యోబు 19:1-29
19 అప్పుడు యోబు ఇలా అన్నాడు:
2 “ఎంతసేపు మీరిలా నా ప్రాణాన్ని* విసిగిస్తూ ఉంటారు,+మాటలతో నన్ను నలగ్గొడతారు?+
3 ఈ పదిసార్లు మీరు నన్ను గద్దించారు;*నాతో కఠినంగా వ్యవహరిస్తున్నందుకు మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా?+
4 ఒకవేళ నేను నిజంగానే తప్పు చేసినా,ఆ తప్పు నా మీదే ఉంటుంది.
5 నన్ను నిందించడం సరైనదని అంటూ,మిమ్మల్ని మీరు నామీద హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తే,
6 ఈ విషయం తెలుసుకోండి: దేవుడే నాతో అన్యాయంగా ప్రవర్తించాడు,తన వలలో నన్ను చిక్కించుకున్నాడు.
7 ‘దౌర్జన్యం! దౌర్జన్యం!’ అని అరుస్తున్నా, నాకు జవాబు రావట్లేదు;+సహాయం కోసం మొరపెడుతున్నా, న్యాయం జరగట్లేదు.+
8 ఆయన నా దారికి అడ్డంగా రాతిగోడ పెట్టాడు, నేను దాన్ని దాటలేను;ఆయన నా దారుల్ని చీకటితో కప్పేశాడు.+
9 ఆయన నా ఘనతను తీసేశాడు,నా తలమీద నుండి కిరీటాన్ని తొలగించాడు.
10 నేను నశించిపోయే వరకు ఆయన అన్నివైపులా నన్ను విరగ్గొడుతున్నాడు;నా ఆశను చెట్టులా పెల్లగిస్తున్నాడు.
11 ఆయన కోపం నా మీద రగులుకుంటోంది,ఆయన నన్ను తన శత్రువులా చూస్తున్నాడు.+
12 ఆయన సైన్యాలు ఏకమై వచ్చి, నన్ను ముట్టడించాయి,అవి నా డేరా చుట్టూ దిగాయి.
13 ఆయన నా సహోదరుల్ని నా నుండి దూరంగా తరిమేశాడు,నేను తెలిసినవాళ్లు పక్కకు తప్పుకుని వెళ్లిపోతున్నారు.+
14 నా సన్నిహిత సహచరులు* నన్ను వదిలేశారు,నాకు బాగా తెలిసినవాళ్లు నన్ను మర్చిపోయారు.+
15 నా ఇంట్లోని అతిథులు,+ నా దాసురాళ్లు నన్ను తెలియని వ్యక్తిలా చూస్తున్నారు;వాళ్ల దృష్టిలో నేను పరదేశిలా ఉన్నాను.
16 నేను నా సేవకుణ్ణి పిలుస్తున్నా, అతను పలకట్లేదు;కనికరం చూపించమని నా నోటితో అతన్ని వేడుకోవాల్సి వస్తోంది.
17 నా భార్య నా శ్వాసను కూడా అసహ్యించుకుంటోంది,+నేను నా సహోదరులకు* దుర్వాసనలా ఉన్నాను.
18 చిన్నపిల్లలు కూడా నన్ను నీచంగా చూస్తున్నారు;నేను లేచినప్పుడు వాళ్లు నన్ను ఎగతాళి చేస్తున్నారు.
19 నా ప్రాణ స్నేహితులంతా నన్ను అసహ్యించుకుంటున్నారు,+నేను ప్రేమించినవాళ్లు నాకు విరోధులయ్యారు.+
20 నా ఎముకలు నా చర్మానికి, మాంసానికి అంటుకుపోయాయి,+నేను తృటిలో చావును తప్పించుకుంటున్నాను.
21 కరుణ చూపించండి, నా సహచరులారా, కరుణ చూపించండి,ఎందుకంటే, స్వయంగా దేవుని చెయ్యే నన్ను కొట్టింది.+
22 మీరు ఎందుకు దేవునిలా నన్ను హింసిస్తూ ఉన్నారు?+ఎందుకు అదేపనిగా నామీద దాడిచేస్తున్నారు?+
23 నా మాటలు రాయబడితే,అవి పుస్తకంలో లిఖించబడితే ఎంత బావుంటుంది!
24 ఎప్పటికీ నిలిచిపోయేలా వాటిని ఉలితో రాతిమీద చెక్కి,సీసం కరిగించిపోస్తే ఎంత బావుంటుంది!
25 ఎందుకంటే, నా విమోచకుడు*+ సజీవుడని నాకు బాగా తెలుసు;ఆయన నా తర్వాత వచ్చి నేలమీద నిలబడతాడు.
26 అలా నా చర్మం నశించిపోయాక,ఇంకా బ్రతికుండగానే నేను దేవుణ్ణి చూస్తాను.
27 నేను స్వయంగా ఆయన్ని చూస్తాను,వేరేవాళ్లు కాదు, స్వయంగా నేనే నా కళ్లతో ఆయన్ని చూస్తాను.+
కానీ లోలోపల నేను చాలా కలవరపడుతున్నాను!*
28 ఎందుకంటే మీరు, ‘మేము ఏవిధంగా అతన్ని హింసిస్తున్నాం?’ అని అంటున్నారు.+
సమస్యకు నేనే కారణం అన్నట్టు మాట్లాడుతున్నారు.
29 ఖడ్గానికి భయపడండి,+ఎందుకంటే, అది తప్పుచేసిన వాళ్లను శిక్షిస్తుంది;తీర్పుతీర్చే వ్యక్తి ఒకడు ఉన్నాడని మీకు తెలియాలి.”+
అధస్సూచీలు
^ లేదా “అవమానించారు.”
^ లేదా “నా బంధువులు.”
^ అంటే, నా తల్లి కడుపున పుట్టినవాళ్లకు.
^ లేదా “నన్ను తిరిగి కొనే వ్యక్తి.”
^ లేదా “నా లోపల మూత్రపిండాలు పాడైపోయాయి.”