కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం|అవినీతి లేని ప్రభుత్వం

దేవుని పరిపాలన—అవినీతి లేని పాలన

దేవుని పరిపాలన—అవినీతి లేని పాలన

‘పౌరులు అవినీతిగా ఉంటే ప్రభుత్వ అధికారులు కూడా అవినీతిగానే ఉంటారు. ఎంతకాదన్నా ప్రభుత్వ అధికారులు కూడా పౌరులే కాబట్టి అవినీతిని తీసివేయలేకపోతున్నారు’ అని నికరాగ్వా ముఖ్య ఆడిటర్‌ అన్నారు.

మానవ సమాజమే అవినీతిగా ఉంటే ఇక ఆ సమాజం నుండి వచ్చే ప్రభుత్వాలు కూడా అవినీతిగానే ఉంటాయని అనడంలో సందేహం ఏమైనా ఉందా? అలాంటప్పుడు అవినీతి లేని ప్రభుత్వం మానవ సమాజం నుండి కాకుండా మరో వైపు నుండి రావాలి. అలాంటి ఒక ప్రభుత్వం గురించి దేవుని వాక్యం చెబుతుంది. అదే దేవుని ప్రభుత్వం లేదా దేవుని రాజ్యం. ఆ రాజ్యం కోసం ప్రార్థన చేయమని యేసు తన శిష్యులకు చెప్పాడు.—మత్తయి 6:9, 10.

దేవుని రాజ్యం పరలోకం నుండి పరిపాలించే ఒక కొత్త ప్రభుత్వం. మానవ ప్రభుత్వాలన్నిటినీ తీసేసి ఆ స్థానంలో ఈ ప్రభుత్వం వస్తుంది. (కీర్తన 2:8, 9; ప్రకటన 16:14; 19:19-21) ఈ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. అవినీతి లేని పరిపాలనను అందిస్తుంది. ఇది నిజమని నమ్మడానికి ఈ ప్రభుత్వం గురించిన ఆరు అంశాలను చూడండి.

1. శక్తి

సమస్య: ప్రభుత్వాలు నడవడానికి కావాల్సిన డబ్బులు ప్రజలే పన్నుల ద్వారా ఇస్తారు. ఈ డబ్బంతా అధికారుల చేతుల్లోకి రావడంతో కొంతమంది వాటికి ఆశపడి దొంగిలిస్తారు, ఇంకొంతమంది లంచం తీసుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను కొందరికి తగ్గిస్తారు. ఇలా ప్రభుత్వానికి వచ్చే నష్టాన్ని పూరించడానికి ప్రభుత్వం పన్నులు పెంచుతుంది, ఫలితంగా మళ్లీ అవినీతి కూడా పెరిగిపోతుంది. ఇలా అవినీతికి ఒక అంతం లేకుండా పోయింది. చివరకు నష్టపోతున్నది నీతి, న్యాయంగా ఉంటున్న వాళ్లే.

పరిష్కారం: ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది అన్నిటిపైనా అధికారం ఉన్న యెహోవా. a (ప్రకటన 11:15) కాబట్టి, ఈ ప్రభుత్వం నడవడానికి ప్రజలు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. దేవునికున్న గొప్ప శక్తి, ఆయన దయ, మంచితనం వల్ల ఈ ప్రభుత్వం ప్రజలందరి అవసరాలను చక్కగా తీరుస్తుంది.—యెషయా 40:26; కీర్తన 145:16.

2. నాయకుడు

సమస్య: అవినీతిని పూర్తిగా తీసేయాలంటే మార్పును ముందుగా పై అధికారుల నుండి మొదలు పెట్టాలని ముందు పేర్కొన్న సూసన్‌ రోస్‌-ఆకర్‌మాన్‌ అన్నారు. కస్టమ్స్‌ ఆఫీసర్లు, పోలీసులు లాంటి అధికారుల్లో ఉన్న అవినీతిని తీసివేయడానికి ప్రయత్నిస్తున్నారు గానీ పెద్దపెద్ద అధికారుల్లో అవినీతిని చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకం పోతుంది. అంతేకాదు, ఎంతో నిజాయితీగా పనిచేసే నాయకుడు కూడా సామాన్యుడే, అతనిలో కూడా లోపాలుంటాయి. అతను కూడా కొన్నిసార్లు తప్పు చేసే అవకాశం ఉంది. “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు” అని దేవుని వాక్యం చెప్తుంది.—ప్రసంగి 7:20.

అతిపెద్ద లంచాన్ని యేసు వద్దన్నాడు

పరిష్కారం: తన ప్రభుత్వానికి నాయకునిగా దేవుడు యేసు క్రీస్తును ఎన్నుకున్నాడు. చెడు చేయాలనే బలహీనత యేసులో లేదు. భూమ్మీద ఉన్నప్పుడు యేసు ఈ విషయాన్ని నిరూపించాడు. తనకు ఒక్కసారి మొక్కితే చాలు ఈ “లోకరాజ్యములన్నిటిని, వాటి మహిమను” లంచంగా ఇస్తానని ఈ లోకాధికారి సాతాను చెప్పాడు. అంత పెద్ద లంచాన్ని కూడా యేసు వద్దన్నాడు. (మత్తయి 4:8-10; యోహాను 14:30) చనిపోయే ముందు యేసును ఎన్నోరకాలుగా హింసించారు. ఆ సమయంలో కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. నొప్పితో బాధపడుతున్న సమయంలో బాధ తెలీకుండా చేసే మత్తుమందును ఆయనకు ఇవ్వాలనుకున్నారు. అది బాధ తెలీకుండా చేసి శరీరం మీద అదుపు కోల్పోయేలా చేస్తుంది కాబట్టి ఆయన దాన్ని తీసుకోలేదు. (మత్తయి 27:34) పరలోకంలో జీవించడానికి దేవుడు యేసును మళ్లీ బ్రతికించాడు. పరిపాలకునిగా ఉండేందుకు కావలసిన పూర్తి అర్హతలు తనకున్నాయని నిరూపించుకున్నాడు.—ఫిలిప్పీయులు 2:8-11.

3. స్థిరత్వం

సమస్య: చాలా దేశాల్లో ఎన్నికలు జరుగుతాయి. అవినీతిపరులైన నాయకులను తీసివేయడానికే ఎన్నికలు పెడతారు. అయితే నిజానికి చిన్నాపెద్ద అన్ని దేశాల్లో ఎన్నికల్లో, ప్రచార కార్యక్రమాల్లో అవినీతి కనిపిస్తుంది. ఎన్నికలప్పుడు ధనవంతులు ప్రచారానికి, ఇతర పనులకు డబ్బు ఇచ్చి అధికారంలో ఉన్న వాళ్లతో, అధికారంలోకి రాబోయే వాళ్లతో తాము కోరుకున్నవి చేయించుకుంటారు.

దానివల్ల ప్రభుత్వం నిజాయితీగా, న్యాయంగా పని చేయడం లేదని ముద్ర పడిపోతుంది, ప్రజలకు ప్రభుత్వం మీదున్న నమ్మకం కూడా పోతుందని అమెరికా సుప్రీం కోర్టు జస్టిస్‌ జాన్‌ పాల్‌ స్టీవెన్స్‌ రాశారు. రాజకీయాల్లోనే ఎక్కువ అవినీతి ఉంది అని అందరూ అనుకోవడంలో ఆశ్చర్యం లేదు.

పరిష్కారం: దేవుని రాజ్యం స్థిరమైన, శాశ్వతమైన ప్రభుత్వం. కాబట్టి ఎన్నికలు, వాటి ప్రచారం అవసరం ఉండదు, వాటిలో జరిగే అవినీతి కూడా ఉండదు. (దానియేలు 7:13, 14) నాయకున్ని దేవుడే ఎన్నుకున్నాడు కాబట్టి ఎన్నికలు జరగడం, ప్రభుత్వం మారడం ఉండదు. ప్రభుత్వం ఎప్పటికీ మారకుండా ఉంటుంది కాబట్టి ప్రజల సంక్షేమం కోసం చేసే పనులు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి.

4. చట్టాలు

దేవుని రాజ్యం పరలోకం నుండి పరిపాలించే ఒక కొత్త ప్రభుత్వం

సమస్య: కొత్త చట్టాలు తెస్తే పరిస్థితి బాగుపడుతుందని మనకు అనిపిస్తుంది. కానీ చట్టాలు పెరిగితే, అవినీతి జరిగే అవకాశాలు కూడా పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు కొత్త చట్టాలను అమలు చేయడానికి ఖర్చు ఎక్కువౌతుందే తప్ప వాటివల్ల ఉపయోగం చాలా తక్కువ.

పరిష్కారం: మానవ ప్రభుత్వాలు చేసిన చట్టాల కన్నా దేవుని రాజ్యం చేసిన చట్టాలు చాలా గొప్పవి. ఇది చేయాలి, అది చేయకూడదు అని చేప్పే బదులు అన్నిటికీ ఉపయోగపడే ఒక మాటను యేసు చెప్పాడు. దాన్ని చాలామంది బంగారు సూత్రం అని కూడా పిలుస్తారు. ఆయనిలా చెప్పాడు: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) దేవుని రాజ్యం పెట్టే నియమాలు మనం చేసే పనులనే కాదు వాటి వెనక ఉన్న ఉద్దేశాలను కూడా సరిచేస్తాయి. “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” అని యేసు అన్నాడు. (మత్తయి 22:39) మనసులో ఏముందో చూడగలిగిన దేవునికి, మనుషులతో ఆ నియమాలను పాటించేలా చేయడం కష్టం కాదు.—1 సమూయేలు 16:7

5. ఉద్దేశాలు

సమస్య: అవినీతికి ముఖ్య కారణం అత్యాశ, స్వార్థం. ఈ లక్షణాలు ప్రభుత్వ అధికారుల్లోనే కాదు ప్రజల్లోనూ ఉన్నాయి. సియోల్‌లో సూపర్‌ మార్కెట్‌ కూలిపోయిన సంఘటనలో కాంట్రాక్టర్లు తక్కువ రకం వస్తువులతో, భద్రతా నియమాలు పాటించకుండా కడితే ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారు.

కాబట్టి అవినీతిని పూర్తిగా తీసేయాలంటే ప్రజల్లో పాతుకుపోయిన అత్యాశ, స్వార్థం లాంటి చెడు లక్షణాలను తీసేసుకోవడం ప్రజలకు నేర్పించాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలకు అలా నేర్పించాలనే కోరికా లేదు, చేసే శక్తీ లేదు.

పరిష్కారం: దేవుని ప్రభుత్వం అవినీతిని పూర్తిగా తీసివేయడానికి, ప్రజల హృదయాల్లో ఉన్న చెడు ఉద్దేశాలను తీసేసుకోవడం నేర్పిస్తుంది. b ఇలా నేర్పిస్తే వాళ్ల మనసులు మారి మంచిగా ఆలోచిస్తారు. (ఎఫెసీయులు 4:23) అత్యాశ, స్వార్థం బదులు సంతృప్తిగా ఉంటారు, ఇతరుల మీద నిజమైన శ్రద్ధ చూపిస్తారు.—ఫిలిప్పీయులు 2:4; 1 తిమోతి 6:6.

6. ప్రజలు

సమస్య: పరిస్థితులు బాగున్నా, మంచిచెడులు బాగా నేర్పించినా కొంతమంది అవినీతిగానే ఉంటారు. ఈ కారణం వల్లే మానవ ప్రభుత్వాలు అవినీతిని పూర్తిగా తీసివేయలేక పోతున్నాయని నిపుణులు అంటున్నారు. మహా అయితే అవినీతిని, దానివల్ల జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించగలుగుతారు.

పరిష్కారం: అవినీతితో పోరాడాలంటే “నిజాయితీగా, నమ్మకంగా, బాధ్యతతో ఉండడాన్ని” ప్రభుత్వాలు ప్రోత్సహించాలని యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ అగెన్‌స్ట్‌ కరప్షన్‌ తీర్మానించింది. అది మంచిదే అయినా దేవుని ప్రభుత్వం కేవలం ఆ లక్షణాలను ప్రోత్సహించడమే కాదు వాటిని ఖచ్చితంగా పాటించాలని చెప్తుంది. “లోభులు” లేదా అత్యాశ చూపించే వాళ్లు, “అబద్ధికులు” ఆ పరిపాలనలో ఉండరు అని దేవుడు చెప్తున్నాడు.—1 కొరింథీయులు 6:9-11; ప్రకటన 21:8.

ప్రజలు ఇలాంటి సూత్రాలను పాటించడం సాధ్యమే అని క్రీస్తు అనుచరులు 2000 సంవత్సరాల క్రితమే పాటించి చూపించారు. ఉదాహరణకు, సీమోను అనే అతను యేసు శిష్యుల నుండి దేవుని శక్తిని డబ్బుతో కొనాలనుకున్నాడు. అయితే శిష్యులు ఆ లంచం తీసుకోకుండా “నీ చెడుతనము మానుకో” అని చెప్పారు. సీమోను ఆ కోరిక తప్పని తెలుసుకున్నప్పుడు దాన్ని మార్చుకోవడానికి తన కోసం ప్రార్థించమని యేసు శిష్యులను అడిగాడు.—అపొస్తలుల కార్యములు 8:18-24.

దేవుని పరిపాలనలో ఉండాలంటే ఏమి చేయాలి?

మీరు ఏ దేశానికి చెందిన వాళ్లయినా, దేవుని ప్రభుత్వంలో పౌరులుగా ఉండే అవకాశం మీకు ఉంది. (అపొస్తలుల కార్యములు 10:34, 35) అందుకు ఏమి చేయాలో దేవుడు ఇప్పుడు నేర్పిస్తున్నాడు. ఆ పని ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. యెహోవా సాక్షులు దేవుని వాక్యాన్ని నేర్పిస్తారు, మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఎలా నేర్పిస్తారో మీకు సంతోషంగా చూపిస్తారు. వారంలో పది నిమిషాలైనా సరిపోతుంది. ‘దేవుని రాజ్య సువార్తలో’ ఉన్న వేరే విషయాలతో పాటు అవినీతి ఎలా పోతుందో చెప్తారు. (లూకా 4:43) మీకు దగ్గర్లో ఉన్న యెహోవాసాక్షులను అడగండి లేదా మా వెబ్‌సైట్‌ www.jw.org/te చూడండి. ▪ (w15-E 01/01)

మీరు బైబిలు గురించి ఉచితంగా నేర్చుకోవాలనుకుంటున్నారా?

a బైబిల్లో దేవుని పేరు యెహోవా అని ఉంది.

b అక్టోబరు 1, 2012 కావలికోటలో “అవినీతి నిండిన లోకంలో నిజాయితీగా ఉండడం సాధ్యమేనా?” (ఇంగ్లీషు) చూడండి.