కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని కుటుంబ సభ్యుల్లో ఒకరవడం

దేవుని కుటుంబ సభ్యుల్లో ఒకరవడం

దేవుని కుటుంబ సభ్యుల్లో ఒకరవడం

కొరియన్‌ యుద్ధం పూర్తయిన దాదాపు 30 సంవత్సరాల తర్వాత, ప్రజలు తప్పిపోయిన తమ కుటుంబ సభ్యులను వెదకడానికి సహాయం చేసేందుకు కొరియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సిస్టమ్‌ (ప్రసార సంస్థ) ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫలితంగా ఏమి జరిగింది? 11,000 కన్నా ఎక్కువమంది తమ ఆత్మీయులను తిరిగి కలుసుకున్నారు. ఆ ఆనందంలో వాళ్లు కంటతడి పెట్టుకుని, ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కొరియన్‌ టైమ్స్‌ అనే పత్రిక ఇలా నివేదించింది: “అంతమంది ప్రజలు ఒకేసారి అక్కడికక్కడే ఆనందంతో కంటతడి పెట్టుకోవడం కొరియా చరిత్రలో అదే ప్రప్రథమం.”

బ్రెజిల్‌లో ఉంటున్న ఒక జంట అప్పు తీర్చలేక దానికి బదులుగా చిన్నవాడైన వాళ్ల అబ్బాయి సేజార్‌ని ఇచ్చేశారు. సేజార్‌, పది సంవత్సరాల తర్వాత తనకు జన్మనిచ్చిన తల్లి ఎవరో తెలుసుకుని ఎంతో సంతోషించి, సంపన్నవంతులైన తన పెంపుడు తల్లిదండ్రులను విడిచి తన తల్లితో ఉండడానికి వెళ్లిపోయాడు.

విడిపోయిన లేదా తప్పిపోయిన కుటుంబీకులు తిరిగి కలుసుకున్నప్పుడు కుటుంబ సభ్యులు ఎంత ఆనందిస్తారో కదా! మానవులు విచారకరంగా దేవుని కుటుంబం నుండి ఎలా దూరమయ్యారో బైబిలు వివరిస్తోంది. వారిప్పుడు సంతోషంగా ఎలా తిరిగి దేవుని కుటుంబ సభ్యులుగా మారుతున్నారో కూడా అది చెబుతోంది. ఇది ఎలా సాధ్యమయ్యింది? ఆ సంతోషంలో మీకు కూడా పాలుపంచుకోవాలని ఉంటే మీరు ఏమి చేయవచ్చు?

దేవుని కుటుంబం ఎలా దూరమయింది?

సృష్టికర్తయైన యెహోవా గురించి కీర్తనకర్త ఇలా చెప్పాడు: “నీయొద్ద జీవపు ఊట కలదు.” (కీర్తన 36:⁠9) విశ్వసనీయంగా ఉంటున్న తెలివైన ప్రాణులతో కూడిన విశ్వవ్యాప్త కుటుంబానికి యెహోవా తండ్రిగా ఉన్నాడు. పరలోకంలో ఉంటున్న దేవుని ఆత్మ కుమారులైన దేవదూతలు, భూమిపై ఉంటున్న మానవులు ఆ కుటుంబంలోని సభ్యులు. ఆ మానవులే ఆయనకు భూసంబంధ పిల్లలౌతారు.

ముందటి ఆర్టికల్‌లో వివరించబడినట్లుగా దేవుని మొదటి మానవ కుమారుడైన ఆదాము పాపము చేసినప్పుడు మానవజాతి విచారకరంగా తమ ప్రేమగల తండ్రి, సృష్టికర్త నుండి దూరమయ్యింది. (లూకా 3:​38) ఆదాము తిరుగుబాటు చేయడం ద్వారా దేవుని కుమారునిగా ఉండే చక్కని అవకాశాన్ని తాను కోల్పోవడమేకాక, తనకింకా పుట్టని సంతానానికి కూడా దాన్ని దక్కకుండా చేశాడు. దాని పర్యవసానాలేమిటో దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా ఇలా వివరించాడు: “వారు తమ్ము చెరుపుకొనిరి; [దేవుని] పుత్రులుకారు; వారు కళంకులు.” మానవులకున్న ‘కళంకం’ లేదా పాపప్రవృత్తి వారిని ప్రతీ విషయంలో పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన దేవుని నుండి దూరం చేసింది. (ద్వితీయోపదేశకాండము 32:​4, 5; యెషయా 6:⁠3) అలా మానవజాతి ఒక రకంగా తప్పిపోయారు, అనాథలయ్యారు.​—⁠ఎఫెసీయులు 2:​12.

మానవజాతి దేవుని నుండి చాలా దూరమయ్యారనే విషయాన్ని నొక్కిచెప్పడానికి బైబిలు, దేవుని కుటుంబ సభ్యులు కానివారిని “శత్రువులు” అని పిలుస్తోంది. (రోమీయులు 5:​8, 10) దేవుని నుండి దూరమైన మానవులు సాతాను క్రూర పరిపాలన వల్ల, వారసత్వంగా సంక్రమించిన పాపం, అపరిపూర్ణతల మరణాంతక ప్రభావంవల్ల ఎంతో బాధను అనుభవించారు. (రోమీయులు 5:​12; 1 యోహాను 5:​19) పాపులైన మానవులు దేవుని కుటుంబీకులు అవ్వగలరా? ఆదాము హవ్వలు పాపం చేయకముందు ఉన్నట్లు, అపరిపూర్ణ ప్రాణులు నిజంగా దేవుని పిల్లలు అవ్వగలరా?

దేవుని నుండి దూరమైన పిల్లలను సమకూర్చడం

యెహోవా తనను ప్రేమించే అపరిపూర్ణ ప్రజల ప్రయోజనార్థం ప్రేమపూర్వక ఏర్పాటు చేశాడు. (1 కొరింథీయులు 2:⁠9) వాటి గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: “దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొ[నెను].” (2 కొరింథీయులు 5:​19) ముందటి ఆర్టికల్‌లో వివరించబడినట్లుగా యెహోవా దేవుడు మనల్ని పాప విముక్తుల్ని చేయడానికి యేసుక్రీస్తును విమోచన క్రయధనంగా [విడిపించడానికి చెల్లించే మూల్యంగా] ఏర్పాటు చేశాడు. (మత్తయి 20:​28; యోహాను 3:​16) దానిపట్ల కృతజ్ఞతను వ్యక్తంచేస్తూ అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి.” (1 యోహాను 3:⁠1) ఆ విధంగా, విధేయులైన మానవజాతి తిరిగి యెహోవా కుటుంబంలో సభ్యులయ్యే మార్గం సుగమం చేయబడింది.

దేవుని కుటుంబ సభ్యులయ్యేలా సమకూర్చబడిన మానవు​లందరూ తమ పరలోక తండ్రి సంరక్షణలో అద్భుతమైన ఐక్యతను ఆస్వాదిస్తారు. అయితే, వారు రెండు గుంపులుగా సమకూర్చబడతారనే విషయాన్ని బైబిలు ఎలా వివరిస్తోందో గమనించండి. మనమిలా చదువుతాము: “కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన [దేవుడు] తన దయాసంకల్పము చొప్పున . . . పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.” (ఎఫెసీయులు 1:​8-10) దేవుడు ఎందుకలా రెండు గుంపులుగా సమకూర్చాలని ఏర్పాటు చేశాడు?

యెహోవా తన పిల్లలను అలా రెండు గుంపులుగా ఏర్పాటు చేయడం నిజానికి తన కుటుంబ సామరస్యానికి దోహదపడుతుంది. ఎందుకు దోహదపడుతుందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. దేవుని కుటుంబం ఎంత పెద్దదంటే దాన్ని మనం ఒక దేశంతో పోల్చవచ్చు. ఏ దేశంలోనైనా సరే ప్రజలందరూ శాంతిభద్రతలను అనుభవించాలంటే వారిలోనుండి ఎన్నుకోబడిన కొందరితో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది. మానవ ప్రభుత్వాలేవీ నిజమైన శాంతిని నెలకొల్పలేక​పోయాయి అన్నది నిజమే. అయితే దేవుడు తన కుటుంబం కోసం ఒక పరిపూర్ణమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. మొదటి గుంపు లేదా “పరలోకములో ఉన్నవి” ఎవరంటే, యెహోవా పరలోకంలో ఒక ప్రభుత్వాన్ని లేదా రాజ్యాన్ని స్థాపించడానికి ఎన్నుకున్న ప్రజలు. పరలోకం నుండి వారు “భూలోకమందు ఏలుదురు.”​—⁠ప్రకటన 5:​9, 10.

భూమ్మీదున్న దేవుని పిల్లలు

యెహోవా “భూమిమీద ఉన్న” వాటిని కూడా అంటే భూవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమందిని సమకూరుస్తున్నాడు, ఎందుకంటే వారే చివరకు తన భూసంబంధ పిల్లలవుతారు. వారు అనేక జనాంగాలకు చెందినవారైనా సామరస్యంగా కలిసివుండేలా, దయాగుణమున్న తండ్రిగా ఆయన వారికి తన ప్రేమపూర్వక మార్గాల గురించి బోధిస్తున్నాడు. ఆఖరికి క్రూరులు, స్వార్థపరులు, దుర్నీతిపరులు, దేవునికి అవిధేయులైనవారు కూడా ‘దేవునితో సమాధానపడాలని’ కోరబడుతున్నారు.​—⁠2 కొరింథీయులు 5:​20.

తన పిల్లలుగా తనతో సమాధానపడమనే దేవుని కోరికను తిరస్కరించేవారికి ఏమౌతుంది? తన కుటుంబంలో శాంతిసామరస్యాలను కాపాడడానికి యెహోవా అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాడు. “భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము” ఒకటి రాబోతోంది. (2 పేతురు 3:⁠7) దేవుడు తిరుగుబాటుదారులను సమూలంగా నాశనం చేస్తాడు. విధేయులకు అదెంతటి ఉపశమనాన్నిస్తుందో కదా!​—⁠కీర్తన 37:​10, 11.

‘తీర్పు దినము’ తర్వాత వెయ్యి సంవత్సరాలపాటు శాంతి నెలకొంటుంది, ఆ సమయంలో దేవుని ప్రేమకు ప్రతిస్పందించేవారంతా ఆదాము పోగొట్టిన పరిపూర్ణ జీవాన్ని క్రమంగా తిరిగి పొందుతారు. చివరకు మృతులు కూడా తిరిగి బ్రతికించబడతారు. (యోహాను 5:​28, 29; ప్రకటన 20:⁠6; 21:​3, 4) అలా, “[మానవ] సృష్టి, నాశనము​నకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందు[తుందనే]” వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు.​—⁠రోమీయులు 8:​20, 21.

మీ తండ్రికి తిరిగి దగ్గరవ్వడం

ఈ ఆర్టికల్‌ ప్రారంభంలో ప్రస్తావించబడిన సేజార్‌, కొరియాలోని వేలాదిమంది తమ కుటుంబ సభ్యులను తిరిగి కలుసు​కోవడానికి ఒక చర్య తీసుకోవాల్సివచ్చింది. కొరియాలో ఉన్నవారు ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది, సేజార్‌ విషయంలోనైతే ఆయన తన పెంపుడు తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సి వచ్చింది. అలాగే మీరు కూడా మీ పరలోక తండ్రియైన యెహోవా దేవునితో సమాధానపడడానికి, ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరయ్యేందుకు నిశ్చితమైన చర్యలను తీసుకోవాలి. ఆ చర్యలేమిటి?

తండ్రిలా ఉన్న మీ దేవునికి మీరు దగ్గరవ్వాలంటే ఆయనపై, ఆయన వాగ్దానాలపై గట్టి నమ్మకాన్ని పెంపొందించుకోవాలి, దానికి మీరు ఆయన వాక్యమైన బైబిలును చదవాలి. అప్పుడు మీరు దేవుడు మిమ్మల్ని చేయమని చెప్పేవన్నీ మీ మంచికోసమే అని నమ్మడం నేర్చుకుంటారు. దేవుడు మిమ్మల్ని సరిదిద్దినప్పుడు, లేదా గద్దించినప్పుడు మీరు దానిని అంగీకరించాలి, ఎందుకంటే బైబిలు ఇలా చెబుతోంది: “దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?”​—⁠హెబ్రీయులు 12:⁠7.

అలాంటి చర్యలు తీసుకోవడం మీ జీవిత విధానాన్ని మార్చేస్తుంది. బైబిలు ఇలా చెబుతోంది: “మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.” (ఎఫెసీయులు 4:​23, 24) ఆ తర్వాత అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఉపదేశాన్ని అన్వయించుకోండి: “మీరు అజ్ఞానంతో జీవించినప్పుడు దురాశలకు లోనై జీవించారు. ఇప్పుడావిధంగా జీవించకుండా చిన్న పిల్లలవలే విధేయతతో జీవించండి.”​—⁠1 పేతురు 1:​14, ఈజీ-టు-రీడ్‌-వర్షన్‌.

మీ అసలు కుటుంబమేదో తెలుసుకోవడం

సేజార్‌ తన తల్లి ఎవరో తెలుసుకున్న తర్వాత ఆయనకు ఒక అన్నయ్య, అక్క కూడా ఉన్నారని తెలుసుకొని చాలా సంతోషించాడు. అలాగే మీరు మీ పరలోక తండ్రికి దగ్గరైనప్పుడు క్రైస్తవ సంఘంలో మీకు చాలామంది సహోదర సహోదరీలు ఉన్నారని తెలుసుకుంటారు. మీరు వారితో సహవ​సించినప్పుడు మీ సొంత కుటుంబ సభ్యులకంటే వీరే మీకు ఎంతో దగ్గరయినట్లు మీకనిపించవచ్చు.​—⁠అపొస్తలుల కార్యములు 28:​14, 15; హెబ్రీయులు 10:​24, 25.

మీ అసలు తండ్రిని, నిజమైన సహోదర సహోదరీలను కలుసుకునే ఆహ్వానం మీకు ఇవ్వబడుతోంది. మీరు కూడా సేజార్‌, కొరియాలోని వేలాదిమంది తమ కుటుంబీకులను తిరిగి కలిసినప్పుడు పొందిన ఆనందం కంటే ఎంతో ఎక్కువగా ఆనందిస్తారు. (w 08 3/1)

[26వ పేజీలోని చిత్రం]

సేజార్‌కు 19 సంవత్సరాలున్నప్పుడు, అతని తల్లితో

[28వ పేజీలోని చిత్రాలు]

దేవునికి దగ్గరవ్వడానికి చర్యలు తీసుకోండి