లూకా సువార్త 5:1-39

  • అద్భుతరీతిలో చేపలు పడడం; మొదటి శిష్యులు (1-11)

  • కుష్ఠురోగి బాగవ్వడం (12-16)

  • పక్షవాతం ఉన్న వ్యక్తిని యేసు బాగుచేయడం (17-26)

  • యేసు లేవిని పిలవడం (27-32)

  • ఉపవాసం గురించిన ప్రశ్న (33-39)

5  ఒకసారి యేసు గెన్నేసరెతు సరస్సు*+ దగ్గర దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, చాలామంది ప్రజలు ఆయన చెప్పేది వింటూ ఆయన మీద పడుతూ ఉన్నారు.  యేసు సరస్సు ఒడ్డున రెండు పడవలు ఉండడం చూశాడు, జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటున్నారు.+  వాటిలో ఒక పడవ సీమోనుది. యేసు అందులోకి ఎక్కి, దాన్ని ఒడ్డు నుండి కాస్త దూరం లాగమని అతన్ని అడిగాడు. తర్వాత ఆయన పడవలో కూర్చొని, అందులో నుండే వాళ్లకు బోధించడం మొదలుపెట్టాడు.  ఆయన మాట్లాడడం పూర్తయ్యాక సీమోనుతో, “పడవను లోతుగా ఉన్న చోటికి తీసుకెళ్లి అక్కడ మీ వలలు వేయండి” అన్నాడు.  కానీ సీమోను, “బోధకుడా, మేము రాత్రంతా కష్టపడినా మాకు ఏమీ దొరకలేదు.+ అయినా నువ్వు చెప్పావు కాబట్టి వలలు వేస్తాను” అన్నాడు.  వాళ్లు అలా వలలు వేసినప్పుడు చాలా చేపలు పడ్డాయి, దాంతో వాళ్ల వలలు పిగిలిపోసాగాయి.+  కాబట్టి వాళ్లు ఇంకో పడవలో ఉన్న తమ తోటి జాలర్లకు సైగ చేసి, వచ్చి తమకు సహాయం చేయమన్నారు. వాళ్లు వచ్చి రెండు పడవల నిండా చేపల్ని నింపారు. దాంతో ఆ పడవలు మునిగిపోసాగాయి.  అది చూసి సీమోను పేతురు యేసు మోకాళ్ల ముందు పడి, “ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచివెళ్లు” అన్నాడు.  ఎందుకంటే, తాము పట్టిన చేపల్ని చూసి అతను, అతనితో ఉన్నవాళ్లు ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 10  సీమోను తోటి జాలర్లూ, జెబెదయి కుమారులూ అయిన యాకోబు, యోహాను+ కూడా ఆశ్చర్యపోయారు. అయితే యేసు సీమోనుతో, “భయపడకు. ఇప్పటినుండి నువ్వు మనుషుల్ని పట్టే జాలరిగా ఉంటావు” అన్నాడు.+ 11  కాబట్టి వాళ్లు పడవల్ని ఒడ్డుకు లాగి, అన్నీ విడిచిపెట్టి ఆయన్ని అనుసరించారు.+ 12  ఇంకో సందర్భంలో ఆయన ఆ నగరాల్లో ఒకదానిలో ఉన్నప్పుడు, ఇదిగో! ఒంటి నిండా కుష్ఠు ఉన్న ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతను యేసును చూసినప్పుడు సాష్టాంగపడి, “ప్రభువా, నీకు ఇష్టమైతే, నన్ను శుద్ధుడిగా చేయగలవు” అని ఆయన్ని వేడుకున్నాడు.+ 13  కాబట్టి ఆయన చెయ్యి చాపి, అతన్ని ముట్టుకుని, “నాకు ఇష్టమే! శుద్ధుడివి అవ్వు” అన్నాడు. వెంటనే అతని కుష్ఠురోగం పోయింది.+ 14  తర్వాత ఆయన దీని గురించి ఎవరికీ చెప్పొద్దని అతనికి ఆజ్ఞాపించి, “అయితే వెళ్లి యాజకునికి కనిపించి, నువ్వు శుద్ధుడివి అయినందుకు మోషే ధర్మశాస్త్రంలో చెప్పినట్టు ఒక అర్పణను అర్పించు.+ ఇది వాళ్లకు సాక్ష్యంగా ఉంటుంది” అన్నాడు.+ 15  ఆయన గురించిన వార్త అంతటా వ్యాపిస్తూ ఉండడంతో ఆయన చెప్పేది వినడానికి, బాగవ్వడానికి చాలామంది వచ్చేవాళ్లు.+ 16  అయితే, ఆయన ప్రార్థించడం కోసం తరచూ ఎడారి ప్రాంతానికి వెళ్లేవాడు. 17  అలా ఒకరోజు ఆయన బోధిస్తున్నప్పుడు గలిలయ, యూదయ గ్రామాలన్నిటిలో నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అక్కడ కూర్చొని ఉన్నారు. బాగుచేయడానికి యెహోవా* శక్తి ఆయనకు తోడుగా ఉంది.+ 18  అప్పుడు ఇదిగో! పక్షవాతం వచ్చిన ఒక వ్యక్తిని కొంతమంది మంచం* మీద మోసుకొచ్చారు. వాళ్లు అతన్ని లోపలికి తీసుకొచ్చి యేసు ముందు ఉంచాలనుకున్నారు.+ 19  ఆ ఇల్లు జనంతో కిటకిటలాడుతున్నందువల్ల వాళ్లు అతన్ని లోపలికి తీసుకురాలేక, ఆ ఇంటి పైకప్పు మీదికి ఎక్కి, పెంకులు తీసేసి, పక్షవాతం ఉన్న వ్యక్తిని మంచంతో* పాటు సరిగ్గా ఆయన ముందు దించారు. 20  వాళ్ల విశ్వాసాన్ని చూసినప్పుడు యేసు అతనితో, “నీ పాపాలు క్షమించబడ్డాయి!” అన్నాడు.+ 21  అప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు “దేవుణ్ణి దూషిస్తున్న ఇతను ఎవరు? పాపాల్ని క్షమించే అధికారం దేవునికి తప్ప ఇంకెవరికి ఉంది?”+ అని ఆలోచించడం మొదలుపెట్టారు. 22  అయితే యేసు వాళ్ల ఆలోచనను పసిగట్టి వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు మనసులో ఏమి ఆలోచిస్తున్నారు? 23  ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడం తేలికా? ‘లేచి, నడువు’ అని చెప్పడం తేలికా? 24  అయితే, భూమ్మీద పాపాలు క్షమించే అధికారం మానవ కుమారునికి* ఉందని మీరు తెలుసుకోవాలని ...” తర్వాత ఆయన పక్షవాతం ఉన్న వ్యక్తితో, “నేను నీతో చెప్తున్నాను, లేచి, నీ మంచం తీసుకొని మీ ఇంటికి వెళ్లు” అన్నాడు.+ 25  దాంతో అతను వాళ్ల ముందు లేచి నిలబడి, తాను అప్పటివరకు పడుకొని ఉన్న మంచాన్ని తీసుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ తన ఇంటికి వెళ్లిపోయాడు. 26  అప్పుడు వాళ్లంతా ఆశ్చర్యంలో మునిగిపోయి దేవుణ్ణి మహిమపర్చడం మొదలుపెట్టారు. అంతేకాదు వాళ్లు చాలా భయపడి, “ఇలాంటివి మనం ఎప్పుడూ చూడలేదే!” అని అనుకున్నారు. 27  తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్తూ, పన్ను వసూలుచేసే కార్యాలయంలో కూర్చున్న లేవి* అనే పన్ను వసూలుచేసే వ్యక్తిని చూసి అతనితో, “వచ్చి, నన్ను అనుసరించు” అన్నాడు.+ 28  అప్పుడు అతను లేచి, అన్నీ విడిచిపెట్టి ఆయన్ని అనుసరించాడు. 29  ఆ తర్వాత లేవి తన ఇంట్లో యేసు కోసం గొప్ప విందు ఏర్పాటు చేశాడు. చాలామంది పన్ను వసూలుచేసే వాళ్లు, ఇతరులు వాళ్లతో కలిసి భోంచేస్తున్నారు.+ 30  అది చూసి పరిసయ్యులు, వాళ్ల శాస్త్రులు, “మీరు ఎందుకు పన్ను వసూలుచేసే వాళ్లతో, పాపులతో కలిసి భోంచేస్తున్నారు?” అంటూ యేసు శిష్యుల మీద సణుక్కున్నారు.+ 31  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం.+ 32  నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పశ్చాత్తాపపడమని పాపుల్ని పిలవడానికే వచ్చాను.”+ 33  వాళ్లు యేసుతో, “యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు తరచూ ఉపవాసం ఉంటారు, పట్టుదలగా ప్రార్థనలు చేస్తారు. కానీ నీ శిష్యులు తింటారు, తాగుతారు” అని అన్నారు.+ 34  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “పెళ్లికుమారుడు తమతో ఉండగా, అతని స్నేహితులతో మీరు ఉపవాసం చేయించగలరా? 35  అయితే పెళ్లికుమారుణ్ణి+ వాళ్ల దగ్గర నుండి తీసుకెళ్లిపోయే రోజులు వస్తాయి, ఆ రోజుల్లో వాళ్లు ఉపవాసం ఉంటారు.”+ 36  ఆయన వాళ్లకు ఈ ఉదాహరణ* కూడా చెప్పాడు: “ఎవ్వరూ కొత్త గుడ్డముక్కను కత్తిరించి పాత వస్త్రానికి అతుకేసి కుట్టరు. అలాచేస్తే, కొత్త గుడ్డముక్క పాత వస్త్రాన్ని చింపేస్తుంది. కొత్త గుడ్డముక్క పాత దానితో కలవదు.+ 37  అంతేకాదు, కొత్త ద్రాక్షారసాన్ని ఎవ్వరూ పాత ద్రాక్షతిత్తుల్లో పోయరు. ఒకవేళ పోస్తే, ఆ కొత్త ద్రాక్షారసం వల్ల ద్రాక్షతిత్తులు పిగిలిపోతాయి. అప్పుడు ద్రాక్షారసం కారిపోతుంది, ద్రాక్షతిత్తులు పాడౌతాయి. 38  అందుకే, కొత్త ద్రాక్షారసాన్ని కొత్త ద్రాక్షతిత్తుల్లోనే పోయాలి. 39  పాత ద్రాక్షారసం తాగిన తర్వాత ఎవ్వరూ కొత్తది తాగాలనుకోరు. ‘పాతదే బాగుంది’ అంటారు.”

అధస్సూచీలు

అంటే, గలిలయ సముద్రం.
అనుబంధం A5 చూడండి.
రోగుల్ని మోసుకెళ్లే చిన్న పరుపు.
రోగుల్ని మోసుకెళ్లే చిన్న పరుపు.
యేసు తన గురించి చెప్పడానికే ఈ పదం వాడాడు. పదకోశం చూడండి.
ఇది మత్తయికి ఇంకో పేరు.
లేదా “ఉపమానం.”