కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొందరు ఎలా గుర్తుచేసుకోబడుతున్నారు?

కొందరు ఎలా గుర్తుచేసుకోబడుతున్నారు?

కొందరు ఎలా గుర్తుచేసుకోబడుతున్నారు?

దాదాపు మూడువేల సంవత్సరాల క్రితం, దావీదు ఇశ్రాయేలు రాజైన సౌలు దగ్గరనుండి పారిపోతున్నాడు. గొర్రెలు, మేకలుపెంచే మోతుబరి నాబాలు వద్దకు ఆహారం కోసం, నీళ్ల కోసం దావీదు తన సేవకుల్ని పంపించాడు. నిజానికి, దావీదుకు, ఆయన అనుచరులకు నాబాలు రుణపడివున్నాడు, ఎందుకంటే వారు ఒకసారి నాబాలు మందల్ని కాపాడారు. అయితే, నాబాలు వారికి ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించాడు. చివరికి అతను దావీదు మనుషులతో కఠినంగా మాట్లాడి తిట్టి పంపించాడు. నాబాలు నిజానికి నిప్పుతో చెలగాటమాడుతున్నాడు ఎందుకంటే దావీదుకు ఇలాంటివన్నీ సహించవు.​—⁠1 సమూయేలు 25:5, 8, 10, 11, 14.

నాబాలు దృక్పథం, సందర్శకులకు, క్రొత్తవారికి ఆతిథ్యమిచ్చే మధ్యప్రాచ్య సాంప్రదాయానికి ఎంతమాత్రం అనుగుణంగా లేదు. కాబట్టి, నాబాలు ఎలాంటి పేరు సంపాదించుకున్నాడు? అతను ‘మోటువాడు దుర్మార్గుడు’ ‘బహు పనికిమాలినవాడు’ అని బైబిలు వృత్తాంతం చెబుతోంది. అతని పేరుకు “మోటు”వాడు అని అర్థం, అతడు దానికి తగ్గట్టుగానే జీవించాడు. (1 సమూయేలు 25:​3, 17, 25) ఇతరులు మిమ్మల్ని కూడా అలా గుర్తుంచుకోవాలని మీరు కోరుకుంటారా? ఇతరులతో ప్రత్యేకంగా బలహీనులుగా ఉన్నట్లున్న వారితో వ్యవహరించేటప్పుడు మీరు మొరటుగా, నిర్దయగా ఉంటారా? లేక దయగలవారిగా, ఆతిథ్యమిచ్చేవారిగా, శ్రద్ధచూపేవారిగా ఉంటారా?

అబీగయీలు​—⁠సుబుద్ధిగల స్త్రీ

తన మొరటుతనాన్నిబట్టి నాబాలు కష్టంలో ఇరుక్కున్నాడు. దావీదు, అతని మనుషులు 400 మంది ఖడ్గాలు ధరించి నాబాలుకు బుద్ధిచెప్పడానికి బయలుదేరారు. నాబాలు భార్య అబీగయీలు జరిగిన సంగతి విన్నది. రానున్న ప్రమాదం ఆమెకు అర్థమయ్యింది. ఆమె ఏమి చేసింది? వెంటనే ఆమె సరిపడా ఆహారం, కావలసిన ఇతర పదార్థాలు తయారుచేసుకొని దావీదును అతని మనుషులను మార్గమధ్యంలోనే ఆపడానికి బయలువెళ్ళింది. ఆమె వారిని కలుసుకొని అకారణంగా రక్తపాతం జరిగించవద్దని దావీదును వేడుకుంది. దావీదు హృదయం మెత్తబడింది. ఆమె ప్రార్థనను ఆయన మన్నించి, శాంతపడ్డాడు. ఇవి జరిగిన కొద్ది రోజులకే నాబాలు మరణించాడు. అబీగయీలు సులక్షణాలు గుర్తించి దావీదు ఆమెను తన భార్యగా స్వీకరించాడు.​—⁠1 సమూయేలు 25:14-42.

అబీగయీలు తనకెలాంటి పేరు సంపాదించుకుంది? ఆదిమ హీబ్రూ వ్యక్తపరుస్తున్న విధంగా, ఆమె ‘సుబుద్ధిగలది’ లేదా “చాలా తెలివైనది.” ఆమె ఎప్పుడు, ఎలా చొరవ తీసుకోవాలో తెలిసిన బుద్ధికుశలత, వాస్తవిక గ్రహింపుగల స్త్రీ. ఆమె మూర్ఖుడైన తన భర్తను, అతని ఇంటివారిని విపత్తు నుండి కాపాడేందుకు యథార్థంగా చర్యతీసుకుంది. చివరికామె చనిపోయింది, అయితే ఆమె బుద్ధికుశలతగల స్త్రీగా మంచి పేరు సంపాదించుకుంది.​—⁠1 సమూయేలు 25:⁠3, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

పేతురు ఎలాంటి పేరు సంపాదించుకున్నాడు?

మనం సా.శ. మొదటి శతాబ్దానికి వెళ్లి యేసు 12 మంది అపొస్తలులను పరిశీలిద్దాం. నిస్సందేహంగా, వారందరిలో గలిలయ ప్రాంతంలో అంతకుముందు జాలరిగావున్న పేతురు లేదా కేఫా మహా దుడుకువాడు, నిర్మొహమాటంగా మాట్లాడతాడు. ఆయన తన భావాలను వ్యక్తం చేయడానికి ఎంతమాత్రం భయపడని వ్యక్తి అని తెలుస్తోంది. ఉదాహరణకు, ఒక సందర్భంలో యేసు తన శిష్యుల పాదాలు కడిగాడు. తన పాదాలు కడిగే వంతువచ్చే సరికి పేతురు ఎలా స్పందించాడు?

పేతురు “ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా?” అని యేసును అడిగాడు. దానికి జవాబిస్తూ యేసు, “నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో” చెప్పాడు. దానికి వెంటనే పేతురు “నీవెన్నడును నా పాదములు కడుగరాదు” అని ఆయనతో అన్నాడు. పేతురు వెంటనే ఎలా స్పందించాడో గమనించండి. దానికి యేసు ఎలా ప్రత్యుత్తరమిచ్చాడు?

యేసు దానికి ప్రత్యుత్తరమిస్తూ, “నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదు” అన్నాడు. అప్పుడు సీమోను పేతురు, “ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో” అన్నాడు. ఇప్పుడు పేతురు అతిగా మాట్లాడాడు! అయితే పేతురు అసలు స్వభావమేమిటో మీకు తెలుసు. అతనిలో కపటం, ద్విమనస్సు లేవు.​—⁠యోహాను 13:​6-9.

మానవ బలహీనతల విషయంలో కూడా పేతురును మర్చిపోలేము. ఉదాహరణకు, దోషారోపణ చేయబడిన నజరేయుడగు యేసు అనుచరునిగా ప్రజలు పేతురును నిందించినప్పుడు వారియెదుట ఆయన మూడుసార్లు క్రీస్తును తానెరుగనని చెప్పాడు. పేతురు తనతప్పు తెలుసుకున్నప్పుడు సంతాపపడి యేడ్చాడు. తాను విఫలమయ్యాననే దుఃఖాన్ని, పరితాపాన్ని వ్యక్తంచెయ్యడానికి ఆయన భయపడలేదు. ఎరుగనని పేతురు చెప్పిన వృత్తాంతాన్ని సువార్త రచయితలు కూడా నమోదు చేయడం గమనార్హమైనదే ఎందుకంటే బహశా పేతురే స్వయంగా ఆ సమాచారం వారికి అందజేసి ఉంటాడు! ఆయన తన వైఫల్యాలు అంగీకరించేంత నమ్రతగలవాడు. మీకు ఆ సద్గుణముందా?​—⁠మత్తయి 26:69-75; మార్కు 14:66-72; లూకా 22:54-62; యోహాను 18:15-18, 25-27.

క్రీస్తును తానెరుగనని చెప్పిన కొద్దివారాల్లోనే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినవాడై ధైర్యంగా పెంతెకొస్తునాడు యూదా జనసమూహాలకు ప్రకటించాడు. పునరుత్థానం చేయబడిన యేసుకు పేతురుపై నమ్మకముందని ఇది సూచించింది.​—⁠అపొస్తలుల కార్యములు 2:​14-21.

మరో సందర్భంలో, పేతురు వేరొక ప్రమాదంలో చిక్కుకున్నాడు. యూదులైన కొందరు సహోదరులు అంతియొకయకు రావడానికి ముందు, పేతురు అన్య విశ్వాసులతో బాహాటంగా కలిసిమెలిసి ఉన్నాడని అపొస్తలుడైన పౌలు వివరించాడు. అయితే, అప్పుడే యెరూషలేమునుండి వచ్చిన “సున్నతి పొందిన వారికి భయపడి” ఆయన వారినుండి ప్రక్కకు తప్పుకున్నాడు. పేతురు ద్వందనీతిని పౌలు తప్పుబట్టాడు.​—⁠గలతీయులు 2:11-14.

అయినప్పటికీ, యేసు అనుచరుల్లో అనేకులు ఆయనను విడిచిపోవడానికి సిద్ధమైన క్లిష్టపరిస్థితిలో ఆ శిష్యుల్లో ఎవరు నిర్భయంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు? అది, యేసు తన శరీరం తిని తన రక్తం త్రాగడం యొక్క విశేషతను గురించి ఓ క్రొత్త విషయాన్ని విశదపరచిన సందర్భం. ఆయనిలా అన్నాడు: “మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.” యేసు అనుచరుల్లోని చాలామంది యూదులు అభ్యంతరపడి, “యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడు” అన్నారు. అప్పుడేం జరిగింది? “అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.”​—⁠యోహాను 6:50-66.

ఈ నిర్ణాయక సమయంలో, యేసు తన 12 మంది అపొస్తలులవైపు తిరిగి గంభీరంగా వారినిలా ప్రశ్నించాడు: “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?” దానికి పేతురు, “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని” ప్రత్యుత్తరమిచ్చాడు.​—⁠యోహాను 6:67-69.

పేతురు ఎలాంటి పేరు సంపాదించుకున్నాడు? ఆయనను గురించిన వృత్తాంతాలను చదివేవారు ఆయన వ్యక్తిత్వంలోని నిజాయితీని నిష్కాపట్యాన్ని, ఆయన యథార్థతను, తన బలహీనతలను ఒప్పుకునేందుకు ఆయన చూపిన సుముఖతను బట్టి ముగ్ధులు కావలసిందే. ఆయన తన కోసం ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో గదా!

యేసు గురించి ప్రజలేమి గుర్తుంచుకున్నారు?

యేసు భూపరిచర్య కేవలం మూడున్నర సంవత్సరాలే సాగింది. అయినప్పటికీ, యేసును ఆయన అనుచరులు ఎలా గుర్తుంచుకున్నారు? ఆయన పరిపూర్ణుడు, పాపంలేని వాడైనందున అందరికి దూరంగా, తప్పుకుని తిరిగాడా? తాను దేవుని కుమారుడనని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అభ్యంతరకరంగా అధికారం చెలాయించాడా? ఆయన తన అనుచరులను భయపెట్టి, తనకు లోబడాలని బలవంతం చేశాడా? ఆయన తనకు తాను ఎంతో ప్రాధాన్యతనిచ్చుకుని ఎలాంటి హాస్యధోరణి లేకుండా ఉండేవాడా? బలహీనులకు, రోగులకు లేదా పిల్లలకు సమయం ఇవ్వలేనంతగా ఆయన పనిలో మునిగిపోయాడా? ఆ కాలంలో తరచు పురుషులు చూసినట్లు, ఆయన ఇతర జాతులవారిని, స్త్రీలను చిన్నచూపు చూశాడా? లిఖితచరిత్ర ఏమి చెబుతోంది?

యేసుకు ప్రజలమీద ఆసక్తివుంది. ఆయన పరిచర్యను గురించిన అధ్యయనం అనేక సందర్భాల్లో ఆయన కుంటివారిని, రోగులను బాగుచేశాడని వెల్లడిచేస్తుంది. ఆయన అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి తీవ్రంగా కృషి చేశాడు. ఆయన పిల్లలయందు ఆసక్తి కనుపరుస్తూ, తన శిష్యులనిలా ఆదేశించాడు: “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు.” ఆ పిమ్మట ఆయన ‘ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు.’ మీరు పిల్లలతో సమయం గడుపుతారా లేక వారున్నారనేది సహితం గమనించలేనంతగా పనిలో మునిగిపోతున్నారా?​—⁠మార్కు 10:13-16; మత్తయి 19:13-15.

యేసు భూమిపై ఉన్నప్పుడు, యూదా ప్రజలు అసలు ధర్మశాస్త్రం కోరినదానికంటే ఎక్కువగా మతసంబంధ నియమనిబంధనలతో అణగద్రొక్కబడ్డారు. వారి మతనాయకులు ప్రజల భుజాలపై మోయశక్యంకాని బరువులు వేశారు గానీ తాము వాటిని తమ వ్రేలితోనైనా కదలింపలేదు. (మత్తయి 23:4; లూకా 11:​46) కాబట్టి, యేసు వారికెంత భిన్నంగా ఉన్నాడో గదా! ఆయనిలా అన్నాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.”​—⁠మత్తయి 11:28-30.

ప్రజలు యేసుతో సహవసించినప్పుడు నూతనోత్తేజం పొందారు. తన శిష్యులు తనతో మాట్లాడడానికి జంకేంతగా ఆయన వారిని భయపెట్టలేదు. వాస్తవానికి, వారు తమ భావాలు వ్యక్తంచేసేలా ఆయన వారిని ప్రశ్నలడిగాడు. (మార్కు 8:​27-29) అందువల్ల, క్రైస్తవ పైవిచారణకర్తలు తమనుతాము ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘నేను నా తోటి విశ్వాసులకు అదేవిధమైన అభిప్రాయం కలుగజేస్తున్నానా? ఇతర పెద్దలు తాము భావించేది నిజంగా నాకు చెబుతారా లేక అలాచేయడానికి వెనుదీస్తారా?’ పైవిచారణకర్తలు సమీపించదగిన వారిగా, ఇతరులు చెప్పేది వినేవారిగా, మృదువుగా ఉండడం ఎంత సేదదీర్పుగా ఉంటుందో గదా! అయుక్తంగా మాట్లాడడం దాపరికంలేని, నిరాటంక చర్చను నిరుత్సాహపరుస్తుంది.

యేసు దేవుని కుమారుడైనా, ఆయనెన్నడూ తన హోదాను లేదా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. బదులుగా, ఆయన తన శ్రోతలతో తర్కించాడు. ఒక సందర్భంలో పరిసయ్యులు ఆయనను చిక్కుల్లో పడేయడానికి కుయుక్తిగా ఇలా ప్రశ్నించారు: “కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా?” యేసు తనకు ఒక నాణెం చూపించమని అడిగి, ‘ఈ రూపమును పైవ్రాతయు ఎవరివి’ అని వారినడిగాడు. అందుకు వారు, ‘కైసరువి’ అని జవాబిచ్చారు. అందుకాయన, ‘ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి’ అని వారితో చెప్పాడు. (మత్తయి 22:​15-21) సులభమైన న్యాయతర్కన సరిపోయింది.

యేసుకు హాస్య ధోరణివుందా? దేవుని రాజ్యంలో ఒక ధనవంతుడు ప్రవేశించడం కంటె సూదిబెజ్జంలో ఒంటె దూరడం సులభమని యేసు చెప్పిన మాటలు చదివినప్పుడు కొందరు పాఠకులు దీనిలో హాస్యం చూస్తారు. (మత్తయి 19:​23, 24) అక్షరార్థ సూదిబెజ్జంలో ఒంటె దూరడమనే తలంపే అతిశయోక్తిగా ఉంది. తన కంటిలో ఉన్న దూలం చూసుకోకుండా తన సహోదరుని కంటిలో నలుసు చూడడం కూడా అలాంటి అతిశయోక్తికి మరో ఉదాహరణ. (లూకా 6:​41, 42) యేసు కఠినస్థుడు కాదు. ఆయన ఆప్యాయత గలవాడు, స్నేహశీలి. హాస్య ధోరణితో ఉండడం నేటి క్రైస్తవులకు ఒత్తిడిగల సమయాల్లో దుఃఖభారం తగ్గించగలదు.

స్త్రీలయెడల యేసుచూపిన కనికరం

యేసు సాన్నిధ్యంలో స్త్రీలెలా భావించారు? నిజానికి, తన తల్లితోసహా అనేకమంది యథార్థ స్త్రీలు ఆయనను వెంబడించారు. (లూకా 8:1-3; 23:55, 56; 24:​9, 10) యేసును స్త్రీలు ఎంత ధైర్యంగా సమీపించేవారంటే, ఒక సందర్భంలో ‘పాపాత్మురాలైన’ స్త్రీ తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి, వాటికి అత్తరు పూసింది. (లూకా 7:​37, 38) ఎన్నో సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడిన మరో స్త్రీ బాగుపడాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి ఆయన వస్త్రం ముట్టుకుంది. యేసు ఆమె విశ్వాసాన్ని ప్రశంసించాడు. (మత్తయి 9:​20-22) అవును, యేసు సమీపించదగిన వ్యక్తని స్త్రీలు కనుగొన్నారు.

మరొక సందర్భంలో, బావిదగ్గర యేసు ఒక సమరయ స్త్రీతో మాట్లాడాడు. దానికామె ఎంతో ఆశ్చర్యపడి, “యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని” అడిగింది. నిజానికి, యూదులకు సమరయులతో ఎలాంటి సంబంధాలుండేవి కావు. ‘నిత్యజీవమునకై ఊరెడి నీటి బుగ్గను’ గురించిన అద్భుతమైన సత్యాన్ని యేసు ఆమెకు బోధించాడు. ఆయన స్త్రీలతో స్వేచ్ఛగా మాట్లాడాడు. తన హోదా తగ్గుతుందని ఆయనెన్నడు భావించలేదు.​—⁠యోహాను 4:7-15.

స్వయం-త్యాగ స్వభావంతో సహా, తనకున్న ఎన్నో మానవతా లక్షణాలకు యేసు పేరుగాంచాడు. ఆయన దైవిక ప్రేమ యొక్క సారమైయున్నాడు. తన అనుచరులు కావాలనుకునే వారందరికి యేసు ప్రమాణముంచాడు. ఆయన మాదిరిని మీరెంత సన్నిహితంగా అనుసరిస్తారు?​—⁠1 కొరింథీయులు 13:4-8; 1 పేతురు 2:21.

నేటి క్రైస్తవులు ఎలా గుర్తుచేసుకోబడుతున్నారు?

ఆధునిక కాలంలో, వేలాదిమంది నమ్మకమైన క్రైస్తవులు మరణించారు, వారిలో చాలామంది వయస్సు మళ్లినవారిగా, మరితరులు సాపేక్షికంగా యౌవనంలోనే మరణించారు. కానీ వారు మంచి పేరు సంపాదించుకున్నారు. వృద్ధురాలై చనిపోయిన క్రిస్టల్‌వలె కొందరు తమకున్న ఎనలేని ప్రేమకు, కలివిడి స్వభావానికి పేరుతెచ్చుకున్నారు. మరికొందరు, 40లలో మరణించిన డిర్క్‌వలె సంతోషవర్తనకు, సిద్ధ స్వభావానికి పేరుతెచ్చుకున్నారు.

స్పెయిన్‌కు చెందిన హోసే అనుభవం కూడా దృష్టాంతంగా ఉంది. ఆ దేశంలో 1960లలో యెహోవాసాక్షుల ప్రకటనా పని నిషేధంలో ఉన్నప్పుడు, ఆయన వివాహితుడు, ఆయనకు ముగ్గురు యౌవన కుమార్తెలున్నారు. ఆయనకు బార్సిలోనాలో స్థిరమైన ఉద్యోగంవుంది. అయితే, ఆ కాలంలో దక్షిణ స్పెయిన్‌లో పరిణతిగల సంఘ పెద్దల అవసరముండింది. హోసే భద్రతగల తన ఉద్యోగం వదిలిపెట్టి తన కుటుంబంతోపాటు మలగాకు మారాడు. తరచు ఎలాంటి ఉద్యోగం లేకుండా వారు ఆర్థిక సంకట్లలో జీవించాల్సి వచ్చింది.

అయినప్పటికీ, హోసే పరిచర్యలో విశ్వాస్యతకు, నమ్మకత్వానికి అలాగే మద్దతిచ్చే భార్య కార్మెలా సహాయంతో మాదిరికరంగా తన బిడ్డలను పెంచడంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ ప్రాంతంలో క్రైస్తవ సమావేశాలు ఏర్పాటుచేయడానికి ఎవరైనా అవసరమైనప్పుడు, హోసే అన్ని సందర్భాల్లో తనను అందుబాటులో ఉంచుకొనేవాడు. దుఃఖదాయకంగా తన 50వ పడిలో ఆయన తీవ్రవ్యాధితో మరణించాడు. అయితే, నమ్మకస్థుడని, కష్టపడి పనిచేసే పెద్దని, ప్రేమగల తండ్రని, భర్తని ఆయన పేరు సంపాదించుకున్నాడు.

మరి మీరెలా గుర్తుచేసుకోబడతారు? మీరు నిన్న మరణించివుంటే, ఈ రోజు మీ గురించి ప్రజలేమని చెప్పుకుంటారు? మనమెలా ప్రవర్తిస్తామనేది మెరుగుపరచుకొనేందుకు ఈ ప్రశ్న మనలను పురికొల్పుతుంది.

మంచి పేరు సంపాదించుకొనేందుకు మనమేమి చేయవచ్చు? ఉదాహరణకు, మనమన్ని సందర్భాల్లో ప్రేమ, దీర్ఘశాంతం, దయాళుత్వం, సాత్వికం, ఆశానిగ్రహం వంటి ఆత్మ ఫలాన్ని ప్రదర్శించడంలో పురోగతి సాధించవచ్చు. (గలతీయులు 5:​22) అవును, ఖచ్చితంగా “సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.”​—⁠ప్రసంగి 7:1; మత్తయి 7:12.

[5వ పేజీలోని చిత్రం]

అబీగయీలు సుబుద్ధిగలదని పేరు సంపాదించుకుంది

[7వ పేజీలోని చిత్రం]

దుడుకుతనమున్నా పేతురు తన యథార్థ వ్యక్తిత్వానికి పేరుతెచ్చుకున్నాడు

[8వ పేజీలోని చిత్రం]

యేసు పిల్లలకొరకు సమయం వెచ్చించాడు