కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘సహనం తన పనిని పూర్తి చేయనివ్వండి’

‘సహనం తన పనిని పూర్తి చేయనివ్వండి’

‘సహనం తన పనిని పూర్తి చేయనివ్వండి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో సంపూర్ణులుగా, నిర్దోషులుగా, దేనిలోనూ లోపంలేని వాళ్లుగా ఉండగలుగుతారు.’యాకో. 1:4, NW.

పాటలు: 24, 139

1, 2. (ఎ) గిద్యోను, అతని 300 మంది సైనికులు చూపించిన సహనం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) లూకా 21:19 లోని మాటల్నిబట్టి సహనం చూపించడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

 న్యాయాధిపతియైన గిద్యోను నాయకత్వంలో ఇశ్రాయేలు సైనికులు తమ శత్రువులతో చేస్తున్న యుద్ధాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఆ యుద్ధం చాలా కష్టమైనది. పైగా గిద్యోను, అతని సైనికులు చాలా అలసిపోయారు. ఎందుకంటే వాళ్లు మిద్యానీయులను, వాళ్ల మద్దతుదారులను రాత్రంతా దాదాపు 32 కి.మీ. వరకు తరుముతూనే ఉన్నారు! ఆ తర్వాత ఏమి జరిగిందో బైబిలు ఇలా చెప్తుంది, “గిద్యోనును అతనితోనున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.” కానీ వాళ్లు యుద్ధంలో గెలవాలంటే, మరో 15,000 మంది సైనికులతో పోరాడాలి. ఈ శత్రువులు ఇశ్రాయేలీయుల్ని ఎన్నో సంవత్సరాలపాటు అణచివేశారు, అందుకే గిద్యోను అతని సైన్యం యుద్ధంలో వెన్నుచూపకుండా ఆ శత్రువుల్ని తరుముతూనే ఉన్నారు. ఆఖరికి వాళ్లు యుద్ధం గెలిచారు.—న్యాయా. 7:22; 8:4, 10, 28.

2 మనం కూడా కష్టమైన, అలసటతో కూడిన యుద్ధాన్ని చేస్తున్నాం. మన శత్రువుల్లో సాతాను, ఈ లోకం, మన సొంత అపరిపూర్ణతలు కూడా ఉన్నాయి. మనలో కొంతమందిమి ఈ శత్రువులతో ఎన్నో ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాం, యెహోవా సహాయంతో చాలాసార్లు గెలిచాం కూడా. అయితే మనం ఇంకా పూర్తి విజయాన్ని సాధించలేదు. కొన్నిసార్లు మనం పోరాడి పోరాడి అలసిపోవచ్చు. లేదా ఈ దుష్టలోక అంతం కోసం ఎదురు చూసిచూసి అలసిపోవచ్చు. అయితే చివరి రోజుల్లో మనం తీవ్రమైన శ్రమల్ని, వ్యతిరేకతల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని యేసు హెచ్చరించాడు. కానీ సహిస్తే గెలుస్తామని కూడా చెప్పాడు. (లూకా 21:19 చదవండి.) ఇంతకీ సహనం అంటే ఏమిటి? సహించడానికి మనకేది సహాయం చేస్తుంది? సహనం చూపించిన వాళ్లనుండి మనమేమి నేర్చుకోవచ్చు? ‘సహనం తన పనిని పూర్తి చేయనివ్వడానికి’ మనమేమి చేయవచ్చు?—యాకో. 1:4.

సహనం అంటే ఏమిటి?

3. సహనం అంటే ఏమిటి?

3 సహనం అంటే ఏదైనా కష్టపరిస్థితిని తట్టుకోవడం లేదా భరించడం మాత్రమే కాదని బైబిలు చెప్తుంది. మన కష్టాల గురించి మనం ఆలోచించే, భావించే విధానం కూడా సహనం చూపించడంలో భాగమే. ధైర్యంగా, నమ్మకంగా, ఓపిగ్గా ఉండడానికి సహనం మనకు సహాయం చేస్తుంది. బలమైన నిరీక్షణతో ఉండడానికి, కష్టపరిస్థితుల్లో నిరుత్సాహపడకుండా ఉండడానికి సహాయం చేసే లక్షణమే సహనం అని ఓ రెఫరెన్సు చెప్తుంది. అవును, మనకు సహనం ఉంటే ఎన్ని తీవ్రమైన కష్టాలు వచ్చినా స్థిరంగా, ధైర్యంగా ఉండగలుగుతాం. అంతేకాదు ఆ కష్టపరిస్థితిని విజయవంతంగా ఎదుర్కోవడానికీ, మన బాధలపై కాకుండా మన లక్ష్యంపై దృష్టిపెట్టడానికీ సహనం మనకు సహాయం చేస్తుంది.

4. సహనానికి, ప్రేమకు మధ్య సంబంధమేంటి?

4 మనకు ప్రేమ ఉంటే సహనం చూపిస్తాం. (1 కొరింథీయులు 13:4, 7 చదవండి.) యెహోవా మీద ప్రేమ ఉంటే ఆయన అనుమతించే దేన్నైనా సహించగలుగుతాం. (లూకా 22:41, 42) మన సహోదరుల మీద ప్రేమ ఉంటే వాళ్ల అపరిపూర్ణతల్ని సహించగలుగుతాం. (1 పేతు. 4:8) అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య కూడా “శ్రమలు” వస్తాయి. కానీ మన భార్యను/భర్తను ప్రేమిస్తే వాటిని సహించగలుగుతాం, వివాహబంధాన్ని బలపర్చుకోగలుగుతాం.—1 కొరిం. 7:28.

సహనం చూపించడానికి మీకేది సహాయం చేస్తుంది?

5. సహనం చూపించేలా మనకు సహాయం చేసే సామర్థ్యం యెహోవాకు మాత్రమే ఉందని ఎలా చెప్పవచ్చు?

5 బలం కోసం యెహోవాను అడగండి. యెహోవా ‘సహనాన్ని, ఊరటను ఇచ్చే దేవుడు.’ (రోమా. 15:5-6, NW) మన పరిస్థితులు, భావాలు, మన పుట్టుపూర్వోత్తరాలు పూర్తిగా అర్థంచేసుకోగల ఏకైక వ్యక్తి ఆయనే. కాబట్టి, సహనం చూపించడానికి మనకు సరిగ్గా ఏమి అవసరమో ఆయనకు తెలుసు. “తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును” అని బైబిలు చెప్తుంది. (కీర్త. 145:19) అయితే, సహనం చూపించడానికి కావాల్సిన బలాన్ని ఇవ్వమని మనం చేసే ప్రార్థనలకు దేవుడు ఎలా జవాబిస్తాడు?

6. యెహోవా మాటిచ్చినట్లు సమస్య నుండి “తప్పించుకొను మార్గమును” మనకెలా చూపిస్తాడు?

6 1 కొరింథీయులు 10:13 చదవండి. సహనం చూపించేలా సహాయం చేయమని యెహోవాను అడిగినప్పుడు, “తప్పించుకొను మార్గమును” మనకు చూపిస్తానని ఆయన మాటిస్తున్నాడు. మరి ఆయన దాన్నెలా చేస్తాడు? కొన్నిసార్లు ఆయన మనకున్న సమస్యను తీసేయవచ్చు. కానీ చాలా సందర్భాల్లో మనం ‘ఓర్పుతో, సంతోషంతో అన్నిటినీ సహించేందుకు’ కావాల్సిన బలాన్నిస్తాడు. (కొలొ. 1:9-12, NW) అంతేకాదు ఆయనకు మన శారీరక, మానసిక, భావోద్వేగ పరిమితులు బాగా తెలుసు కాబట్టి మనం ఆయనకు నమ్మకంగా ఉండలేనంత పెద్ద సమస్యల్ని ఎన్నడూ అనుమతించడు.

7. సహించడానికి మనకు ఆధ్యాత్మిక ఆహారం ఎందుకు అవసరమో ఉదాహరణతో చెప్పండి.

7 ఆధ్యాత్మిక ఆహారం తీసుకుంటూ విశ్వాసాన్ని బలపర్చుకోండి. ఆధ్యాత్మిక ఆహారం ఎందుకు ప్రాముఖ్యం? ఓ ఉదాహరణ పరిశీలించండి: ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలంటే ఓ వ్యక్తికి రోజుకు 6,000 క్యాలరీలు కావాలి. మామూలు మనిషికి అవసరమైన క్యాలరీలకన్నా ఇది చాలా ఎక్కువ. అయితే ఆ వాతావరణాన్ని తట్టుకుని, తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తి వీలైనన్ని ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినాలి. అదేవిధంగా మనం కూడా, పరిస్థితుల్ని సహిస్తూ మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే వీలైనంత ఎక్కువ ఆధ్యాత్మిక ఆహారం తీసుకోవాలి. కాబట్టి వ్యక్తిగత అధ్యయనం కోసం, మీటింగ్స్‌ కోసం సమయం వెచ్చించాలని మనం గట్టిగా నిర్ణయించుకోవాలి. అలాచేస్తే మన విశ్వాసం బలంగా ఉంటుంది.—యోహా. 6:27.

8, 9. (ఎ) యోబు 2:4, 5 ప్రకారం మనకు కష్టాలు వచ్చినప్పుడు ఏమి పరీక్షించబడుతుంది? (బి) మీకు కష్టాలు వచ్చినప్పుడు ఏ సన్నివేశాన్ని ఊహించుకోవచ్చు?

8 మీరు దేవునికి యథార్థంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. కష్టాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం. కానీ ఆ పరిస్థితుల్లో దేవునిపట్ల మన యథార్థత కూడా పరీక్షించబడుతుంది. కష్టాలకు మనం ప్రతిస్పందించే తీరునుబట్టి యెహోవాయే విశ్వాన్ని పరిపాలించే నిజమైన పరిపాలకుడని మనం నమ్ముతున్నామో లేదో తెలుస్తుంది. అలాగని ఎలా చెప్పవచ్చు? యెహోవా పరిపాలనను వ్యతిరేకిస్తున్న దేవుని శత్రువైన సాతాను, మనుషులు స్వార్థంతోనే దేవున్ని ఆరాధిస్తున్నారని చెప్పి యెహోవాను నిందించాడు. “తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని [యోబు] యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును” అని సాతాను అన్నాడు. (యోబు 2:4, 5) ఇప్పుడు సాతాను ఏమైనా మారాడా? ఎంతమాత్రం లేదు. అది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత సాతాను పరలోకం నుండి భూమ్మీదకు పడద్రోయబడినప్పుడు కూడా దేవుని నమ్మకమైన సేవకుల్ని నిందించడం ఆపలేదు. (ప్రక. 12:10) మనుషులు స్వార్థంతోనే దేవున్ని ఆరాధిస్తారని సాతాను ఇప్పటికీ నిందిస్తూనే ఉన్నాడు. మనం దేవుని పరిపాలనా హక్కును తిరస్కరించి, ఆయన్ని ఆరాధించడం ఆపేస్తే చూడాలని సాతాను ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు.

9 మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. ఒకవైపు సాతాను అతని చెడ్డ దూతలు నిలబడి మీరు పడుతున్న కష్టాన్ని చూస్తున్నారు. మీరు దాన్ని తట్టుకోలేక యెహోవాను సేవించడం ఆపేస్తారని వాళ్లు నిందిస్తున్నారు. ఇంకో వైపు యెహోవా, మన రాజైన యేసుక్రీస్తు, పునరుత్థానమైన అభిషిక్తులు, వేలమంది దేవదూతలు ఉన్నారు. వాళ్లు కూడా మీరు పడుతున్న కష్టాన్ని చూస్తున్నారు. కానీ మీరు దాన్ని తట్టుకోగలరని వాళ్లు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు దాన్ని సహించి యెహోవాకు యథార్థంగా ఉంటున్నారని చూసి వాళ్లు సంతోషిస్తారు. “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును” అని యెహోవా మీతో అంటున్నాడు.—సామె. 27:11.

10. సహించడం వల్ల వచ్చే బహుమానం మీద మనసుపెట్టే విషయంలో యేసును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

10 బహుమానం మీద మనసుపెట్టండి. మీరు దూర ప్రయాణం చేస్తున్నట్లు ఊహించుకోండి. మార్గం మధ్యలో ఓ పొడవాటి సొరంగంలో మీరు ప్రయాణించాలి. అంతా చీకటిగా ఉంటుంది, కానీ మీరు ప్రయాణిస్తూ సొరంగం చివరివరకు వెళ్తే వెలుగు కనిపిస్తుందని మీకు తెలుసు. జీవితం కూడా ఆ సొరంగంలో చేసే ప్రయాణం లాంటిదే. జీవితంలో మీరు చాలా కష్టపరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిరావచ్చు, సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు అనిపించవచ్చు. బహుశా యేసుకు కూడా అలానే అనిపించి ఉంటుంది. హింసా కొయ్య మీద వ్రేలాడదీసినప్పుడు, ఆయన చాలా బాధపడ్డాడు, ఎంతో నొప్పిని భరించాడు. ఆయన జీవితంలో అత్యంత కష్ట సమయం అదే అయ్యుండవచ్చు. అయితే సహించడానికి యేసుకు ఏమి సహాయం చేసింది? ‘ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందాన్ని’ చూశాడని బైబిలు చెప్తుంది. (హెబ్రీ. 12:1-3) అవును, సహించడం వల్ల వచ్చే బహుమానాల మీద యేసు మనసుపెట్టాడు, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని పేరును పరిశుద్ధపర్చడంలో, ఆయన పరిపాలనా హక్కును సమర్థించడంలో తనకు కూడా వంతు ఉందనే దానిగురించి ఆలోచించాడు. తనకు వచ్చిన కష్టం కొంతకాలమే ఉంటుందిగానీ పరలోకంలో తాను పొందబోయే బహుమానం శాశ్వతంగా ఉంటుందని యేసుకు తెలుసు. నేడు మిమ్మల్ని కష్టాలు ముంచెత్తవచ్చు, వాటివల్ల ఎంతో బాధ కలుగుతుండవచ్చు. కానీ అవి కొంతకాలమే అని గుర్తుంచుకోండి.

‘సహించినవాళ్లు’

11. ‘సహించినవాళ్ల’ అనుభవాలను ఎందుకు పరిశీలించాలి?

11 సహించే విషయంలో మనం ఒంటరివాళ్లం కాదు. క్రైస్తవులకు సాతాను పెడుతున్న ఎన్నో కష్టాల్ని సహించేలా ప్రోత్సహించడానికి అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు, “లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.” (1 పేతు. 5:9) ఇప్పటికే ఎన్నో కష్టాల్ని ‘సహించినవాళ్ల’ అనుభవాల నుండి మనం యెహోవాకు నమ్మకంగా ఎలా ఉండవచ్చో నేర్చుకోవచ్చు. అంతేకాదు, మనం కష్టాల్ని విజయవంతంగా ఎదుర్కోవచ్చనీ, నమ్మకంగా ఉంటే బహుమానం పొందుతామనీ ఆ అనుభవాలు మనకు భరోసాను ఇస్తాయి. (యాకో. 5:11) అలాంటి కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. [1]

12. ఏదెను తోటలో కెరూబులు ఉంచిన ఆదర్శం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

12 కెరూబులు. ఆదాముహవ్వలు పాపం చేసిన తర్వాత యెహోవా కొంతమంది కెరూబులకు భూమ్మీద ఓ కొత్త నియామకం ఇచ్చాడు. పరలోకంలో వాళ్లకున్న నియామకంకన్నా ఇది చాలా భిన్నమైనది. వాళ్లు చూపించిన ఆదర్శం నుండి, మనకు ఏదైనా కష్టమైన నియామకం వచ్చినప్పుడు ఎలా సహనం చూపించాలో నేర్చుకోవచ్చు. యెహోవా, “ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను” అని బైబిలు చెప్తుంది. [2] (ఆది. 3:24) ఆత్మప్రాణుల్లో అత్యంత గొప్ప స్థానంలో ఉన్న కెరూబులు ఈ కొత్త నియామకం గురించి సణిగారనిగానీ, అంత గొప్ప స్థానంలో ఉన్న తాము ఆ నియామకాన్ని చేయడమేంటని ఆలోచించారనిగానీ బైబిలు ఎక్కడా చెప్పట్లేదు. ఆ పని విసుగ్గా ఉందని వాళ్లు మధ్యలో వదిలేయలేదు. బదులుగా 1,600 కన్నా ఎక్కువ సంవత్సరాలు అంటే బహుశా నోవహు జలప్రళయం వచ్చేవరకు వాళ్లు ఆ నియామకాన్ని నమ్మకంగా పూర్తిచేశారు.

13. తనకు ఎదురైన కష్టాల్ని యోబు ఎలా సహించగలిగాడు?

13 నమ్మకస్థుడైన యోబు. మీ కుటుంబసభ్యుడు లేదా స్నేహితుడు మిమ్మల్ని బాధపెట్టే మాట అన్నప్పుడు మీరు కొన్నిసార్లు నొచ్చుకొని ఉండవచ్చు. లేదా తీవ్రమైన అనారోగ్యంవల్లో, మీకు ఇష్టమైనవాళ్లు చనిపోవడంవల్లో మీరు బాధపడుతుండవచ్చు. మీ పరిస్థితి ఏదైనా యోబు ఉదాహరణ నుండి మీరు ఓదార్పు పొందవచ్చు. (యోబు 1:18, 19; 2:7, 9; 19:1-3) తనకు హఠాత్తుగా అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయో యోబుకు తెలీదు. కానీ వాటిని తట్టుకోవడం తనవల్ల కాదని అతను అనుకోలేదు. మరి వాటిని సహించడానికి అతనికి ఏమి సహాయం చేసింది? అన్నిటికన్నా ప్రాముఖ్యంగా అతను యెహోవాను ప్రేమించాడు, “దేవునియందు భయభక్తులు” కలిగివున్నాడు. (యోబు 1:1) పరిస్థితులు బాగున్నప్పుడే కాదు, కష్టాలు వచ్చినప్పుడు కూడా అతను దేవున్ని సంతోషపెట్టాలనుకున్నాడు. దానితోపాటు యెహోవా తన పవిత్రశక్తితో చేసిన సృష్టిలోని అద్భుతాల గురించి కూడా యోబు ఆలోచించాడు. దాంతో యెహోవా సరైన సమయంలో తన కష్టాల్ని తీసేస్తాడనే నమ్మకం యోబుకు మరింత పెరిగింది. (యోబు 42:1, 2) నిజానికి అదే జరిగింది, ‘యెహోవా యోబుకు మళ్లీ విజయం ఇచ్చాడు. అతనికి అంతకుముందు ఉన్నదానికి రెండంతలు దేవుడు ఇచ్చాడు.’ అలా యోబు సంతృప్తిగా “సుదీర్ఘమైన కాలం జీవించాడు.”—యోబు 42:10, 17, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

14. రెండవ కొరింథీయులు 1:6 ప్రకారం, పౌలు చూపించిన సహనం ఇతరుల్ని ఎలా ప్రోత్సహించింది?

14 అపొస్తలుడైన పౌలు. మీరు తీవ్రమైన వ్యతిరేకతను లేదా హింసను ఎదుర్కొంటున్నారా? సంఘపెద్దగా లేదా ప్రాంతీయ పర్యవేక్షకునిగా ఊపిరాడనన్ని బాధ్యతలు మీకున్నాయా? అలాగైతే అపొస్తలుడైన పౌలు ఉదాహరణ మీకు సహాయం చేస్తుంది. పౌలు ఘోరమైన హింసల్ని ఎదుర్కొన్నాడు, సంఘంలో ఉన్న సహోదరుల గురించి ఆయన ఎప్పుడూ చింతించేవాడు. (2 కొరిం. 11:23-29) అయినప్పటికీ ఆయన ఎన్నడూ తన నియామకంలో వెనుకంజ వేయలేదు, ఆయన ఉంచిన ఆదర్శం ఇతరుల్ని బలపర్చింది. (2 కొరింథీయులు 1:6 చదవండి.) అదేవిధంగా మీరు చూపించే సహనాన్ని బట్టి కూడా ఇతరులు ప్రోత్సాహం పొందుతారు.

సహనం మీ విషయంలో తన పనిని పూర్తి చేస్తుందా?

15, 16. (ఎ) సహనం మన విషయంలో తన ‘పనిని’ ఎలా పూర్తి చేస్తుంది? (బి) ‘సహనం తన పనిని పూర్తి చేయడానికి’ మనం ఏమి చేయవచ్చో కొన్ని ఉదాహరణలు చెప్పండి.

15 అపొస్తలుడైన యాకోబు ఇలా రాశాడు, ‘సహనం తన పనిని పూర్తి చేయనివ్వండి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో సంపూర్ణులుగా, నిర్దోషులుగా, దేనిలోనూ లోపంలేని వాళ్లుగా ఉండగలుగుతారు.’ (యాకో. 1:4, NW) అయితే, సహనం మన విషయంలో తన ‘పనిని’ ఎలా పూర్తి చేస్తుంది? మనకు ఏదైనా కష్టం ఎదురైనప్పుడు మరింత సహనాన్ని, కృతజ్ఞతను, లేదా ప్రేమను చూపించాల్సిన అవసరం ఉందని మనం గుర్తించవచ్చు. మనం ఆ కష్టాన్ని సహించేకొద్దీ ఆ లక్షణాలన్నిటినీ మరింత ఎక్కువగా ఎలా చూపించాలో నేర్చుకుంటాం. దానివల్ల మన క్రైస్తవ వ్యక్తిత్వం ఇంకా మెరుగౌతుంది.

మనం కష్టాల్ని సహించినప్పుడు మన క్రైస్తవ వ్యక్తిత్వం మరింత మెరుగౌతుంది (15, 16 పేరాలు చూడండి)

16 సహనం ఉంటే మనం క్రైస్తవ లక్షణాలను మరింత బాగా చూపించగలుగుతాం. కానీ కేవలం మన కష్టాన్ని తప్పించుకోవడానికి యెహోవా నియమాల విషయంలో రాజీపడం. ఉదాహరణకు, మీరు చెడు ఆలోచనలతో పోరాడుతుంటే, చెడు పనులు చేయాలనే కోరికకు లొంగిపోకండి. బదులుగా తప్పుడు ఆలోచనల్ని ఎదిరించడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి. అంతేకాదు, మీ కుటుంబసభ్యుల్లో ఎవరైనా యెహోవా సేవ చేయొద్దని మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా? అయితే నిరుత్సాహపడకండి. యెహోవాను సేవిస్తూ ఉండాలనే నిశ్చయతతో ఉండండి. అలాచేస్తే యెహోవా మీద మీకున్న నమ్మకం ఇంకా బలపడుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి: దేవుని అనుగ్రహం పొందాలంటే, మనం ఖచ్చితంగా సహించాలి.—రోమా. 5:3-5; యాకో. 1:12.

17, 18. (ఎ) అంతం వరకు సహించడం ఎందుకు ప్రాముఖ్యమో ఉదాహరణతో చెప్పండి. (బి) అంతం దగ్గరపడుతుండగా మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

17 మనం కేవలం కొంతకాలం వరకు కాదుగానీ అంతం వరకు సహించాలి. ఉదాహరణకు, ఒక ఓడ మునిగిపోతోందని ఊహించుకోండి. ప్రాణాలు కాపాడుకోవాలంటే అందులో ఉన్న ప్రయాణికులు ఒడ్డుకు చేరే వరకు ఈదుతూనే ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఈదడం మొదలుపెట్టిన వెంటనే ఆపేస్తే మునిగిపోతారు. అంతేకాదు, ఒడ్డుకు ఇంకాస్త దూరంలో ఉన్నప్పుడు ఈదడం ఆపేసినా మునిగిపోతారు. అదేవిధంగా మనం కొత్తలోకంలో జీవించాలనుకుంటే, సహిస్తూనే ఉండాలి. కాబట్టి అపొస్తలుడైన పౌలులాంటి అభిప్రాయమే మనమూ కలిగివుందాం. ఆయనిలా అన్నాడు, మేము “అధైర్యపడము.”—2 కొరిం. 4:1, 16.

18 అంతం వరకు సహించడానికి యెహోవా సహాయం చేస్తాడని అపొస్తలుడైన పౌలుకు ఉన్నలాంటి నమ్మకమే మనకూ ఉంది. పౌలు ఇలా రాశాడు, “అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.” (రోమా. 8:37-39) నిజమే కొన్నిసార్లు మనం అలసిపోతాం. కానీ మనం గిద్యోను, అతని సైనికుల్ని అనుసరిద్దాం. వాళ్లు అలిసిపోయినప్పటికీ పట్టువదల్లేదు, చివరిదాకా పోరాడారు.—న్యాయా. 8:4.

^ [1] (11వ పేరా) మనకాలంలోని దేవుని సేవకులు ఏవిధంగా సహనం చూపించారో పరిశీలించడం వల్ల కూడా మీరు ప్రోత్సాహాన్ని పొందవచ్చు. ఉదాహరణకు ఇతియోపియా, మలావీ, రష్యా వంటి దేశాల్లో ఉన్న సహోదరుల ప్రోత్సాహకరమైన అనుభవాలు 1992, 1999, 2008 వార్షిక పుస్తకాల్లో(ఇంగ్లీషు) ఉన్నాయి.

^ [2] (12వ పేరా) ఈ పని చేయడానికి దేవుడు ఎంతమంది కెరూబులను నియమించాడో బైబిలు చెప్పట్లేదు.