రాజులు మొదటి గ్రంథం 11:1-43
11 అయితే, సొలొమోను రాజు ఫరో కూతుర్నే కాక+ చాలామంది విదేశీ స్త్రీలను ఇష్టపడ్డాడు.+ వాళ్లలో మోయాబీయులు,+ అమ్మోనీయులు,+ ఎదోమీయులు, సీదోనీయులు,+ హిత్తీయులు+ ఉన్నారు.
2 యెహోవా ఆ దేశాలవాళ్ల గురించే, “మీరు వాళ్లతో కలవకూడదు;* ఎందుకంటే, మీరు వాళ్ల దేవుళ్లను అనుసరించేలా వాళ్లు మీ హృదయాల్ని ఖచ్చితంగా తిప్పేస్తారు”+ అని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. అయినా సొలొమోను వాళ్లతో చాలా సన్నిహితంగా ఉన్నాడు, వాళ్లను ఇష్టపడ్డాడు.
3 అతనికి రాకుమార్తెలైన 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అతని భార్యలు మెల్లమెల్లగా అతని హృదయాన్ని తిప్పేశారు.*
4 సొలొమోను ముసలివాడైనప్పుడు+ వేరే దేవుళ్లను అనుసరించేలా అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు,+ దాంతో అతని హృదయం తన తండ్రైన దావీదు హృదయంలా తన దేవుడైన యెహోవా పట్ల సంపూర్ణంగా* లేదు.
5 సొలొమోను సీదోనీయుల దేవత అష్తారోతును,+ అమ్మోనీయుల అసహ్యమైన దేవుడు మిల్కోమును+ పూజించాడు.
6 సొలొమోను యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అతను తన తండ్రి దావీదులా+ యెహోవాను సంపూర్ణంగా* అనుసరించలేదు.
7 ఆ సమయంలోనే అతను యెరూషలేముకు ఎదురుగా ఉన్న కొండమీద మోయాబుకు చెందిన అసహ్యమైన దేవుడైన కెమోషుకు ఒక ఉన్నత స్థలాన్ని,+ అమ్మోనీయుల అసహ్యమైన దేవుడైన మోలెకుకు+ మరో ఉన్నత స్థలాన్ని కట్టించాడు.+
8 తమ దేవుళ్లకు బలులు అర్పిస్తూ వాటి పొగను పైకిలేచేలా చేసే తన విదేశీ భార్యలందరి కోసం అతను అలా చేశాడు.
9 సొలొమోను హృదయం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నుండి పక్కకు మళ్లింది+ కాబట్టి, యెహోవాకు అతనిమీద చాలా కోపం వచ్చింది; ఆయన అంతకుముందు సొలొమోనుకు రెండుసార్లు ప్రత్యక్షమై,+
10 ఈ విషయం గురించే, అంటే ఇతర దేవుళ్లను అనుసరించకూడదనే+ దాని గురించే హెచ్చరించాడు. కానీ యెహోవా ఆజ్ఞాపించినవాటికి సొలొమోను లోబడలేదు.
11 కాబట్టి యెహోవా సొలొమోనుకు ఇలా చెప్పాడు: “నువ్వు ఇలా చేసి, నీకు నేను ఆజ్ఞాపించినట్టు నా ఒప్పందానికి, నా శాసనాలకు కట్టుబడివుండలేదు కాబట్టి, నేను ఖచ్చితంగా నీ దగ్గర నుండి రాజ్యాన్ని తీసేసి, నీ సేవకుల్లో ఒకరికి ఇస్తాను.+
12 అయితే, నీ తండ్రి దావీదుకు నేను ఇచ్చిన మాటను బట్టి నీ జీవితకాలంలో అలా చేయను. అయితే, నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసేస్తాను,+
13 కానీ మొత్తం రాజ్యాన్ని తీసేయను.+ నా సేవకుడైన దావీదును బట్టి, నేను ఎంచుకున్న యెరూషలేమును బట్టి+ ఒక గోత్రాన్ని నీ కుమారునికి ఇస్తాను.”+
14 తర్వాత యెహోవా సొలొమోనుకు వ్యతిరేకంగా ఎదోము రాజ కుటుంబానికి చెందిన ఎదోమీయుడైన హదదు+ అనే ఒక శత్రువును రేపాడు.+
15 గతంలో దావీదు ఎదోమును ఓడించినప్పుడు,+ చంపబడినవాళ్లను పాతిపెట్టడానికి సైన్యాధిపతైన యోవాబు వెళ్లాడు, అతను ఎదోములో ప్రతీ మగవాణ్ణి చంపాలని చూశాడు.
16 (ఎదోములోని ప్రతీ మగవాణ్ణి చంపేంతవరకు యోవాబు, ఇశ్రాయేలు సైన్యమంతా అక్కడే ఆరు నెలలు ఉన్నారు.)
17 కానీ హదదు ఎదోమీయులైన తన తండ్రి సేవకుల్లో కొందరితో కలిసి ఐగుప్తుకు పారిపోయాడు; అప్పుడు హదదు చిన్న పిల్లవాడు.
18 వాళ్లు మిద్యాను నుండి బయల్దేరి పారానుకు వచ్చారు. వాళ్లు పారాను+ నుండి మనుషుల్ని వెంటబెట్టుకొని ఐగుప్తుకు, ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి వచ్చారు. ఫరో అతనికి ఒక ఇల్లు, ఆహారం ఏర్పాటు చేశాడు, భూమిని ఇచ్చాడు.
19 హదదు ఫరో దృష్టిలో దయ పొందాడు కాబట్టి ఫరో అతనికి తన భార్య చెల్లెల్ని అంటే తహ్పెనేసు రాణి చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాడు.
20 కొంతకాలానికి, తహ్పెనేసు చెల్లెలు అతనికి గెనుబతు అనే ఒక కుమారుణ్ణి కన్నది. తహ్పెనేసు ఆ బాబును ఫరో ఇంట్లో పెంచింది.* గెనుబతు ఫరో కుమారులతో పాటు ఫరో ఇంట్లో ఉండిపోయాడు.
21 దావీదు చనిపోయాడని,*+ సైన్యాధిపతి యోవాబు కూడా చనిపోయాడని+ ఐగుప్తులో ఉన్న హదదు విన్నాడు. అప్పుడు అతను ఫరోతో, “నేను నా దేశానికి వెళ్తాను, నన్ను పంపించు” అన్నాడు.
22 కానీ ఫరో అతనితో, “నా దగ్గర నీకు ఏమి తక్కువైందని నువ్వు ఇప్పుడు నీ దేశానికి వెళ్లాలనుకుంటున్నావు?” అన్నాడు. దానికి అతను, “ఏమీ తక్కువ కాలేదు, అయినా దయచేసి నన్ను పంపించు” అన్నాడు.
23 దేవుడు సొలొమోనుకు వ్యతిరేకంగా ఇంకో శత్రువును రేపాడు.+ అతను ఎల్యాదా కుమారుడైన రెజోను. అతను తన యజమాని అయిన సోబా రాజు హదదెజరు+ దగ్గర నుండి పారిపోయాడు.
24 దావీదు సోబా మనుషుల్ని ఓడించినప్పుడు*+ రెజోను కొందరు మనుషుల్ని పోగుచేసుకొని దోపిడీ ముఠాకు అధిపతి అయ్యాడు. వాళ్లు దమస్కుకు+ వెళ్లి అక్కడ స్థిరపడి దమస్కులో పరిపాలించడం మొదలుపెట్టారు.
25 అతను సొలొమోను రోజులన్నిట్లో ఇశ్రాయేలుకు శత్రువుగా ఉన్నాడు. అతను హదదులాగే ఇశ్రాయేలీయులకు హాని చేశాడు. అతను సిరియాను పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల్ని ఎంతో ద్వేషించాడు.
26 నెబాతు కుమారుడైన యరొబాము+ అనే ఒకతను ఉన్నాడు. అతను జెరేదాకు చెందిన ఒక ఎఫ్రాయిమీయుడు; అతను సొలొమోను సేవకుల్లో ఒకడు,+ అతని తల్లి పేరు జెరూహా. ఆమె విధవరాలు. అతను కూడా రాజు మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు.
27 అతను రాజు మీద ఎందుకు తిరుగుబాటు చేశాడంటే: సొలొమోను మిల్లో* కట్టి+ తన తండ్రి దావీదు నగరాన్ని+ పటిష్ఠం చేశాడు.
28 యరొబాము సమర్థుడైన యువకుడు. అతను కష్టపడి పనిచేసేవాడని సొలొమోను చూసినప్పుడు, అతన్ని యోసేపు గోత్రానికి చెందిన వెట్టి పనివాళ్లందరి మీద పర్యవేక్షకునిగా+ నియమించాడు.
29 ఒకసారి యరొబాము యెరూషలేము నుండి వెళ్తున్నప్పుడు షిలోనీయుడైన అహీయా+ అనే ప్రవక్త అతన్ని దారిలో కలిశాడు. అప్పుడు అహీయా కొత్త వస్త్రాన్ని వేసుకొని ఉన్నాడు. పొలంలో వాళ్లిద్దరే ఉన్నారు.
30 అహీయా తాను వేసుకున్న కొత్త వస్త్రాన్ని 12 ముక్కలుగా చింపాడు.
31 తర్వాత అతను యరొబాముతో ఇలా అన్నాడు:
“నువ్వు పది ముక్కల్ని తీసుకో. ఎందుకంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో నేను సొలొమోను చేతిలో నుండి రాజ్యాన్ని లాగేసి నీకు పది గోత్రాలు ఇస్తాను.+
32 కానీ నా సేవకుడైన దావీదు కోసం,+ ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో నుండి నేను ఎంచుకున్న నగరమైన యెరూషలేము కోసం+ ఒక గోత్రం అతని దగ్గరే ఉంటుంది.+
33 ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టి సీదోనీయుల దేవత అష్తారోతుకు, మోయాబువాళ్ల దేవుడు కెమోషుకు, అమ్మోనీయుల దేవుడు మిల్కోముకు సాష్టాంగపడుతున్నారు కాబట్టి నేను అలా చేస్తాను.+ సొలొమోను తండ్రైన దావీదు చేసినట్టు వాళ్లు నా దృష్టిలో సరైనది చేయలేదు, నా శాసనాల్ని, తీర్పుల్ని పాటించలేదు, నా మార్గాల్లో నడవలేదు.
34 కానీ నేను అతని చేతిలో నుండి మొత్తం రాజ్యాన్ని తీసేయను. నేను ఎంచుకున్న నా సేవకుడైన దావీదు కోసం అతన్ని తన జీవిత కాలమంతా ప్రధానుడిగా ఉంచుతాను.+ ఎందుకంటే దావీదు నా ఆజ్ఞలకు, శాసనాలకు లోబడ్డాడు.
35 అయితే నేను అతని కుమారుని చేతిలో నుండి రాజరికాన్ని తీసేసి, నీకు పది గోత్రాల్ని ఇస్తాను.+
36 అతని కుమారునికి ఒక గోత్రాన్ని ఇస్తాను. ఆ విధంగా నా పేరు ఉంచడానికి నేను ఎంచుకున్న యెరూషలేము నగరంలో, నా సేవకుడైన దావీదుకు నా ఎదుట ఒక దీపం ఎప్పుడూ ఉంటుంది.+
37 నేను నిన్ను ఎంచుకుంటాను. నువ్వు కోరుకున్నవాటన్నిటి మీద నువ్వు పరిపాలిస్తావు, నువ్వు ఇశ్రాయేలు మీద రాజవుతావు.
38 నేను నీకు ఆజ్ఞాపించేవాటన్నిటికీ లోబడుతూ, నా సేవకుడైన దావీదులా+ నా శాసనాలకు, ఆజ్ఞలకు లోబడుతూ నా మార్గాల్లో నడిస్తే, నా దృష్టికి సరైనది చేస్తే, నేను నీకు తోడుగా ఉంటాను. నేను దావీదుకు కట్టినట్టు, నీకు ఒక శాశ్వత రాజవంశాన్ని కడతాను,+ నీకు ఇశ్రాయేలును ఇస్తాను.
39 నేను ఈ కారణంగా దావీదు వంశస్థుల్ని అవమానపరుస్తాను,+ కానీ ఎప్పటికీ అలా చేస్తూ ఉండను.’ ”+
40 కాబట్టి సొలొమోను యరొబామును చంపడానికి ప్రయత్నించాడు. కానీ యరొబాము ఐగుప్తుకు పారిపోయి, ఐగుప్తు రాజైన షీషకు+ దగ్గరికి వెళ్లాడు;+ సొలొమోను చనిపోయేవరకు అతను అక్కడే ఉన్నాడు.
41 సొలొమోను మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులన్నిటి గురించి, అతని తెలివి గురించి సొలొమోను చరిత్ర గ్రంథంలో రాయబడివుంది.+
42 సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలు అంతటి మీద పరిపాలించిన కాలం 40 సంవత్సరాలు.
43 తర్వాత సొలొమోను చనిపోయాడు,* అతన్ని తన తండ్రైన దావీదు నగరంలో పాతిపెట్టారు; అతని స్థానంలో అతని కుమారుడు రెహబాము+ రాజయ్యాడు.
అధస్సూచీలు
^ లేదా “పెళ్లి సంబంధాలు కుదుర్చుకోకూడదు.”
^ లేదా “అతని భార్యల ప్రభావం అతని మీద బలంగా ఉంది.”
^ లేదా “పూర్తిగా అంకితమై.”
^ అక్ష., “పూర్తిగా.”
^ లేదా “పాలు మాన్పించింది” అయ్యుంటుంది.
^ అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడని.”
^ అక్ష., “చంపినప్పుడు.”
^ ఈ హీబ్రూ పదం, కోటలాంటి నిర్మాణాన్ని సూచిస్తుండవచ్చు. అక్ష., “మట్టిదిబ్బ.”
^ అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”