కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రతీ ఒక్కరూ మంచి ఆరోగ్యం కోరుకుంటారు!

ప్రతీ ఒక్కరూ మంచి ఆరోగ్యం కోరుకుంటారు!

ప్రతీ ఒక్కరూ మంచి ఆరోగ్యం కోరుకుంటారు!

దాదాపు 2,700 ఏళ్ల క్రితం, వ్యాధులు ఇక ఉండని ఒక కాలం గురించి ఒక ప్రవక్త వివరించాడు. ఆ ప్రవచనం మన కాలంవరకు భద్రపరచబడివుంది, అది యెషయా రాసిన ప్రాచీన గ్రంథంలో కనిపిస్తుంది. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అన[ని]” కాలం గురించేకాక, ఆ కాలంలో “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును” అని కూడా ఆయన రాశాడు. (యెషయా 33:​24; 35:​5, 6) ఇతర బైబిలు ప్రవచనాలు అలాంటి భవిష్యత్తు గురించి ప్రస్తావిస్తున్నాయి. ఉదాహరణకు, బైబిల్లోని చివరి పుస్తకమైన ప్రకటన, దేవుడు వేదనను తొలగించే కాలం గురించి వివరిస్తోంది.​—ప్రకటన 21:4.

ఆ వాగ్దానాలు నెరవేరతాయా? మానవజాతి మంచి ఆరోగ్యంతో ఉండే కాలం, రోగాలు ఇక ఉండని కాలం ఎప్పటికైనా వస్తుందా? నిజమే, నేడు చాలామంది పాత తరాలవారికన్నా మెరుగైన ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నారు. అయితే మెరుగైన ఆరోగ్యం ఉన్నంత మాత్రాన వారు శ్రేష్ఠమైన ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నారని దాని భావంకాదు. ఇప్పటికీ రోగాలు అనేకమందిని పట్టిపీడిస్తున్నాయి. అనారోగ్యం పాలౌతామేమోననే భయమే వారికెంతో ఆందోళన కలిగిస్తోంది. అంతేకాక, కఠోరమైన వాస్తవమేమిటంటే, ఈ ఆధునిక యుగంలో కూడా, భౌతిక, మానసిక రుగ్మతల బారినుండి ఎవరూ పూర్తిగా తప్పించుకోలేరు.

మీరు చెల్లించే మూల్యం

అనారోగ్యంవల్ల ఎన్నో పర్యవసానాలను ఎదుర్కోవాల్సివస్తుంది. వాటిలో ప్రజలమీద ఆర్థిక భారం పెరగడం ఒకటి. ఉదాహరణకు, ఇటీవల ఒక సంవత్సరంలో, అనారోగ్య కారణాలవల్ల యూరప్‌లో 50 కోట్ల పనిదినాలు నష్టపోవాల్సివచ్చింది. ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. పనిస్థలంలో ఉత్పత్తి తగ్గడంతోపాటు, ఆరోగ్య సంరక్షణ వ్యయం పెరగడంవల్ల అందరిమీద ఆర్థిక భారం పడుతుంది. వాణిజ్య సంస్థలతోపాటు ప్రభుత్వాలు కూడా దానికి మూల్యం చెల్లిస్తాయి. ఈ ఖర్చులను తగ్గించుకునేందుకు ఆ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతాయి, వాటికి తోడు ప్రభుత్వాలు పన్నులను వడ్డిస్తాయి. వాటిని ఎవరు భరిస్తారు? ఆఖరికి మీరే వాటిని భరిస్తారు!

బాధాకరమైన విషయమేమిటంటే, పేదవారికి తగిన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉన్నా వాటిని పొందడం కష్టంగా ఉండొచ్చు. వర్ధమాన దేశాల్లో ఉన్న కోట్లాదిమంది ఈ దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, వారికి సరైన ఆరోగ్య సేవలు అంతగా అందుబాటులో ఉండవు లేక అసలు ఉండనే ఉండవు. ధనిక దేశాల్లో కూడా, అందుబాటులో ఉన్న చక్కని వైద్య సేవల నుండి ప్రయోజనం పొందడానికి కొందరు సంఘర్షించాల్సివస్తోంది. అమెరికాలో, ఆరోగ్య బీమా లేని 4.6 కోట్లమందిలో చాలామంది అలాంటి పరిస్థితినే తరచూ ఎదుర్కొంటున్నారు.

అనారోగ్యంవల్ల ఆర్థిక భారంతోపాటు అనేక ఇతర సమస్యలు వచ్చిపడతాయి. ప్రాణాంతక వ్యాధి ఉండడంవల్ల కలిగే తీవ్రవేదన, దీర్ఘకాలిక బాధలవల్ల ఎదురయ్యే మనోవేదన, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని చూడడంవల్ల కలిగే బాధ, ప్రియమైనవారు మరణించడంవల్ల కలిగే నిరాశ వంటి మూల్యాలను మనం చివరికి చెల్లిస్తాం.

ఏదో ఒకరోజు వ్యాధుల్లేని లోకంలో జీవిస్తామనే నిరీక్షణ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ప్రతీ ఒక్కరూ మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటారు! అలాంటి పరిస్థితి నమ్మదగినదిగా అనిపించకపోయినా ఆ నిరీక్షణ నిజమైనదని చాలామంది నమ్ముతున్నారు. మానవ సాంకేతిక విజ్ఞానం సహాయంతో కొంతకాలానికి దాదాపు వ్యాధులన్నీ, రోగాలన్నీ అరికట్టబడతాయని నమ్మేవారు కొందరున్నారు. మరోవైపు, బైబిలును విశ్వసించేవారు, వ్యాధుల్లేని లోకం గురించి దానిలోవున్న ప్రాచీన ప్రవచనాలను దేవుడు నెరవేరుస్తాడని నమ్ముతున్నారు. వ్యాధులు ఇక ఉండని ఒక కాలాన్ని మానవుడు తీసుకువస్తాడా? అలాంటి కాలాన్ని దేవుడు తీసుకువస్తాడా? భవిష్యత్తులో ఏమి జరగనుంది? (g 1/07)