తీతు 1:1-16

  • శుభాకాంక్షలు (1-4)

  • తీతు క్రేతులో పెద్దల్ని నియమించాలి (5-9)

  • తిరుగుబాటు చేసేవాళ్లను గద్దించు (10-16)

1  దేవుని దాసుణ్ణి, యేసుక్రీస్తు అపొస్తలుణ్ణి అయిన పౌలు అనే నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. నా విశ్వాసం, అపొస్తలుడిగా నేను చేస్తున్న సేవ దేవుడు ఎంచుకున్నవాళ్ల విశ్వాసానికి, సత్యం గురించిన సరైన జ్ఞానానికి అనుగుణంగా ఉన్నాయి; ఈ సత్యం దైవభక్తికి అనుగుణంగా ఉంది.  ఇవి శాశ్వత జీవితమనే+ నిరీక్షణమీద ఆధారపడి ఉన్నాయి. ఆ శాశ్వత జీవితాన్ని అబద్ధమాడలేని దేవుడు+ ఎంతోకాలం క్రితమే వాగ్దానం చేశాడు;  కానీ ఆయన తాను అనుకున్న సమయంలో, మంచివార్తను ప్రకటించే పని ద్వారా తన సందేశాన్ని తెలియజేశాడు. ఆ మంచివార్తను ప్రకటించే బాధ్యత మన రక్షకుడైన దేవుని ఆజ్ఞమేరకు నాకు అప్పగించబడింది.+  తోటి విశ్వాసివైన తీతూ, నా నిజమైన కుమారుడా, తండ్రైన దేవుడు, అలాగే మన రక్షకుడైన క్రీస్తుయేసు నీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.  నేను నీకు ఇచ్చిన నిర్దేశాల ప్రకారం, నువ్వు లోపాల్ని* సరిచేయాలని, ఒక్కో నగరానికి వెళ్తూ పెద్దల్ని నియమించాలని నిన్ను క్రేతులో ఉంచి వచ్చాను.  ఒక సహోదరుణ్ణి పెద్దగా నియమించాలంటే అతని మీద ఏ నిందా ఉండకూడదు, అతనికి ఒకే భార్య ఉండాలి, అతని పిల్లలు విశ్వాసులై ఉండాలి, ఆ పిల్లలకు చెడు తిరుగుళ్లు తిరుగుతారనే* లేదా తిరగబడేవాళ్లనే చెడ్డపేరు ఉండకూడదు.+  పర్యవేక్షకుడు దేవుని సంఘాన్ని చూసుకునే వ్యక్తి* కాబట్టి అతని మీద ఏ నిందా ఉండకూడదు, అతను మొండివాడు+ గానీ, ముక్కోపి+ గానీ, తాగుబోతు గానీ, కొట్టేవాడు గానీ, అక్రమ లాభాన్ని ఆశించేవాడు గానీ అయ్యుండకూడదు.  బదులుగా అతను ఆతిథ్యమిచ్చేవాడు,+ మంచితనాన్ని ప్రేమించేవాడు, మంచి వివేచన గలవాడు,+ నీతిమంతుడు, విశ్వసనీయుడు,+ ఆత్మనిగ్రహం గలవాడు+ అయ్యుండాలి;  బోధించేటప్పుడు* నమ్మకమైన వాక్యాన్ని* గట్టిగా అంటిపెట్టుకునేవాడై ఉండాలి.+ అప్పుడే అతను మంచి* బోధతో+ ఇతరుల్ని ప్రోత్సహించగలుగుతాడు, ఆ బోధను వ్యతిరేకించేవాళ్లను గద్దించగలుగుతాడు.+ 10  ఎందుకంటే తిరుగుబాటు చేసేవాళ్లు, పనికిరాని మాటలు మాట్లాడేవాళ్లు, మోసగాళ్లు, ముఖ్యంగా సున్నతి గురించి పట్టుబట్టేవాళ్లు చాలామంది ఉన్నారు.+ 11  వాళ్ల నోళ్లు మూయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్లు అక్రమ లాభం కోసం, బోధించకూడని విషయాల్ని బోధిస్తూ కుటుంబాలకు కుటుంబాల్నే నాశనం చేస్తున్నారు. 12  వాళ్లలో ఒకతను, అంటే వాళ్ల సొంత ప్రవక్తే ఇలా అన్నాడు: “క్రేతువాళ్లు ఎప్పుడూ అబద్ధాలాడతారు, వాళ్లు ప్రమాదకరమైన క్రూరమృగాలు, సోమరులు, తిండిబోతులు.” 13  అతని సాక్ష్యం నిజం. అందుకే వాళ్లను తీవ్రంగా గద్దిస్తూ ఉండు. అప్పుడే వాళ్లు విశ్వాసంలో దృఢంగా* ఉంటూ 14  యూదుల కట్టుకథల్ని, సత్యాన్ని విడిచిపెట్టేవాళ్ల ఆజ్ఞల్ని లెక్కచేయకుండా ఉంటారు. 15  పవిత్రులకు అన్నీ పవిత్రం;+ కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదీ పవిత్రం కాదు. ఎందుకంటే వాళ్ల మనసు, మనస్సాక్షి రెండూ కలుషితమైపోయాయి.+ 16  వాళ్లు తమకు దేవుడు తెలుసని అందరిముందు చెప్పుకుంటారు, కానీ వాళ్ల పనులు+ వాళ్లు దేవుణ్ణి తిరస్కరిస్తున్నారని చూపిస్తాయి. ఎందుకంటే వాళ్లు అసహ్యమైనవాళ్లు, అవిధేయులు, ఏ మంచిపనికీ పనికిరానివాళ్లు.

అధస్సూచీలు

లేదా “దోషాల్ని.”
లేదా “అడ్డూఅదుపూ లేనివాళ్లనే.”
లేదా “దేవుని గృహనిర్వాహకుడు.”
లేదా “బోధనాకళను ఉపయోగిస్తున్నప్పుడు.”
లేదా “నమ్మదగిన సందేశాన్ని.”
లేదా “ఆరోగ్యకరమైన; ప్రయోజనకరమైన.”
అక్ష., “ఆరోగ్యంగా.”