కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి

యేసుక్రీస్తు ఎవరు?

యేసుక్రీస్తు ఎవరు?

ఈ ఆర్టికల్‌సాధారణంగా మీకు వచ్చే సందేహాలను ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి జవాబులు మీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కూడా ఈ ఆర్టికల్‌ తెలియజేస్తుంది. ఆ జవాబులను మీతో చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.

యేసుక్రీస్తు ఎవరు?

యేసు ఇతర మానవుల్లా కాకుండా, ఈ భూమ్మీద పుట్టకముందు ఆత్మ ప్రాణిగా పరలోకంలో జీవించాడు. (యోహాను 8:23) దేవుడు మొట్టమొదట యేసును సృష్టించాడు, వేరే వాటన్నిటినీ సృష్టించడంలో యేసు సహాయం చేశాడు. ఆయనను మాత్రమే యెహోవా స్వయంగా సృష్టించాడు కాబట్టి ఆయన దేవుని “అద్వితీయ” కుమారుడు అని పిలువబడ్డాడు. ఆయన దేవుని ప్రతినిధిగా పని చేసినందుకు “వాక్యం” అని కూడా పిలువబడ్డాడు.—యోహాను 1:1-3, 14; సామెతలు 8:22, 23, 30; కొలొస్సయులు 1:15, 16 చదవండి.

యేసు భూమ్మీదకు ఎందుకు వచ్చాడు?

దేవుడు పరలోకంలో ఉన్న తన కుమారుని జీవాన్ని యూదురాలైన మరియ అనే కన్య గర్భంలోకి మార్చడం ద్వారా ఆయనను భూమ్మీదకు పంపాడు. అందుకే యేసుకు మానవ తండ్రి లేడు. (లూకా 1:30-35) (1) దేవుని గురించి సత్యం తెలియజేయడానికి, (2) దేవుని చిత్తం చేయడంలో మనకు ఆదర్శంగా ఉండడానికి, (3) తన పరిపూర్ణ జీవితాన్ని “విమోచన క్రయధనముగా” అర్పించడానికి యేసు భూమ్మీదకు వచ్చాడు.—మత్తయి 20:28; యోహాను 18:37 చదవండి.

మనకు విమోచన క్రయధనం ఎందుకు అవసరం?

విమోచన క్రయధనం ఒక వ్యక్తిని దాస్యం నుండి విడిపించడానికి చెల్లించే మూల్యం. దేవుడు మానవులను సృష్టించినప్పుడు వాళ్లు వృద్ధులై, చనిపోవాలని ఆయన కోరుకోలేదు. అలాగని మనకెలా తెలుసు? బైబిలు పాపం అని చెప్తున్నదాన్ని చేస్తే చనిపోతావని దేవుడు మొదటి మానవుడైన ఆదాముతో చెప్పాడు. ఆదాము పాపం చేయకపోతే ఎప్పటికీ చనిపోయేవాడు కాదు. ఆ తర్వాత ఆయన కొన్ని శతాబ్దాల వరకు బ్రతికినా, దేవునికి అవిధేయుడైన రోజు నుండే చనిపోవడం మొదలుపెట్టాడు. (ఆదికాండము 2:16, 17; 5:5) పాపం, దానికి శిక్షగా పడిన మరణం తన తర్వాతి వాళ్లందరికీ వారసత్వంగా వచ్చేలా చేశాడు. ఆ విధంగా ఆదాము ద్వారా మరణం మానవ లోకంలోకి ‘ప్రవేశించింది.’ అందుకే మనకు విమోచన క్రయధనం అవసరమైంది.—రోమీయులు 5:12; 6:23 చదవండి.

  యేసు ఎందుకు చనిపోయాడు?

మనల్ని మరణం నుండి విడిపించడానికి ఎవరు విమోచన క్రయధనం చెల్లించగలరు? మనం చనిపోయినప్పుడు కేవలం మన పాపాలకే పరిహారాన్ని చెల్లిస్తాం. ఇతరుల పాపాల కోసం ఏ అపరిపూర్ణ మానవుడూ పరిహారాన్ని చెల్లించలేడు.—కీర్తన 49:7-9 చదవండి.

యేసుకు మానవ తండ్రి నుండి అపరిపూర్ణత వారసత్వంగా రాలేదు కాబట్టి ఆయన తన పాపాల వల్ల కాదు గానీ ఇతరుల పాపాల కోసం చనిపోయాడు. దేవుడు మానవుల మీద తనకున్న అసాధారణమైన ప్రేమను వ్యక్తం చేస్తూ తన కుమారుణ్ణి మన కోసం చనిపోవడానికి పంపించాడు. తన తండ్రి చెప్పిన మాట విని మన పాపాల కోసం తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా యేసు కూడా మన మీద ప్రేమ చూపించాడు.—యోహాను 3:16; రోమీయులు 5:18, 19 చదవండి.

యేసు ఇప్పుడు ఏమి చేస్తున్నాడు?

రోగులను బాగుచేయడం ద్వారా, చనిపోయిన వాళ్లను తిరిగి బ్రతికించడం ద్వారా, ప్రజలను పాప మరణాల నుండి కాపాడడానికి తన ప్రాణం పెట్టడం ద్వారా, యేసు విధేయులైన మానవులందరి కోసం భవిష్యత్తులో తానేమి చేస్తాడో చూపించాడు. (లూకా 18:35-42; యోహాను 5:28, 29) యేసు చనిపోయిన తర్వాత యెహోవా దేవుడు ఆయనను ఆత్మ ప్రాణిగా బ్రతికించాడు. (1 పేతురు 3:18) భూమంతటి మీద రాజుగా పరిపాలించడానికి యెహోవా దేవుడు తనకు అధికారం ఇచ్చేంతవరకు యేసు ఆయన కుడిపార్శ్వాన వేచివున్నాడు. (హెబ్రీయులు 10:12, 13) ఇప్పుడు యేసు పరలోకంలో రాజుగా పరిపాలిస్తున్నాడు, భూమ్మీదున్న ఆయన అనుచరులు ప్రపంచమంతటా సువార్త ప్రకటిస్తున్నారు.—దానియేలు 7:13, 14; మత్తయి 24:14 చదవండి.

త్వరలోనే యేసు రాజుగా తనకున్న అధికారాన్ని ఉపయోగించి బాధలన్నిటిని, వాటిని కలిగించేవాళ్లను లేకుండా చేస్తాడు. యేసు మీద విశ్వాసం ఉంచి, ఆయన చెప్పింది చేసే లక్షలాదిమంది అందమైన తోటగా మారిన ఈ భూమ్మీద ఆనందంగా జీవిస్తారు.—కీర్తన 37:9-11 చదవండి. (w11-E 03/01)

 

[29వ పేజీలోని చిత్రం]

యేసు మీద విశ్వాసం ఉంచి, ఆయన చెప్పింది చేసే లక్షలాదిమంది అందమైన తోటగా మారిన ఈ భూమ్మీద ఆనందంగా జీవిస్తారు