కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కామ్‌చట్కా రష్యా పసిఫిక్‌ తీరంలోని అద్భుత ప్రాంతం

కామ్‌చట్కా రష్యా పసిఫిక్‌ తీరంలోని అద్భుత ప్రాంతం

కామ్‌చట్కా రష్యా పసిఫిక్‌ తీరంలోని అద్భుత ప్రాంతం

రష్యాలోని తేజరిల్లు! రచయిత

మూడు వందల కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం, ఆసియా ఖండం గుండా తూర్పు దిశలో పయనిస్తున్న రష్యా అన్వేషకులకు, ఓకాట్‌స్క్‌ సముద్రాన్నీ బేరింగ్‌ సముద్రాన్నీ వేరుచేస్తూ దక్షిణ దిశలో ముందుకు పొడుచుకొనివున్న పర్వత ద్వీపకల్పం తారసపడింది. ఆ ద్వీపకల్పం ఇటలీ దేశం కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. అంతగా వెలుగులోకి రాని ఈ అందమైన ప్రదేశం గురించి బయటివారికి ఇప్పటికీ పెద్దగా తెలియదు.

ఈ ద్వీపకల్పంలోని తీర ప్రాంతాల్లో, శీతాకాలంలో చలి అంత ఎక్కువగా ఉండదు, అదే లోపలి భాగాల్లో అయితే 6 మీటర్ల కన్నా ఎక్కువ మంచు కురుస్తుంది, కొన్నిసార్లు దాదాపు 12 మీటర్ల మంచు కురుస్తుంది! వేసవి కాలంలో, ఆ ద్వీపకల్పాన్ని ఎక్కువగా సముద్రపు పొగమంచు కప్పుతుంది, బలమైన గాలులు వీస్తాయి. కామ్‌చట్కా అగ్నిపర్వత నేలమీద వర్షపాతం ఎక్కువ కాబట్టి అక్కడ పచ్చని మొక్కలతోపాటు, పండ్లుకాసే పొదలు, మనిషంత ఎత్తులో ఉండే గడ్డి పెరగడమేకాక, పచ్చిక మైదానాల రాణిగా పేరుపొందిన గులాబీపువ్వు లాంటి అద్భుతమైన అడవిపూలు పూస్తాయి.

స్టోన్‌ లేక ఇర్మాన్‌ కొండరావి చెట్లు ఆ ద్వీపకల్పంలోని మూడోవంతు భాగాన్ని ఆక్రమించాయి, భయంకరమైన గాలులు, దట్టంగా కురిసే మంచు వాటి కాండాలను, పెద్ద కొమ్మలను వంచి, మెలికలు తిరిగేలా చేస్తాయి. మొండిగా, నిదానంగా పెరిగే ఈ కొండరావి చెట్లు అసాధారణ రీతిలో బలంగా ఉంటాయి, వాటి వేర్లు దృఢంగా ఉంటాయి, దానివల్ల ఆ చెట్లు దాదాపు ఎక్కడైనా పెరగగలవు, చివరకు కొండల అంచుల్లో అడ్డంగా కూడా పెరగగలవు! సాధారణంగా జూన్‌ నెలలో ఆ ద్వీపకల్పం మంచుతో కప్పబడినప్పటికీ వాటి ఆకులు చిగురుస్తాయి, ఆగస్టులో వాటి ఆకులు పసుపు పచ్చగా మారి శీతాకాల ఆగమనాన్ని చాటుతాయి.

అగ్నిపర్వతాలు, వేడినీటి ఊటలు, కొలనులు

పసిఫిక్‌ మహాసముద్రం చుట్టూ భూకంపాలు ఎక్కువగా సంభవించే అగ్నివలయమున్న ప్రాంతంలో నెలకొనివున్న కామ్‌చట్కాలో దాదాపు 30 విస్ఫోటక అగ్నిపర్వతాలు ఉన్నాయి. “పరిపూర్ణమైన, ఎంతో అందమైన శంఖువు” ఆకారంలోవున్న అగ్నిపర్వతంగా వర్ణించబడిన కివ్యుచెఫ్స్కాయా అగ్నిపర్వతం సముద్రమట్టానికి 4,750 మీటర్ల ఎత్తులో ఉంది కాబట్టి, అది యురేషియాలోనే అతిపెద్ద విస్ఫోటక అగ్నిపర్వతమని చెప్పవచ్చు. రష్యా అన్వేషకులు కామ్‌చట్కామీద మొదట కాలుమోపినప్పటి నుండి అంటే 1697 నుండి ఆ ద్వీపకల్పంలో 600 కన్నా ఎక్కువ విస్ఫోటనాలు నమోదయ్యాయి.

1975/76లో టోల్బాచిక్‌ ప్రాంతంలో బీటలు లేక పగుళ్లతోకూడిన విస్ఫోటనాలు సంభవించి దాదాపు 2,500 మీటర్ల కన్నా అధిక ఎత్తులో మండుతున్న “దివిటీ” ఏర్పడింది! బూడిదవల్ల ఏర్పడిన మేఘాల్లో మెరుపులు మెరిశాయి. అలా ఏడాదిన్నర వరకు నిర్విరామంగా కొనసాగిన ఆ విస్ఫోటనాలవల్ల నాలుగు క్రొత్త అగ్నిపర్వత శంఖువులు ఏర్పడ్డాయి. సరస్సులు, నదులు కనుమరుగయ్యాయి, వేడి బూడిద అడవులను కూకటివేళ్లతో మాడిమసైపోయేలా చేసింది. ఎన్నో గ్రామీణ ప్రాంతాలు ఎడారులుగా మారాయి.

సంతోషకరంగా, అనేక విస్ఫోటనలు నివాసిత ప్రాంతాలకు దూరంగా జరిగాయి కాబట్టి, కొంచెమే ప్రాణనష్టం జరిగింది. అయితే సందర్శకులు జాగ్రత్తగా ఉండేందుకు ఇతర కారణాలున్నాయి, ప్రత్యేకంగా కెక్పెనాచ్‌ అగ్నిపర్వతం అడుగున ఉన్న వ్యాలీ ఆఫ్‌ డెత్‌కు వెళ్తున్నప్పుడు వారు జాగ్రత్తగా ఉండాలి. గాలి వీయని సమయంలో, ప్రత్యేకంగా వసంత రుతువులో మంచు కరిగేంతగా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అగ్నిపర్వత సంబంధ విషపూరిత వాయువులు ఆ లోయలో కేంద్రీకృతమై వన్యప్రాణుల జీవానికి అపాయకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక సందర్భంలో, ఆ లోయలో పది ఎలుగుబంట్లు, అనేక చిన్న జంతువుల మృతకళేబరాలు చెల్లాచెదురుగా పడివున్నాయి.

ఊజాన్‌ కాల్డెరాగా పేరుపొందిన అతిపెద్ద అగ్నిపర్వతశిఖర బిలంలో వేడి బురద ఉబికే మట్టి గుంటలూ, వివిధరంగుల నాచుతో నిండివుండి అత్యంత వేడిగావున్న సరస్సులూ ఉన్నాయి. అదే ప్రాంతంలో 1941లో వెలుగుచూసిన వ్యాలీ ఆఫ్‌ గీజర్స్‌ ఉంది. కొన్ని వేడినీటి ఊటలు రెండు మూడు నిమిషాలకొకసారి పేలతాయి, మరికొన్ని కొన్నిరోజులకు ఒకసారి పేలతాయి. హెలికాప్టర్లు సందర్శకులను పిట్రాపావ్లావ్స్క​—కామ్చాస్ట్కి నగరానికి ఉత్తరాన దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అద్భుతమైన ప్రదేశాలకు తీసుకువెళ్తాయి. అయితే, సున్నితమైన పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా ఉంచేందుకు సందర్శకుల సంఖ్య జాగ్రత్తగా నియంత్రించబడుతోంది. అందుకే, కామ్‌చట్కాలోని ఆరు ప్రాంతాలు ప్రపంచ వారసత్వ స్థలాలుగా (వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్స్‌గా) సంరక్షించబడుతున్నాయి.

కామ్‌చట్కాలో ఎన్నో వేడినీటి కొలనులు ఉన్నాయి, వాటిలో అనేక కొలనుల ఉష్ణోగ్రత 30-40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉంటుంది. అవి సందర్శకులను ఉల్లాసపర్చి సుదీర్ఘమైన శీతాకాల నెలల నుండి కొంత ఊరటనిస్తాయి. విద్యుత్తు ఉత్పత్తికి భూతాపం కూడా ఉపయోగించబడుతోంది. వాస్తవానికి, రష్యాలోని మొట్టమొదటి భూతాప విద్యుత్‌ కేంద్రం ఈ ద్వీపకల్పంలోనే నిర్మించబడింది.

ఎలుగుబంట్లు, సాల్‌మన్‌ చేపలు, సముద్ర డేగలు

గోధుమవర్ణంలోవుండే ఎలుగుబంట్లు దాదాపు 10,000 ఇప్పటికీ కామ్‌చట్కాలో సంచరిస్తున్నాయి. వాటి సగటు బరువు 150-200 కిలోల వరకు ఉంటుంది, అయితే అవి చంపబడకపోతే ఇంకా దాదాపు మూడు రెట్లు ఎక్కువగా పెరగగలవు. ఈ ద్వీపకల్ప నివాసులైన ఈటల్‌మన్‌ ప్రజల జానపద గాథల్లో, ఎలుగుబంట్లు వారి “సోదరులుగా” ప్రస్తావించబడ్డాయి, వారు ఆ జంతువులను గౌరవించేవారు. తుపాకీల రాకతో ఆ సహోదరత్వం అంతమైంది. ఆ జంతువు భవిత గురించి సంరక్షణావాదులు ఆందోళన చెందుతున్నారు.

ఎలుగుబంట్లు పిరికివి కాబట్టి అవి చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే జూన్‌ నెలలో, సాల్‌మన్‌ చేపలు నదుల్లో గుడ్లు పెట్టడం మొదలుపెట్టినప్పుడు వాటిని ఆరగించడానికి చాలా ఎలుగుబంట్లు వస్తాయి, ఒక ఎలుగుబంటి రెండు డజన్ల సాల్‌మన్‌ చేపలను ఇట్టే లాగించగలదు! వాటికి ఎందుకంత విపరీతమైన ఆకలి? ఆహారం దొరకని శీతాకాలంలో సజీవంగా ఉండేందుకు ఎలుగుబంట్లు శరీరంలో సరిపడేంత క్రొవ్వు కూడబెట్టుకోవాలి, ఆ కాలంలో శక్తిని కాపాడుకోవడానికి అవి సురక్షితమైన బొరియల్లో నిద్రిస్తూ గడుపుతాయి.

స్టెల్లార్‌ సముద్ర డేగ అనే అద్భుతమైన పక్షి కూడా సాల్‌మన్‌ చేపలను ఆరగిస్తుంది, ఈ పక్షి రెక్కలు దాదాపు 2.5 మీటర్ల వరకు విచ్చుకోగలవు. చాలామట్టుకు నల్లగా ఉండే ఈ పక్షికి భుజమ్మీద తెల్లని మచ్చ ఉంటుంది, త్రిభుజాకృతిలో ఉండే తెల్లని తోక ఉంటుంది. ఇప్పుడు దాదాపు 5,000 వరకు ఉన్న ఈ పక్షుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది, ప్రపంచంలో అవి ఈ ప్రదేశంలోనే కనిపిస్తాయి, ఇవి అల్యూషియన్‌, ప్రిబలాఫ్‌ ద్వీపాల్లో కూడా కొన్నిసార్లు కనిపిస్తుంటాయి. ఈ పక్షులు ఉపయోగించిన గూళ్లనే ప్రతీ ఏడాది ఉపయోగిస్తూ, వాటిని కాపాడుతూ, వాటికి మరికొంత కలుపుతూ ఉంటాయి. ఒక గూడు వృత్తవ్యాసం మూడు మీటర్లకు పెరిగి ఎంత బరువుగా తయారైందంటే దానికి ఆధారంగా ఉన్న కొండరావి చెట్టుకు పగుళ్లు ఏర్పడ్డాయి!

కామ్‌చట్కా వాసులు

ప్రస్తుతం కామ్‌చట్కా వాసుల్లో రష్యావారే ఎక్కువగా ఉన్నారు, అయితే వేలాదిమంది ఆ ద్వీపకల్ప వాసులు కూడా అక్కడ నివసిస్తున్నారు, వారిలో ఉత్తరాన నివసిస్తున్న కార్యాక్‌ గుంపువారు ఎక్కువగా ఉన్నారు. చుక్చి, ఈటల్‌మన్‌ వంటి ఇతర గుంపులవారు కూడా అక్కడ నివసిస్తున్నారు, ఆ రెండు గుంపులకు మాతృభాష ఉంది. కామ్‌చట్కా వాసుల్లో చాలామంది పరిపాలక కేంద్రమైన పిట్రాపావ్లావ్స్క​—కామ్చాస్ట్కిలో నివసిస్తున్నారు. ద్వీపకల్పంలోని మిగతా ప్రాంతాల్లో జనవాసం అంతగా లేదు, తీర ప్రాంతాల్లో, నదిఒడ్డున ఉన్న అనేక పల్లెలకు పడవ లేదా విమానం ద్వారానే చేరుకోవచ్చు.

చేపలు పట్టడం, పీతలు పట్టడం కామ్‌చట్కా ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు. కామ్‌చట్కా జెయింట్‌ రెడ్‌ క్రాబ్స్‌ (కామ్‌చట్కా రాక్షస ఎర్రపీతలు) ప్రత్యేకంగా పేరుపొందాయి. వాటి గోళ్లమధ్య ఎడం 1.7 మీటర్లు ఉంటుంది కాబట్టి విక్రయించే బల్లలమీద అవి ఆకర్షణీయంగా, వర్ణభరితంగా కనిపిస్తాయి.

యెహోవాసాక్షులు మరో రకమైన చేపలు పట్టే ఉద్దేశంతో 1989 నుండి కామ్‌చట్కాను సందర్శిస్తున్నారు. “మనుష్యులను పట్టుజాలరులుగా” వారు కామ్‌చట్కాలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. (మత్తయి 4:​19; 24:​14) కొందరు ఆ సువార్తకు ప్రతిస్పందించి యెహోవా దేవుని సృష్టిని ఆరాధించే బదులు సృషికర్తయైన ఆయనను తెలుసుకొని, ఆరాధించేందుకు వారు ఇప్పుడు ఇతరులకు సహాయం చేస్తున్నారు. దానివల్ల స్థానికుల్లో చాలామంది దుష్టాత్మల విషయంలో సాధారణంగా ఉండే భయం నుండి విముక్తి పొందుతున్నారు. (యాకోబు 4:7) భవిష్యత్తులో భూమంతటి నుండి సమస్త దుష్టత్వం తీసివేయబడి, దుష్టులు నిర్మూలించబడి, “యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండు” కాలం గురించి కూడా వారు నేర్చుకుంటున్నారు.​—యెషయా 11:9. (g 3/07)

[18వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

అద్భుతమైన కాల్డెరా

ప్రాచీన అగ్నిపర్వత బిలమైన ఊజాన్‌ కాల్డెరా దాదాపు 10 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దాని నిటారు గోడల లోపల “కామ్‌చట్కా వేటికోసం ప్రఖ్యాతిగాంచిందో అవన్నీ” ఉన్నాయి అని ఒక గ్రంథం చెబుతోంది. ఆ బిలంలో వేడినీటి కొలనులు, చన్నీటి కొలనులు, వేడి బురద ఉబికే మట్టి గుంటలు, వేడినీటి కొలనుల దగ్గర వేడి బురదను విరజిమ్మే అగ్నిపర్వతాలు, చేపలు, హంసలతో కళకళలాడుతున్న ఎంతో స్వచ్ఛమైన సరస్సులతోపాటు, విస్తారమైన వృక్షసంపదకూడా ఉంది.

“అలాంటి ప్రదేశం భూమ్మీద మరెక్కడా లేదు” అని మిరకల్స్‌ ఆఫ్‌ కామ్‌చట్కా ల్యాండ్‌ అనే పుస్తకం చెబుతోంది, శరదృతువు కొంతకాలమే ఉన్నా అది ఎంతో రమణీయంగా ఉంటుంది. చెట్లులేకుండా మంచుతో కప్పబడి బోసిగా కనిపించే ప్రాంతాలకు విరుద్ధంగా సింధూరవర్ణంలో, పసుపు పచ్చవర్ణంలో, సువర్ణవర్ణంలో సుసంపన్నంగా కనిపించే కొండరావిచెట్లు ఉంటాయి, అదే సమయంలో నీలివర్ణ ఆకాశం క్రింద, బురద ఉబికే మట్టి గుంటలు తెల్లని ఆవిరిని స్తంభంలా విడుస్తూ అక్కడక్కడా స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాక, తెలవారుతూనే మంచుపొరతో కప్పబడిన లెక్కలేనన్ని ఆకులు చిరు శబ్దంతో నేలపై రాలుతున్నప్పుడు అడవి “పాడుతూ” శీతాకాలపు ఆగమనాన్ని మృదువుగా చాటుతుంది.

[19వ పేజీలోని బాక్సు]

ప్రాణాంతకమైన సరస్సు!

నిర్జీవమైనదిగా పరిగణించబడిన ఒక అగ్నిపర్వతం 1996లో కారిమ్స్కి సరస్సు అడుగున విస్ఫోటనం చెందింది, దానివల్ల 10 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన అలలు, చుట్టూవున్న అడవులను నేలమట్టం చేశాయి. కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలకు ప్రమాదకరంగా తయారయ్యేంతగా ఆ సరస్సు నీటిలో ఆమ్లాల శాతం పెరిగింది. అగ్నిపర్వతం బూడిద విరజిమ్మినా, తీరాన్ని అలలు ముంచెత్తినా ఆ సరస్సు దగ్గర జంతువుల మృతకళేబరాలు కనిపించలేదని ఆండ్రూ లోగన్‌ అనే పరిశోధకుడు వివరిస్తున్నాడు. “విస్ఫోటనానికి ముందు ఆ సరస్సు లక్షలాది చేపల (ఎక్కువగా సాల్‌మన్‌, ట్రౌట్‌ చేపలు) నివాసంగా పేరుగాంచింది. విస్ఫోటనం తర్వాత ఆ సరస్సులో ఏ ప్రాణి మిగల్లేదు” అని ఆయన అంటున్నాడు. అయితే చాలా చేపలు బ్రతికాయి. ఏదో ఒక రకమైన హెచ్చరికా సంకేతం, బహుశా నీటి రసాయన సమ్మేళనాల్లో మార్పులు చేపలను అప్రమత్తం చేసి, అవి దగ్గర్లోని కారిమ్స్కి నదికి వెళ్లిపోయేలా చేసివుండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

[16వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

రష్యా

కామ్‌చట్కా