి వివాహ సమయం రాజ్యమందిరంలో క్రమంగా జరిగే కూటాలకు, ముందే నిర్ణయించబడిన కార్యక్రమాలకు అంతరాయం కలిగించకుండా కూడా నిశ్చయపర్చుకుంటారు. (1 కొరింథీయులు 14:​33, 39-40) అలాగే జంట రాజ్యమందిరాన్ని అడిగినప్పుడు, వారు హాలును సిద్ధపర్చడం గురించి సమీక్షించడమే కాక, దానిని ఉపయోగించే విషయం గురించి ప్రకటన చేయాలావద్దా అనేది కూడా నిర్ణయిస్తారు.

10 వివాహ ప్రసంగమిచ్చే పెద్ద ఆ ప్రసంగాన్ని స్నేహపూర్వకంగా, ఆధ్యాత్మికంగా బలపర్చే విధంగా, గౌరవప్రదంగా ఇచ్చేందుకు కృషిచేస్తాడు. జంట ఒకవేళ మొదటే పౌరసంబంధ రీతిలో వివాహం చేసుకునివుంటే, వారిద్దరు కైసరు చట్టానికి అనుగుణంగా వివాహం చేసుకున్నారని స్పష్టం చేస్తాడు. పౌరసంబంధ ఆచరణలో వివాహ ప్రమాణాలు చేసుకోకపోతే, ఆ జంట ప్రసంగ సమయంలో ప్రమాణాలు చేసేందుకు ఇష్టపడవచ్చు. * ఆ పౌరసంబంధ ఆచరణలో ఒకవేళ ప్రమాణాలు చేసినా, నవదంపతులు యెహోవా ఎదుట, సంఘం ఎదుట ప్రమాణాలు చేయడానికి ఇష్టపడితే, తాము అప్పటికే ‘జతపరచబడినట్లు’ సూచించేలా ప్రమాణాలు చేయాలి.​—⁠మత్తయి 19:⁠6; 22:​21.

11 కొన్ని ప్రాంతాల్లో చట్టం, వివాహ జంట ప్రభుత్వ ప్రతినిధి సమక్షంలో గానీ, ఫలానా ఆచరణ జరిపి పెళ్లి చేసుకోవాలని గానీ కోరకపోవచ్చు. సంతకం చేసిన వివాహ రిజిస్ట్రేషన్‌ ఫారమ్‌ను అధికారికి ఇస్తే వారికి పెళ్లైనట్లు పరిగణించబడుతుంది. అలా ఆ వివాహ ధృవపత్రం నమోదు చేయబడుతుంది. ఈ విధంగా ఆ తేదీ ఆ జంట పెళ్లిరోజుగా లెక్కించబడి ఆ రోజునుండి వారు భార్యాభర్తలుగా పరిగణించబడతారు. పైన ప్రస్తావించినట్లుగా, ఇలా వివాహం చేసుకున్న జంట తమ వివాహ రిజిస్ట్రేషన్‌ పూర్తైన వెంటనే రాజ్యమందిరంలో బైబిలు ఆధారిత ప్రసంగమివ్వబడేలా ఏర్పాటు చేసుకునేందుకు ఇష్టపడవచ్చు. ఆ ప్రసంగమిచ్చేందుకు ఎంచుకోబడిన ఆధ్యాత్మిక పరిణతిగల సహోదరుడు, అంతకుముందే జరిగిన రిజిస్ట్రేషన్‌నుబట్టి ఆ జంట వివాహం చేసుకున్నారని హాజరైనవారందరికీ తెలియజేస్తాడు. ఏవైనా ప్రమాణాలు చేయాలనుకుంటే వాటిని 10వ పేరాలో, దాని సంబంధిత అధస్సూచిలో ఉన్న సూచనలకు అనుగుణంగా నిర్వహించాలి. రాజ్యమందిరంలో హాజరైనవారందరు ఆ వివాహిత జంటతోపాటు ఆనందించి, దేవుని వాక్య హితవునుండి ప్రయోజనం పొందుతారు.​—⁠పరమగీతము 3:​11.

ఆచారబద్ధమైన, పౌరసంబంధమైన వివాహాలు

12 కొన్నిదేశాల్లో, జంటలు ఆచారబద్ధమైనదిగా (లేదా తెగ సంబంధమైనదిగా) పిలువబడే వివాహం చేసుకోవచ్చు. ఇది ఇద్దరు వ్యక్తులు కేవలం కలిసి జీవించడాన్ని లేదా కొన్ని స్థలాల్లో సంపూర్ణ స్థాయిలో చట్టబద్ధంగా వివాహం కాకపోయినా కలిసి జీవించే వ్యక్తులకు కొంతవరకు వివాహిత హోదా కల్పించే కామన్‌లా మ్యారేజ్‌ను సూచించదు. * మనమిక్కడ సంబంధిత తెగలో లేదా ప్రాంతంలో సార్వజనికంగా ఆమోదించబడిన ఆచారానికి అనుగుణంగా వివాహం చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాం. దీనిలో కన్యాశుల్కాన్ని పూర్తిగా చెల్లించడం, దానిని అంగీకరించడం ఇమిడివుంది, ఈ ప్రక్రియ ద్వారా ఒక జంట చట్టబద్ధంగా లేఖనాధారంగా వివాహం చేసుకున్నవారౌతారు. ప్రభుత్వం అలాంటి వివాహాన్ని సరైనదిగా, చట్టబద్ధమైనదిగా, బాధ్యతాయుతమైనదిగా దృష్టిస్తుంది. అలా ఆచారబద్ధంగా జరిగిన వివాహాన్ని సాధారణంగా ఆ తర్వాత నమోదు చేసుకునే లేదా రిజిస్టరు చేసుకునే వీలుంది, అలాచేసిన జంటకు అధికారిక ధృవపత్రం లభించవచ్చు. ఆ విధంగా నమోదు లేదా రిజిస్టరు చేయించుకోవడం ఆ దంపతులకు లేదా ఆ భార్య విధవరాలైనప్పుడు రక్షణ కల్పిస్తుంది, వారికి పుట్టేపిల్లలకు చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తుంది. అలా ఆచారబద్ధంగా వివాహం చేసుకున్నవారు సాధ్యమైనంత త్వరగా తమ వివాహాన్ని రిజిస్టరు చేసుకొమ్మని సంఘం వారిని కోరుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మోషే ధర్మశాస్త్రం అమలులో ఉన్నప్పుడు వివాహాలు, పుట్టుకలు అధికారికంగా నమోదు చేయబడేవనిపిస్తోంది.​—⁠మత్తయి 1:​1-16.

13 అలా ఆచారబద్ధ ప్రక్రియలో చట్టబద్ధంగా ఒకటైన జంట ఆ వివాహ ఆచరణ ముగిసినప్పుడు భార్యాభర్తలౌతారు. పైన పేర్కొన్నట్లుగా, అలా చట్టబద్ధంగా వివాహం చేసుకున్న క్రైస్తవులు రాజ్యమందిరంలో వివాహ ప్రమాణాలతో కూడిన వివాహ ప్రసంగాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఇష్టపడవచ్చు. అలాంటి ఏర్పాటు జరిగినప్పుడు, ప్రసంగీకుడు ఆ జంట కైసరు నియమాల ప్రకారం అప్పటికే వివాహం చేసుకున్నారని చెబుతాడు. అలాంటి ప్రసంగం ఒకటి మాత్రమే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చట్టపరంగా సరైన ఆచారబద్ధమైన (లేదా తెగ సంబంధమైన) వివాహం ఒకటే కాబట్టి, ప్రసంగం కూడా ఒకసారే ఇవ్వబడుతుంది. ఆ రెండు పనులను సాధ్యమైనంత త్వరగా, వీలైతే అదేరోజున పూర్తిచేయడం సమాజంలో క్రైస్తవ వివాహానికి ఘనతను తీసుకొస్తుంది.

14 ఆచారబద్ధమైన వివాహం చట్టబద్ధంగా గుర్తించబడే కొన్నిదేశాల్లో, పౌర సంబంధమైన (లేదా శాసనబద్ధ) వివాహం చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. పౌర సంబంధ వివాహాన్ని సాధారణంగా ఒక ప్రభుత్వ ప్రతినిధి నిర్వహిస్తాడు, ఆ వివాహంలో పెళ్లి ప్రమాణాలు చేయడం, రిజిస్టరులో సంతకాలు పెట్టడం ఇమిడివుండవచ్చు. కొందరు క్రైస్తవులు ఆచారబద్ధమైన వివాహానికి బదులు ఈ పౌర సంబంధ వివాహాన్ని ఇష్టపడవచ్చు. ఈ రెండు పద్ధతులను పాటించనవసరం లేదు; ఆ రెండు పద్ధతులు చట్టబద్ధమైనవే. వివాహ ప్రసంగం, ప్రమాణాల గురించి 9, 10 పేరాల్లో చెప్పబడినదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఆ జంట దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట గౌరవప్రదమైన రీతిలో వివాహం చేసుకోవడమే ముఖ్యమైన విషయం.​—⁠లూకా 20:​25; 1 పేతురు 2:​13, 14.

వివాహ ఘనతను కాపాడండి

15 పారసీక రాజు వివాహంలో ఒక సమస్య తలెత్తినప్పుడు, ముఖ్య సలహాదారుడైన మెమూకాను ‘స్త్రీలందరు తమ పురుషులను సన్మానించాలనే’ లేదా గౌరవించాలనే సానుకూల ప్రభావం చూపించగల సలహాను ఇచ్చాడు. (ఎస్తేరు 1:​20) క్రైస్తవ వివాహాల విషయంలో అలాంటి సలహా పాటించమని ఏ మానవ రాజు ఆదేశించనసరం లేదు; భార్యలు తమ భర్తల్ని గౌరవించాలని కోరుకుంటారు. అలాగే, క్రైస్తవ భర్తలు తమ భార్యలను సన్మానించి వారిని కొనియాడతారు. (సామెతలు 31:​11, 30; 1 పేతురు 3:⁠7) వివాహాన్ని అనేక సంవత్సరాల తర్వాత గౌరవించడం కాదుగానీ, ఆరంభం నుండే అంటే పెళ్లిరోజు నుండే గౌరవించే స్వభావాన్ని కనబరచాలి.

16 వివాహం జరిగే రోజున, ఆ స్త్రీపురుషులు అంటే భార్యాభర్తలు మాత్రమేకాదుగానీ, దానిపట్ల అందరూ గౌరవం చూపించాలి. ఒకవేళ ఆ వివాహ ప్రసంగాన్ని ఒక పెద్ద ఇస్తుంటే, ఆ ప్రసంగం కూడా గౌరవాన్ని ప్రదర్శించేదిగా ఉండాలి. ఆ ప్రసంగాన్ని దంపతులనుద్దేశించి ఇవ్వాలి. వారిని గౌరవించడంలో భాగంగా ప్రసంగీకుడు ఆ ప్రసంగంలో హాస్యాన్ని లేదా వ్యాప్తిలోవున్న కథలను చొప్పించకూడదు. అటు దంపతులను ఇటు శ్రోతలను ఇబ్బందిపెట్టేలా ఆయన అతిగా తన వ్యక్తిగత అభిప్రాయాలను ప్రస్తావించకూడదు. బదులుగా, ఆయన స్నేహపూర్వకంగా, ప్రోత్సాహకరంగా ప్రసంగించడానికి ప్రయత్నించడంతోపాటు, వివాహ వ్యవస్థాపకుణ్ణి, ఆయన గొప్ప సలహాను నొక్కిచెప్పేందుకు ప్రయత్నించాలి. అవును, ఆ పెద్ద ఇచ్చే గౌరవప్రదమైన వివాహ ప్రసంగం యెహోవా దేవుణ్ణి ఘనపరిచే వివాహానికి దోహదపడుతుంది.

17 ఈ ఆర్టికల్‌లో వివాహానికి సంబంధించిన అనేక చట్టబద్ధమైన వివరాలు ఉండడాన్ని మీరు గమనించివుంటారు. కొన్ని అంశాలు మీ ప్రాంతానికి నేరుగా వర్తించకపోవచ్చు. అయినప్పటికీ, యెహోవాసాక్షుల్లో జరిగే వివాహ ఏర్పాట్లు స్థానిక నియమాలపట్ల, కైసరు శాసనాలపట్ల గౌరవాన్ని కనబర్చడం ఎంత ప్రాముఖ్యమో మనమందరం తెలుసుకోవాలి. (లూకా 20:​25) పౌలు ఇలా ఉద్బోధించాడు: “ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. . . . ఎవనియెడల సన్మానముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.” (రోమీయులు 13:⁠7) అవును, పెళ్లిరోజు నుండే క్రైస్తవులు, ప్రస్తుతకాలం కోసం దేవుడు నియమించిన ఏర్పాటును గౌరవించడం సరైనది.

18 అనేక క్రైస్తవ వివాహాల తర్వాత వివాహ విందు, భోజనం లేదా రిసెప్షన్‌ వంటివి ఏర్పాటు చేయబడతాయి. అలాంటి ఒక విందుకు యేసు హాజరయ్యాడని జ్ఞాపకం చేసుకోండి. అలాంటి విందు ఒకవేళ ఉంటే, అది కూడా దేవుని ఘనపరుస్తూ, నవదంపతులకు, క్రైస్తవ సంఘానికి మంచి పేరు తెచ్చేలా చూసుకునేందుకు బైబిలు సలహా మనకెలా సహాయం చేయగలదు? ఆ విషయాన్నే తర్వాతి ఆర్టికల్‌ పరిశీలిస్తుంది. *

[అధస్సూచీలు]

^ పేరా 5 వివాహానికి సంబంధించని విందుకు కూడా అదే పదాన్ని ఉపయోగించవచ్చు.​—⁠ఎస్తేరు 9:​22, సెప్టాజింట్‌.

^ పేరా 7 యెహోవాసాక్షులు “దేవుని దృష్టిలో గౌరవప్రదమైన వివాహం” అనే శీర్షికగల 30 నిమిషాల వివాహ ప్రసంగ ప్రతిని ఉపయోగిస్తారు. ఈ ప్రసంగం యెహోవాసాక్షులు ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకంతోపాటు, ఇతర ప్రచురణల్లోని చక్కని లేఖనాధార సలహాలను చర్చిస్తుంది. ఆ చర్చ పెళ్లి చేసుకుంటున్న జంటకూ, ఆ పెళ్లికి హాజరైనవారందరికీ సహాయకరంగా ఉంటుంది.

^ పేరా 13 స్థానిక చట్టం మరోలా కోరనట్లయితే, దేవుణ్ణి ఘనపరిచే ఈ ప్రమాణాలను చేయవచ్చు. పెళ్లికుమారుడు: “[పెండ్లికుమారుని పేరు] అను నేను [పెండ్లికుమార్తె పేరు] అను నిన్ను నా పెండ్లి భార్యగా స్వీకరించి, దేవుడు ఏర్పాటు చేసిన వివాహ ఏర్పాటు ప్రకారం మనమిద్దరం భూమ్మీద కలిసి జీవించినంతకాలం, క్రైస్తవ భర్తల కొరకు పరిశుద్ధ లేఖనాల్లో పొందుపర్చబడిన దైవిక శాసనానికి అనుగుణంగా నిన్ను ప్రేమించి సంరక్షిస్తాను.” పెండ్లికుమార్తె: “[పెండ్లికుమార్తె పేరు] అను నేను [పెండ్లికుమారుని పేరు] అను మిమ్మల్ని నా పెండ్లి భర్తగా స్వీకరించి, దేవుడు ఏర్పాటు చేసిన వివాహ ఏర్పాటు ప్రకారం మనమిద్దరం భూమ్మీద కలిసి జీవించినంతకాలం, క్రైస్తవ భార్యల కొరకు పరిశుద్ధ లేఖనాల్లో పొందుపర్చబడిన దైవిక శాసనానికి అనుగుణంగా మిమ్మల్ని ప్రేమించి, మద్దతిస్తూ ప్రగాఢంగా గౌరవిస్తాను.”

^ పేరా 16 కావలికోట (ఆంగ్లం) మే 1, 1962, 287వ పేజీలో కామన్‌లా మ్యారేజ్‌కు సంబంధించిన వ్యాఖ్యానాలు ఉన్నాయి.

^ పేరా 23 ఇరవై ఎనిమిదవ పేజీలోని “మీ పెళ్లిరోజు ఆనందాన్ని, గౌరవాన్ని అధికం చేసుకోండి” ఆర్టికల్‌ చూడండి.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• వివాహాలకు సంబంధించి చట్టబద్ధమైన, లేఖనాధారమైన అంశాలపట్ల మనమెందుకు శ్రద్ధ కనబరచాలి?

• ఇద్దరు క్రైస్తవులు పౌర సంబంధ ఆచరణ ప్రకారం వివాహం చేసుకుంటే, వెంటనే దేనిని ఏర్పాటు చేసుకునేందుకు వారు నిర్ణయించుకోవచ్చు?

• వివాహ ప్రసంగాలు రాజ్యమందిరంలో ఎందుకు ఇవ్వబడతాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1. కానాలో యేసు గురించిన వృత్తాంతం దేనివైపు మన దృష్టిని మళ్లిస్తోంది?

2. వివాహాల గురించిన ఏ సమాచారం బైబిల్లో ఉంది?

3. యేసు కానాలో ఏ సందర్భానికి తన చేయూతనిచ్చాడు?

4. కొందరు క్రైస్తవులు ఏ విధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు, ఎందుకు?

5. చాలామంది క్రైస్తవులు తమ వివాహ సందర్భంలో వివాహ ప్రసంగం ఉండాలని ఎందుకు కోరుకుంటారు, ఆ ప్రసంగంలో ఏ విషయాలు ఉంటాయి?

6, 7. వివాహం విషయంలో చట్టబద్ధమైన అంశాలపట్ల మనమెందుకు శ్రద్ధ కనబరచాలి, ఈ శ్రద్ధను మనమెలా కనబరచవచ్చు?

8. వివాహబంధం ఏ బాధ్యతను తీసుకొస్తుంది, ఆ అవగాహనను ప్రతిబింబించే ఏ పద్ధతిని యెహోవాసాక్షులు అవలంబిస్తారు?

9. (ఎ) పౌర సంబంధ వివాహం విషయంలో, క్రైస్తవ జంట ఏమి చేసేందుకు నిర్ణయించుకోవచ్చు? (బి) వివాహ ఏర్పాట్ల విషయంలో పెద్దలు ఏ పాత్ర పోషించవచ్చు?

10. పౌరసంబంధ రీతిలో వివాహం జరిగితే, అది వివాహ ప్రసంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

11. కొన్ని ప్రాంతాల్లో ఒక జంట ఎలా వివాహం చేసుకుంటారు, అది వివాహ ప్రసంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

12. ఆచారబద్ధమైన వివాహమంటే ఏమిటి, అలాంటి వివాహం చేసుకున్న తర్వాత ఏమి చేయడం మంచిది?

13. ఆచారబద్ధమైన వివాహం తర్వాత, వివాహ ప్రసంగం విషయంలో ఏమిచేయడం సరైనది?

14. ఆచారబద్ధమైన వివాహంతోపాటు, పౌర సంబంధమైన వివాహం కూడా సాధ్యమైనప్పుడు ఒక క్రైస్తవుడు ఏమి చేయవచ్చు?

15, 16. వివాహంలో గౌరవం ఎలా ఒక ప్రాముఖ్యమైన భాగంగా ఉండాలి?

17. క్రైస్తవ వివాహాల్లో చట్టబద్ధమైన అంశమెందుకు ఉంది?

18. వివాహానికి సంబంధించిన ఏ ఐచ్ఛిక అంశం గురించి ఆలోచించాలి, ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని మనమెక్కడ కనుగొనవచ్చు?

[18వ పేజీలోని చిత్రం]

ప్రాచీన ఇశ్రాయేలీయుల వివాహంలో, పెండ్లికుమారుడు పెండ్లికుమార్తెను తన ఇంటికో లేదా తన తండ్రి ఇంటికో తీసుకొచ్చేవాడు

[21వ పేజీలోని చిత్రం]

ఆచారబద్ధమైన వివాహం తర్వాత, క్రైస్తవులు రాజ్యమందిరంలో ప్రసంగాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఇష్టపడవచ్చు