కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆదాము, హవ్వ తప్పు చేస్తారని దేవునికి ముందే తెలుసా?

ఆదాము, హవ్వ తప్పు చేస్తారని దేవునికి ముందే తెలుసా?

ఆదాము, హవ్వ తప్పు చేస్తారని దేవునికి ముందే తెలుసా?

చాలామంది దీనికి జవాబు నిజంగా తెలుసుకోవా లనుకుంటారు. దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు ఉండనిస్తున్నాడనే విషయం చర్చకు వచ్చినప్పుడు వెంటనే ఏదెను తోటలో మొదటి దంపతులు చేసిన తప్పు గురించిన ప్రస్తావన వస్తుంది. ‘దేవునికి ప్రతీదీ తెలుసు’ అనే ఆలోచన వల్ల కొంతమంది ఆదాము, హవ్వ తనకు విధేయత చూపించరన్న విషయం దేవునికి ముందే తెలిసి ఉంటుందనే ముగింపుకు వచ్చే అవకాశం ఉంది.

ఏ లోపం లేకుండా (పరిపూర్ణులుగా) సృష్టించబడిన ఆదాము, హవ్వ తప్పు చేస్తారని దేవునికి నిజంగా ముందే తెలిసివుంటే ఆయన గురించి ఏమనుకునే అవకాశం ఉంది? ఆయనెంతో చెడ్డవాడని అనుకునే అవకాశం ఉంది. ఆయన ప్రేమలేనివాడు, అన్యాయస్థుడు, నిజాయితీ లేనివాడు అనిపిస్తుంది. ముగింపు చెడ్డగా ఉంటుందని తెలిసి కూడా మొదటి దంపతులు విధేయత చూపిస్తారా లేదా అని పరీక్షించడం క్రూరత్వమని కొంతమంది అనొచ్చు. అప్పటినుండి ఇప్పటివరకు జరిగిన చెడంతటికీ, బాధలన్నిటికీ ఆయనే బాధ్యుడని లేదా కనీసం కొంతవరకైనా బాధ్యుడని అనిపిస్తుంది. కొంతమందికి మన సృష్టికర్త తెలివితక్కువ వాడన్నట్లు కూడా అనిపిస్తుంది.

యెహోవా దేవుడు చెడ్డవాడని బైబిలు చెబుతోందా? అది తెలుసుకోవాలంటే, యెహోవా చేసిన సృష్టి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి బైబిలు ఏమి చెబుతుందో చూద్దాం.

‘చాలా మంచిగా ఉంది’

మొదటి మానవులతో సహా, దేవుడు సృష్టించిన వాటన్నిటి గురించి బైబిలు పుస్తకమైన ఆదికాండము ఇలా చెబుతోంది, ‘దేవుడు తాను చేసినదంతా చూసినప్పుడు అది చాలా మంచిగా ఉంది.’ (ఆదికాండము 1:31) దేవుడు ఆదామును, హవ్వను ఏ లోపం లేకుండా, భూపర్యావరణానికి తగిన విధంగా సృష్టించాడు. వాళ్లను సృష్టించిన విధానంలో ఎలాంటి లోపం లేదు. ఆయన వాళ్లను ‘చాలా మంచిగా’ సృష్టించాడు కాబట్టి ప్రవర్తించాల్సిన విధంగా ప్రవర్తించే సామర్థ్యం వాళ్లలో ఉంది. వాళ్లు ‘దేవుని పోలికలో’ సృష్టించబడ్డారు. (ఆదికాండము 1:27, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము) కాబట్టే జ్ఞానం, యథార్థ ప్రేమ, న్యాయం, మంచితనం వంటి దేవుని లక్షణాలను కొంతమేరకు చూపించే సామర్థ్యం వాళ్లలో ఉంది. అలాంటి లక్షణాలను చూపిస్తే, తమకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకోగలుగుతారు, తమ పరలోక తండ్రికి సంతోషం కలిగించగలుగుతారు.

ఎలాంటి లోపం లేకుండా సృష్టించిన ఈ తెలివిగల మానవులకు సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ యెహోవా ఇచ్చాడు. కాబట్టి వాళ్లు ఏదో ఒక రకమైన రోబోలా, దేవునికి సంతోషం కలిగించేందుకు ముందే ప్రోగ్రాం చేయబడినవాళ్లు కాదు. దీని గురించి ఆలోచించండి. ఎవరైనా మనకు ఏదైనా ఒక బహుమతి, ఏదో ఇవ్వాలి కదా అని ఇస్తే ఎక్కువ సంతోషపడతామా లేదా ప్రేమతో ఇస్తేనా? జవాబు మనకు తెలిసిందే. అలాగే ఆదాము, హవ్వ దేవునికి విధేయులుగా ఉండడానికి సొంతగా నిర్ణయించుకునివుంటే, వాళ్ల విధేయతను చూసి దేవుడు ఎక్కువ సంతోషించి ఉండేవాడు. మొదటి దంపతులకు సొంతగా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్లు ప్రేమతో యెహోవాకు విధేయత చూపించి ఉండగలిగేవాళ్లు.—ద్వితీయోపదేశకాండము 30:19, 20.

నీతిమంతుడు, న్యాయవంతుడు, మంచివాడు

యెహోవా లక్షణాల గురించి బైబిలు తెలియజేస్తోంది. ఆయనకు ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన పాపం చేయడం అసాధ్యం. ఆయన ‘నీతిని, న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు’ అని కీర్తన 33:5 చెబుతోంది. అందుకే, ‘దేవుడు కీడుచేత శోధించబడనేరడు, ఆయన ఎవర్నీ శోధించడు’ అని యాకోబు 1:13 చెప్తోంది. యెహోవా మంచివాడు, ఆయనకు ఆదాము అంటే శ్రద్ధ ఉంది కాబట్టి, ‘ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలాలను నీవు నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినకూడదు, నువ్వు వాటిని తిన్న దినాన్నే నిశ్చయంగా చచ్చిపోతావు’ అని హెచ్చరించాడు. (ఆదికాండము 2:16, 17) మొదటి దంపతులు ఎల్లకాలం బ్రతకడం లేదా చనిపోవడం వాళ్లు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ముగింపు చెడ్డగా ఉంటుందని తెలిసి కూడా ఫలాని పాపం చేయవద్దని ఆయన వాళ్లను హెచ్చరించడం మోసం చేసినట్లు అయ్యుండేది కాదా? ‘నీతిని, న్యాయాన్ని ప్రేమించే’ యెహోవా నిజానికి వాళ్లకు నిరంతరం జీవించే అవకాశం లేకపోయినా వాళ్లు దాన్ని ఎంపిక చేసుకోవచ్చని చెప్పివుండేవాడు కాదు.

యెహోవా ఎంతో మంచివాడు కూడా. (కీర్తన 31:19) దేవుని మంచితనాన్ని గురించి వివరిస్తూ యేసు ఇలా అడిగాడు, ‘రొట్టె అడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవరైనా ఉన్నారా? లేక చేపను అడిగితే పామును ఎవరైనా ఇస్తారా? దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలు ఇవ్వాలని తెలుసు కదా! మరి అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగిన వాళ్లకు మంచి కానుకలు ఇవ్వడా?’ (మత్తయి 7:9-11, పరిశుద్ధ బైబిల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) దేవుడు తను సృష్టించిన వాళ్లకు ‘మంచి కానుకలు’ ఇస్తాడు. మానవులను సృష్టించిన పద్ధతి, వాళ్ల కోసం అందమైన తోటను సిద్ధపరచిన పద్ధతి చూస్తే ఆయన మంచివాడని తెలుస్తుంది. అంత మంచి సర్వాధిపతి, అందమైన తోట వాళ్ల చేజారిపోతుందని తెలిసి కూడా దాన్ని వాళ్లకు ఇచ్చేంత క్రూరమైనవాడా? కాదు. మానవులు చేసిన తిరుగుబాటుకు నీతిమంతుడు, మంచివాడు అయిన మన సృష్టికర్తను నిందించలేం.

‘ఏకైక జ్ఞానవంతుడు’

యెహోవాయే ‘ఏకైక జ్ఞానవంతుడు’ అని కూడా లేఖనాలు చెబుతున్నాయి. (రోమీయులు 16:27, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) పరలోకంలో ఉన్న దేవదూతలు, యెహోవా చేసిన ఎన్నో సృష్టి కార్యాల్లో ఆయన అపారమైన జ్ఞానాన్ని చూశారు. యెహోవా భూసంబంధమైన వాటిని సృష్టించినప్పుడు వాళ్లు, ‘ఆనందంతో జయధ్వనులు చేశారు.’ (యోబు 38:4-7) ఏదెను తోటలో జరుగుతున్న ఒక్కో సంఘటనను వాళ్లు తప్పకుండా ఎంతో ఆసక్తితో చూసివుంటారు. కాబట్టి, జ్ఞానవంతుడైన దేవుడు ఎంతో అద్భుతమైన విశ్వాన్ని, ఆశ్చర్యం గొలిపే భూసంబంధమైన సృష్టిని చేసిన తర్వాత, దూతలు చూస్తుండగా రెండు వింత ప్రాణులను అదీ వాళ్లు తప్పు చేస్తారని తెలిసి కూడా సృష్టించడం సమంజసంగా ఉంటుందా? కుప్పకూలుతుందని తెలిసీ అలాంటి ప్రణాళిక వేయడం తెలివైన పని కాదని వేరే చెప్పనక్కర్లేదు.

అయితే కొందరు, ‘కానీ అంత జ్ఞానవంతుడైన దేవునికి అలా జరుగుతుందని తెలియకుండా ఎలా ఉంటుంది?’ అనొచ్చు. యెహోవాకున్న అపారమైన జ్ఞానంలో ‘ఆది నుండి అంతాన్ని’ తెలుసుకునే సామర్థ్యం ఒక భాగమన్నది నిజమే. (యెషయా 46:9, 10, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) అయితే, ఆయన తనకున్న అపారమైన శక్తినంతటిని ఎల్లవేళలా ఉపయోగించాల్సిన అవసరం లేనట్లే, ఆయన ఈ సామర్థ్యాన్ని ఎల్లవేళలా ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా లేదు. జరగబోయేదాన్ని ముందే తెలుసుకోగల ఈ సామర్థ్యాన్ని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలనేది ఆయన జ్ఞానవంతంగా నిర్ణయించుకుంటాడు. అంటే ఈ సామర్థ్యాన్ని ఎప్పుడు ఉపయోగించుకుంటే మంచిదో అప్పుడే, ఏ పరిస్థితుల్లో అవసరమో ఆ పరిస్థితుల్లోనే ఉపయోగించుకుంటాడు.

జరగబోయేదాన్ని ముందే తెలుసుకోగల సామర్థ్యాన్ని ఉపయోగించుకోకుండా ఎలా ఉండవచ్చో, ఆధునిక సాంకేతికతకు సంబంధించిన ఒక అంశాన్ని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. రికార్డు చేసి పెట్టిన ఒక మ్యాచ్‌ చూస్తున్న వ్యక్తి, ఎవరు నెగ్గారో ఎవరు ఓడిపోయారో తెలుసుకోవడం కోసం ముగింపును ముందే చూడాలనుకుంటే చూడొచ్చు. కానీ ఆయన అలానే చూడాల్సిన అవసరం లేదు. ఆయన మ్యాచ్‌ను మొదటి నుండి చివరి వరకు చూడాలనుకుంటే అందులో తప్పేమైనా ఉందా? అలాగే, పరిస్థితులు ఎలా మారతాయో ముందే తెలుసుకోవాలని సృష్టికర్త అనుకోలేదు. కానీ ఆయన వేచి ఉండి, ఒక్కో సంఘటన జరుగుతుండగా తన పిల్లలైన మానవులు ఎలా ప్రవర్తిస్తారో చూడాలని నిర్ణయించుకున్నాడు.

పైన చూసినట్లుగా, జ్ఞానవంతుడైన యెహోవా మొదటి మానవులను రోబోలలా సృష్టించలేదు. కానీ, సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ప్రేమతో ఆయన వాళ్లకు ఇచ్చాడు. సరైనది చేయాలని నిర్ణయించుకోవడం ద్వారా వాళ్లు తమ ప్రేమను, కృతజ్ఞతను, విధేయతను చూపించగలుగుతారు. అలా చేయడం ద్వారా వాళ్లు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు, అంతేకాదు తమ పరలోక తండ్రి అయిన యెహోవాకు ఎంతో సంతోషాన్ని తీసుకురాగలుగుతారు.—సామెతలు 27:11; యెషయా 48:18.

జరగబోయేదాన్ని ముందే తెలుసుకోగల తన సామర్థ్యాన్ని దేవుడు ఎన్నో సందర్భాల్లో ఉపయోగించుకోలేదని బైబిలు చెబుతోంది. ఉదాహరణకు, నమ్మకస్థుడైన అబ్రాహాము తన కుమారుణ్ణి బలి అర్పించబోతున్నప్పుడు, ‘దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే నీ ఒకే ఒక కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు’ అని యెహోవా ఆయనతో అనగలిగాడు. (ఆదికాండము 22:12, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) మరోవైపు, కొందరి చెడు ప్రవర్తన దేవుడు ‘దుఃఖపడేలా’ చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. వాళ్లు ఏమి చేస్తారో ఆయనకు ముందే తెలిసివుంటే ఆయన అలా దుఃఖపడి ఉండేవాడా?—కీర్తన 78:40, 41; 1 రాజులు 11:9, 10.

కాబట్టి, మన మొదటి తల్లిదండ్రులు తప్పు చేస్తారన్న విషయాన్ని ముందే తెలుసుకోవడానికి గొప్ప జ్ఞానవంతుడైన దేవుడు ఈ సామర్థ్యాన్ని ఉపయోగించలేదని చెప్పడం సబబుగా ఉంటుంది. అయితే ఆయన ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ముందుగానే అంతా తెలుసుకుని, ఆ వెర్రి సంఘటనలన్నిటిని మళ్లీ జరిగించడానికి ప్రయత్నించేంత తెలివితక్కువ వాడు కాదు.

‘దేవుడు ప్రేమగలవాడు’

దేవుని శత్రువైన సాతాను, ఏదెను తోటలో తిరుగుబాటు మొదలుపెట్టడంతో పాప మరణాలతోసహా చెడు పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందుకే సాతాను ‘నరహంతకుడు.’ అంతేకాదు, తను ‘అబద్ధికుడినని, అబద్ధానికి జనకుడినని’ చూపించుకున్నాడు. (యోహాను 8:44) తనలోనే చెడ్డ ఉద్దేశాలు ఉంచుకుని, మన ప్రేమగల సృష్టికర్తకు చెడు ఉద్దేశాలను ఆపాదించడానికి ప్రయత్నిస్తాడు. మానవులు చేసిన పాపానికి యెహోవాను నిందించాలని చూస్తాడు.

ఆదాము, హవ్వ పాపం చేస్తారని యెహోవా ముందే తెలుసుకోకూడదని నిర్ణయించుకోడానికి బలమైన కారణం ప్రేమే. అదే దేవుని ప్రధాన లక్షణం. “దేవుడు ప్రేమాస్వరూపి” అని 1 యోహాను 4:8 చెబుతోంది. ప్రేమ ఉన్నవాళ్లు ఇతరులకు మేలు చేస్తారే కానీ కీడు చేయరు. వాళ్లు ఇతరుల్లోవున్న మంచిని చూస్తారు. అవును, యెహోవా దేవునికి ప్రేమ ఉన్నందుకే ఆయన మొదటి మానవ దంపతులకు శ్రేష్ఠమైనది చేయాలనుకున్నాడు.

భూమ్మీదున్న తన పిల్లలకు తెలివితక్కువ నిర్ణయం తీసుకునే అవకాశమున్నా పరిపూర్ణులైన వాళ్ల విషయంలో ప్రతికూలంగా ఆలోచించాలనిగానీ వాళ్లను అనుమానించాలనిగానీ మన ప్రేమగల దేవుడు అనుకోలేదు. జీవితంలో వాళ్లకు కావాల్సినవన్నీ సమృద్ధిగా సమకూర్చాడు, వాళ్లు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ వాళ్లకు తెలియజేశాడు. కాబట్టి వాళ్లు తిరుగుబాటు చేస్తారని కాదుగానీ ప్రేమతో తనకు విధేయత చూపిస్తారని దేవుడు కోరుకోవడం సముచితమే. వాళ్లలో నమ్మకంగా ఉండే సామర్థ్యం ఉందని ఆయనకు తెలుసు. అబ్రాహాము, యోబు, దానియేలు, ఇంకా అలాంటి చాలామంది ఇతరులు అపరిపూర్ణులుగా ఉండి కూడా ఆ తర్వాతి కాలంలో ఆయనకు నమ్మకంగా జీవించారు.

‘దేవునికి సమస్తం సాధ్యం’ అని యేసు చెప్పాడు. (మత్తయి 19:26) ఆ విషయం ఎంతో ఓదార్పునిస్తుంది. యెహోవాకు ప్రేమతోపాటు ఇతర ప్రధాన లక్షణాలైన న్యాయం, జ్ఞానం, శక్తి ఉన్నాయి కాబట్టి, పాపమరణాల వల్ల వచ్చిన బాధలన్నిటినీ తగిన కాలంలో తప్పక తీసేయగలడు, తీసేస్తాడు కూడా.—ప్రకటన 21:3-5.

మొదటి దంపతులు పాపం చేస్తారని యెహోవాకు ముందే తెలియదన్న విషయం స్పష్టమౌతోంది. మానవులు అవిధేయత చూపించినందుకు, దానివల్ల ఎన్నో కష్టాలు వచ్చినందుకు దేవుడు దుఃఖపడినప్పటికీ భూమి విషయంలో, దాని మీదున్న మానవుల విషయంలో తాను చేయాలనుకున్నదాన్ని ఈ తాత్కాలిక పరిస్థితి ఆపలేదని ఆయనకు తెలుసు. ఆయన చేయాలనుకున్న దాని గురించి, ఆయన తను అనుకున్నదాన్ని అద్భుతంగా పూర్తి చేసినప్పుడు మనం పొందే ప్రయోజనాల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటే మంచిది. a (w11-E 01/01)

[అధస్సూచి]

a భూమికి సంబంధించి దేవుడు చేయాలనుకున్న దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 3వ అధ్యాయం చూడండి.

[12వ పేజీలోని బ్లర్బ్‌]

యెహోవా మొదటి మానవులను రోబోల్లా సృష్టించలేదు

[13వ పేజీలోని బ్లర్బ్‌]

ఆదాముకు, హవ్వకు నమ్మకంగా ఉండే సామర్థ్యం ఉందని దేవునికి తెలుసు