కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవితానికి ఏది నిజమైన అర్థాన్నిస్తుంది?

జీవితానికి ఏది నిజమైన అర్థాన్నిస్తుంది?

జీవితానికి ఏది నిజమైన అర్థాన్నిస్తుంది?

జీవితార్థం గురించి 17 ఏళ్ల ఉన్నత పాఠశాల విద్యార్థి జెస్సిని అడిగినప్పుడు “బ్రతికినంతకాలం సాధ్యమైనంత ఎక్కువ సుఖం అనుభవించడమే జీవితార్థం” అని చెప్పాడు. సూజి దృక్కోణం దానికి భిన్నంగా ఉంది. ఆమె ఇలా అంది: “మనం మలుచుకున్నట్లుగా ఉండేదే జీవితమని నా ఉద్దేశం.”

జీవితార్థమేమిటని మీరెప్పుడైనా ఆలోచించారా? యావత్‌ మానవాళి కోసం ఏదైనా ఒకే సంకల్పముందా? లేదా సూజి చెప్పినట్లుగా మనం మలుచుకున్న జీవన విధానమే అసలు జీవితమా? మన సమాజం సాంకేతికంగా ఎంత ఆధునికంగా మారుతున్నా, మన అంతరంగంలో జీవితార్థం గురించి మనం పరితపిస్తున్నట్లే అనిపిస్తోంది. మన జీవితంలో ఏదోక సమయంలో మనలో చాలామంది ‘మనమెందుకు ఇక్కడ ఉన్నాం?’ అని ఆలోచిస్తారు.

ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆధునిక విజ్ఞానశాస్త్రం శాయశక్తులా ప్రయత్నించింది. ఫలితం? “బ్రతికి ఉండడానికి సహజసిద్ధమైన, పరిణామ సంబంధమైన అర్థమంటూ ఏమీ లేదు” అని మానసికశాస్త్ర, జంతుశాస్త్ర పండితుడైన డేవిడ్‌ పి. బారెష్‌ అన్నాడు. పరిణామ జీవశాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం, జీవరాశులకు బ్రతకడం సంతానోత్పత్తి చేయడం అనే ఒకే సంకల్పముంది. కాబట్టి పండితుడైన బారెష్‌ ఇలా సూచిస్తున్నాడు: “సంకల్పంలేని, ప్రజల పట్ల శ్రద్ధచూపని ఈ మహా విశ్వంలో స్వేచ్ఛగా, తెలివిగా, ఉద్దేశపూర్వకంగా మనం ఎంపిక చేసుకునే వాటిద్వారా జీవితానికొక అర్థాన్నిచ్చుకొనే బాధ్యత మానవులకే ఉంది.”

అర్థానికి, సంకల్పానికి మూలాధారం

జీవితంలో ఉన్నదంతా అంతేనా, మనలో ప్రతీ ఒక్కరూ తనిష్ట ప్రకారం జీవించడమేనా? ఒక సంకల్పం లేదా అర్థం అంటూ లేని ఈ విశ్వంలో, ఒక లక్ష్యం లేకుండా తిరిగేందుకు మనల్ని వదిలేయకుండా మనమొక సంకల్పంతోనే ఇక్కడ ఉన్నామని బైబిలు ఎప్పుడో వెల్లడిచేసింది. మనం ఏదో అంతరిక్ష ఆకస్మిక సంఘటన వల్ల యాదృచ్ఛికంగా ఉనికిలోకి రాలేదు. మానవాళి మనుగడ కోసం సృష్టికర్త ఈ భూమిని ఎన్నో యుగాలుగా సిద్ధం చేశాడని మనకు చెప్పబడింది. ఆకస్మిక సంఘటన వల్ల ఏదీ ఉనికిలోకి రాలేదు. ప్రతీదీ “చాలమంచిదిగ” ఉండేలా ఆయన చూశాడు. (ఆదికాండము 1:31; యెషయా 45:​18) ఎందుకు? ఎందుకంటే మానవుని విషయంలో దేవునికి ఒక సంకల్పముంది.

అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే, దేవుడు, తను కలుగజేసుకోవడం ద్వారా గానీ లేక ఏదో జీవ ప్రక్రియ ద్వారా గానీ ప్రతీ వ్యక్తి భవిష్యత్తును ముందుగా నిర్ణయించలేదు. జన్యుపరమైన వారసత్వం మనపై ప్రభావం చూపినప్పటికీ, ఎక్కువగా మన క్రియలే మనల్ని నియంత్రిస్తూ ఉంటాయి. జీవితంలో మనకిష్టమైన మార్గాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మనందరికీ ఉంది.

మన జీవితంతో మనమేమి చేస్తామో ఎంపిక చేసుకోవడం మన చేతిలోనే ఉన్నప్పటికీ, మన ఆలోచనల్లో నుండి సృష్టికర్తను మినహాయించడం తప్పవుతుంది. వాస్తవానికి, దేవునితో ఉన్న సంబంధంతో జీవితానికి నిజమైన అర్థం, సంకల్పం ముడిపడి ఉన్నట్లు చాలామంది తెలుసుకున్నారు. దేవునికీ, మన జీవిత సంకల్పానికీ ఉన్న ఆ ప్రాముఖ్యమైన సంబంధం దేవుని వ్యక్తిగత నామమైన యెహోవాలో నొక్కిచెప్పబడింది, దానికి అక్షరార్థంగా “తానే కర్త అవుతాడు” అని భావం. (నిర్గమకాండము 6:3; కీర్తన 83:​18) అంటే ఆయన ప్రగతిశీల విధానంలో తాను వాగ్దానం చేసినవాటన్నిటినీ నెరవేరుస్తాడు, అలాగే తాను చేయాలని సంకల్పించిన దానిని ఎల్లప్పుడూ పూర్తిచేస్తాడు. (యెషయా 55:​10, 11) ఆ పేరుకున్న విశేషతను గురించి ఒక్కసారి ఆలోచించండి. యెహోవా అనే పేరు దానంతటదే అర్థవంతమైన సంకల్పానికి ఆయనే పరమోన్నతమైన, శాశ్వతమైన మూలాధారమని హామీ ఇస్తోంది.

సృష్టికర్త ఉనికిని గుర్తించడమే ఒక వ్యక్తి జీవన దృక్కోణంపై అపారమైన ప్రభావం చూపుతుంది. 19 సంవత్సరాల లినెట్‌ ఇలా చెబుతోంది: “యెహోవా సృష్టించిన అద్భుతమైన సృష్టిని, వాటి సంకల్పాన్ని చూస్తే నేను కూడా ఒక సంకల్పంతోనే సృష్టించబడ్డానని తెలుస్తుంది.” మరో అమ్మాయి ఆంబర్‌ ఇలా అంటోంది: “ప్రజలు ‘దేవుడున్నాడో లేదో’ మాకు తెలియదని అన్నప్పుడు ఆయన ఉనికిలో ఉన్నాడని నాకు తెలుసన్న విషయం గుర్తొస్తుంది. యెహోవా ఉనికిలో ఉన్నాడనటానికి రుజువు ఆయన చేసిన సృష్టికార్యాల్లోనే ఉంది.” (రోమీయులు 1:​20) సృష్టికర్త ఉనికిలో ఉన్నాడని గుర్తించడం ఒక ఎత్తయితే, ఆయనతో అర్థవంతమైన సంబంధం వృద్ధిచేసుకోవడం మరో ఎత్తు.

దేవునితో స్నేహం

ఈ విషయంలో కూడా బైబిలు సహాయం చేయగలదు. యెహోవా దేవుడు ప్రేమగల తండ్రని దాని ఆరంభ అధ్యాయాలు స్పష్టమైన రుజువునిస్తున్నాయి. ఉదాహరణకు, ఆయన ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత తానెవరో వారికి చెప్పకుండా ఉండలేదు. ఆయన వారితో క్రమంగా సంభాషించాడు. తాను వేరే పనులు చూసుకుంటూ, లోకంలో తమ మార్గం వెదుక్కోవడానికి ఆయన వారిని ఏదెనులో వదిలిపెట్టలేదు. బదులుగా, జీవించడానికి ఏది శ్రేష్ఠమైన మార్గమనే విషయంలో ఆయన వారికి నిర్దిష్టమైన మార్గదర్శకం ఇచ్చాడు. వారికాయన సంతృప్తికరమైన పని ఇచ్చాడు, వారి ప్రవర్ధమాన విద్య కోసం ఏర్పాటు చేశాడు. (ఆదికాండము 1:26-30; 2:​7-9) సమర్థుడైన, ప్రేమగల తండ్రి నుండి మీరు కోరేది ఇదే కాదా? దాని అర్థమేమిటో ఇప్పుడు ఆలోచించండి. “యెహోవాయే భూమిని సృష్టించాడనీ, తన సృష్టిని ఆస్వాదించే సామర్థ్యంతో మనలను రూపొందించాడనీ తెలుసుకోవడం మనం సంతోషంగా ఉండాలని ఆయన కోరుతున్నాడని నాకు వివరిస్తోంది” అని డీన్యల్‌ చెబుతోంది.

అంతకంటే ఎక్కువగా, ప్రేమగల అందరి తండ్రుల్లాగే యెహోవా తన పిల్లలందరూ తనతో వ్యక్తిగత సంబంధం కలిగివుండాలని కోరుతున్నాడు. ఈ విషయంలో అపొస్తలుల కార్యములు 17:⁠27 మనకిలా హామీ ఇస్తోంది: “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” ఈ విషయం తెలుసుకోవడం వల్ల ప్రయోజనమేమిటి? ఆంబర్‌ ఇలా అంటోంది: “యెహోవాను తెలుసుకోవడం, నేనెప్పటికీ ఒంటరి దాన్ని కాననే నమ్మకాన్ని నాకిచ్చింది. నేనెలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎల్లప్పుడూ నాకు అండగా ఉండే ఒక వ్యక్తి ఉన్నారు.” అంతేకాక, మీరు యెహోవాను తెలుసుకున్న కొద్దీ ఆయన దయాళుడనీ, న్యాయవంతుడనీ, మంచివాడనీ మీరు అర్థం చేసుకుంటారు. మీరాయనపై ఆధారపడవచ్చు. “యెహోవా సన్నిహిత స్నేహితుడైనప్పుడు, నన్ను ఆదుకోవడానికి ఆయనను మించినవారు మరొకరు లేరని నేను తెలుసుకున్నాను” అని జెఫ్‌ చెబుతున్నాడు.

అయితే, యెహోవా గురించి అనేక ప్రతికూల విషయాలు చెప్పబడడం విచారకరం. విపరీతమైన మానవ బాధలకు, మతసంబంధమైన దుష్ప్రవర్తనకు ఆయన నిందించబడ్డాడు. మానవ చరిత్రలోని ఘోరాతిఘోరమైన దారుణకృత్యాలు కొన్ని ఆయనకు అంటగట్టబడ్డాయి. కానీ ద్వితీయోపదేశకాండము 32:4, 5 ఇలా వివరిస్తోంది: “ఆయన చర్యలన్నియు న్యాయములు . . . వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు; వారు కళంకులు.” కాబట్టి వాస్తవాలను స్వయంగా పరిశోధించవలసిన బాధ్యత మనపై ఉంది.​—⁠ద్వితీయోపదేశకాండము 30:​19, 20.

దేవుని సంకల్పం నెరవేర్చబడింది

మనమేమి నిర్ణయించుకున్నా, దేవుడు ఈ భూమి పట్ల, మానవాళి పట్ల తనకున్న సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చకుండా ఆయనను ఏదీ ఆపుచేయలేదు. ఎంతైనా, ఆయన సృష్టికర్త. అయితే ఆ సంకల్పమేమిటి? యేసుక్రీస్తు తాను కొండమీద ఇచ్చిన ప్రసంగంలో దీనిని ప్రస్తావిస్తూ ఇలా అన్నాడు: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” ఆ తర్వాత ఆయన తన అపొస్తలుడైన యోహానుకు, దేవుడు “భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకు” దృఢ సంకల్పంతో ఉన్నాడని సూచించాడు. (మత్తయి 5:5; ప్రకటన 11:​18) సృష్టి సమయంలో యేసు, దేవునితోకూడా ఉన్నాడు కాబట్టి, పరిపూర్ణ మానవ కుటుంబం పరదైసు భూమిపై నిత్యం నివసించాలనేది ఆరంభం నుండి దేవుని సంకల్పమని ఆయనకు తెలుసు. (ఆదికాండము 1:26, 27; యోహాను 1:​1-3) పైగా దేవుడు మార్పులేనివాడు. (మలాకీ 3:⁠6) “నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును” అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు.​—⁠యెషయా 14:​24.

నేటి లోకంలో అధికమైపోయిన దురాశ, స్వీయాసక్తిపై కాక దేవుని పట్ల, పొరుగువారి పట్ల ప్రేమపై ఆధారపడిన ఐక్య సమాజానికి యెహోవా ఇప్పటికే పునాదులు వేయడం ఆరంభించాడు. (యోహాను 13:35; ఎఫెసీయులు 4:15, 16; ఫిలిప్పీయులు 2:​1-4) అది ఈ విధానాంతానికి ముందు, రాబోయే దేవుని రాజ్యసువార్తను ప్రకటించే ఆజ్ఞను నెరవేర్చాలనే గొప్ప పురికొల్పుతో, పురోగమిస్తున్న స్వచ్ఛంద సేవకుల సమాజం. (మత్తయి 24:14; 28:​19, 20) 230 కంటే ఎక్కువ దేశాల్లో 60 లక్షలకు పైగా క్రైస్తవులు ఇప్పటికే ప్రేమగల, అంతర్జాతీయ ఐక్య సహోదరత్వంతో కలిసి ఆరాధిస్తున్నారు.

మీ జీవితానికొక అర్థాన్నివ్వండి

మీ జీవితానికి మరింత అర్థముండాలని మీరు గ్రహించినట్లయితే, యెహోవా దేవుడు మిమ్మల్ని ఇప్పుడు తన ప్రజలతో అంటే తన ‘నీతిగల జనముతో’ సహవసించమని ఆహ్వానిస్తున్నాడని దయచేసి తెలుసుకోండి. (యెషయా 26:⁠2) అయితే ‘ఈ క్రైస్తవ సమాజంలో జీవితమెలా ఉంటుంది? నేను నిజంగా ఆ సమాజంలో ఉండాలని కోరుకుంటున్నానా?’ అని మీరు ఆలోచిస్తుండవచ్చు. కొందరు యౌవనులు ఏమి చెబుతున్నారో చూడండి:

క్వెంటిన్‌: “లోకంలో సంఘం నాకొక ఆశ్రయంలాంటిది. నా జీవితంలో యెహోవా ఒక భాగమని గ్రహించడం ఆయన ఉనికిలో ఉన్నాడనీ, నేను సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడనీ అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేస్తుంది.”

జెఫ్‌: “ప్రోత్సాహం కోసం నేను వెళ్లగల శ్రేష్ఠమైన స్థలం సంఘం. అక్కడున్న నా సహోదర సహోదరీలు నాకు మద్దతిస్తూ నన్ను మెచ్చుకుంటుంటారు. వాళ్లు నిజంగా ఉమ్మడి కుటుంబంలోని సభ్యుల్లా ఉంటారు.”

లినెట్‌: “ఎవరైనా ఒక వ్యక్తి బైబిలు సత్యాన్ని హత్తుకొని యెహోవాను సేవించాలనే నిర్ణయం తీసుకోవడాన్ని చూసే ఆనందాన్ని మరి దేనితోను పోల్చలేము. ఇది నా జీవితానికి గొప్ప సంతృప్తినిస్తుంది.”

కోడీ: “యెహోవా లేకపోతే నా జీవితానికి విలువేలేదు. సంతోషం కోసం అన్వేషిస్తూ, అది లభించక ఒకచోటి నుండి మరోచోటికి కొట్టుకొనిపోయే అనేకమంది ఇతరుల్లానే నేనూ ఉండేవాడిని. అయితే యెహోవా తనతో సంబంధమేర్పరచుకునే నమ్మశక్యంకాని ఆధిక్యతను నాకిచ్చాడు, అది నా జీవితానికొక అర్థానిస్తోంది.”

మీరే స్వయంగా ఎందుకు పరిశోధించకూడదు? మీ సృష్టికర్తయైన యెహోవా దేవునికి సన్నిహితం కావడం ద్వారా, జీవితానికి నిజమైన అర్థాన్ని తెలుసుకోవచ్చని మీరు గ్రహిస్తారు.

[31వ పేజీలోని చిత్రాలు]

దేవునితో సంబంధం కలిగివుండడం మన జీవితానికొక అర్థాన్నిస్తుంది

[29వ పేజీలోని చిత్రసౌజన్యం]

NASA photo