కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నాను

దేవుని మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నాను

“చివరి ఆదాము జీవాన్నిచ్చే పరలోక సంబంధమైన వ్యక్తి అయ్యాడు.”1 కొరిం. 15:45.

పాటలు: 151, 147

1-3. (ఎ) మన ప్రాథమిక నమ్మకాల్లో ఏది కూడా ఉంది? (బి) పునరుత్థానం ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది? (ప్రారంభ చిత్రం చూడండి.)

 మీ నమ్మకాలకు సంబంధించిన ముఖ్యమైన బోధలు ఏమిటని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమి చెప్తారు? యెహోవా సృష్టికర్తని, ఆయన మనకు జీవమిచ్చినట్లు నమ్ముతున్నారని ఖచ్చితంగా చెప్తారు. అంతేకాదు, తన ప్రాణాన్ని విమోచనా క్రయధనంగా అర్పించిన యేసుక్రీస్తును నమ్ముతున్నారని కూడా చెప్తారు. భవిష్యత్తులో దేవుని ప్రజలు శాశ్వతకాలం జీవించే భూపరదైసు గురించి కూడా మీరు ఖచ్చితంగా చెప్తారు. అయితే, మీరు పునరుత్థానాన్ని కూడా బలంగా నమ్ముతున్నారని చెప్తారా?

2 మనం మహాశ్రమను తప్పించుకుని కొత్తలోకంలోకి ప్రవేశించాలని ఎదురుచూస్తున్నప్పటికీ, పునరుత్థానాన్ని నమ్మడానికి సరైన కారణాలే ఉన్నాయి. పునరుత్థానం ఎందుకు చాలా ప్రాముఖ్యమైనదో అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఆయనిలా అన్నాడు, “ఒకవేళ మృతుల పునరుత్థానం లేకపోతే, క్రీస్తు బ్రతికించబడనట్టే లెక్క.” ఒకవేళ యేసు పునరుత్థానం అయ్యుండకపోతే, ఆయన పరలోకంలో రాజుగా పరిపాలిస్తూ ఉండేవాడు కాదు. దేవుని రాజ్యం గురించి మనం చేసే ప్రకటనా పని కూడా వృథా అవుతుంది. (1 కొరింథీయులు 15:12-19 చదవండి.) కానీ యేసు పునరుత్థానం అయ్యాడని మనకు తెలుసు. యూదుల కాలంనాటి సద్దూకయ్యులకూ, మనకూ ఉన్న తేడా అదే. వాళ్లు పునరుత్థానాన్ని నమ్మేవాళ్లు కాదు. ఇతరులు మనల్ని ఎగతాళి చేసినప్పటికీ, చనిపోయినవాళ్లను దేవుడు పునరుత్థానం చేస్తాడనే మన విశ్వాసం చెక్కుచెదరదు.—మార్కు 12:18; అపొ. 4:2, 3; 17:32; 23:6-8.

3 “క్రీస్తు గురించిన ప్రాథమిక” బోధల్లో, “మృతుల పునరుత్థానం” కూడా భాగమని పౌలు చెప్పాడు. (హెబ్రీ. 6:1, 2) పునరుత్థానం మీద తనకు నమ్మకం ఉందని పౌలు నొక్కి చెప్పాడు. (అపొ. 24:10, 15, 24, 25) మనం బైబిలు నుండి నేర్చుకునే ప్రాథమిక బోధల్లో పునరుత్థానం ఒకటైనప్పటికీ, దానిగురించి మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. (హెబ్రీ. 5:12) ఎందుకు?

4. పునరుత్థానం గురించి మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

4 ప్రజలు బైబిల్ని లోతుగా చదవడం మొదలు పెట్టినప్పుడు, గతంలో జరిగిన పునరుత్థానాల గురించి అంటే లాజరు పునరుత్థానం వంటి వాటి గురించి చదువుతారు. అంతేకాదు, చనిపోయినవాళ్లు భవిష్యత్తులో ఖచ్చితంగా పునరుత్థానం అవుతారని అబ్రాహాము, యోబు, దానియేలు నమ్మినట్లు తెలుసుకుంటారు. అయితే, వందల సంవత్సరాల క్రితం నాటి పునరుత్థాన ప్రవచనం ఖచ్చితంగా నిజమౌతుంది అనడానికి ఆధారాలు చూపించమని ఎవరైనా అడిగితే మీరేమి చేస్తారు? పునరుత్థానం ఎప్పుడు జరుగుతుందో బైబిల్లో ఉందా? వీటికి జవాబులు తెలుసుకుంటే మన విశ్వాసం మరింత బలపడుతుంది.

వందల సంవత్సరాల క్రితమే చెప్పబడిన ఒక పునరుత్థానం

5. ముందు మనం ఏ ప్రశ్నల గురించి చర్చిస్తాం?

5 చనిపోయిన వ్యక్తి వెంటనే పునరుత్థానం అవ్వడాన్ని ఊహించుకోవడం మనకు సులభమే. (యోహా. 11:11; అపొ. 20:9, 10) కానీ చనిపోయిన వ్యక్తి వందల సంవత్సరాల తర్వాత పునరుత్థానం అవుతాడని చెప్పిన మాటను మనం నమ్మవచ్చా? అలా మాట ఇచ్చినది చాలాకాలం క్రితం చనిపోయిన వ్యక్తి గురించైనా లేదా ఈ మధ్యే చనిపోయిన వ్యక్తి గురించైనా దాన్ని మనం నమ్మవచ్చా? నిజానికి వాగ్దానం చేసిన వందల సంవత్సరాల తర్వాత జరిగిన ఒక పునరుత్థానాన్ని మీరు ఇప్పటికే నమ్ముతున్నారు. ఇంతకీ ఆ పునరుత్థానం ఎవరిది? దానికీ, మీరు ఎదురుచూసే భవిష్యత్తు పునరుత్థానానికీ సంబంధం ఏమిటి?

6. 118వ కీర్తనకూ, యేసుకూ ఉన్న సంబంధం ఏమిటి?

6 వాగ్దానం చేసిన వందల సంవత్సరాల తర్వాత జరిగిన ఒక పునరుత్థానం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. 118వ కీర్తన రాసింది బహుశా దావీదు అయ్యుంటాడు. ఆ కీర్తనలో ఈ మాటలు ఉన్నాయి, “యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. . . . యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాదమొందును గాక.” ఇది మెస్సీయ గురించిన ప్రవచనం. అయితే యేసు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు, అంటే నీసాను 9న ఆయన గాడిద మీద యెరూషలేముకు వచ్చినప్పుడు ప్రజలు ఆ ప్రవచనాన్ని ఎత్తి చెప్పారు. (కీర్త. 118:25, 26; మత్త. 21:7-9) చాలా సంవత్సరాల తర్వాత జరగబోయే పునరుత్థానం గురించి 118వ కీర్తన ఎలా తెలియజేయగలిగింది? ఆ కీర్తనలో ఉన్న మరో మాటను కూడా గమనించండి, “ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.”—కీర్త. 118:22.

“ఇల్లు కట్టువారు” మెస్సీయను తిరస్కరించారు (7వ పేరా చూడండి)

7. యూదులు యేసును ఎలా తిరస్కరించారు?

7 మెస్సీయను తిరస్కరించిన “ఇల్లు కట్టువారు” ఎవరంటే యూదా మతనాయకులు. వాళ్లు యేసును పట్టించుకోకపోవడం లేదా క్రీస్తుగా ఆయన్ను నిరాకరించడం కన్నా ఎక్కువే చేశారు. యేసును చంపమని పిలాతుపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా చాలామంది యూదులు ఆయన్ను తిరస్కారించారు. (లూకా 23:18-23) అవును, యేసు మరణానికి వాళ్లు కూడా బాధ్యులే.

“మూలకు తలరాయి” అయ్యేలా దేవుడు యేసును పునరుత్థానం చేశాడు (8, 9 పేరాలు చూడండి)

8. యేసు “మూలకు తలరాయి” ఎలా అయ్యాడు?

8 యేసును తిరస్కరించి, చంపేస్తే ఆయన “మూలకు తలరాయి” ఎలా అవుతాడు? ఆయన పునరుత్థానమౌతేనే అది సాధ్యమౌతుంది. దాన్ని అర్థంచేసుకోవడానికి తోట యజమాని గురించిన ఉదాహరణను యేసు చెప్పాడు. ఆ యజమాని తన తోటలో పనిచేస్తున్న రైతుల దగ్గరకు తన దాసులను పంపిస్తాడు. కానీ ఆ రైతులు వాళ్లను కొట్టి, అవమానిస్తారు. కొంతకాలం తర్వాత, ఆ యజమాని తన సొంత కొడుకును పంపిస్తాడు. కనీసం అతని మాటైనా వింటారని యజమాని అనుకుంటాడు. కానీ వాళ్లు అతన్ని చంపేస్తారు. ఈ ఉదాహరణ చెప్పిన తర్వాత కీర్తన 118:22⁠లో ఉన్న ప్రవచనాన్ని యేసు ఎత్తి చెప్పాడు. (లూకా 20:9-17) అపొస్తలుడైన పేతురు కూడా అదే వచనాన్ని ఉపయోగించి, యెరూషలేములో సమావేశమైన ‘యూదుల పాలకులు, పెద్దలు, శాస్త్రులుతో’ మాట్లాడాడు. ఆయనిలా అన్నాడు, “ఆ యేసుక్రీస్తునే మీరు కొయ్యమీద శిక్ష వేసి చంపారు, కానీ దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు. ‘కట్టేవాళ్లయిన మీరు వద్దనుకున్న రాయి, ముఖ్యమైన మూలరాయి అయింది,’ ఆ రాయి యేసే.”—అపొ. 3:15; 4:5-11; 1 పేతు. 2:5-7.

9. ఏ ప్రాముఖ్యమైన సంఘటన గురించి కీర్తన 118:22⁠లో ముందుగానే చెప్పబడింది?

9 నిజమే, వందల సంవత్సరాల తర్వాత జరగబోయే పునరుత్థానం గురించి కీర్తన 118:22⁠లో ముందుగానే చెప్పబడింది. మెస్సీయ తిరస్కరించబడి, చంపబడతాడు. కానీ ఆయన పునరుత్థానం అయ్యి “మూలకు తలరాయి” అవుతాడు. పునరుత్థానమైన తర్వాత, “మనల్ని రక్షించడానికి ప్రజల్లో నుండి దేవుడు ఎంచుకున్న” ఏకైక పేరు యేసుదే అయ్యింది.—అపొ. 4:12; ఎఫె. 1:20.

10. (ఎ) కీర్తన 16:10 ఎలా నెరవేరింది? (బి) ఆ కీర్తన దావీదు గురించి చెప్పట్లేదని మనమెలా ఖచ్చితంగా నమ్మవచ్చు?

10 ఇంకొకరి పునరుత్థానం గురించి ప్రవచించిన మరో లేఖనాన్ని పరిశీలిద్దాం. ఆ ప్రవచనం 1000 కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిచాక నెరవేరింది. ఆ వాస్తవం, పునరుత్థానం గురించి వాగ్దానం చేసి చాలాకాలం గడిచినప్పటికీ అది తప్పకుండా నిజమౌతుందనే నమ్మకాన్ని మనలో కలిగించాలి. 16వ కీర్తనలో దావీదు ఇలా రాశాడు, “ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.” (కీర్త. 16:10) తాను ఎప్పటికీ చనిపోనని, సమాధిలో ఉండనని దావీదు చెప్పట్లేదు. దావీదు వృద్ధుడై చనిపోయాడని, ఆయన “పితరులతో కూడ నిద్రపొంది, దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను” అని బైబిలు చాలా స్పష్టంగా చెప్తుంది. (1 రాజు. 2:1, 10) మరి ఈ లేఖనం ఎవరి గురించి చెప్తుంది?

11. కీర్తన 16:10 గురించి పేతురు ఎప్పుడు వివరించాడు?

11 దావీదు ఆ మాటల్ని రాసిన 1000 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత, కీర్తన 16:10 ఎవరి గురించి మాట్లాడుతోందో పేతురు వివరించాడు. యేసు చనిపోయి, పునరుత్థానమైన కొన్ని వారాల తర్వాత పేతురు వేలమంది యూదులతో, యూదా మత ప్రవిష్టులతో మాట్లాడాడు. (అపొస్తలుల కార్యాలు 2:29-32 చదవండి.) దావీదు చనిపోయాడని, ఆయన్ని పాతిపెట్టారని పేతురు వాళ్లకు గుర్తుచేశాడు. అంతేకాదు, మెస్సీయ “పునరుత్థానం గురించి దావీదుకు ముందే తెలుసు, అతను దాని గురించి మాట్లాడాడు” అని పేతురు చెప్పినప్పుడు దాన్ని ఎవ్వరూ తప్పుబట్టలేదని బైబిల్లో గమనించవచ్చు.

12. కీర్తన 16:10⁠లోని మాటలు ఎలా నెరవేరాయి? అది పునరుత్థాన వాగ్దానం గురించి ఏమి రూఢిచేస్తుంది?

12 మెస్సీయ పునరుత్థానం గురించి దావీదుకు తెలుసనే విషయాన్ని సమర్థించడానికి కీర్తన 110:1⁠లోని దావీదు మాటల్ని పేతురు ఎత్తి చెప్పాడు. (అపొస్తలుల కార్యాలు 2:33-36 చదవండి.) పేతురు లేఖనాల నుండి తర్కించిన విధానంబట్టి, యేసే ‘ప్రభువు, క్రీస్తు’ అని అక్కడికి వచ్చిన వేలమంది ఒప్పుకున్నారు. కీర్తన 16:10⁠లో ఉన్న మాటలు యేసు పునరుత్థానమైనప్పుడు నెరవేరాయని ప్రజలు గ్రహించారు. కొంతకాలం తర్వాత అపొస్తలుడైన పౌలు, పిసిదియాలోని అంతియొకయలో ఉన్న యూదులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ వచనంలోని మాటల్నే ప్రస్తావించాడు. ఆ విషయాలు వాళ్లకు చాలా నచ్చి, ఇంకా వినాలనుకున్నారు. (అపొస్తలుల కార్యాలు 13:32-37, 42 చదవండి.) వీటినిబట్టి, పునరుత్థాన ప్రవచనాలు నెరవేరడానికి వందల సంవత్సరాలు పట్టినప్పటికీ అవి నమ్మదగిన ప్రవచనాలని మనం తెలుసుకోవాలి.

పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది?

13. పునరుత్థానం గురించి ఏ ప్రశ్నలు మనకు రావచ్చు?

13 ప్రవచించి వందల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ పునరుత్థానం జరుగుతుందని తెలుసుకోవడం చాలా ప్రోత్సాహాన్నిస్తుంది. అయినప్పటికీ కొంతమంది ఇలా అనవచ్చు, ‘అంటే చనిపోయిన నా ప్రియమైనవాళ్లను మళ్లీ చూడాలంటే నేను చాలా సంవత్సరాలు ఓపికపట్టాలా? వాళ్లు ఎప్పుడు పునరుత్థానం అవుతారు?’ అయితే తమకు తెలియని, తెలుసుకోలేని విషయాలు కొన్ని ఉన్నాయని యేసు తన అపొస్తలులకు చెప్పాడు. అంతేకాదు, “సమయాలను, కాలాలను తండ్రి తన అధికారం కింద ఉంచుకున్నాడు. వాటిని మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు” అని కూడా ఆయన చెప్పాడు. (అపొ. 1:6, 7; యోహా. 16:12) ఏదేమైనా, పునరుత్థానం ఎప్పుడు జరుగుతుందో తెలియజేసే కొంత సమాచారం మన దగ్గర ఉంది.

14. ప్రాచీనకాలంలో జరిగిన పునరుత్థానాలకు, యేసు పునరుత్థానానికి ఉన్న తేడా ఏమిటి?

14 బైబిల్లో నమోదైన అతి ప్రాముఖ్యమైన పునరుత్థానం, యేసు పునరుత్థానమే. ఒకవేళ యేసు పునరుత్థానం అయ్యుండకపోతే, చనిపోయిన మన ప్రియమైనవాళ్లను మళ్లీ చూస్తామనే ఆశ మనలో ఎవ్వరికీ ఉండేది కాదు. యేసుకన్నా ముందు పునరుత్థానమైనవాళ్లు అంటే ఎవరినైతే ఏలీయా, ఎలీషా పునరుత్థానం చేశారో, వాళ్లు శాశ్వతకాలం జీవించలేదు. కొంతకాలం తర్వాత మళ్లీ చనిపోయారు, మట్టిలో కలిసిపోయారు. కానీ యేసు ‘మృతుల్లో నుండి బ్రతికింపబడ్డాడు, ఇక చనిపోడు, ఇక మరణానికి ఆయన మీద అధికారం లేదు.’ ఆయన పరలోకంలో “యుగయుగాలు జీవిస్తూనే” ఉంటాడు.—రోమా. 6:9; ప్రక. 1:5, 18; కొలొ. 1:18; 1 పేతు. 3:18.

15. యేసుకు “ప్రథమఫలం” అనే పేరు ఎందుకు వచ్చింది?

15 అదృశ్య ప్రాణిగా పరలోకానికి పునరుత్థానమైన మొట్టమొదటి వ్యక్తి యేసే. ఆ రకమైన పునరుత్థానం అత్యంత ప్రాముఖ్యమైన పునరుత్థానం. (అపొ. 26:23) అయితే, యేసు తర్వాత పరలోకానికి పునరుత్థానమైన ఇంకొంతమంది ఉన్నారు. నమ్మకమైన అపొస్తలులు పరలోకంలో తనతోపాటు పరిపాలిస్తారని యేసు మాటిచ్చాడు. (లూకా 22:28-30) కానీ వాళ్లు చనిపోయిన తర్వాతే ఆ బహుమతిని పొందుతారు. అప్పుడు వాళ్లు యేసులా అదృశ్య శరీరంతో పునరుత్థానం అవుతారు. పౌలు ఇలా రాశాడు, “చనిపోయినవాళ్లలో ప్రథమఫలంగా క్రీస్తు బ్రతికించబడ్డాడు.” వేరేవాళ్లు కూడా పునరుత్థానమై పరలోకానికి వెళ్తారని పౌలు అన్నాడు. ఆయనిలా అన్నాడు, “ప్రతీ ఒక్కరు తమతమ వరుసలో బ్రతికించబడతారు. ప్రథమఫలం క్రీస్తు; ఆ తర్వాత, ఆయన ప్రత్యక్షత సమయంలో ఆయనకు చెందినవాళ్లు బ్రతికించబడతారు.”—1 కొరిం. 15:20, 23.

16. పరలోక పునరుత్థానం ఎప్పుడు జరుగుతుందో మనకెలా తెలుసు?

16 పౌలు మాటల్నిబట్టి పరలోక పునరుత్థానం ఎప్పుడు జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. అది క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో జరుగుతుంది. క్రీస్తు “ప్రత్యక్షత” 1914⁠లో మొదలైందని, యెహోవా సాక్షులు ఎన్నో సంవత్సరాల క్రితమే బైబిలు నుండి రుజువు చేశారు. మనం ఇంకా ఆ ప్రత్యక్షత కాలంలోనే జీవిస్తున్నాం. ఈ దష్టవిధానం అంతమయ్యే సమయం చాలా దగ్గర్లో ఉంది.

17, 18. క్రీస్తు ప్రత్యక్షత కాలంలో కొంతమంది అభిషిక్తులకు ఏమి జరుగుతుంది?

17 పరలోక పునరుత్థానం గురించి బైబిలు ఇంకా ఇలా వివరిస్తుంది, “చనిపోయినవాళ్ల భవిష్యత్తు గురించి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.. . . యేసు చనిపోయి బ్రతికించబడ్డాడనే నమ్మకం మనకుంటే, యేసు శిష్యులుగా చనిపోయినవాళ్లను దేవుడు యేసుతోపాటు ఉండేందుకు బ్రతికిస్తాడని కూడా నమ్ముతాం. . . . మనలో ఎవరైతే ప్రభువు ప్రత్యక్షత కాలంలో ఇంకా బ్రతికివుంటారో వాళ్లు ఏ విధంగానూ ఇప్పటికే చనిపోయినవాళ్ల కన్నా ముందు బ్రతికించబడరు; ఎందుకంటే, ప్రభువు తానే స్వయంగా అధికారం ఉట్టిపడే స్వరంతో . . . పరలోకం నుండి దిగివస్తాడు. ముందు, క్రీస్తు శిష్యులుగా చనిపోయినవాళ్లు బ్రతికించబడతారు. ఆ తర్వాత, బ్రతికివున్న మనం వాళ్లతో కలిసి ఉండడానికి, ప్రభువును కలవడానికి గాలిలో మేఘాల మీద వెళ్తాం; అలా మనం ఎప్పుడూ ప్రభువుతోనే ఉంటాం.”—1 థెస్స. 4:13-17.

18 క్రీస్తు ప్రత్యక్షత మొదలైన కొంతకాలం తర్వాత పరలోక పునరుత్థానం ప్రారంభమైంది. మహాశ్రమ కాలంలో ఇంకా బ్రతికివుండే అభిషిక్త క్రైస్తవులు ‘గాలిలో మేఘాల మీద వెళ్తారు.’ దానర్థం వాళ్లు ‘మరణంలో నిద్రపోరు.’ అంటే చనిపోయిన స్థితిలో ఎక్కువసేపు ఉండరు. బదులుగా వాళ్లు ‘మార్పు చెందుతారు. ఒక్క క్షణంలో, రెప్పపాటున, చివరి బాకా ఊదబడుతుండగా అలా జరుగుతుంది.’—1 కొరిం. 15:51, 52; మత్త. 24:31.

19. “మెరుగైన పునరుత్థానం” అంటే ఏమిటి?

19 నేడు, నమ్మకమైన క్రైస్తవుల్లో చాలామంది అభిషిక్తులు కాదు. క్రీస్తుతోపాటు పరిపాలించడానికి దేవుడు వాళ్లను ఎంచుకోలేదు. బదులుగా , ఈ దుష్టలోకం నాశనమయ్యే “యెహోవా రోజు” కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ సమయం అతిదగ్గర్లో ఉందని మాత్రం రుజువులు తెలియజేస్తున్నాయి. (1 థెస్స. 5:1-3) దేవుడు తీసుకొచ్చే కొత్తలోకంలో వేరే రకమైన పునరుత్థానం ఉంటుంది. చనిపోయినవాళ్లు భూమ్మీద జీవించడానికి పునరుత్థానం అవుతారు. వాళ్లు పరిపూర్ణులై, ఇక ఎన్నడూ చనిపోరు. అది ‘మెరుగైన పునరుత్థానంగా’ ఉంటుంది ఎందుకంటే గతంలో పునరుత్థానమైన వాళ్లు కొంతకాలం తర్వాత మళ్లీ చనిపోయారు.—హెబ్రీ. 11:35.

20. పునరుత్థానం ఒక క్రమపద్ధతిలో జరుగుతుందని మనమెందుకు నమ్మవచ్చు?

20 పునరుత్థానమై పరలోకానికి వెళ్లే “ప్రతీ ఒక్కరు తమతమ వరుసలో బ్రతికించబడతారు” అని బైబిలు చెప్తోంది. (1 కొరిం. 15:23) కాబట్టి భూమ్మీద జరిగే పునరుత్థానం కూడా ఒక క్రమపద్ధతిలో జరుగుతుందని మనం నమ్మవచ్చు. అయితే మనకు ఈ ప్రశ్నలు రావచ్చు: ఈ మధ్యకాలంలో చనిపోయినవాళ్లు, క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన ఆరంభంలో పునరుత్థానమై తమ ప్రియమైనవాళ్లను కలుస్తారా? ప్రాచీనకాలంలో నమ్మకంగా జీవించి చనిపోయిన నైపుణ్యవంతులైన నాయకులు, కొత్తలోకంలో దేవుని ప్రజలను ఒక క్రమపద్ధతిలో నడిపించేందుకు మొదట పునరుత్థానమౌతారా? యెహోవాను ఎన్నడూ ఆరాధించని ప్రజల సంగతేంటి? వాళ్లు ఎప్పుడు, ఎక్కడ పునరుత్థానం అవుతారు? ఇంకా ఎన్నో ప్రశ్నలు మనకు రావచ్చు. కానీ ఆ విషయాల గురించి మనం ఇప్పుడే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మనం చేయగలిగిందల్లా వేచి చూడడమే. మనకు ఆశ్చర్యం కలిగే విధంగా యెహోవా విషయాలను చక్కదిద్దుతాడనే నమ్మకంతో ఉండవచ్చు.

21. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?

21 అప్పటివరకు, యెహోవా మీద మనకున్న విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాలి. చనిపోయినవాళ్లు తన జ్ఞాపకంలో ఉన్నారని, వాళ్లను పునరుత్థానం చేస్తానని యెహోవా యేసు ద్వారా మనకు మాటిచ్చాడు. (యోహా. 5:28, 29; 11:23) యెహోవా పునరుత్థానం చేస్తాడని నమ్మడానికి మరో రుజువు ఉంది. అదేంటంటే, ఒక సందర్భంలో యేసు మాట్లాడుతూ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు “వాళ్లంతా ఆయన దృష్టిలో బ్రతికే ఉన్నారు” అని అన్నాడు. (లూకా 20:37, 38) అవును, “దేవుడు పునరుత్థానం చేస్తాడని . . . నేనూ నమ్మకంతో ఎదురుచూస్తున్నాను” అని చెప్పిన అపొస్తలుడైన పౌలులాగే మనమూ చెప్పడానికి ఎన్నో మంచి కారణాలు ఉన్నాయి.—అపొ. 24:15.