కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నన్ను ఎవరైనా “హుకప్‌” కోసం అడిగితే నేనేమి చేయాలి?

నన్ను ఎవరైనా “హుకప్‌” కోసం అడిగితే నేనేమి చేయాలి?

యువత ఇలా అడుగుతోంది . . .

నన్ను ఎవరైనా “హుకప్‌” కోసం అడిగితే నేనేమి చేయాలి?

“యౌవనస్థులు తమకు శారీరక సంబంధాలు పెట్టుకునే సామర్థ్యం ఉందేమో చూడడానికి, అలా ఎంతమందితో తాము సెక్స్‌ సంబంధాలు పెట్టుకోగలమో చూడడానికి హుకప్‌ అవుతుంటారు.”​—పీనీ. *

“అబ్బాయిలు దాని గురించి నిర్మొహమాటంగా మాట్లాడుకుంటారు. తమకు ఒకే గర్ల్‌ఫ్రెండ్‌ ఉన్నా చాలామంది అమ్మాయిలతో సెక్స్‌ సంబంధాలు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటారు.”​—ఎడ్వర్డ్‌.

“నన్ను హుకప్‌ కోసం అడిగినవారు దాని గురించి నిర్భయంగా మాట్లాడేవారు. నేను కుదరదని చెప్పినా వారు పదేపదే అడుగుతారు.”​—ఇడా.

కొన్ని దేశాల్లో అలాంటి సెక్స్‌ సంబంధాన్ని హుకప్‌ అంటారు. ఇతర దేశాల్లో దానికి వేర్వేరు పదాలున్నాయి. ఉదాహరణకు జపాన్‌లో అలా చేయడాన్ని టేక్‌-అవుట్స్‌ అంటారని అకీకో చెబుతోంది. “సేఫ్రే అంటే ‘సెక్స్‌ ఫ్రెండ్‌’ (లైంగికంగా దగ్గరయ్యే స్నేహితుడు/రాలు) అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. కేవలం శారీరక సంబంధాలు పెట్టుకోవడమే వారి స్నేహం వెనకున్న ఉద్దేశం” అని ఆమె చెప్పింది.

దానికి ఎలాంటి పేరు పెట్టినా దానర్థం ఒకటే, మనోభావాలతో ఎలాంటి సంబంధం లేకుండా, ఎలాంటి కట్టుబడి లేకుండా కేవలం లైంగిక వాంఛ తీర్చుకోవడానికే శారీరక సంబంధాలు పెట్టుకోవడం. * తమకు “ప్రయోజనాలు చేకూర్చే స్నేహితులు” ఉన్నారని అంటే పెళ్లి, ప్రేమ అనే “ఇక్కట్లు” లేకుండా కావల్సినన్నిసార్లు శారీరకంగా కలుసుకునే స్నేహితులు ఉన్నారని కొందరు యౌవనస్థులు గొప్పలు పోతుంటారు. “హుకప్‌ అంటే అప్పటికప్పుడు శారీరక వాంఛను తీర్చుకోవడమే, మీకు కావల్సింది మీరు పొందిన తర్వాత చేతులు దులిపేసుకోవచ్చు” అని ఒక యౌవనస్థురాలు చెబుతోంది.

క్రైస్తవులుగా మీరు “జారత్వమునకు దూరముగా పారిపో[వాలి].” * (1 కొరింథీయులు 6:​18) ఆ విషయం తెలిసిన మీరు, ప్రమాదానికి దారితీయగల పరిస్థితుల విషయంలో జాగ్రత్తగా ఉండడానికి తప్పకుండా కృషి చేస్తారు. అయితే, కొన్నిసార్లు సమస్యలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. “స్కూల్లో చాలామంది అబ్బాయిలు నన్ను హుకప్‌ కోసం రమ్మన్నారు” అని సిండీ చెబుతోంది. మీ ఉద్యోగస్థలంలో అదే ఎదురవ్వవచ్చు. “మా మేనేజరు నన్ను హుకప్‌ కోసం అడిగాడు, అతను నన్ను ఎంతగా వేధించాడంటే నేను ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది” అని మార్గరేట్‌ చెబుతోంది.

మరోవైపు, మీ మనసులో కూడా అలాంటి కోరికే పుడితే కంగారుపడకండి. “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది” అని బైబిలు చెబుతోంది. (యిర్మీయా 17:9) లూర్దిస్‌ అనే అమ్మాయి అది నిజమని తెలుసుకుంది. “తనను హుకప్‌ కోసం అడిగిన అబ్బాయి అంటే నాకు ఇష్టం” అని ఆమె ఒప్పుకుంటోంది. జేన్‌కి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. “నేను అతనివైపు బలంగా ఆకర్షితురాలినయ్యేదాన్ని, వద్దని చెప్పడం నేను చేసిన పనుల్లో అతి కష్టమైనది” అని ఆమె ఒప్పుకుంది. నైతిక పవిత్రతను కాపాడుకోవడం అంత సులభం కాదు అని పైన పేర్కొనబడిన ఎడ్వర్డ్‌ కూడా ఒప్పుకున్నాడు. “ఎంతోమంది అమ్మాయిలు నాతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ముందుకువచ్చారు, దానికి దూరంగా ఉండడం క్రైస్తవునిగా నాకు తీవ్ర పోరాటమనే చెప్పాలి, వారిని నిరాకరించడం కష్టం” అని ఆయన చెప్పాడు.

లూర్దిస్‌, జేన్‌, ఎడ్వర్డ్‌లలాగే మీకూ అనిపించినా మీరు యెహోవా దేవుని దృష్టిలో సరైనది చేసివుంటే, మీరు నిజంగా ప్రశంసార్హులు. అపొస్తలుడైన పౌలు కూడా తప్పుడు ఆలోచనలకు వ్యతికేరంగా నిర్విరామ పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలుసుకోవడం మీకు ప్రోత్సాహకరంగా ఉండవచ్చు.​—రోమీయులు 7:​21-24.

ఎవరైనా మిమ్మల్ని హుకప్‌ కోసం అడిగితే మీరు ఏ బైబిలు సూత్రాలను మనసులో ఉంచుకోవాలి?

అలా చేయడం ఎందుకు తప్పో తెలుసుకోండి

వివాహేతర లైంగిక సంబంధాలను బైబిలు ఖండిస్తోంది. నిజానికి, జారత్వం ఎంత గంభీరమైన పాపం అంటే దానికి పాల్పడేవారు “దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” (1 కొరింథీయులు 6:​9, 10) అలా లైంగిక వాంఛ తీర్చుకోవడానికే శారీరక సంబంధాలు పెట్టుకోవాలనే కోరికను విడనాడాలంటే, యెహోవా దానినెలా దృష్టిస్తాడో వ్యక్తిగతంగా మీరూ అలాగే దృష్టించండి. నైతిక పవిత్రతను కాపాడుకోవడం మీ స్వంత నిర్ణయమై ఉండాలి.

“యెహోవా నిర్దేశించే మార్గమే జీవించేందుకు అతి శ్రేష్ఠమైన మార్గమని నాకు పూర్తి నమ్మకం ఉంది.”​—కారెన్‌, కెనడా.

“కేవలం క్షణమాత్రపు సుఖం కోసం యెహోవా దేవుని నైతిక ప్రమాణాలను నిర్లక్ష్యం చేసేవారు జీవితంలో చాలా కోల్పోతారు.”​—వివియన్‌, మెక్సికో.

“మీరు ఒకరికి కూతురు లేదా కొడుకు అని, అనేకులకు స్నేహితుడినో/రాలినో అని, సంఘంలో భాగంగా ఉన్నానని మరచిపోకండి. మీరు తప్పు చేయడానికి తలవంచితే వారందరినీ బాధపెడతారు!”​—పీటర్‌, బ్రిటన్‌.

“ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు” ఉండండి అని పౌలు వ్రాశాడు. (ఎఫెసీయులు 5:​10) మీ అపరిపూర్ణ శరీరానికి కోరదగినదిగా అనిపించినా, జారత్వం విషయంలో యెహోవాకున్న దృక్పథాన్నే అలవర్చుకోవడం ద్వారా మీరు కూడా ‘చెడుతనమును అసహ్యించుకుంటారు.’​—కీర్తన 97:​10.

చదవడానికి సూచించబడిన లేఖనాలు: ఆదికాండము 39:​7-9. లైంగికంగా ఒత్తిడి చేయబడినప్పుడు యోసేపు ధైర్యంగా ఎలా చర్య తీసుకున్నాడో, దాన్ని ఎదిరించడానికి ఆయనకు ఏమి సహాయం చేసిందో పరిశీలించండి.

మీ నమ్మకాల విషయంలో గర్వపడండి

సాధారణంగా యౌవనులు తమ నమ్మకాల విషయంలో గర్వపడి, వాటిని సమర్థిస్తూ ఉంటారు. క్రైస్తవులుగా మీరు, మాదిరికరమైన మీ ప్రవర్తన ద్వారా దేవుని నామాన్ని సమర్థించడం మీకివ్వబడిన ఆధిక్యత. వివాహానికి ముందు లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదనే స్థిరమైన మీ తీర్మానం విషయంలో సిగ్గుపడకండి.

“మీకు నైతిక సూత్రాలు ఉన్నాయని మొదటి నుంచే స్పష్టం చేయండి.”​—ఆలెన్‌, జర్మనీ.

“మీ నమ్మకాల విషయంలో సిగ్గుపడకండి.”​—ఎస్తేర్‌, నైజీరియా.

“‘డేటింగ్‌ చేయడానికి నా తల్లిదండ్రులు ఒప్పుకోరు’ లాంటి కారణాలు చెప్తే, హుకప్‌ విషయంలో మీ స్థానాన్ని మీ తోటివారు అంగీకరించరు. వారితో డేటింగ్‌ చేయడంపై మీకు స్వయానా ఎటువంటి ఆసక్తీ లేదని మీ తోటివయస్కులకు తెలియజేయండి.”​—జానెట్‌, దక్షిణాఫ్రికా.

“నాతోపాటు హైస్కూల్లో చదివే అబ్బాయిలకు నేనెలాంటిదాన్నో తెలుసు, వారి ప్రయత్నాలు వ్యర్థమని కూడా వారికి తెలుసు.”​—విక్కీ, అమెరికా.

మీ నమ్మకాలను సమర్థించడం అనేది మీరు పరిణతి చెందుతున్నారనడానికి సూచన.​—1 కొరింథీయులు 14:​20.

చదవడానికి సూచించబడిన లేఖనం: సామెతలు 27:​11. మీరు చేసే పనులు అత్యంత మహోన్నతమైన సంకల్పాన్ని అంటే యెహోవా నామాన్ని ఎలా పవిత్రపరుస్తాయో తెలుసుకోండి.

స్థిరంగా ఉండండి!

అది సాధ్యం కాదని చెప్పడం ప్రాముఖ్యం. అయితే మీరు నిరాకరించడాన్ని కొందరు “కేవలం ఆసక్తి లేనట్లు నటించడం” అని అపార్థం చేసుకోవచ్చు.

“మీరు నిరాకరించిన వ్యక్తి దాన్ని తన సామర్థ్యానికి ఒక సవాలుగా పరిగణిస్తూ మీ వెంటపడవచ్చు.”​—లారెన్‌, కెనడా.

“మీకు సంబంధించిన ప్రతీ విషయంలో అంటే మీ వస్త్రధారణలో, సంభాషించే విధానంలో, ఎవరితో మాట్లాడుతున్నారనే విషయంలో, ఇతరులతో ప్రవర్తించే విధానంలో మీ తిరస్కారం వెల్లడవ్వాలి.”​—జాయ్‌, నైజీరియా.

“మీ తిరస్కారం స్థిరంగా, నొక్కిచెప్పేటట్లుగా ఉండాలి.”​—డానియెల్‌, ఆస్ట్రేలియా.

“స్థిరంగా ఉండండి! ఒక యౌవనుడు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించినప్పుడు, ‘నా భుజమ్మీదనుండి చెయ్యి తియ్‌’ అని గట్టిగా చెప్పి, కోపంగా చూస్తూ అక్కడి నుండి నడిచి వచ్చేశాను.”​—ఎలెన్‌, బ్రిటన్‌.

“మీకు వారిపై ఏమాత్రం ఆసక్తి లేదనీ, భవిష్యత్తులో ఉండబోదనీ ముక్కుసూటిగా చెప్పాలి. అది మృదువుగా ఉండాల్సిన సమయం కాదు.”​—జీన్‌, స్కాట్లండ్‌.

“ఒక అబ్బాయి హుకప్‌ కోసం అడుగుతూ, వ్యంగ్యమైన వ్యాఖ్యానాలు చేస్తూ విసిగిస్తూ వచ్చాడు. నేను పూర్తిగా స్థిరంగా ఉన్నప్పుడే అతడు నన్ను వేధించడం మానేశాడు.”​—క్వానీటా, మెక్సికో.

“వాళ్ళు కోరుకునేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అనే విషయాన్ని మీరు స్పష్టం చేయాలి. హుకప్‌ కోసం మిమ్మల్ని ఒత్తిడి చేసే అబ్బాయిల నుండి ఎన్నడూ బహుమతులు స్వీకరించకండి. అలాచేస్తే, మీరు వారికేదో బాకీ ఉన్నారనే విధంగా వారు ప్రవర్తించగలరు.”​—లారా, బ్రిటన్‌.

మీరు స్థిరంగా ఉంటే యెహోవా మీకు సహాయం చేస్తాడు. దావీదు స్వీయానుభవంతో యెహోవా గురించి ఇలా చెప్పగలిగాడు: “నీవు . . . యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు.”​—కీర్తన 18:​25.

చదవడానికి సూచించబడిన లేఖనం: 2 దినవృత్తాంతములు 16:9. యథార్థహృదయులకు సహాయం చేయాలని యెహోవా ఎంతగా కోరుకుంటున్నాడో గమనించండి.

ముందుచూపుతో వ్యవహరించండి

“బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 22:3) మీరు ఆ సలహాను ఎలా పాటించవచ్చు? ముందుచూపుతో వ్యవహరించడం ద్వారా!

“లైంగిక విషయాల గురించి మాట్లాడేవారి నుండి మీరు సాధ్యమైనంత దూరంగా ఉండండి.”​—నయోమి, జపాన్‌.

“ప్రమాదకరంగా మారగల సహవాసులను, పరిస్థితులను దరిచేరనివ్వకండి. ఉదాహరణకు, మద్యం మత్తులో తప్పు చేయడానికి లొంగిపోయిన కొందరు నాకు తెలుసు.”​—ఇషా, బ్రెజిల్‌.

“మీ చిరునామా లేదా ఫోను నంబరు లాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరికీ ఇవ్వకండి.”​—డయానా, బ్రిటన్‌.

“తోటివిద్యార్థులను అకారణంగా కౌగిలించుకోకండి.”​—ఎస్తేర్‌, నైజీరియా.

“మీ వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ దుస్తులు రెచ్చగొట్టేలా ఉండకూడదు.”​—హైడీ, జర్మనీ.

“మీ తల్లిదండ్రులతో మంచి సంబంధాన్ని కలిగివుండి, వారితో ఇలాంటి పరిస్థితుల గురించి మాట్లాడడం మిమ్మల్ని సంరక్షిస్తుంది.”​—అకీకో, జపాన్‌.

మీరు మాట్లాడే, ప్రవర్తించే తీరు గురించి, స్నేహితుల గురించి, మీరు తరచూ వెళ్లే స్థలాల గురించి ఆలోచించండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘శారీరక సంబంధాలు పెట్టుకోమని ఇతరులు నన్ను అడిగేందుకు నడిపించేలా నేను ప్రవర్తిస్తున్నానా లేక నాకు తెలియకుండానే వారలా చేయడానికి పురికొల్పుతున్నానా?’

చదవడానికి సూచించబడిన లేఖనాలు: ఆదికాండము 34:​1, 2. దీనా, వెళ్లకూడని స్థలానికి వెళ్లడంవల్ల ఎలాంటి ఘోరమైన పర్యవసానాలకు దారితీసిందో తెలుసుకోండి.

కేవలం లైంగిక వాంఛ తీర్చుకోవడానికే శారీరక సంబంధాలు పెట్టుకోవడం యెహోవా దృష్టిలో చిన్న విషయం కాదు, మీరు కూడా దాన్ని గంభీరంగానే పరిగణించాలి. “వ్యభిచారియైనను, అపవిత్రుడైనను . . . దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు” అని బైబిలు చెబుతోంది. (ఎఫెసీయులు 5:5) సరైనదాన్ని చేయాలనే నిశ్చయతతో ఉండడం ద్వారా మీరు నిర్మలమైన మనస్సాక్షిని కాపాడుకుని, మీ స్వాభిమానాన్ని నిలుపుకుంటారు. కార్లీ అనే అమ్మాయి చెబుతున్నట్లుగా, “వేరొకరి వాంఛకు మీరు ‘బలి’ అయ్యేందుకు ఎందుకు అనుమతిస్తారు? మీరు ఇప్పటివరకూ నిలుపుకున్నదాన్ని అలాగే కాపాడుకోండి!” (g 3/07)

“యువత ఇలా అడుగుతోంది . . . ” శీర్షికల పరంపరలోని మరిన్ని ఆర్టికల్స్‌ www.watchtower.org/ype వెబ్‌సైట్‌లో చూడవచ్చు

ఆలోచించాల్సిన విషయాలు

◼ అపరిపూర్ణ మానవ నైజానికి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కోరదగినదిగా అనిపించినా, అలా చేయడం ఎందుకు తప్పు?

◼ కేవలం లైంగిక వాంఛ తీర్చుకోవడానికే శారీరక సంబంధాలు పెట్టుకోమని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేమి చేస్తారు?

[అధస్సూచీలు]

^ ఈ ఆర్టికల్‌లో కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

^ ఆ పదాలు ఇతర రకాల సన్నిహిత ప్రవర్తనను అంటే స్పర్శించుకోవడాన్ని లేదా మోహంతో ముద్దులు పెట్టుకోవడాన్ని కూడా సూచిస్తుంది.

^ జారత్వంలో సంభోగం, ముఖరతి, ఆసన సంభోగము, సలింగ సంయోగం, మరో వ్యక్తికి హస్తప్రయోగం చేయడం, అవివాహితులు తమ మర్మాంగాలను దుర్నీతిగా ఉపయోగించడం వంటివి ఇమిడివున్నాయి.

[27వ పేజీలోని బాక్సు]

▪ జారత్వానికి పాల్పడే వ్యక్తి “తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు” అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 6:​18) ఆ మాటలెలా నిజం? అలా పాపం చేయడానికి దారితీసే కొన్నింటి గురించి ఆలోచించి, వాటిని ఈ క్రింద వ్రాయగలరేమో చూడండి.

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

సూచన: పై ప్రశ్నకు జవాబును కనుగొనడంలో సహాయం కోసం మీరు కావలికోట జూన్‌ 15, 2006 28వ పేజీ, 14వ పేరాను, కావలికోట జూన్‌ 15, 2002 21వ పేజీ, 17వ పేరాను చూడండి. ఆ రెండు పత్రికలను యెహోవాసాక్షులే ప్రచురించారు.

[29వ పేజీలోని బాక్సు]

తల్లిదండ్రులకు గమనిక

“స్కూల్లో నా తోటివిద్యార్థి హుకప్‌ కోసం నన్ను అడిగాడు. అతనేమి అడుగుతున్నాడో గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది. అప్పుడు నాకు 11 ఏళ్లే.”​— లీయా.

పిల్లలు ఇప్పుడు చాలా చిన్న వయసులోనే లైంగిక విషయాల గురించి వింటున్నారు. బైబిలు “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని,” అప్పుడు ప్రజలు “అజితేంద్రియులుగా . . . దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారి[గా]” ఉంటారని చాలాకాలం క్రితమే తెలియజేసింది. (2 తిమోతి 3:​1, 3, 4) ఆ ప్రవచనం నిజమని నిరూపించే అనేక సూచనల్లో ఒకటి, యౌవనస్థుల కోసం ఉద్దేశించిన ఈ ఆర్టికల్‌లో నొక్కిచెప్పడిన “హుకప్‌.”

మీరు పెరిగిన లోకంకన్నా నేటి లోకం చాలా భిన్నంగా ఉంది. అయితే, కొన్ని విధాలుగా చూస్తే అప్పుడున్న సమస్యలే నేడూ ఉన్నాయి. కాబట్టి, మీ పిల్లలు పెరుగుతున్న చెడు వాతావరణం విషయంలో అతిగా ఆందోళన చెంది, భయపడకండి. బదులుగా, అపొస్తలుడైన పౌలు దాదాపు 2,000 సంవత్సరాల క్రితం క్రైస్తవుల్ని ప్రోత్సహించిన విధంగానే మీ పిల్లలు కూడా చేసేలా మీరు వారికి సహాయం చేయాలని తీర్మానించుకోండి. ఆయనిలా వ్రాశాడు: “మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి.” (ఎఫెసీయులు 6:​11) నిజానికి, అనేకమంది క్రైస్తవ యౌవనస్థులు తమ చుట్టూ చెడు ప్రభావాలున్నా సరైనది చేయడానికి ప్రశంసాపూర్వకంగా కృషి చేస్తున్నారు. మీ పిల్లలు అలా సరైనది చేయడానికి మీరెలా సహాయపడవచ్చు?

దానికి ఒక మార్గం ఏమిటంటే, మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించి మీ అబ్బాయితో లేదా అమ్మాయితో నిర్మొహమాటంగా చర్చించండి. “చదవడానికి సూచించబడిన లేఖనాలు” అనే భాగాల్లో ఆలోచన రేకెత్తించే లేఖనాలు ఇవ్వబడ్డాయి. కొందరు సరైనది చేయడానికి కట్టుబడి ఎలా ఆశీర్వాదాలను చవిచూశారో, మరికొందరు దేవుని నియమాలను నిర్లక్ష్యం చేసి ఎలా దుష్ఫలితాలను ఎదుర్కొన్నారో చూపించే నిజ జీవిత ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. వారికీ, మీకూ ఉన్న దేవుని నియమాలకు అనుగుణంగా జీవించడమనే గొప్ప ఆధిక్యతను గుర్తించేలా మీ పిల్లలకు సహాయం చేయడానికి “చదవడానికి సూచించబడిన లేఖనాలు” అనే భాగాల్లో సూత్రాలు ఇవ్వబడ్డాయి. మీ పిల్లలతో ఆ సమాచారాన్ని పునఃసమీక్షించడానికి మీరు ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు?

దేవుని ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవడం మనకు ఎప్పటికీ ప్రయోజనకరమే. (యెషయా 48:​17, 18) వాటిని పెడచెవిన పెట్టడం ఖచ్చితంగా సమస్యలకు దారితీస్తుంది. మీరు మీ పిల్లల హృదయాల్లో దేవుని నియమాలను, సూత్రాలను నాటడానికి ప్రయత్నిస్తుండగా యెహోవా ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండాలని తేజరిల్లు! పత్రిక ప్రకాశకులు ఆశిస్తున్నారు.​—ద్వితీయోపదేశకాండము 6:​6, 7.

[28వ పేజీలోని చిత్రం]

వాళ్ళు కోరుకునేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అనే విషయాన్ని మీరు స్పష్టం చేయాలి