‘మీరు నాకు సాక్షులుగా ఉంటారు’
“మీరు . . . భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని [యేసు] వారితో చెప్పెను.”—అపొ. 1:7, 8.
1, 2. (ఎ) యెహోవాకు అత్యంత గొప్ప సాక్షి ఎవరు? (బి) యేసు పేరుకున్న అర్థమేమిటి, దేవుని కుమారుడు తన పేరుకు తగ్గట్లుగా ఎలా జీవించాడు?
యేసుక్రీస్తు తనను విచారిస్తున్న యూదయలోని రోమా అధిపతితో, “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని” అని ధైర్యంగా చెప్పాడు. (యోహాను 18:33-38 చదవండి.) చాలా సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన పౌలు, “పొంతిపిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన” యేసు ఉదాహరణను ప్రస్తావించాడు. (1 తిమో. 6:13) అవును, ద్వేషంతో నిండివున్న సాతాను లోకంలో ‘నమ్మకమైన సత్యసాక్షిగా’ ఉండాలంటే కొన్నిసార్లు ఎంతో ధైర్యం కావాలి.—ప్రక. 3:14.
2 యేసు యూదా జనాంగంలో పుట్టాడు కాబట్టి ఆయన పుట్టుకతోనే యెహోవాకు సాక్షి. (యెష. 43:10) నిజానికి, దేవుడు తన నామం కొరకు ఎంపిక చేసుకున్న వాళ్లందరిలో యేసే అతిగొప్ప సాక్షి. దేవుడు తనకు పెట్టిన పేరుకున్న అర్థానికి తగినట్లుగా యేసు జీవించాడు. మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని యోసేపుకు చెబుతూ ఒక దూత ఇలా అన్నాడు, “ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు.” (మత్త. 1:20, 21) దేవుని పేరుకు క్లుప్త రూపమైన జెషువ [యెషువ] అనే హీబ్రూ పేరు నుండి యేసు పేరు వచ్చిందని బైబిలు విద్వాంసులు అంటారు, ఆ పేరుకు అర్థం “యెహోవాయే రక్షణ.” తన పేరుకున్న అర్థానికి తగ్గట్లుగా యేసు, “ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెలు” తమ పాపాలకు పశ్చాత్తాపపడి, తిరిగి యెహోవా అనుగ్రహం పొందేలా సహాయం చేశాడు. (మత్త. 10:6; 15:24; లూకా 19:10) అందుకే, దేవుని రాజ్యం గురించి యేసు ఉత్సాహంగా సాక్ష్యమిచ్చాడు. సువార్త రచయిత మార్కు ఇలా రాశాడు, “యేసు —కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.” (మార్కు 1:14, 15) అంతేకాదు యేసు యూదామత నాయకులను ధైర్యంగా విమర్శించాడు, అందుకే వాళ్లు ఆయనను మ్రానుమీద వేలాడదీశారు.—మార్కు 11:17, 18; 15:1-15.
“దేవుని గొప్పకార్యములు”
3. యేసు మరణించిన మూడవ రోజున ఏమి జరిగింది?
3 అయితే, యేసు క్రూరంగా చంపబడిన మూడవ రోజున ఒక అద్భుతం జరిగింది. యెహోవా ఆయనను మానవునిగా కాక, ఒక అమర్త్యమైన ఆత్మ ప్రాణిగా పునరుత్థానం చేశాడు. (1 పేతు. 3:18) దానికి రుజువుగా, యేసు ప్రభువు మానవ శరీరాన్ని ధరించి తాను మళ్లీ బ్రతికానని చూపించాడు. పునరుత్థానమైన రోజే, ఆయన వేర్వేరు శిష్యులకు కనీసం ఐదుసార్లు కనిపించాడు.—మత్త. 28:8-10; లూకా 24:13-16, 30-36; యోహా. 20:11-18.
4. పునరుత్థానమైన రోజు యేసు ఏ కూటాన్ని జరిపాడు? తన శిష్యులకు ఏ బాధ్యత ఉందని స్పష్టం చేశాడు?
4 యేసు ఐదవసారి కనబడినప్పుడు ఆయన అపొస్తలులు, ఇతరులు సమకూడి ఉన్నారు. మర్చిపోలేని ఆ సందర్భంలో ఆయన వాళ్లకు లేఖనాల గురించి వివరించాడు. “వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును” తెరిచాడు. దేవుని శత్రువుల చేతుల్లో ఆయన చనిపోవడం, అద్భుతరీతిలో మళ్లీ బ్రతకడం గురించి లేఖనాలు ముందే చెప్పాయని అప్పుడు వాళ్లు అర్థంచేసుకున్నారు. ఆ ప్రాముఖ్యమైన కూటం చివర్లో, తన శిష్యులకున్న బాధ్యత గురించి యేసు వాళ్లకు స్పష్టంగా చెప్పాడు. ఆయనిలా చెప్పాడు, “యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడును . . . ఈ సంగతులకు మీరే సాక్షులు.”—లూకా 24:44-48.
5, 6. (ఎ) “నాకు సాక్షులైయుందురు” అని యేసు ఎందుకు అన్నాడు? (బి) యెహోవా సంకల్పం గురించిన ఏ కొత్త విషయాన్ని యేసు శిష్యులు ప్రకటించాల్సివుంది?
5 అందుకే యేసు 40 రోజుల తర్వాత, చివరిసారిగా కనబడినప్పుడు, “మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు” అనే సరళమైన, శక్తిమంతమైన ఆజ్ఞను ఎందుకిచ్చాడో అపొస్తలులు గ్రహించి ఉంటారు. (అపొ. 1:8) యెహోవాకు సాక్షులైయుందురు అని కాకుండా, “నాకు సాక్షులైయుందురు” అని యేసు ఎందుకు అన్నాడు? వాళ్లు యెహోవాకు సాక్షులుగా ఉంటారని యేసు చెప్పి ఉండేవాడే, కానీ ఆయన మాట్లాడుతున్నది ఇశ్రాయేలీయులతో, అంటే అప్పటికే యెహోవాకు సాక్షులుగా ఉన్నవాళ్లతో.
6 యేసు శిష్యులు ఆ తర్వాత యెహోవా సంకల్పం గురించిన ఓ కొత్త విషయాన్ని ప్రకటించాల్సివుంది. అంటే, ఐగుప్తు బానిసత్వం నుండి, ఆ తర్వాత బబులోను చెర నుండి ఇశ్రాయేలీయులు పొందిన విడుదలకన్నా మరింత గొప్ప విడుదలను ప్రకటించాల్సివుంది. యేసు మరణం-పునరుత్థానం, ఘోరమైన బానిసత్వం నుండి అంటే పాపమరణాల బంధకాల నుండి విడుదలను సాధ్యం చేశాయి. సా.శ. 33 పెంతెకొస్తు రోజున కొత్తగా అభిషేకించబడిన యేసు శిష్యులు, “దేవుని గొప్పకార్యములను” ప్రజలకు ప్రకటించారు. వాటిని విన్న ఎంతోమంది పశ్చాత్తాపపడి, యేసు బలియందు విశ్వాసముంచారు. పునరుత్థానమైన యేసుకు పరలోకంలో కొత్త అధికారం లభించింది. యేసు ద్వారా, భూమ్మీదున్న వేలాదిమందికి యెహోవా రక్షణ దయచేశాడు.—అపొ. 2:5, 11, 37-41.
“అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము”
7. సా.శ. 33 పెంతెకొస్తు రోజు జరిగిన సంఘటనలు ఏ విషయాన్ని నిరూపించాయి?
7 ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తంగా యేసు పరిపూర్ణ మానవ బలిని యెహోవా అంగీకరించాడని, సా.శ. 33 పెంతెకొస్తు రోజు జరిగిన సంఘటనలు నిరూపించాయి. (హెబ్రీ. 9:11, 12, 24) యేసు వివరించినట్లుగా, ఆయన “పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను.” (మత్త. 20:28) యేసు విమోచన నుండి ప్రయోజనం పొందే “అనేకులు” కేవలం పశ్చాత్తాపం చూపించిన యూదులే కాదు. విమోచన క్రయధనం “లోక పాపమును” తీసివేస్తుంది కాబట్టి, ‘మనుష్యులందరు రక్షణ పొందాలనేదే’ దేవుని చిత్తం.—1 తిమో. 2:4-6; యోహా. 1:29.
8. యేసు శిష్యులు ఎంతవరకు సువార్త ప్రకటించారు? అదెలా సాధ్యమైంది?
8 అయితే, యేసు గురించి సాక్ష్యమిస్తూనే ఉండేందుకు కావాల్సిన ధైర్యం తొలి శిష్యులకు ఉందా? ఖచ్చితంగా ఉంది, కానీ వాళ్లు తమ సొంత శక్తితో ఆ పని చేయలేదు. యెహోవా దయచేసిన శక్తిమంతమైన పరిశుద్ధాత్మ వాళ్లను ప్రేరేపించి, సాక్ష్యమివ్వడంలో కొనసాగేలా బలపర్చింది. (అపొస్తలుల కార్యములు 5:30-32 చదవండి.) సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టిన సుమారు 27 ఏళ్లకు, యేసు శిష్యులు ‘సువార్త సత్యమునుగూర్చిన బోధను,’ ‘ఆకాశముక్రింద ఉన్న సమస్త సృష్టిలో’ ఉన్న యూదులకు, అన్యులకు ప్రకటించారు.—కొలొ. 1:5, 23.
9. బైబిలు ముందే చెప్పినట్లు, తొలి క్రైస్తవ సంఘానికి ఏమైంది?
9 విచారకరంగా, తొలి క్రైస్తవ సంఘం మెల్లమెల్లగా కలుషితమైంది. (అపొ. 20:29, 30; 2 పేతు. 2:2, 3; యూదా 3, 4) ‘దుష్టుడైన’ సాతాను మద్దతుతో మతభ్రష్టత్వం “యుగసమాప్తి” వరకు వృద్ధి చెంది, నిజ క్రైస్తవత్వాన్ని మరుగు చేస్తుందని యేసు చెప్పాడు. (మత్త. 13:37-43) యెహోవా 1914, అక్టోబరులో మానవజాతి మీద యేసును రాజుగా చేశాడు. దాంతో, సాతాను దుష్ట వ్యవస్థకు “అంత్యదినములు” మొదలయ్యాయి.—2 తిమో. 3:1.
10. (ఎ) ఓ ప్రాముఖ్యమైన సంఘటన ఎప్పుడు జరగబోతుందని ఆధునికకాల అభిషిక్త క్రైస్తవులు ముందే చెప్పారు? (బి) 1914, అక్టోబరులో ఏమి జరిగింది? అదెలా స్పష్టమైంది?
10 ఆధునికకాల అభిషిక్త క్రైస్తవులు 1914, అక్టోబరులో ఓ ప్రాముఖ్యమైన సంఘటన జరగబోతుందని ముందే చెప్పారు. దానియేలు గ్రంథంలోని మహావృక్షం నరికి వేయబడి, మళ్లీ “ఏడు కాలముల” తర్వాత పెరుగుతుందని చెప్పిన ప్రవచనం ఆధారంగా వాళ్లు ఆ విషయం చెప్పారు. (దాని. 4:16) తన భవిష్యత్తు ప్రత్యక్షతకు అలాగే “ఈ యుగసమాప్తికి” సంబంధించి చెప్పిన ప్రవచనంలో యేసు ఆ సమయాన్ని, “అన్యజనముల కాలములు” అని సూచించాడు. 1914 నుండి లోకంలో జరుగుతున్న సంఘటనలు యేసు రాజయ్యాడని స్పష్టంగా చూపిస్తున్నాయి. (మత్త. 24:3, 7, 14; లూకా 21:24) అప్పటినుండి, మనం ప్రకటిస్తున్న ‘దేవుని గొప్పకార్యాల్లో’ యెహోవా, యేసును మానవజాతి మీద రాజుగా చేశాడనే విషయం కూడా ఉంది.
11, 12. (ఎ) యుద్ధం ముగిసిన 1919లో, రాజైన యేసు ఏమి చేయడం మొదలుపెట్టాడు? (బి) 1935 నుండి ఏ విషయం స్పష్టమైంది? (ప్రారంభ చిత్రం చూడండి.)
11 యేసుక్రీస్తు రాజైన వెంటనే “మహాబబులోను” నుండి తన అభిషిక్త అనుచరులను విడిపించడం మొదలుపెట్టాడు. (ప్రక. 18:2, 4) మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన 1919లో, దేవుని రక్షణ ఏర్పాటు గురించి, రాజ్య స్థాపన గురించి సువార్త భూవ్యాప్తంగా ప్రకటించడానికి మార్గం తెరుచుకుంది. అభిషిక్త క్రైస్తవులు సాక్ష్యమిచ్చే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు, అందువల్ల వేలమంది ఇతర అభిషిక్త క్రైస్తవులు క్రీస్తు తోటి వారసులవ్వడం వీలైంది.
12 యేసు, లక్షలమంది ‘వేరే గొఱ్ఱెలను’ సమకూర్చే పనిని అప్పటికే మొదలుపెట్టాడని 1935 నుండి స్పష్టమైంది. వాళ్లు వేర్వేరు దేశాల ప్రజలతో ఉన్న ‘గొప్పసమూహంగా’ తయారౌతున్నారు. అభిషిక్త క్రైస్తవుల నడిపింపు కింద ఈ గొప్పసమూహం కూడా, యేసు మాదిరిని అనుసరిస్తూ తమ రక్షణకు దేవుడు, యేసు కారణమని అందరికీ ధైర్యంగా సాక్ష్యమిస్తున్నారు. ఈ పనిలో కొనసాగుతూ, క్రీస్తు విమోచన క్రయధనం మీద విశ్వాసం చూపిస్తూ ఉండడం వల్ల, సాతాను లోకాన్ని నాశనం చేసే “మహాశ్రమ” నుండి వాళ్లు తప్పించుకోగలుగుతారు.—యోహా. 10:16; ప్రక. 7:9, 10, 14.
‘సువార్త ప్రకటించడానికి ధైర్యం కూడగట్టుకోండి’
13. యెహోవాసాక్షులముగా మనం ఏమి చేయాలని తీర్మానించుకోవాలి? ఈ విషయంలో మనం విజయం సాధించగలమనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు?
13 యెహోవా దేవుడు ఇప్పటివరకు చేసిన, భవిష్యత్తులో చేయబోయే “గొప్పకార్యముల” గురించి సాక్ష్యమివ్వడం మనకు దొరికిన గొప్ప భాగ్యం. నిజమే, ఆ పనిలో కొనసాగడం అంత సులువు కాదు. మన సహోదరులు ఎంతోమంది ఉదాసీనత, ఎగతాళి లేదా హింసలు ఎక్కువగా ఉన్న క్షేత్రాల్లో పనిచేస్తున్నారు. అందుకే మనం పౌలును, ఆయన తోటివాళ్లను అనుకరించాలి. “యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమి” అని ఆయన చెప్పాడు. (1 థెస్స. 2:2) కాబట్టి, మనం ఎప్పుడూ మన ప్రయత్నాల్ని ఆపకుండా ఉందాం. బదులుగా, సాతాను లోకం నాశనం అవుతుండగా మనం మన సమర్పణకు కట్టుబడి ఉండాలని తీర్మానించుకుందాం. (యెష. 6:11) అలా చేయడానికి మన సొంత శక్తి చాలదు, అందుకే తొలి క్రైస్తవులను ఆదర్శంగా తీసుకుంటూ, తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు కావాల్సిన “బలాధిక్యము” ఇవ్వమని యెహోవాకు ప్రార్థించాలి.—2 కొరింథీయులు 4:1, 7 చదవండి; లూకా 11:13.
14, 15. (ఎ) మొదటి శతాబ్దంలో క్రైస్తవులను ఎలా చూసేవాళ్లు? అపొస్తలుడైన పేతురు వాళ్లను ఎలా ప్రోత్సహించాడు? (బి) మనం యెహోవా సాక్షులమైనందుకు వ్యతిరేకత ఎదురైతే ఏమి గుర్తుపెట్టుకోవాలి?
14 నేడు లక్షలమంది క్రైస్తవులమని చెప్పుకుంటారు కానీ, “అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి తమ క్రియలవలన [దేవుణ్ణి] ఎరుగమన్నట్టున్నారు.” (తీతు 1:16) మొదటి శతాబ్దంలోని నిజక్రైస్తవులను వాళ్ల తోటివాళ్లలో చాలామంది ద్వేషించారని మనం గుర్తుంచుకోవాలి. అందుకే అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు, “క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల . . . దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.”—1 పేతు. 4:14.
15 ఆ ప్రేరేపిత మాటలు నేడు యెహోవాసాక్షులకు వర్తిస్తాయా? తప్పకుండా, ఎందుకంటే మనం యేసు రాచరికం గురించి సాక్ష్యమిస్తున్నాం. కాబట్టి, యెహోవా నామం ధరించినందుకు ద్వేషించబడడం, ‘క్రీస్తు నామము నిమిత్తము నిందపాలవ్వడం’ లాంటిదే. యేసు తన వ్యతిరేకులతో, “నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను; మీరు నన్ను అంగీకరింపరు” అన్నాడు. (యోహా. 5:43) కాబట్టి, ఈసారి సాక్ష్యమిస్తున్నప్పుడు మీకు వ్యతిరేకత ఎదురైతే, ధైర్యంగా ఉండండి. దేవుని ఆమోదం మీకుందని, ఆయన ఆత్మ మీమీద ఉందనడానికి అలాంటి వ్యతిరేకతే రుజువు.
16, 17. (ఎ) ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజలు ప్రకటనా పని గురించి ఎలా భావిస్తున్నారు? (బి) మీరేమి తీర్మానించుకున్నారు?
16 అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మంచి అభివృద్ధి జరుగుతోందని గుర్తుంచుకోండి. ఇప్పటికే ఎన్నోసార్లు పనిచేసిన క్షేత్రాల్లో కూడా వినడానికి ఇష్టపడే ప్రజలను కనుగొంటున్నాం, వాళ్లతో అద్భుతమైన రక్షణ సందేశాన్ని పంచుకుంటున్నాం. కాబట్టి, ఆసక్తి ఉన్నవాళ్లను మళ్లీ కలవడానికి, సాధ్యమైతే వాళ్లతో బైబిలు అధ్యయనాలు చేయడానికి కృషి చేద్దాం. వాళ్లు సమర్పించుకుని, బాప్తిస్మం పొందేలా సహాయం చేద్దాం. దక్షిణ ఆఫ్రికాలో 60 కన్నా ఎక్కువ సంవత్సరాల నుండి సాక్ష్యమిచ్చే పనిలో చురుగ్గా పాల్గొంటున్న సారీ అనే సహోదరిలాగే బహుశా మీరు భావిస్తుండవచ్చు. ఆమె ఇలా చెబుతోంది, “యేసు విమోచనా క్రయధన బలి ద్వారా విశ్వ సర్వాధిపతియైన యెహోవాతో మంచి స్నేహాన్ని ఆస్వాదిస్తున్నందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని. ఆయన మహిమాన్విత నామాన్ని ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.” సారీ, ఆమె భర్త మార్టీనస్‌లు యెహోవా ఆరాధకులయ్యేలా తమ ముగ్గురు పిల్లలతోపాటు ఎంతోమందికి సహాయం చేశారు. “మరే పనిలో ఇంత సంతృప్తి దొరకదు, ప్రాణాలను కాపాడే ఈ పనిలో కొనసాగడానికి కావాల్సిన బలాన్ని, తన పరిశుద్ధాత్మ ద్వారా యెహోవా మనందరికి ఇస్తాడు” అని సారీ అంటోంది.
17 మనం బాప్తిస్మం పొందినా లేక ఆ లక్ష్యం వైపుగా కృషిచేస్తున్నా, యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త సంఘంతో సహవసించే గొప్ప అవకాశం మనకున్నందుకు ఎంత కృతజ్ఞులమో కదా! కాబట్టి, అపరిశుద్ధమైన సాతాను లోకంలో పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడుతూ, సమగ్రంగా సాక్ష్యమివ్వడంలో కొనసాగండి. మీరలా చేయడం ద్వారా తన మహిమాన్విత నామాన్ని ధరించే గొప్ప భాగ్యాన్ని మనకిచ్చిన పరలోక తండ్రికి ఘనతను తీసుకొస్తారు.