యిర్మీయా 33:1-26
33 యిర్మీయా ఇంకా కాపలాదారుల ప్రాంగణంలో+ బందీగా ఉన్నప్పుడే యెహోవా వాక్యం రెండోసారి అతని దగ్గరికి వచ్చి ఇలా అంది:
2 “భూమిని సృష్టించిన యెహోవా, దాన్ని తయారుచేసి, స్థిరంగా స్థాపించిన యెహోవా ఇలా అంటున్నాడు; ఆయన పేరు యెహోవా,
3 ‘నాకు ప్రార్థించు, నేను నీకు జవాబిస్తాను, నీకు తెలియని గొప్పగొప్ప విషయాల్ని, అర్థం చేసుకోలేని విషయాల్ని నీకు తెలియజేస్తాను.’ ”+
4 “ముట్టడిదిబ్బల వల్ల, ఖడ్గం వల్ల పడగొట్టబడిన ఈ నగరంలోని ఇళ్ల గురించి, యూదా రాజుల ఇళ్ల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు;+
5 కల్దీయులతో పోరాడడానికి వస్తున్న వాళ్ల గురించి, కోపంతో ఆగ్రహంతో నేను చంపినవాళ్ల శవాలతో నింపబడుతున్న ఈ స్థలాల గురించి, నేను ఈ నగరాన్ని విడిచిపెట్టేంత చెడ్డగా ప్రవర్తించినవాళ్ల గురించి ఆయన ఇలా అంటున్నాడు:
6 ‘ఇదిగో, నేను ఆమెను బాగుచేసి ఆరోగ్యవంతురాలిగా చేస్తాను,+ నేను వాళ్లను బాగుచేసి సమృద్ధిగా శాంతిని, సత్యాన్ని దయచేస్తాను.+
7 బందీలుగా వెళ్లిన యూదావాళ్లను, ఇశ్రాయేలువాళ్లను నేను వెనక్కి తీసుకొచ్చి,+ మొదట్లో కట్టినట్టు కడతాను.+
8 వాళ్లు నాకు వ్యతిరేకంగా చేసిన పాపాల వల్ల కలిగిన దోషమంతటినీ కడిగేస్తాను,+ వాళ్లు నాకు వ్యతిరేకంగా చేసిన పాపాల వల్ల, అపరాధాల వల్ల కలిగిన దోషమంతటినీ క్షమిస్తాను.+
9 నేను వాళ్లమీద చూపించే మంచితనం అంతటి గురించి భూమ్మీది ఏయే దేశాలు వింటాయో, వాటన్నిటి ముందు ఆమె వల్ల నాకు కీర్తి, సంతోషం, స్తుతి, మహిమ కలుగుతాయి.+ నేను ఆమెమీద చూపించే మంచితనం అంతటిని బట్టి, ఆమెకు దయచేసే శాంతిని బట్టి వాళ్లు భయపడతారు, వణికిపోతారు.’ ”+
10 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘మనుషులు గానీ పశువులు గానీ లేని పాడుబడ్డ భూమి అని మీరు చెప్పే ఈ స్థలంలో, మనుషులు గానీ నివాసులు గానీ పశువులు గానీ లేకుండా నాశనమైపోయిన యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో మళ్లీ ఈ శబ్దాలు వినిపిస్తాయి:
11 సంతోష ధ్వని, ఉల్లాస ధ్వని,+ పెళ్లికుమారుడి స్వరం, పెళ్లికూతురి స్వరం; “సైన్యాలకు అధిపతైన యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, యెహోవా మంచివాడు;+ ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది!” అని చెప్పేవాళ్ల స్వరం వినిపిస్తాయి.’+
“ ‘వాళ్లు యెహోవా మందిరంలోకి కృతజ్ఞతార్పణలు తీసుకొస్తారు,+ ఎందుకంటే దేశం నుండి బందీలుగా వెళ్లిన వాళ్లను నేను వెనక్కి తీసుకొస్తాను, వాళ్లు మళ్లీ మొదట్లో ఉన్నట్టే ఉంటారు’ అని యెహోవా అంటున్నాడు.”
12 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘మనుషులు గానీ పశువులు గానీ లేని ఈ పాడుబడ్డ భూమిలో, దాని నగరాలన్నిట్లో మళ్లీ పచ్చికబయళ్లు ఉంటాయి, కాపరులు తమ మందల్ని అక్కడ పడుకోబెడతారు.’+
13 “ ‘పర్వత ప్రాంతంలోని నగరాల్లో, మైదానంలోని నగరాల్లో, దక్షిణ ప్రాంతంలోని నగరాల్లో, బెన్యామీను ప్రాంతంలో, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో,+ యూదా నగరాల్లో మందలు మళ్లీ వాటిని లెక్కపెట్టే వాళ్ల చేతుల కింది నుండి వెళ్తాయి’ అని యెహోవా అంటున్నాడు.”
14 “ ‘ఇదిగో, నేను ఇశ్రాయేలు ఇంటివాళ్ల గురించి, యూదా ఇంటివాళ్ల గురించి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే రోజులు వస్తున్నాయి’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+
15 ‘ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదుకు ఒక నీతి మొలకను* పుట్టిస్తాను,+ అతను దేశంలో నీతిన్యాయాలు జరిగిస్తాడు.+
16 ఆ రోజుల్లో యూదా రక్షించబడుతుంది,+ యెరూషలేము సురక్షితంగా నివసిస్తుంది.+ ఆమె, “యెహోవాయే మన నీతి” అని పిలవబడుతుంది.’ ”+
17 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇశ్రాయేలు ఇంటివాళ్ల సింహాసనం మీద కూర్చునే వ్యక్తి దావీదు వంశంలో ఎప్పుడూ ఉంటాడు,+
18 అలాగే నా ముందు నిలబడి సంపూర్ణ దహనబలులు అర్పించడానికి, ధాన్యార్పణలు కాల్చడానికి, బలులు అర్పించడానికి లేవీయులైన యాజకులు ఎప్పటికీ ఉంటారు.’ ”
19 యెహోవా వాక్యం మళ్లీ యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది:
20 “యెహోవా ఇలా అంటున్నాడు, ‘పగలు, రాత్రి వాటివాటి సమయాల్లో రాకుండా నువ్వు పగటి గురించిన నా ఒప్పందాన్ని, రాత్రి గురించిన నా ఒప్పందాన్ని భంగం చేయగలిగితే,+
21 అప్పుడు మాత్రమే నా సేవకుడైన దావీదుతో నేను చేసిన ఒప్పందం భంగమై,+ అతని సింహాసనం మీద కూర్చుని రాజుగా పరిపాలించడానికి అతనికి ఒక కుమారుడు లేకుండా పోతాడు;+ అప్పుడు మాత్రమే నా పరిచారకులైన లేవి యాజకుల గురించిన నా ఒప్పందం కూడా భంగమౌతుంది.+
22 ఆకాశంలో నక్షత్రాల్ని లెక్కపెట్టడం, సముద్రంలోని ఇసుకను కొలవడం అసాధ్యం అనే మాట ఎంత ఖచ్చితమో, నేను నా సేవకుడైన దావీదు సంతానాన్ని,* నాకు పరిచారం చేస్తున్న లేవీయుల్ని వృద్ధి చేయడం కూడా అంతే ఖచ్చితం.’ ”
23 యెహోవా వాక్యం మళ్లీ యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది:
24 “ఈ ప్రజలు, ‘యెహోవా తాను ఎంచుకున్న రెండు కుటుంబాల్ని తిరస్కరిస్తాడు’ అని అంటున్న మాటను నువ్వు గమనించలేదా? వాళ్లు నా ప్రజలతో గౌరవం లేనట్టు ప్రవర్తిస్తున్నారు, వాళ్లను ఇక ఏమాత్రం ఒక జనంగా చూడట్లేదు.
25 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘పగలు, రాత్రి గురించిన నా ఒప్పందాన్ని,+ భూమ్యాకాశాల నియమాల్ని*+ నేను స్థిరపర్చాను అనే మాట ఎంత ఖచ్చితమో,
26 యాకోబు సంతానాన్ని,* నా సేవకుడైన దావీదు సంతానాన్ని* ఎప్పటికీ తిరస్కరించను అనే మాట కూడా అంతే ఖచ్చితం; అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల వంశస్థుల్ని* పరిపాలించడానికి అతని సంతానం* నుండి నేను పరిపాలకుల్ని తీసుకోకుండా ఉండను. ఎందుకంటే వాళ్లలో బందీలుగా వెళ్లిన వాళ్లను నేను సమకూరుస్తాను,+ వాళ్లమీద జాలిపడతాను.’ ”+
అధస్సూచీలు
^ లేదా “వారసుణ్ణి.”
^ అక్ష., “విత్తనాన్ని.”
^ లేదా “శాసనాల్ని.”
^ అక్ష., “విత్తనాన్ని.”
^ అక్ష., “విత్తనాన్ని.”
^ అక్ష., “విత్తనాన్ని.”
^ అక్ష., “విత్తనం.”