కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అందరూ ఆత్మగౌరవంతో ఉండవచ్చు

అందరూ ఆత్మగౌరవంతో ఉండవచ్చు

అందరూ ఆత్మగౌరవంతో ఉండవచ్చు

“మనుష్యుల చిరకాల ఆత్మగౌరవం ఘనంగా ఎంచబడే క్రొత్త లోకాన్ని అంటే మరెంతో శ్రేష్ఠమైన లోకాన్ని మనం నిర్మించాలి.” ​—⁠అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, అమెరికా, ఏప్రిల్‌ 25, 1945.

మానవులు తమ గతం నుండి పాఠాలు నేర్చుకొని అందరూ ఆత్మగౌరవంతో జీవించగల “క్రొత్తలోకాన్ని” స్థాపించగలరని రెండవ ప్రపంచ యుద్ధానంతర సంవత్సరాల్లో అనేకమంది నమ్మినట్లే, అధ్యక్షుడు ట్రూమన్‌ కూడా నమ్మాడు. అయితే, ఆధునిక చరిత్ర దానికి విరుద్ధమైన వాస్తవాలను మనముందు ఉంచడం బాధాకరం. సమస్యకు మూలకారణం మానవుల గొప్ప శత్రువే గానీ మానవులు కాదు, అందువల్ల “మనుష్యుల చిరకాల ఆత్మగౌరవం” ఇప్పటికీ అణచివేయబడుతోంది.

సమస్యకు మూలకారణం

మానవ చరిత్రారంభం నుండే మానవులను పరిపాలించే దేవుని హక్కును సవాలుచేసిన దుష్టప్రాణియైన అపవాదియగు సాతానే ఆ శత్రువని బైబిలు పేర్కొంటోంది. సాతాను ఏదెను తోటలో హవ్వతో మాట్లాడినప్పటి నుండి, మానవులను తమ సృష్టికర్త నుండి దూరం చేయాలన్నదే అతని లక్ష్యం. (ఆదికాండము 3:​1-5) ఆదాము హవ్వలు సాతాను ప్రలోభాలకు లొంగిపోయిన తర్వాత వారు అనుభవించిన విపత్కర పర్యవసానాల గురించి ఆలోచించండి! నిషేధించబడిన పండు గురించిన దేవుని నియమానికి అవిధేయులైన వెంటనే వారికెదురైన పర్యవసానం ఏమిటంటే, వారిద్దరు ‘దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా దాక్కున్నారు.’ ఎందుకు? ఆదాము ఇలా ఒప్పుకున్నాడు: “దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని.” (ఆదికాండము 3:​8-10) ఆదాముకు తన పరలోక తండ్రితో ఉన్న సంబంధం, తనను తాను దృష్టించుకొనే విధానం మారిపోయింది. ఆయన అవమానభారంతో యెహోవాతో ఇంతకుముందులా మాట్లాడలేకపోయాడు.

ఆదాము ఆత్మగౌరవం దెబ్బతినడం చూడాలని అపవాది ఎందుకు కోరుకున్నాడు? ఎందుకంటే, మానవుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు, ఆయన దేవుని మహిమను మలినపరిచేలా ప్రవర్తించాలని సాతాను కోరుకున్నాడు. (ఆదికాండము 1:​27; రోమీయులు 3:​23) మానవ చరిత్ర అవమానపరిచే క్రియలతో ఎందుకు నిండివుందో దీనినిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. “ఈ యుగ సంబంధమైన దేవత”గా సాతాను ఇతరులను అవమానపరిచే ఈ స్వభావాన్ని ‘ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకుంటున్న’ కాలంలో పురికొల్పాడు. (2 కొరింథీయులు 4:⁠4; ప్రసంగి 8:⁠9; 1 యోహాను 5:​19) అంటే, మనుష్యులకు దక్కాల్సిన నిజమైన ఆత్మగౌరవం శాశ్వతంగా కనుమరుగైందని దానర్థమా?

యెహోవా తన సృష్టిని గౌరవిస్తున్నాడు

ఆదాము హవ్వలు పాపం చేయకముందు ఏదెను తోటలో ఉన్న పరిస్థితుల గురించి మళ్లీ ఆలోచించండి. వారికి సమృద్ధిగా ఆహారం, సంతృప్తికరమైన పని, వారికీ, వారి సంతానానికీ ఆరోగ్యకరమైన, నిరంతర జీవితాన్ని అనుభవించే ఉత్తరాపేక్ష ఉంది. (ఆదికాండము 1:​28) వారి జీవితానికి సంబంధించిన ప్రతీ అంశం మానవజాతి కోసం దేవుడు ఏర్పాటు చేసిన ప్రేమపూర్వకమైన, గౌరవప్రదమైన సంకల్పాన్ని నొక్కిచెప్పాయి.

ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత మనుష్యుల ఆత్మగౌరవం విషయంలో యెహోవా దృక్పథం మారిందా? మారలేదు. తాము దిగంబరులుగా ఉన్న కారణంగా అవమానభారంతోవున్న వారిపై శ్రద్ధ చూపించాడు. అంజూరపు ఆకులతో తాము కుట్టుకున్న కచ్చడములకు బదులు దేవుడు వారికి “చర్మపు చొక్కాయిలను” ప్రేమపూర్వకంగా ఇచ్చాడు. (ఆదికాండము 3:​7, 21) అవమానభారంతో ఉన్న వారిని ఆ స్థితిలో వదిలేసే బదులు, దేవుడు వారితో గౌరవపూర్వకంగా వ్యవహరించాడు.

ఆ తర్వాత, యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో వ్యవహరించినప్పుడు, సమాజంలో తరచూ అవమానించబడే అనాథలపట్ల, విధవరాండ్రపట్ల, పరదేశులపట్ల కనికరం చూపించాడు. (కీర్తన 72:​13) ఉదాహరణకు, తమ పంటను కోసేటప్పుడు, ఒలీవ చెట్ల, ద్రాక్షతోటల పంటను సమకూర్చేటప్పుడు ఇశ్రాయేలీయులు తాము వదిలేసిన పరిగెను ఏరుకోవడానికి తిరిగి తమ పొలాలకు వెళ్లొద్దని ఆదేశించబడ్డారు. అయితే, ఆ పరిగె “పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఉండవలెను” అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. (ద్వితీయోపదేశకాండము 24:​19-21) ఈ నియమాలను అన్వయించుకున్నప్పుడు, నిరుపేదలకు కూడా భిక్షమెత్తుకునే పరిస్థితి ఏర్పడలేదు, వారికి గౌరవప్రదమైన పని దొరికింది.

యేసు ఇతరులను గౌరవించాడు

దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు ఇతరులను గౌరవించే విషయంలో శ్రద్ధ చూపించాడు. ఉదాహరణకు, ఆయన గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు కుష్ఠరోగంతో నిండిన ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, కుష్ఠరోగి ఇతరులకు ఆ వ్యాధి సోకకుండా ఉండేందుకు “అపవిత్రుడను అపవిత్రుడను!” అని బిగ్గరగా హెచ్చరించాలి. (లేవీయకాండము 13:​45) అయితే ఈ వ్యక్తి యేసు దగ్గరికి వస్తున్నప్పుడు అలా హెచ్చరించలేదు. దానికి బదులు ఆయన సాగిలపడి యేసును ఇలా వేడుకున్నాడు: “ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు.” (లూకా 5:​12) దానికి యేసు ఎలా స్పందించాడు? నియమాన్ని ఉల్లంఘించినందుకు యేసు ఆ వ్యక్తిని గద్దించలేదు, అలాగని అతణ్ణి నిర్లక్ష్యమూ చేయలేదు లేదా అతనికి దూరంగా వెళ్లిపోలేదు. బదులుగా, ఆయన కుష్ఠరోగిని ముట్టుకొని “నాకిష్టమే. నీవు శుద్ధుడవుకమ్ము” అని చెబుతూ అతణ్ణి గౌరవించాడు.​—⁠లూకా 5:​13.

ఇతర సందర్భాల్లో, యేసు రోగులను అసలు ముట్టుకోకుండానే స్వస్థపరచడం ద్వారా, కొన్నిసార్లు దూరం నుండే స్వస్థపరచడం ద్వారా తనకున్న సామర్థ్యాన్ని చూపించాడు. అయితే, ఈ సందర్భంలో ఆయన ఆ వ్యక్తిని ముట్టుకున్నాడు. (మత్తయి 15:​21-28; మార్కు 10:​51, 52; లూకా 7:​1-10) ఆ వ్యక్తి “కుష్ఠరోగముతో నిండి” ఉన్నాడు కాబట్టి, చాలాకాలంగా ఆయనను ఖచ్చితంగా ఎవరూ ముట్టుకొని ఉండకపోవచ్చు. మరో వ్యక్తి తనను ముట్టిన అనుభూతి మళ్లీ కలగడం ఆయనకు ఎంత ఓదార్పును ఇచ్చివుంటుందో కదా! ఆయన తన కుష్ఠరోగం నయంకావాలని మాత్రమే ఆశించివుండవచ్చు, యేసు తనను ముట్టుకోవాలని ఆశించివుండకపోవచ్చు. అయినా, యేసు ఆ వ్యక్తిని స్వస్థపరచిన విధం, మనుష్యుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికి కూడా తప్పక సహాయం చేసింది. ఇతరుల ఆత్మగౌరవంపట్ల ఉన్న అలాంటి శ్రద్ధ నేటి సమాజంలో కూడా ఉండగలదని నమ్మడం వాస్తవికమైనదేనా? వాస్తవికమైనదైతే, దానినెలా చూపించవచ్చు?

గౌరవం ప్రదర్శించే పరిపాలన

మానవ సంబంధాల గురించి ఇప్పటివరకు ఇవ్వబడిన ఉపదేశాల్లో అతి శ్రేష్ఠమైనదిగా చాలామంది పరిగణించే ఉపదేశాన్ని యేసు ఇచ్చాడు: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:​12) బంగారు సూత్రమని తరచూ పిలవబడే ఆ సూత్రం, ఒక వ్యక్తి తన పొరుగువాడిని గౌరవిస్తూ తాను కూడా అతని నుండి అంతే గౌరవాన్ని పొందడాన్ని ఆశించేందుకు పురికొల్పుతుంది.

చరిత్ర రుజువుచేస్తున్నట్లుగా, ఈ సూత్రాన్ని అన్వయించుకోవడం సహజంగా వచ్చేదికాదు, తరచూ ఈ సూత్రానికి వ్యతిరేకంగానే ప్రజలు వ్యవహరిస్తారు. “నేను ఇతరులను అవమానించడంలో ఆనందించేవాణ్ణి, కేవలం కొన్ని మాటలతో వారిని కంగారుపెట్టేవాణ్ణి, కలవరపెట్టేవాణ్ణి, కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకొనేలా చేసేవాణ్ణి” అని ఒక వ్యక్తి అన్నాడు, ఆయనను మనం హెరాల్డ్‌ అని పిలుద్దాం. హెరాల్డ్‌ ఇతరులతో వ్యవహరించే తీరును మార్చుకునేలా చేసిన ఒక సంఘటన జరిగింది. “చాలామంది యెహోవాసాక్షులు మా ఇంటికి రావడం మొదలుపెట్టారు. నేను గతాన్ని నెమరువేసుకున్నప్పుడు, నేను వారితో అన్న కొన్ని మాటల గురించి, వారితో వ్యవహరించిన తీరు గురించి ఆలోచించడానికే నాకు సిగ్గనిపిస్తోంది. అయినా వారు ఎన్నడూ పట్టువీడలేదు, బైబిలు సత్యాలు కొద్దికొద్దిగా నా హృదయాన్ని స్పర్శించి, నాలో మార్పులు చేసుకునేందుకు నన్ను ప్రోత్సహించాయి.” ఈ రోజు, హెరాల్డ్‌ క్రైస్తవ సంఘంలో ఒక పెద్దగా సేవచేస్తున్నాడు.

“దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది” అనే వాక్యానికి హెరాల్డ్‌ సజీవ సాక్ష్యం. (హెబ్రీయులు 4:​12) ఒక వ్యక్తి హృదయాన్ని స్పర్శించి ఆయన ఆలోచనను, ప్రవర్తనను మార్చే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఇతరులను గౌరవించాలంటే, వారిని బాధపెట్టే బదులు సహాయం చేయాలనే, అవమానించే బదులు గౌరవించాలనే హృదయపూర్వక కోరిక ఉండడం ప్రాముఖ్యం.​—⁠అపొస్తలుల కార్యములు 20:​35; రోమీయులు 12:​10.

సరైన ఆత్మగౌరవం పునరుద్ధరించబడుతుంది

బైబిల్లో ఉన్న అద్భుతమైన నిరీక్షణ గురించి ఇతరులతో మాట్లాడడానికి యెహోవాసాక్షులను ఆ హృదయపూర్వక కోరికే పురికొల్పుతుంది. (అపొస్తలుల కార్యములు 5:​42) తోటి మానవులను గౌరవించి, వారిని ఘనపర్చడానికి ‘మేలైన సువర్తమానము’ ప్రకటించడమంత శ్రేష్ఠమైన మార్గం ఇంకొకటి లేదు. (యెషయా 52:​7, NW) ‘మేలైన’ అనే ఆ పదం సూచిస్తున్న వాటిలో “నవీనస్వభావమును” ధరించుకోవడం కూడా ఇమిడివుంది, అది ఇతరులను అవమానించాలనే “దురాశను” చంపేస్తుంది. (కొలొస్సయులు 3:​5-10) దానిలో మానవులు తమ ఆత్మగౌరవాన్ని కోల్పోయేలా చేస్తున్న పరిస్థితులు, వైఖరులతోపాటు, వాటి సూత్రధారియైన అపవాదియైన సాతానును కూడా త్వరలో తొలగించాలనే యెహోవా సంకల్పం కూడా ఇమిడివుంది. (దానియేలు 2:​44; మత్తయి 6:​9, 10; ప్రకటన 20:​1, 2, 10) అలా జరిగి, భూమి “యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి”నప్పుడు మాత్రమే, అందరికీ ఆత్మగౌరవం లభిస్తుంది.​—⁠యెషయా 11:⁠9.

ఈ అద్భుతమైన నిరీక్షణ గురించి నేర్చుకోవాల్సిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ఇతరులను ఘనపరుస్తుందని యెహోవాసాక్షులతో సహవసించడం ద్వారా మీరు తెలుసుకుంటారు. మరెన్నడూ అణచివేయబడని విధంగా ‘మనుష్యుల ఆత్మగౌరవం చిరకాలం’ ఉండే లోకాన్ని, ‘ఎంతో శ్రేష్ఠమైన క్రొత్తలోకాన్ని’ దేవుని రాజ్యం త్వరలో ఎలా తీసుకొస్తుందో మీరు నేర్చుకోగలుగుతారు.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

యథార్థంగా ఉండడం వారి గౌరవాన్ని కాపాడింది

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో దాదాపు 2,000కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు తమ నమ్మకాల కారణంగా నాజీ సామూహిక నిర్బంధ శిబిరాలకు పంపించబడ్డారు. వారు తమ యథార్థతను ప్రదర్శించిన తీరును గమనించిన మాజీ రావెన్స్‌బ్రూక్‌ కారాగారవాసి లా గార్డియా గ్లక్‌, మై స్టోరి అనే తన పుస్తకంలో ఇలా వివరించింది: “తమ నమ్మకాలను త్యజించి, వాటిని త్యజిస్తున్నట్లు తెలియజేసే దస్తావేజుమీద సంతకం చేసే బైబిలు విద్యార్థులకు స్వేచ్ఛ ఇవ్వబడుతుంది, వారిక హింసించబడరు అని ఒక సమయంలో రహస్య పోలీసులు ప్రకటించారు.” ఆ దస్తావేజు మీద సంతకం చేయడానికి నిరాకరించిన వారి గురించి ఆమె ఇలా వ్రాసింది: “వారు హింసను అనుభవిస్తూ, నూతనలోకం కోసం ఓర్పుతో వేచివుండడానికే ఇష్టపడ్డారు.” వారు ఆ వైఖరిని ఎందుకు అవలంబించారు? ముందరి ఆర్టికల్‌ ప్రారంభంలో పేర్కొనబడిన మాగ్దాలానా ఇప్పుడు 80వ పడిలో ఉంది, ఆమె ఇలా వివరిస్తోంది: ఏదో ఒకటి చేసి సజీవంగా ఉండడంకన్నా యెహోవాకు నమ్మకంగా ఉండడమే చాలా ప్రాముఖ్యం. మన గౌరవాన్ని కాపాడుకోవడం అంటే మన యథార్థతను కాపాడుకోవడమే. *

[అధస్సూచి]

^ పేరా 23 కుస్సరో కుటుంబం గురించిన మరిన్ని వివరాల కోసం కావలికోట (ఆంగ్లం), సెప్టెంబరు 1, 1985, 10-15 పేజీలు చూడండి.

[5వ పేజీలోని చిత్రం]

యేసు తాను స్వస్థపరచినవారిని గౌరవించాడు

[7వ పేజీలోని చిత్రం]

“మేలైన సువర్తమానము” గురించి ఇతరులకు ప్రకటించడం ద్వారా యెహోవాసాక్షులు ఇతరులను గౌరవిస్తారు