కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు చదవడం వల్ల వచ్చే పూర్తి ప్రయోజనాన్ని పొందండి

బైబిలు చదవడం వల్ల వచ్చే పూర్తి ప్రయోజనాన్ని పొందండి

“దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను.”—రోమా. 7:22.

1-3. బైబిలు చదివి, దానిలోని బోధలను పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

 “బైబిలును అర్థంచేసుకోవడానికి నాకు సహాయం చేస్తున్నందుకు నేను ప్రతీ ఉదయం యెహోవాకు కృతజ్ఞతలు చెప్తాను.” ఈ మాటలు చెప్పిన వృద్ధ సహోదరి ఇప్పటికే 40కన్నా ఎక్కువసార్లు బైబిలు పూర్తిగా చదివింది, ఇంకా చదువుతూనే ఉంది. ఆమె కన్నా వయసులో చిన్నదైన మరో సహోదరి, బైబిలు చదవడం వల్ల తాను యెహోవా లక్షణాల గురించి తెలుసుకున్నానని రాసింది. దానివల్ల ఆమె తన పరలోక తండ్రికి ఇంకా దగ్గరైంది. ఆమె ఇలా అంటోంది: “నేనెన్నడూ ఇంత సంతోషంగా లేను!”

2 “నిర్మలమైన వాక్యమను . . . పాలను అపేక్షించుడి” అని అపొస్తలుడైన పేతురు అందరినీ ప్రోత్సహించాడు. (1 పేతు. 2:1, 2) బైబిలు అధ్యయనం చేస్తూ, దానిలోని బోధలను పాటిస్తూ ఆ అపేక్షను తీర్చుకునే వాళ్లకు మంచి మనస్సాక్షి ఉంటుంది, వాళ్ల జీవితానికి ఓ లక్ష్యం ఉంటుంది. అలాంటి వాళ్లు నిజమైన దేవుణ్ణి ప్రేమించే, సేవించే ఇతరులతో కలకాలం నిలిచే స్నేహాలు ఏర్పర్చుకుంటారు. “దేవుని ధర్మశాస్త్రమునందు” ఆనందించేవాళ్లు ఈ ప్రయోజనాలన్నిటినీ పొందుతారు. (రోమా. 7:22) ఇవేకాదు, ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం.

3 యెహోవా గురించి, ఆయన కుమారుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా వాళ్లిద్దరిని, అలాగే తోటి మనుష్యులను ప్రేమిస్తాం. మనకు లేఖనాల గురించి ఖచ్చితమైన జ్ఞానం ఉంటే, నాశనం వైపు వెళ్తున్న ఈ లోకం నుండి తనకు విధేయంగా ఉండేవాళ్లను దేవుడు త్వరలోనే కాపాడతాడని అర్థంచేసుకుంటాం. పరిచర్యలో ప్రజలకు సంతోషాన్నిచ్చే సువార్తను చెప్పగలుగుతాం. దేవుని వాక్యాన్ని చదివి మనం నేర్చుకున్నవాటిని ఇతరులకు బోధిస్తున్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు.

చదవండి, ధ్యానించండి

4. యెహోషువ 1:8లోని ఉపదేశాన్ని మనమెలా పాటించవచ్చు?

4 తన వాక్యాన్ని మనం ఆదరబాదరగా చదువుకుంటూ పోవాలని యెహోవా కోరుకోవడం లేదు. ఆయన పూర్వకాలంలోని యెహోషువకు ఇలా చెప్పాడు: ‘ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దివారాత్రము దానిని ధ్యానించవలెను.’ (యెహో. 1:8; కీర్త. 1:2) అంటే, ధ్యానించడానికి వీలయ్యేలా నెమ్మదిగా చదవాలని ఈ లేఖనం ఉపదేశిస్తోంది. మనం బైబిల్లో చదివిన విషయాల్ని ‘ధ్యానించినప్పుడు,’ ప్రత్యేకించి ఆ సమయంలో మనకు ఉపయోగకరంగా, ప్రోత్సాహకరంగా ఉండే విషయాలపై దృష్టి నిలపగలుగుతాం. అలాంటి వాక్య భాగాలు, వాక్యాలు లేదా వృత్తాంతాలు తారసపడినప్పుడు వీలైతే వాటిని ఉచ్చరిస్తూ, పలుకుతూ నెమ్మదిగా చదవాలి. అలా ధ్యానించినప్పుడు ఓ లేఖనానికున్న పూర్తి అర్థాన్ని గ్రహించి మనం చేసుకోవాల్సిన మార్పును గుర్తిస్తాం. అదెందుకు అవసరం? ఎందుకంటే, దేవుని సలహాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే దాన్ని పాటించాలని బలంగా కోరుకుంటాం.

5-7. దేవుని వాక్యం చదువుతూ ధ్యానించడం (ఎ) నైతిక విలువలు పాటించడానికి ఎలా తోడ్పడుతుంది? (బి) ఇతరులతో ఓర్పుగా, దయగా వ్యవహరించడానికి ఎలా దోహదపడుతుంది? (సి) కష్టాలు వచ్చినప్పుడు కూడా యెహోవాపై నమ్మకాన్ని పెంచుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది?

5 మనకు అంత బాగా తెలియని బైబిలు పుస్తకాలు చదువుతున్నప్పుడు, ధ్యానించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి, మూడు సన్నివేశాల్ని ఊహించుకుందాం. మొదటి సన్నివేశంలో, ఓ యౌవన క్రైస్తవుడు తన బైబిలు అధ్యయనంలో హోషేయ ప్రవచనాన్ని చదువుతున్నాడు. 4వ అధ్యాయంలో 11 నుండి 13 వచనాలు చదివిన తర్వాత కాసేపు ఆగుతాడు. (హోషేయ 4:11-13 చదవండి.) ఎందుకు? ఆ సహోదరుడు స్కూల్లో, అనైతికమైన పనులు చేయాలనే ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు కాబట్టి, ఆ లేఖనాలు ఆయన్ని ఆకట్టుకున్నాయి. ఆయన ఆ లేఖనాలను ధ్యానిస్తూ ఇలా అనుకుంటాడు: ‘చుట్టు పక్కల ఎవ్వరూ లేనప్పుడు చేసే చెడ్డ పనులను కూడా యెహోవా గమనిస్తాడు. ఆయనను నేను బాధపెట్టాలనుకోవడం లేదు.’ దేవునికి నచ్చేలా జీవించడానికి నైతిక విలువలను పాటించాలని ఆ సహోదరుడు గట్టిగా నిర్ణయించుకుంటాడు.

6 రెండవ సన్నివేశంలో, ఓ సహోదరి యోవేలు ప్రవచనాన్ని చదువుతూ రెండవ అధ్యాయంలోని 13వ వచనం దాకా వచ్చింది. (యోవేలు 2:13 చదవండి.) ఆ వచనం చదువుతుండగా, ‘కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు’ అయిన యెహోవాను తానెలా అనుకరించాలో ధ్యానిస్తుంది. తన భర్తతో, మరితరులతో కొన్నిసార్లు వెటకారంగా, కోపంగా మాట్లాడే తత్వం ఉన్న ఆమె దాన్ని మానుకోవడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకుంటుంది.

7 మూడవ సన్నివేశంలో, ఉద్యోగం కోల్పోయిన ఓ క్రైస్తవ తండ్రి తన భార్యాపిల్లల బాగోగుల గురించి ఆందోళన పడుతుంటాడు. నహూము 1:7లో, ‘శ్రమ దినమందు యెహోవా ఆశ్రయదుర్గంలా’ కాపాడతాడని, “తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును” అని చదివినప్పుడు ఆ సహోదరునికి కాస్త ఊరట కలుగుతుంది. ప్రేమతో యెహోవా చూపించే శ్రద్ధ ఎలాంటిదో గ్రహించి అతిగా ఆందోళనపడడం ఆపేస్తాడు. ఆ తర్వాత ఆయన 15వ వచనాన్ని చదువుతాడు. (నహూము 1:15 చదవండి.) కష్టాలు అనుభవిస్తున్న సమయంలో కూడా సువార్త ప్రకటనా పని చేస్తే యెహోవాను తన ఆశ్రయ దుర్గంగా చేసుకున్నట్లు చూపించగలనని ఆయన గ్రహిస్తాడు. దాంతో, మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే వారం మధ్యలో జరిగే ప్రకటనాపనిలో పాల్గొనాలనే ప్రేరణ ఆయనలో కలిగింది.

8. మీరు బైబిలు చదువుతున్నప్పుడు కనుగొన్న ఓ వజ్రం గురించి చెప్పండి.

8 ఇప్పటిదాకా మనం పరిశీలించిన ప్రయోజనకరమైన విషయాలన్నీ, అర్థంచేసుకోవడానికి కష్టమని కొందరు భావించే బైబిలు పుస్తకాల్లోనివే. హోషేయ, యోవేలు, నహూము పుస్తకాల నుండి పాఠాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో చదివితే, వాటిలో ఉన్న వేరే వచనాల్ని కూడా చదివి ధ్యానించాలనిపిస్తుంది. ఆ ప్రవక్తలు రాసిన విషయాల నుండి మనమెంత జ్ఞానాన్ని, ఓదార్పును పొందవచ్చో ఒక్కసారి ఆలోచించండి! మరి, బైబిల్లోని ఇతర పుస్తకాల విషయమేమిటి? దేవుని వాక్యం వజ్రాల గనిలాంటిది. కాబట్టి, దానిలోని వజ్రాల కోసం తవ్వుతూనే ఉండండి! అంతటి విలువైన దేవుని నిర్దేశాన్ని, అభయాన్ని పొందాలనే లక్ష్యంతో బైబిలును పూర్తిగా చదవండి.

అర్థంచేసుకోవడానికి కృషి చేయండి

9. దేవుని చిత్తం గురించి మనకున్న అవగాహనను ఎలా పెంచుకోవచ్చు?

9 ప్రతీరోజు బైబిలు చదవడం ప్రాముఖ్యమే అయినా, దానిలోని విషయాల్ని అర్థంచేసుకోవడం, వాటి గురించిన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం కూడా అవసరమే. కాబట్టి, బైబిల్లో మీరు చదివే వ్యక్తుల గురించి, ప్రదేశాల గురించి, సంఘటనల గురించి పరిశోధించడానికి యెహోవా సంస్థ అందిస్తున్న ప్రచురణల్ని చక్కగా ఉపయోగించుకోండి. ఒకవేళ ఫలాని బైబిలు బోధ మీ జీవితానికి ఎలా వర్తిస్తుందో అర్థంకాకపోతే, సంఘ పెద్దలను లేదా పరిణతిగల ఇతర క్రైస్తవులను అడిగి తెలుసుకోండి. మన అవగాహనను పెంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో తెలుసుకోవడానికి, మొదటి శతాబ్దానికి చెందిన ఓ క్రైస్తవుని గురించి చూద్దాం. ఆయన పేరు అపొల్లో.

10, 11. (ఎ) మరింత మెరుగైన సువార్త పరిచారకునిగా ఉండేందుకు అపొల్లోకు ఎలాంటి సహాయం దొరికింది? (బి) అపొల్లో నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (“మీరు మారిన అవగాహనల్నే బోధిస్తున్నారా?” అనే బాక్సు చూడండి.)

10 క్రైస్తవునిగా మారిన యూదుడైన అపొల్లో “లేఖనముల యందు ప్రవీణుడు,” ‘ఆత్మయందు తీవ్రతగలవాడు.’ అపొస్తలుల కార్యముల పుస్తకం ఆయన గురించి ఇలా చెబుతోంది: “యోహాను బాప్తిస్మము మాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను.” అవగాహనలో వచ్చిన మార్పు తెలియక అపొల్లో బాప్తిస్మం గురించి పాత విషయాల్నే బోధిస్తున్నాడు. ఎఫెసులో అపొల్లో బోధిస్తున్నప్పుడు విన్న క్రైస్తవ దంపతులు ప్రిస్కిల్ల, అకుల “దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.” (అపొ. 18:24-26) దానివల్ల అపొల్లో ఎలా ప్రయోజనం పొందాడు?

11 అపొల్లో ఎఫెసులో ప్రకటించాక అకయకు వెళ్లాడు. “అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను.” (అపొ. 18:27, 28) ఆ సమయానికల్లా, క్రైస్తవ బాప్తిస్మం గురించిన అసలు అర్థాన్ని అపొల్లో సరిగ్గా వివరించగలిగాడు. తన అవగాహన మెరుగవ్వడంతో ఆయన సత్యారాధన విషయంలో ఎదగడానికి కొత్తవాళ్లకు ‘చాలా సహాయము’ చేశాడు. దీన్నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? అపొల్లోలాగే, మనం కూడా బైబిల్లో చదివిన విషయాల్ని అర్థంచేసుకోవడానికి కృషిచేస్తాం. అయితే, మరింత మెరుగ్గా బోధించడానికి సంబంధించి అనుభవంగల తోటి క్రైస్తవులు మనకు సలహా ఇచ్చినప్పుడు మనం ఆ సలహాను వినయంతో, కృతజ్ఞతతో స్వీకరించాలనుకుంటాం. అలాచేస్తే, మనం పరిశుద్ధ సేవను మరింత మెరుగ్గా చేయగలుగుతాం.

మీరు నేర్చుకున్నవాటిని ఉపయోగించి ఇతరులకు సహాయం చేయండి

12, 13. మనం లేఖనాల్ని నేర్పుగా ఉపయోగిస్తే, బైబిలు విద్యార్థులు ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తారని ఎలా చెప్పవచ్చు?

12 ప్రిస్కిల్ల, అకుల, అపొల్లో మాదిరిగానే మనం కూడా ఇతరులకు సహాయం చేయవచ్చు. మీరిచ్చిన ప్రోత్సాహం వల్ల ఓ కొత్త వ్యక్తి తన ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకంగా ఉన్న సమస్యను అధిగమించాడని తెలుసుకున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? లేదా సంఘపెద్దగా మీరిచ్చిన ఒక లేఖన ఉపదేశం క్లిష్టమైన సమయంలో తమకు సహాయం చేసిందని తోటి ఆరాధకులు మీకు చెబితే మీకెలా అనిపిస్తుంది? ఇతరులు తమ జీవితాల్ని మెరుగుపర్చుకునేలా మీరు దేవుని వాక్యాన్ని ఉపయోగించినప్పుడు, నిస్సందేహంగా మీకు ఎంతో సంతృప్తి, సంతోషం కలుగుతాయి. a అయితే, ఆ దిశలో మీరు ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చో ఆలోచించండి.

13 ఏలీయా కాలంలో చాలామంది ఇశ్రాయేలీయులు సత్యారాధనకు, అబద్ధ ఆరాధనకు సంబంధించి రెండు తలంపుల మధ్య ఊగిసలాడారు. ఆ సమయంలో ఏలీయా ఓ ఉపదేశం ఇచ్చాడు. నిర్ణయం తీసుకోవడానికి తటపటాయిస్తూ ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేకపోతున్న బైబిలు విద్యార్థులకు ఆ ఉపదేశం ఎంతో సహాయం చేస్తుంది. (1 రాజులు 18:21 చదవండి.) మరో సన్నివేశాన్ని పరిశీలించండి: కొత్తగా ఆసక్తి చూపిస్తున్న ఓ విద్యార్థి తన బంధుమిత్రులు ఏమనుకుంటారో అని భయపడుతుంటే, యెహోవాను ఆరాధించాలని గట్టిగా నిర్ణయించుకునేలా అతనికి సహాయం చేయడానికి యెషయా 51:12, 13 వచనాలను ఉపయోగించవచ్చు.—చదవండి.

14. ఇతరులకు సహాయం చేసేందుకు కావాల్సిన లేఖనాల్ని గుర్తుచేసుకోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

14 పాఠకుల్ని ప్రోత్సహించే, సరిదిద్దే లేదా బలపర్చే మాటలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. కానీ, ‘ఫలాని సందర్భంలో నాకు అవసరమైన లేఖనాలు అప్పటికప్పుడు ఎలా దొరుకుతాయి?’ అని మనకు అనిపించవచ్చు. ప్రతీరోజు బైబిలు చదువుతూ దేవుని తలంపుల్ని ధ్యానించండి. అలాచేస్తే, లేఖనాల సంపదను వృద్ధిచేసుకుంటాం. అవసరమైనప్పుడు వాటిని గుర్తుచేసుకోవడానికి యెహోవా ఆత్మ మనకు సహాయం చేస్తుంది.—మార్కు 13:11; యోహాను 14:26 చదవండి.

15. దేవుని వాక్యాన్ని మనమెలా మరింత బాగా అర్థంచేసుకోవచ్చు?

15 సొలొమోను రాజులా మనం కూడా యెహోవా అప్పగించిన బాధ్యతల్ని నిర్వర్తించడానికి కావాల్సిన జ్ఞానం కోసం ఆయనకు ప్రార్థించాలి. (2 దిన. 1:7-10) యెహోవా గురించిన, ఆయన చిత్తం గురించిన ఖచ్చితమైన జ్ఞానం కోసం పూర్వకాలంలోని ప్రవక్తల్లాగే మనం కూడా దేవుని వాక్యాన్ని ‘విచారించి, పరిశోధించాలి.’ (1 పేతు. 1:10-12) “విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల” నుండి బలాన్ని పొందమని తిమోతిని అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించాడు. (1 తిమో. 4:6) మనం అవన్నీ చేస్తే, ఇతరులకు ఆధ్యాత్మిక సహాయాన్ని అందించగలిగేంత సామర్థ్యాన్ని సంపాదించుకుంటాం. అంతేకాక, మన సొంత విశ్వాసాన్ని కూడా బలపర్చుకుంటాం.

దేవుని వాక్యం మనల్ని తప్పక కాపాడుతుంది

16. (ఎ) ‘ప్రతీదినం లేఖనాలు పరిశోధించడం’ వల్ల బెరయ వాసులు ఎలా ప్రయోజనం పొందారు? (బి) ప్రతీరోజు బైబిలు చదవడం ఇప్పుడు మనకెందుకు అంత ప్రాముఖ్యం?

16 మాసిదోనియాకు చెందిన బెరయ నగరంలోని యూదులకు ‘ప్రతీదినం లేఖనాలు పరిశోధించే’ అలవాటు ఉండేది. పౌలు సువార్త ప్రకటించినప్పుడు ఆ యూదులు, ఆయన చెప్పిన మాటల్ని తమకున్న లేఖన జ్ఞానంతో పోల్చి చూసుకున్నారు. ఫలితం? చాలామందికి ఆయన బోధించేది సత్యమేనని నమ్మకం కుదిరి ‘విశ్వాసులయ్యారు.’ (అపొ. 17:10-12) ప్రతీరోజు బైబిలు చదివితే యెహోవా మీద అపారమైన విశ్వాసం కలుగుతుందని దాన్నిబట్టి తెలుస్తోంది. అలాంటి విశ్వాసం “నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపము” కాబట్టి మనం దేవుని నూతనలోకంలో అడుగుపెట్టాలంటే అది మనకు ఎంతో అవసరం.—హెబ్రీ. 11:1.

17, 18. (ఎ) బలమైన విశ్వాసం, ప్రేమ ఎలా మన హృదయాన్ని కాపాడతాయి? (బి) నిరీక్షణ మనల్ని ప్రమాదాల నుండి ఎలా కాపాడుతుంది?

17 మంచి కారణంతోనే పౌలు ఇలా రాశాడు: “మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.” (1 థెస్స. 5:8) శత్రువు నుండి ఒక సైనికుడు తన గుండెను కాపాడుకోవడానికి కవచం ధరించినట్లే, మనం ‘పాపం’ బారిన పడకుండా మన హృదయాన్ని కాపాడుకోవడానికి కవచం ధరించాలి. దేవుని సేవకునికి, ఆయన వాగ్దానాలపై బలమైన విశ్వాసంతో పాటు ఆయన మీద, తోటి మనుష్యుల మీద ప్రేమ కూడా ఉంటే ఏమి జరుగుతుంది? దానికి మించిన ఆధ్యాత్మిక కవచం మరొకటి ఉండదు. అది ధరిస్తే, మనం దేవుని అనుగ్రహాన్ని కోల్పోయేలా చేసే వాటివైపు మొగ్గుచూపం.

18 “రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము” గురించి కూడా పౌలు మాట్లాడాడు. శిరస్త్రాణం లేకుండా యుద్ధానికి వెళ్లే సైనికులు ప్రాణాలతో బయటపడడం కష్టం. కానీ, మంచి శిరస్త్రాణం ఉంటే తలకు తీవ్రమైన గాయాలు కాకుండా తప్పించుకోవచ్చు. మనం యెహోవా వాక్యాన్ని అధ్యయనం చేస్తే యెహోవా రక్షణ కార్యాల మీద నిరీక్షణను పెంపొందించుకోవచ్చు. మన నిరీక్షణ బలంగా ఉంటే మనం మతభ్రష్టుల వల్ల, వాళ్లు చెప్పే కొరుకుడుపుండులాంటి “వట్టి మాటల” వల్ల మోసపోము. (2 తిమో. 2:16-19) అంతేకాదు, యెహోవాకు నచ్చని పనులు చేయించే వాళ్లకు దూరంగా ఉండడానికి కావాల్సిన బలాన్ని ఆ నిరీక్షణ మనలో నింపుతుంది.

రక్షణకు అవశ్యకం

19, 20. దేవుని వాక్యాన్ని మనమెందుకు ప్రత్యేకంగా గౌరవిస్తాం? దాన్ని అమూల్యమైనదిగా ఎంచుతున్నామని ఎలా చూపిస్తాం? (“సరిగ్గా నాకు కావాల్సిందే యెహోవా ఇస్తాడు” అనే బాక్సు చూడండి.)

19 అంత్యదినాలు ముగిసే సమయం దగ్గరపడుతుండగా మనం యెహోవా వాక్యంపై మరింత ఎక్కువగా ఆధారపడాలి. చెడు అలవాట్లను మానుకోవడానికి, పాపభరిత ఆలోచనల్ని అణచుకోవడానికి బైబిలు సలహాలు మనకు సహాయం చేస్తాయి. సాతాను, అతని లోకం పెట్టే పరీక్షల్లో మనం నెగ్గడానికి కావాల్సిన ప్రోత్సాహం, ఊరట బైబిల్లో దొరుకుతాయి. యెహోవా తన వాక్యం ద్వారా ఇచ్చే నడిపింపుతో మనం జీవమార్గంలో నిలిచి ఉంటాం.

20 “మనుష్యులందరు రక్షణ” పొందాలన్నదే దేవుని చిత్తమని గుర్తుంచుకోండి. ఆ ‘అందరిలో’ యెహోవా సేవకులమైన మనతో సహా మన ప్రకటనా పని ద్వారా, బోధనా పని ద్వారా ప్రయోజనం పొందే ప్రజలు కూడా ఉన్నారు. అయితే, రక్షణ పొందాలనుకునే వాళ్లంతా “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానము” సంపాదించుకోవాలి. (1 తిమో. 2:4) కాబట్టి, దుష్ట లోకాంతాన్ని తప్పించుకొని జీవించాలంటే బైబిలు చదువుతూ, అందులోని దేవుని నిర్దేశాల్ని పాటించడం తప్పనిసరి. అవును, మనం ప్రతీరోజు బైబిలు చదివితే యెహోవా అమూల్యమైన సత్యవాక్యాన్ని మనమెంత గౌరవిస్తున్నామో చూపిస్తాం.—యోహా. 17:17.

a మనం బైబిలు ఉపయోగించి ఇతరుల్ని ఒత్తిడి చేయం లేదా వాళ్లను ఖండించం. యెహోవా మనతో వ్యవహరించినంత ఓపికగా, దయగా మనం మన బైబిలు విద్యార్థులతో వ్యవహరించాలి.—కీర్త. 103:8.