న్యాయాధిపతులు 8:1-35

  • ఎఫ్రాయిమువాళ్లు గిద్యోనుతో గొడవపడడం (1-3)

  • మిద్యాను రాజుల్ని తరిమి, చంపడం (4-21)

  • గిద్యోను రాజరికాన్ని వద్దనడం (22-27)

  • గిద్యోను జీవితం గురించిన వివరాలు (28-35)

8  అప్పుడు ఎఫ్రాయిమువాళ్లు గిద్యోనుతో, “నువ్వు మాకు ఇలా ఎందుకు చేశావు? నువ్వు మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?”+ అన్నారు. వాళ్లు అతనితో బాగా గొడవపడ్డారు.+  కానీ అతను వాళ్లతో ఇలా అన్నాడు: “మీతో పోలిస్తే నేను చేసింది ఎంత? ఎఫ్రాయిము పరిగె+ అబీయెజరు ద్రాక్ష కోత+ కన్నా ఎక్కువ కాదా?  దేవుడు మిద్యాను అధిపతులైన ఓరేబును, జెయేబును మీ చేతికే కదా అప్పగించాడు;+ మీతో పోలిస్తే నేను చేసింది ఎంత?” అతను ఈ మాట అన్నప్పుడు వాళ్లు శాంతించారు.  తర్వాత గిద్యోను యొర్దాను దగ్గరికి వచ్చి నది దాటాడు. అతను, అతనితో ఉన్న 300 మంది అలసిపోయారు, అయినా వాళ్లు శత్రువుల్ని తరుముతూనే ఉన్నారు.  అప్పుడు అతను సుక్కోతువాళ్లతో, “దయచేసి నా వెంట ఉన్నవాళ్లకు రొట్టెలు ఇవ్వండి, వాళ్లు అలసిపోయారు; నేను మిద్యాను రాజులైన జెబహును, సల్మున్నాను తరుముతున్నాను” అన్నాడు.  కానీ సుక్కోతు అధిపతులు, “మేము నీ సైన్యానికి రొట్టెలు ఇవ్వడానికి నువ్వు ఇప్పటికే జెబహును, సల్మున్నాను పట్టుకున్నావా?” అన్నారు.  అప్పుడు గిద్యోను, “మీరు ఈ మాట అన్నారు కాబట్టి జెబహును, సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించినప్పుడు నేను ఎడారిలోని ముళ్ల చెట్లతో మీ ఒళ్లు చీరేస్తాను”+ అన్నాడు.  అతను అక్కడి నుండి పెనూయేలుకు వెళ్లి, అక్కడి వాళ్లనూ అలాగే అడిగాడు, కానీ పెనూయేలు ప్రజలు సుక్కోతు ప్రజలు ఇచ్చిన జవాబే ఇచ్చారు.  కాబట్టి అతను పెనూయేలు ప్రజలతో కూడా, “నేను క్షేమంగా తిరిగొచ్చినప్పుడు ఈ* గోపురాన్ని పడగొడతాను” అన్నాడు.+ 10  జెబహు, సల్మున్నా దాదాపు 15,000 మంది సైనికులతో కర్కోరులో ఉన్నారు. కత్తులు ధరించిన 1,20,000 మంది చనిపోయారు కాబట్టి తూర్పు ప్రజల మొత్తం సైన్యంలో+ అంతమందే మిగిలారు. 11  గిద్యోను నోబహుకు, యొగ్బెహకు+ తూర్పున డేరాల్లో నివసించేవాళ్ల దారిలో వెళ్తూ, అప్రమత్తంగా లేని శత్రువుల దండు మీద దాడి చేశాడు. 12  జెబహు, సల్మున్నా పారిపోయినప్పుడు, గిద్యోను ఆ ఇద్దరు మిద్యాను రాజుల్ని తరిమి పట్టుకుని, శత్రువుల దండు మొత్తాన్ని భయాందోళనలకు గురిచేశాడు. 13  తర్వాత యోవాషు కుమారుడైన గిద్యోను యుద్ధం నుండి తిరిగొచ్చాడు, అతను హెరెసుకు ఎక్కే దారి గుండా వచ్చాడు. 14  వచ్చే దారిలో అతను ఒక సుక్కోతు యువకుణ్ణి పట్టుకుని ప్రశ్నించాడు. ఆ యువకుడు 77 మంది సుక్కోతు అధిపతుల, పెద్దల పేర్లను రాసి గిద్యోనుకు ఇచ్చాడు. 15  అప్పుడు గిద్యోను సుక్కోతువాళ్ల దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు: “ ‘మేము అలసిపోయిన మనుషులకు రొట్టెలు ఇవ్వడానికి నువ్వు ఇప్పటికే జెబహును, సల్మున్నాను పట్టుకున్నావా?’ అంటూ మీరు ఎవరి గురించి నన్ను హేళన చేశారో ఆ జెబహు, సల్మున్నా ఇక్కడ ఉన్నారు.”+ 16  తర్వాత అతను ఆ నగర పెద్దల్ని పట్టుకుని, ఎడారిలోని ముళ్ల చెట్లతో సుక్కోతువాళ్లకు* గుణపాఠం నేర్పాడు.+ 17  అంతేకాదు అతను పెనూయేలు గోపురాన్ని పడగొట్టి,+ ఆ నగర ప్రజల్ని చంపాడు. 18  అతను జెబహును, సల్మున్నాను, “మీరు తాబోరులో చంపింది ఎలాంటివాళ్లను?” అని ​అడిగాడు. దానికి వాళ్లు, “వాళ్లు నీలాగే ఉన్నారు, ప్రతీ ఒక్కరు రాకుమారుల్లా ఉన్నారు” అని చెప్పారు. 19  అప్పుడు గిద్యోను, “వాళ్లు నా సహోదరులు, మా అమ్మకు పుట్టినవాళ్లు. యెహోవా జీవం తోడు, మీరు ఒకవేళ వాళ్లను బ్రతకనిచ్చివుంటే నేను మిమ్మల్ని చంపాల్సిన ​అవసరం ఉండేది కాదు” అన్నాడు. 20  అతను తన పెద్ద కుమారుడు యెతెరుతో, “లేచి వాళ్లను చంపు” అన్నాడు. కానీ ఆ యువకుడు తన కత్తి ఎత్తలేదు; అతను ఇంకా యువకుడే కాబట్టి ​భయపడ్డాడు. 21  అప్పుడు జెబహు, సల్మున్నా గిద్యోనుతో, “నీకు అంత సత్తా ఉంటే* నువ్వే లేచి మమ్మల్ని చంపు” అన్నారు. దాంతో గిద్యోను లేచి జెబహును, సల్మున్నాను చంపి,+ వాళ్ల ఒంటెల మెడలకు ఉన్న చంద్రవంకల్ని తీసుకున్నాడు. 22  తర్వాత ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, “నువ్వు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించావు+ కాబట్టి నువ్వూ, నీ కుమారులూ, నీ మనవళ్లూ మమ్మల్ని పరిపాలించండి” అన్నారు. 23  కానీ గిద్యోను వాళ్లతో, “నేను మిమ్మల్ని పరిపాలించను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పరిపాలించడు. యెహోవాయే మిమ్మల్ని పరిపాలిస్తాడు”+ అని అన్నాడు. 24  గిద్యోను ఇంకా ఇలా అన్నాడు: “నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీలో ప్రతీ ఒక్కరు తాము దోచుకున్న సొమ్ములో నుండి నాకు ఒక ముక్కు పోగు ఇవ్వండి.” (ఓడిపోయినవాళ్లు ఇష్మాయేలీయులు+ కాబట్టి వాళ్ల ముక్కులకు బంగారు పోగులు ఉండేవి.) 25  వాళ్లు, “మేము తప్పకుండా ఇస్తాం” అన్నారు. అప్పుడు వాళ్లు ఒక గుడ్డను పరిచి, ప్రతీ ఒక్కరు తాము దోచుకున్న సొమ్ములో నుండి ఒక ముక్కు పోగును దానిమీద వేశారు. 26  చంద్రవంకలు, లోలాకులు, మిద్యాను రాజులు ధరించిన ఊదారంగు ఉన్ని వస్త్రాలు, ఒంటెలకు ఉన్న కంఠాభరణాలే+ కాకుండా గిద్యోను అడిగిన బంగారు ముక్కు పోగుల బరువు మొత్తం 1,700 షెకెల్‌ల* బంగారం. 27  గిద్యోను ఆ బంగారంతో ఒక ఏఫోదును తయారుచేసి,+ దాన్ని తన నగరమైన ఒఫ్రాలో+ ప్రదర్శించాడు. అక్కడ ఇశ్రాయేలీయులందరూ దాన్ని పూజించారు;*+ అది గిద్యోనుకు, అతని ఇంటివాళ్లకు ఉచ్చులా మారింది.+ 28  అలా ఇశ్రాయేలీయులు మిద్యానీయుల్ని+ ఓడించారు, వాళ్లు మళ్లీ ఇశ్రాయేలీయుల్ని సవాలు చేయలేదు;* గిద్యోను కాలంలో దేశం 40 సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉంది.+ 29  యోవాషు కుమారుడైన యెరుబ్బయలు+ ఇంటికి తిరిగొచ్చి అక్కడే ఉన్నాడు. 30  గిద్యోనుకు 70 మంది కుమారులు పుట్టారు, ఎందుకంటే అతనికి చాలామంది భార్యలు ఉన్నారు. 31  షెకెములో ఉన్న అతని ఉపపత్ని కూడా అతనికి ఒక కుమారుణ్ణి కన్నది, గిద్యోను అతనికి అబీమెలెకు+ అని పేరు పెట్టాడు. 32  యోవాషు కుమారుడైన గిద్యోను మంచి ముసలితనంలో చనిపోయాడు. అతన్ని అతని తండ్రైన యోవాషు సమాధిలో పాతిపెట్టారు, అది అబీయెజ్రీయులకు చెందిన ఒఫ్రాలో+ ఉంది. 33  గిద్యోను చనిపోయిన వెంటనే ఇశ్రాయేలీయులు మళ్లీ బయలు దేవుళ్లను పూజించడం* మొదలుపెట్టారు,+ వాళ్లు బయల్బెరీతును తమ దేవుడిగా చేసుకున్నారు.+ 34  ఇశ్రాయేలీయులు తమ చుట్టూ ఉన్న శత్రువులందరి చేతిలో నుండి తమను రక్షించిన+ తమ దేవుడైన యెహోవాను గుర్తుపెట్టుకోలేదు;+ 35  అంతేకాదు యెరుబ్బయలు, అంటే గిద్యోను ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటికీ ప్రతిఫలంగా వాళ్లు అతని ఇంటివాళ్ల మీద కూడా విశ్వసనీయ ప్రేమ చూపించలేదు.+

అధస్సూచీలు

లేదా “మీ.”
లేదా “సుక్కోతు పెద్దలకు.”
లేదా “ఒక మనిషి బలాన్ని బట్టే అతనేంటో తెలుస్తుంది కాబట్టి.”
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “దానితో ఆధ్యాత్మిక వ్యభిచారం చేశారు.”
అక్ష., “మళ్లీ తల ఎత్తుకోలేదు.”
లేదా “దేవుళ్లతో ఆధ్యాత్మిక వ్యభిచారం చేయడం.”