ఆదికాండం 24:1-67

  • ఇస్సాకుకు భార్యను వెతకడం (1-58)

  • రిబ్కా ఇస్సాకును కలవడానికి వెళ్లడం (59-67)

24  అబ్రాహాము ఏళ్లు నిండిన ముసలివాడయ్యాడు. యెహోవా ప్రతీ విషయంలో అబ్రాహామును దీవించాడు.+  అబ్రాహాము తన ఆస్తి అంతటినీ చూసుకుంటున్న తన పెద్ద సేవకునితో+ ఇలా అన్నాడు: “దయచేసి, నీ చెయ్యి నా తొడ కింద పెట్టి,  భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా ముందు ఒట్టేయి. నేను ఎవరి మధ్యైతే నివసిస్తున్నానో ఆ కనానీయుల్లో నుండి నువ్వు నా కుమారుని కోసం భార్యను తీసుకురాకూడదు.+  బదులుగా నువ్వు నా దేశానికి, నా బంధువుల+ దగ్గరికి వెళ్లి నా కుమారుడు ఇస్సాకు కోసం భార్యను తీసుకురావాలి.”  అయితే, ఆ సేవకుడు అతనితో ఇలా అన్నాడు: “ఒకవేళ ఈ దేశానికి రావడం ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఏమి చేయాలి? నీ కుమారుణ్ణి నీ దేశానికి+ తిరిగి తీసుకెళ్లాలా?”  అందుకు అబ్రాహాము తన సేవకునితో ఇలా అన్నాడు: “నా కుమారుణ్ణి అక్కడికి తీసుకెళ్లకుండా చూసుకో.+  నా తండ్రి ఇంటి నుండి, నా బంధువుల దేశం నుండి నన్ను తీసుకొచ్చి,+ నాతో మాట్లాడి, ‘నీ సంతానానికి*+ ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాను’+ అని నాతో ప్రమాణం చేసిన+ పరలోక దేవుడైన యెహోవా నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు.+ నువ్వు ఖచ్చితంగా నా కుమారునికి అక్కడి నుండి+ భార్యను తీసుకొస్తావు.  ఒకవేళ ఆ అమ్మాయికి నీతో రావడం ఇష్టంలేకపోతే, ఈ ఒట్టు నుండి నీకు విడుదల లభిస్తుంది. కానీ నువ్వు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకెళ్లకూడదు.”  దాంతో ఆ సేవకుడు తన యజమాని అబ్రాహాము తొడ కింద చెయ్యి పెట్టి దాని గురించి ఒట్టేశాడు.+ 10  ఆ సేవకుడు తన యజమాని ఒంటెల్లో నుండి పది ఒంటెల్ని, తన యజమాని దగ్గరున్న అన్నిరకాల మంచి వస్తువుల్ని తీసుకొని ప్రయాణమయ్యాడు. అలా అతను నాహోరు నగరానికి అంటే మెసొపొతమియకు చేరుకున్నాడు. 11  అతను నగరం బయట ఉన్న బావి దగ్గర ఒంటెల్ని కూర్చోబెట్టాడు. అది దాదాపు సాయంకాల సమయం; ఆ సమయానికి ఊళ్లోని స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వస్తారు. 12  అప్పుడు అతను ఇలా అన్నాడు: “యెహోవా, నా యజమాని అబ్రాహాము దేవా, దయచేసి, ఈ రోజు నా పనిని సఫలం చేయి. నా యజమాని అబ్రాహాము పట్ల నీ విశ్వసనీయ ప్రేమ చూపించు. 13  నేను ఇక్కడ ఒక బావి దగ్గర నిలబడి ఉన్నాను. ఈ నగరంలోని యువతులు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు. 14  నేను ఒక యువతితో, ‘దయచేసి నీ కుండ దించి తాగడానికి నాకు నీళ్లు ఇవ్వు’ అన్నప్పుడు, ఆమె ‘తాగు, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను’ అనాలి. ఆ యువతే నీ సేవకుడైన ఇస్సాకు కోసం నువ్వు నిర్ణయించిన యువతి అయ్యుండాలి; అలా, నువ్వు నా యజమాని పట్ల విశ్వసనీయ ప్రేమ చూపించావని నాకు తెలుస్తుంది.” 15  అతను అలా అనడం పూర్తికాకముందే, రిబ్కా నీళ్ల కుండ భుజం మీద పెట్టుకొని అక్కడికి వచ్చింది. ఆమె బెతూయేలు కూతురు.+ ఈ బెతూయేలు అబ్రాహాము సహోదరుడైన నాహోరు+ భార్య మిల్కా+ కుమారుడు. 16  రిబ్కా చాలా అందగత్తె, కన్య; ఏ పురుషుడూ ఆమెతో ఎప్పుడూ లైంగిక సంబంధం పెట్టుకోలేదు. ఆమె బావిలోకి దిగి తన కుండ నింపుకొని పైకి వచ్చింది. 17  వెంటనే ఆ సేవకుడు ఆమెను కలవడానికి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెతో, “దయచేసి, నేను తాగడానికి నీ కుండలో నుండి నాకు కొన్ని నీళ్లు ఇవ్వు” అన్నాడు. 18  దానికి ఆమె, “అయ్యా, తాగు” అంటూ వెంటనే తన కుండను భుజాల మీద నుండి చేతుల మీదికి దించి, అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చింది. 19  అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చాక, “నేను నీ ఒంటెల కోసం కూడా కావాల్సినన్ని నీళ్లు చేదుకొస్తాను” అంది. 20  కాబట్టి ఆమె వెంటనే తన కుండలోని నీళ్లు తొట్టిలో పోసి, బావి దగ్గరికి చాలాసార్లు పరుగెత్తుకుంటూ వెళ్లి అతని ఒంటెలన్నిటి కోసం నీళ్లు చేదుకొస్తూ ఉంది. 21  ఆ సమయమంతట్లో, ఆ సేవకుడు ఆశ్చర్యంలో మునిగిపోయి మౌనంగా ఆమెనే చూస్తూ, యెహోవా తన ప్రయాణాన్ని సఫలం చేశాడా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. 22  ఒంటెలు నీళ్లు తాగడం అయిపోయాక, ఆ సేవకుడు ఆమెకు ఇవ్వడానికి అర షెకెల్‌* బరువున్న ఒక బంగారు ముక్కు పోగును, పది షెకెల్‌ల* బరువున్న రెండు బంగారు కడియాల్ని బయటికి తీశాడు. 23  తర్వాత అతను ఇలా అన్నాడు: “దయచేసి, నువ్వు ఎవరి కూతురివో చెప్పు. ఈ రాత్రి మేము ఉండడానికి మీ తండ్రి ఇంట్లో చోటు ఉందా?” 24  దానికి ఆమె ఇలా అంది: “నేను నాహోరు భార్య మిల్కా+ కుమారుడైన బెతూయేలు కూతుర్ని.”+ 25  ఆమె ఇంకా ఇలా అంది: “మీరు ఈ రాత్రి ఉండడానికి స్థలం, మీ ఒంటెల కోసం గడ్డి, కావాల్సినంత మేత మా దగ్గర ఉన్నాయి.” 26  అప్పుడు ఆ సేవకుడు వంగి, యెహోవా ముందు సాష్టాంగ నమస్కారం చేసి, 27  ఇలా అన్నాడు: “నా యజమాని అబ్రాహాముకు దేవుడైన యెహోవా స్తుతించబడాలి. ఎందుకంటే ఆయన నా యజమాని పట్ల తన విశ్వసనీయ ప్రేమను, తన నమ్మకత్వాన్ని చూపించడం మానలేదు. యెహోవా నా యజమాని సహోదరుల ఇంటికి నన్ను నడిపించాడు.” 28  అప్పుడు ఆ యువతి ఈ విషయాల గురించి వాళ్ల అమ్మ ఇంటివాళ్లకు చెప్పడానికి పరుగెత్తుకుంటూ వెళ్లింది. 29  రిబ్కాకు ఒక సహోదరుడు ఉన్నాడు, అతని పేరు లాబాను.+ అతను ఊరి బయట బావి దగ్గరున్న ఆ సేవకుని దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. 30  లాబాను తన సహోదరి రిబ్కా ముక్కు పోగునూ ఆమె చేతులకున్న కడియాల్నీ చూసి, అలాగే తన సహోదరి “అతను నాతో ఇలా మాట్లాడాడు” అని చెప్పడం విని అతన్ని కలవడానికి వెళ్లాడు. ఆ వ్యక్తి ఇంకా బావి దగ్గరే ఒంటెల పక్కన నిలబడి ఉన్నాడు. 31  వెంటనే లాబాను ఇలా అన్నాడు: “యెహోవా చేత దీవెన పొందినవాడా, రా! నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకు నిలబడి ఉన్నావు? నేను నీ కోసం ఇంటిని, ఒంటెల కోసం స్థలాన్ని సిద్ధం చేశాను.” 32  దాంతో ఆ వ్యక్తి వాళ్లింటికి వచ్చాడు. అతను* ఒంటెలకున్న జీనులు విప్పి, వాటికి గడ్డిని, మేతను పెట్టి, ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి, అతనితోపాటు ఉన్నవాళ్లు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు. 33  అయితే, భోజనం తెచ్చి అతని ముందు పెట్టినప్పుడు అతను, “నేను చెప్పాల్సింది చెప్పేవరకు భోజనం చేయను” అన్నాడు. దానికి లాబాను, “సరే, చెప్పు!” అన్నాడు. 34  అప్పుడు అతను ఇలా అన్నాడు: “నేను అబ్రాహాము సేవకుణ్ణి.+ 35  యెహోవా నా యజమానిని ఎంతగానో ఆశీర్వదించాడు; గొర్రెల్ని, పశువుల్ని, వెండిబంగారాల్ని, సేవకుల్ని, సేవకురాళ్లను, ఒంటెల్ని, గాడిదల్ని ఇచ్చి నా యజమానిని చాలా ధనవంతుణ్ణి చేశాడు.+ 36  అంతేకాదు, నా యజమాని భార్య శారా తన ముసలితనంలో నా యజమానికి ఒక కుమారుణ్ణి కన్నది.+ నా యజమాని తనకున్న ప్రతీది అతనికి ఇస్తాడు.+ 37  అందుకే నా యజమాని నాతో ఒట్టు వేయించుకుంటూ ఇలా అన్నాడు: ‘నేను ఎవరి మధ్యైతే నివసిస్తున్నానో ఆ కనానీయుల్లో నుండి నా కుమారుని కోసం భార్యను తీసుకురాకూడదు.+ 38  బదులుగా నా తండ్రి ఇంటికి, నా కుటుంబం+ దగ్గరికి వెళ్లి నా కుమారుని కోసం భార్యను తీసుకురావాలి.’+ 39  కానీ నేను నా యజమానిని, ‘ఒకవేళ ఆ అమ్మాయికి నాతో రావడం ఇష్టం లేకపోతే ఏమి చేయాలి?’ అని అడిగాను.+ 40  అప్పుడు అతను నాతో ఇలా అన్నాడు: ‘నేను ఎవరి ముందైతే విధేయతతో నడుచుకున్నానో+ ఆ యెహోవా నీతో తన దూతను పంపిస్తాడు,+ ఖచ్చితంగా నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు; నువ్వు నా కుటుంబం నుండి, నా తండ్రి ఇంటి నుండి+ నా కుమారునికి భార్యను తీసుకురావాలి. 41  నువ్వు నా కుటుంబం దగ్గరికి వెళ్లినప్పుడు, వాళ్లు ఆమెను నీకు ఇవ్వకపోతే, నువ్వు నాకు వేసిన ఒట్టు నుండి విడుదల పొందుతావు. అలా నీ ఒట్టు+ నుండి నీకు విడుదల లభిస్తుంది.’ 42  “నేను ఈ రోజు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అన్నాను: ‘యెహోవా, నా యజమాని అబ్రాహాము దేవా, నువ్వు నా ప్రయాణాన్ని సఫలం చేస్తే ఇలా జరగాలి: 43  నేను ఇక్కడ ఒక బావి దగ్గర నిలబడి ఉన్నాను. నీళ్లు చేదుకోవడానికి ఒక యువతి+ వచ్చినప్పుడు, “దయచేసి, నేను తాగడానికి నీ కుండలో నుండి కొన్ని నీళ్లు ఇవ్వు” అని అంటాను. 44  అప్పుడు ఆమె నాతో, “ఇదిగో తాగు, నీ ఒంటెల కోసం కూడా నీళ్లు చేదుకొస్తాను” అనాలి. నా యజమాని కుమారునికి భార్య అవ్వడానికి యెహోవా ఎంచుకున్న స్త్రీ ఆ యువతే అయ్యుండాలి.’+ 45  “నేను నా హృదయంలో అలా అనుకోవడం పూర్తికాకముందే, రిబ్కా తన భుజం మీద కుండతో వచ్చి, బావిలోకి దిగి నీళ్లు చేదుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు నేను ఆమెను, ‘దయచేసి, తాగడానికి నాకు నీళ్లు ఇవ్వు’ అని అడిగాను.+ 46  ఆమె వెంటనే భుజం మీద నుండి తన కుండను దించి, ‘తాగు,+ నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను’ అంది. దాంతో నేను నీళ్లు తాగాను, ఆమె నా ఒంటెలకు కూడా నీళ్లు పెట్టింది. 47  తర్వాత నేను ఆమెను, ‘నువ్వు ఎవరి కూతురివి?’ అని అడిగాను. దానికి ఆమె, ‘మిల్కా నాహోరుకు కన్న బెతూయేలు కూతుర్ని’ అని చెప్పింది. అప్పుడు నేను ఆమెకు ముక్కు పోగు పెట్టాను, చేతులకు కడియాలు తొడిగాను.+ 48  తర్వాత నేను వంగి యెహోవా ముందు సాష్టాంగ నమస్కారం చేశాను, నా యజమాని దేవుడైన యెహోవాను స్తుతించాను.+ ఎందుకంటే, నా యజమాని సహోదరుడి కూతుర్ని* అతని కుమారుని కోసం తీసుకెళ్లడానికి దేవుడు నన్ను సరైన మార్గంలో నడిపించాడు. 49  నా యజమాని పట్ల విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని చూపించడం మీకు ఇష్టమైతే నాకు చెప్పండి; ఇష్టం లేకపోతే, అది కూడా చెప్పండి, అప్పుడు నేను ఏమి చేయాలో* ఆలోచించుకుంటాను.”+ 50  అప్పుడు లాబాను, బెతూయేలు ఇలా అన్నారు: “ఇది యెహోవా నుండి వచ్చింది కాబట్టి మేము నీతో అవునని గానీ, కాదని గానీ చెప్పలేము. 51  ఇదిగో, రిబ్కా నీ ముందు ఉంది. ఈమెను తీసుకొని వెళ్లు. యెహోవా చెప్పినట్టే ఈమె నీ యజమాని కుమారునికి భార్య అవుతుంది.” 52  అబ్రాహాము సేవకుడు వాళ్ల మాటలు విన్నప్పుడు, వెంటనే నేలమీద పడి యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. 53  తర్వాత అతను వెండి వస్తువుల్ని, బంగారు వస్తువుల్ని, వస్త్రాల్ని బయటికి తీసి రిబ్కాకు ఇచ్చాడు; అలాగే ఆమె సహోదరునికి, వాళ్ల అమ్మకు విలువైన వస్తువుల్ని ఇచ్చాడు. 54  ఆ తర్వాత అతను, అతని మనుషులు తిని, తాగి ఆ రాత్రి అక్కడే బస చేశారు. తర్వాతి రోజు ఉదయం అతను లేచినప్పుడు, “నన్ను నా యజమాని దగ్గరికి పంపించేయండి” అని వాళ్లతో అన్నాడు. 55  అందుకు ఆమె సహోదరుడు, వాళ్ల అమ్మ, “మా అమ్మాయిని పది రోజులైనా మాతో ఉండనివ్వు. ఆ తర్వాత ఆమె వెళ్లవచ్చు” అన్నారు. 56  కానీ అతను, “యెహోవా నా ప్రయాణాన్ని సఫలం చేశాడు, నన్ను ఆపకండి. నేను నా యజమాని దగ్గరికి తిరిగెళ్లేలా నన్ను పంపించేయండి” అని వాళ్లతో అన్నాడు. 57  దానికి వాళ్లు, “అమ్మాయిని పిలిచి, ఆమె ఏమంటుందో అడిగి చూద్దాం” అన్నారు. 58  వాళ్లు రిబ్కాను పిలిచి, “నువ్వు ఇతనితో వెళ్తావా?” అని అడిగారు. అందుకామె, “నాకిష్టమే, నేను వెళ్తాను” అంది. 59  అలా వాళ్లు తమ సహోదరి రిబ్కాను,+ ఆమె దాదిని,*+ అబ్రాహాము సేవకుణ్ణి, అతని మనుషుల్ని పంపించేశారు. 60  వాళ్లు రిబ్కాను దీవించి ఇలా అన్నారు: “మా సహోదరీ, నువ్వు లక్షలమందికి తల్లివి కావాలి. నీ సంతానం* తమను ద్వేషించేవాళ్ల నగరాల్ని స్వాధీనం చేసుకోవాలి.”+ 61  అప్పుడు రిబ్కా, ఆమె సేవకురాళ్లు లేచి ఒంటెల మీద ఎక్కి కూర్చొని, అబ్రాహాము సేవకుని వెంట వెళ్లారు. అలా ఆ సేవకుడు రిబ్కాను తీసుకొని వెళ్లిపోయాడు. 62  ఇస్సాకు నెగెబులో+ నివసిస్తున్నాడు. ఒకరోజు, అతను బెయేర్‌-లహాయిరోయికి+ వెళ్లే దారి నుండి పక్కకు తిరిగి, 63  ధ్యానించడానికి+ పొలంలోకి వెళ్లాడు. అప్పటికే సాయంకాలమై చీకటి కావస్తోంది, అతను తల ఎత్తి చూసినప్పుడు, అదిగో, ఒంటెలు వస్తున్నాయి! 64  రిబ్కా తల ఎత్తి చూసినప్పుడు ఇస్సాకు కనిపించాడు. వెంటనే ఆమె ఒంటె మీద నుండి కిందికి దిగింది. 65  తర్వాత ఆమె అబ్రాహాము సేవకుణ్ణి, “పొలంలో నుండి మనల్ని కలవడానికి వస్తున్నది ఎవరు?” అని అడిగింది. అందుకు ఆ సేవకుడు, “అతను నా యజమాని” అన్నాడు. కాబట్టి ఆమె తలమీద ముసుగు వేసుకుంది. 66  తర్వాత, ఆ సేవకుడు తాను చేసిందంతా ఇస్సాకుకు చెప్పాడు. 67  ఆ తర్వాత ఇస్సాకు ఆమెను తన తల్లి శారా డేరాలోకి+ తీసుకొచ్చాడు. అలా అతను రిబ్కాను తన భార్యగా చేసుకున్నాడు; అతను ఆమెను చాలా ప్రేమించాడు,+ తన తల్లి లేని బాధ+ నుండి ఊరట పొందాడు.

అధస్సూచీలు

అక్ష., “విత్తనానికి.”
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
ఇది బహుశా లాబానును సూచిస్తుంది.
లేదా “మనవరాల్ని.”
అక్ష., “కుడివైపు వెళ్లాలో, ఎడమవైపు వెళ్లాలో.”
అంటే, చిన్నప్పుడు దాదిగా ఉండి, ఇప్పుడు ఆమె సేవకురాలిగా ఉన్న స్త్రీ.
అక్ష., “విత్తనం.”