న్యాయాధిపతులు 7:1-25
7 అప్పుడు యెరుబ్బయలు, అంటే గిద్యోను+ అలాగే అతనితోపాటు ఉన్న ప్రజలందరూ ఉదయాన్నే లేచి హరోదు ఊట దగ్గర మకాం వేశారు; వాళ్లకు ఉత్తరం వైపున ఉన్న లోయ మైదానంలోని మోరే కొండ దగ్గర మిద్యాను దండు దిగింది.
2 అప్పుడు యెహోవా గిద్యోనుతో ఇలా అన్నాడు: “నీతోపాటు మరీ ఎక్కువమంది ఉన్నారు, నేను మిద్యానీయుల్ని వాళ్ల చేతికి అప్పగించను.+ లేదంటే ఇశ్రాయేలీయులు తమ గురించి గొప్పలు చెప్పుకుంటూ, ‘మేము మా సొంత శక్తితో* జయించాం’ అని నాతో అంటారేమో.+
3 కాబట్టి, ‘ఎవరైతే భయపడుతున్నారో, వణుకుతున్నారో వాళ్లు ఇంటికి వెళ్లిపోవచ్చు’ అని దయచేసి ప్రజల ముందు ప్రకటించు.”+ దాంతో గిద్యోను ఆ మాటలు చెప్పి వాళ్లను పరీక్షించాడు. అప్పుడు 22,000 మంది ఇంటికి వెళ్లిపోయారు; 10,000 మంది మిగిలారు.
4 అయినా యెహోవా గిద్యోనుతో ఇలా అన్నాడు: “ఇప్పటికీ ఎక్కువమందే ఉన్నారు. నేను వాళ్లను పరీక్షించేలా వాళ్లను నీళ్ల దగ్గరికి తీసుకెళ్లు. ‘ఇతను నీతోపాటు వస్తాడు’ అని నేను ఎవరి గురించి చెప్తానో అతను నీతోపాటు వస్తాడు; ‘ఇతను నీతోపాటు రాడు’ అని నేను ఎవరి గురించి చెప్తానో అతను నీతోపాటు రాడు.”
5 కాబట్టి గిద్యోను ప్రజల్ని నీళ్ల దగ్గరికి తీసుకెళ్లాడు.
అప్పుడు యెహోవా గిద్యోనుతో, “మోకాళ్ల మీద వంగి నీళ్లు తాగే వాళ్ల నుండి, చేతుల్లోకి నీళ్లు తీసుకుని నాలుకతో గతికే* ప్రతీ ఒక్కర్ని వేరు చేయి” అని చెప్పాడు.
6 చేతులతో నీళ్లు తీసుకుని గతికిన వాళ్లు 300 మంది. మిగతావాళ్లు మోకాళ్ల మీద వంగి నీళ్లు తాగారు.
7 అప్పుడు యెహోవా గిద్యోనుతో, “చేతులతో నీళ్లు గతికిన ఈ 300 మందితో నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిద్యానీయుల్ని నీ చేతికి అప్పగిస్తాను.+ మిగతా వాళ్లందర్నీ ఇళ్లకు పంపించేయి” అని చెప్పాడు.
8 కాబట్టి వాళ్లు మిగతావాళ్ల దగ్గరున్న ఆహారాన్ని, బూరల్ని* తీసుకున్నాక, గిద్యోను వాళ్లను ఇళ్లకు పంపించేశాడు; అతను 300 మందిని మాత్రమే తనతో ఉండనిచ్చాడు. అతనికి దిగువనున్న లోయ మైదానంలో మిద్యాను దండు ఉంది.+
9 ఆ రాత్రి యెహోవా గిద్యోనుకు ఇలా చెప్పాడు: “లే, దండు మీద దాడి చేయి, నేను దాన్ని నీ చేతికి అప్పగించాను.+
10 ఒకవేళ దాడిచేయడానికి నీకు భయం అనిపిస్తే, నీ సేవకుడైన పూరాతో కలిసి కింద ఉన్న దండు దగ్గరికి వెళ్లు.
11 వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో విను, అప్పుడు నీకు దండు మీద దాడిచేయడానికి ధైర్యం వస్తుంది.”* దాంతో గిద్యోను తన సేవకుడైన పూరాతో కలిసి కింద ఉన్న ఆ దండు దగ్గరికి వెళ్లాడు.
12 మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు ప్రజలందరూ+ మిడతల దండులా ఆ లోయ మైదానాన్ని కప్పేశారు; వాళ్ల ఒంటెలు సముద్రతీరంలోని ఇసుక రేణువుల్లా లెక్కలేనన్ని ఉన్నాయి.+
13 గిద్యోను వెళ్లినప్పుడు, ఒకతను తోటి వ్యక్తికి ఒక కల గురించి చెప్తున్నాడు; అతను ఇలా అన్నాడు: “నాకు ఒక కల వచ్చింది. దానిలో ఒక గుండ్రటి బార్లీ రొట్టె మిద్యాను దండులోకి దొర్లుకుంటూ వచ్చింది. అది ఒక డేరా దగ్గరికి వచ్చి దాన్ని చాలా గట్టిగా ఢీ కొట్టడంతో ఆ డేరా పడిపోయింది.+ అవును, అది డేరాను తలకిందులు చేసింది; ఆ డేరా పూర్తిగా పడిపోయింది.”
14 అప్పుడు ఆ తోటివ్యక్తి అతనితో, “అది ఖచ్చితంగా ఇశ్రాయేలీయుడూ యోవాషు కుమారుడూ అయిన గిద్యోను కత్తే అయ్యుంటుంది.+ దేవుడు మిద్యానును, దండు మొత్తాన్ని అతని చేతికి అప్పగించాడు”+ అన్నాడు.
15 అతను చెప్పిన కలను, దాని అర్థాన్ని విన్న వెంటనే+ గిద్యోను దేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత అతను ఇశ్రాయేలు దండు దగ్గరికి తిరిగొచ్చి, “లేవండి, యెహోవా మిద్యాను దండును మీ చేతికి అప్పగించాడు” అన్నాడు.
16 అప్పుడు గిద్యోను 300 మందిని మూడు గుంపులుగా విభజించి, వాళ్లందరికీ బూరల్ని,+ లోపల దివిటీలు ఉన్న పెద్ద కుండల్ని ఇచ్చాడు.
17 అతను వాళ్లకు ఇలా చెప్పాడు: “నన్ను గమనించండి, సరిగ్గా నేను చేసినట్టే చేయండి. నేను దండు పొలిమేరకు వెళ్లినప్పుడు, నేను చేసినట్టే మీరు చేయాలి.
18 నేనూ నాతోపాటు ఉన్నవాళ్లందరూ బూర ఊదినప్పుడు మీరు కూడా దండు చుట్టూరా బూరలు ఊది, ‘యెహోవా ఖడ్గం! గిద్యోను ఖడ్గం!’ అని అరవాలి.”
19 రెండో జాము* మొదలై కాపలాదారులు మారగానే గిద్యోను, అతనితోపాటు ఉన్న 100 మంది దండు పొలిమేరకు చేరుకున్నారు. వాళ్లు బూరలు ఊది,+ తమ చేతుల్లో ఉన్న పెద్ద కుండల్ని పగలగొట్టారు.+
20 కాబట్టి మూడు గుంపులవాళ్లు బూరలు ఊది, పెద్ద కుండల్ని పగలగొట్టారు. వాళ్లు తమ ఎడమచేతితో దివిటీలు పట్టుకుని కుడిచేతితో బూరలు ఊది, “యెహోవా ఖడ్గం! గిద్యోను ఖడ్గం!” అని అరవడం మొదలుపెట్టారు.
21 ఈలోగా ప్రతీ ఒక్కరు దండు చుట్టూ తమతమ స్థానాల్లో నిలబడ్డారు, అప్పుడు శత్రు సైనికులందరూ కేకలు వేస్తూ పారిపోయారు.+
22 ఆ 300 మంది ఇంకా బూరలు ఊదుతూ ఉండగా, ఆ దండులోని వాళ్లందరూ ఒకరినొకరు కత్తితో చంపుకునేలా యెహోవా చేశాడు;+ దాంతో సైన్యం సెరేరా వైపుగా బేత్షిత్తా వరకు, తబ్బాతు దగ్గరున్న ఆబేల్-మెహోలా+ పొలిమేరల వరకు పారిపోయింది.
23 అప్పుడు నఫ్తాలి, ఆషేరు గోత్రాల నుండి, మొత్తం మనష్షే గోత్రం నుండి ఇశ్రాయేలీయులు పిలవబడ్డారు;+ వాళ్లు మిద్యానీయుల్ని తరిమారు.
24 గిద్యోను ఎఫ్రాయిమువాళ్లు నివసిస్తున్న పర్వత ప్రాంతమంతటికీ సందేశకుల్ని పంపించి ఇలా చెప్పాడు: “మీరు వెళ్లి మిద్యానీయుల మీద దాడి చేయండి. వాళ్ల కన్నా ముందు యొర్దాను రేవుల్ని, బేత్బారా వరకున్న దాని వాగుల్ని ఆక్రమించండి.” కాబట్టి ఎఫ్రాయిము వాళ్లందరూ కలిసి, యొర్దాను రేవుల్ని, బేత్బారా వరకున్న దాని వాగుల్ని ఆక్రమించారు.
25 అంతేకాదు వాళ్లు ఓరేబు, జెయేబు అనే ఇద్దరు మిద్యాను అధిపతుల్ని పట్టుకున్నారు; వాళ్లు ఓరేబును ఓరేబు బండమీద+ చంపారు, జెయేబును జెయేబు ద్రాక్షతొట్టి దగ్గర చంపారు. వాళ్లు మిద్యానీయుల్ని తరుముతూ వెళ్లారు;+ వాళ్లు ఓరేబు, జెయేబు తలల్ని యొర్దాను ప్రాంతంలో గిద్యోను దగ్గరికి తీసుకొచ్చారు.
అధస్సూచీలు
^ అక్ష., “చేతితో.”
^ లేదా “కుక్కలా తాగే.”
^ అక్ష., “కొమ్ముల్ని.”
^ అక్ష., “నీ చేతులు బలపడతాయి.”
^ అంటే, దాదాపు రాత్రి 10 గంటల నుండి దాదాపు రాత్రి 2 గంటల వరకు.