వాళ్లలా విశ్వాసం చూపించండి | శారా
‘నువ్వు ఎంతో అందంగా ఉంటావు’
శారా తన ఇంట్లో నిలబడి చుట్టూ చూసుకుంటుంది. అందమైన ఆమె కళ్లల్లో ఏదో బాధ కనబడుతోంది. ఆమె బాధకు కారణం లేకపోలేదు. ఆ ఇంట్లో ఆమెకు ఎన్నో తీపి గుర్తులున్నాయి, తన భర్త అబ్రాహాముతో కలిసి అక్కడ ఎన్నో మధుర క్షణాలు గడిపింది. a
వాళ్లు ఊరు అనే సంపన్న నగరంలో జీవించారు. అక్కడ హస్తకళల్లో ఆరితేరిన వాళ్లు, వ్యాపారులు చాలామంది ఉండేవాళ్లు. కాబట్టి వాళ్ల ఇంట్లో వస్తువులకు ఏ లోటూ ఉండేది కాదని చెప్పవచ్చు. అయితే శారా ఆ ఇంటిని ఇష్టపడింది అందులోని వస్తువుల్ని, సౌకర్యాల్ని బట్టి కాదు. ఆమె, ఆమె భర్త కలిసి ఎన్నో సంవత్సరాల పాటు ఆ ఇంట్లో కష్ట సుఖాల్ని పంచుకున్నారు, అలాగే లెక్కలేనన్ని సార్లు తమ దేవుడైన యెహోవాకు ప్రార్థించారు. కాబట్టి ఆ ఇల్లంటే శారాకు ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు.
అయినా, ఆ ఇంటిని వదిలి వెళ్లడానికి శారా ముందుకొచ్చింది. అప్పుడు ఆమె వయసు బహుశా 60 ఏళ్లు. తిరిగి వస్తారో-రారో తెలియకపోయినా, ఇంతకు ముందెప్పుడూ చూడని ప్రాంతానికి వెళ్లడానికి ఆమె సిద్ధపడింది. అక్కడ ఎన్నో ప్రమాదాలు, కష్టాలు ఎదురవ్వవచ్చు. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమె విశ్వాసం నుండి మనమేం నేర్చుకోవచ్చు?
‘నీ దేశాన్ని విడిచి వెళ్లు’
శారా ఊరు నగరంలోనే పుట్టి పెరిగి ఉండవచ్చు. ఇప్పుడైతే అక్కడ కేవలం శిథిలాలే కనిపిస్తాయి. కానీ, అప్పట్లో ఆ నగరం సిరిసంపదలతో వర్ధిల్లింది. ఎక్కడెక్కడి నుండో వ్యాపారులు యూఫ్రటీసు నది గుండా అక్కడకు వచ్చి ఎన్నో విలువైన వస్తువుల్ని అమ్మేవాళ్లు. సన్నని మెలికలు తిరిగిన వీధులు జనాలతో కిటకిటలాడేవి, ఓడ రేవులేమో పడవలతో కిక్కిరిసిపోయేవి, మార్కెట్లేమో రకరకాల వస్తువులతో కళకళలాడేవి. సందడి సందడిగా ఉండే ఆ నగరంలో శారా ఎలా పెరిగి ఉంటుందో ఒకసారి ఊహించండి. అక్కడ చాలామంది ఆమెకు తెలిసిన వాళ్లే ఉండుంటారు. శారా చాలా అందగత్తె కాబట్టి, ఊళ్లో వాళ్లకు కూడా ఆమె తెలిసే ఉంటుంది. ఆ నగరంలో ఆమె బంధువులు కూడా చాలామందే ఉండుంటారు.
ఊరు నగరంలో చాలామంది చంద్ర దేవున్ని ఆరాధించేవాళ్లు. ఆ దేవునికి అక్కడ పెద్ద ఆలయం ఉంది. ఆ నగరంలో, ఏ మూల నుండి చూసినా ఎత్తైన ఆ ఆలయం కనిపిస్తుంది. అయితే శారా చంద్ర దేవున్ని కాకుండా సత్యదేవుడైన యెహోవాను ఆరాధించింది. శారా విశ్వాసం చాలా గొప్పది అని బైబిలు చెప్తుంది, కానీ ఆమె ఆ విశ్వాసాన్ని ఎలా సంపాదించుకుందో బైబిలు చెప్పట్లేదు. ఆమె తండ్రి కొంతకాలం పాటు విగ్రహాలను ఆరాధించాడు. అయితే, శారాకు ఆమె కన్నా 10 ఏళ్లు పెద్దవాడైన అబ్రాహాముతో పెళ్లయింది. b (ఆదికాండం 17:17) కొంతకాలానికి, అబ్రాహాముకు “విశ్వాసం చూపించే వాళ్లందరికీ తండ్రి” అనే పేరు వచ్చింది. (రోమీయులు 4:11) పెళ్లయ్యాక వాళ్లు ఒకరినొకరు గౌరవించుకున్నారు, మనసు విప్పి మాట్లాడుకున్నారు, ఏదైనా సమస్య వస్తే వెంటనే కలిసి పరిష్కరించుకున్నారు. అలా భార్యాభర్తలుగా వాళ్లు ఒక విడదీయలేని బంధాన్ని పెంచుకున్నారు. వాళ్ల అన్యోన్య దాంపత్యానికి ముఖ్య కారణం దేవుడి మీద వాళ్లిద్దరికీ ఉన్న ప్రేమే.
శారా తన భర్తను మనసారా ప్రేమించింది. వాళ్లు ఊరు నగరంలో తమ బంధువుల మధ్య ఉండేవాళ్లు. వాళ్ల జీవితంలో ఒకేఒక్క లోటు ఉండేది. శారా “గొడ్రాలు; ఆమెకు పిల్లలు లేరు.” (ఆదికాండం 11:30) ఆ రోజుల్లో, పిల్లలు పుట్టని ఆడవాళ్ల కష్టాలు అంతా-ఇంతా కాదు. అయినా తన భర్త, తన దేవుడు తనకు తోడున్నారు అనే ధైర్యంతో శారా జీవితాన్ని నెట్టుకొచ్చింది. అందుకే తండ్రి లేని లోతును అబ్రాహాము-శారా తమ సొంత కొడుకులా చూసుకున్నారు (లోతు అబ్రాహాము అన్న కొడుకు). వాళ్ల జీవితం హాయిగా సాగిపోతోంది. కానీ ఒకరోజు ఉన్నట్టుండి అంతా మారిపోయింది.
అబ్రాహాము ఇన్నేళ్లు ఆరాధించిన దేవుడు ఆయనతో మాట్లాడాడు! ఒక దేవదూత ఆయన కళ్లముందు కనిపించి దేవుని మాటల్ని ఆయనకు చెప్పాడు. ఇది కలా, నిజమా అని అబ్రాహాముకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. దాన్నుండి తేరుకున్నాక, ఆ సంగతి శారాకు చెప్పడానికి అబ్రాహాము చాలా హుషారుగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృత శారా కళ్లల్లో కనిపిస్తోంది. ఆమె ఇక ఉండబట్టలేక, “దేవుడు మీకు ఏం చెప్పాడు?” అని ఆయన్ని అడిగింది. బహుశా అబ్రాహాము కాసేపు కూర్చుని, జరిగిందంతా ఒకసారి నెమరు వేసుకుని, యెహోవా మాటల్ని చెప్పాడు: “నీ దేశాన్ని, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు.” (అపొస్తలుల కార్యాలు 7:2, 3) సంతోషంతో గాల్లో తేలిపోయిన ఆ ఇద్దరూ, కాసేపయ్యాక యెహోవా చెప్పిన ఆ మాట గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఏ చీకూచింత లేని జీవితాన్ని విడిచిపెట్టి, ఇప్పుడు వాళ్లు పరదేశుల్లా ఊరూరా తిరగాలి! ఇంతకీ శారా ఏమంటుందా అని అబ్రాహాము ఆమె వంకే చూస్తున్నాడు. చెప్పాలంటే, అది చాలా పెద్ద నిర్ణయమే! మరి శారా దానికి ఇష్టంగానే ఒప్పుకుంటుందా?
శారా లాంటి పరిస్థితి మనకు ఎప్పుడూ రాదని అనిపించవచ్చు. ‘అలా చేయమని దేవుడు నాకు గానీ నా భర్తకు గానీ ఎప్పుడూ చెప్పలేదు’ అని మీరు అనుకోవచ్చు. కానీ, ఒక విధంగా శారా లాంటి పరిస్థితే మనందరి ముందూ ఉంది. నేడు, డబ్బే లోకం అన్నట్టు బ్రతుకుతున్న ప్రజల మధ్య మనం ఉన్నాం. ఆస్తిపాస్తుల్ని బాగా కూడబెట్టుకొని, ఏ చీకూచింతా లేకుండా సుఖంగా బ్రతకడమే అన్నిటికన్నా ముఖ్యమని ఈ లోకం అంటోంది. కానీ, మన సంతోషాల కన్నా దేవున్ని సంతోషపెట్టడమే ముఖ్యమని బైబిలు చెప్తుంది. (మత్తయి 6:33) అయితే శారా ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం. దాని గురించి చదువుతున్నప్పుడు, ‘నేనైతే ఏం చేస్తాను?’ అని మీరు ఆలోచించవచ్చు.
వాళ్లు ‘ఆ దేశం నుండి బయటికి వచ్చేశారు’
సామాన్లు సర్దుకునేటప్పుడు, ఏవి పట్టుకెళ్లాలి, ఏవి వదిలేయాలి అని శారా చాలా ఆలోచించి ఉంటుంది. ఒంటెల మీద, గాడిదల మీద వాళ్లు తీసుకెళ్లగలిగేవి మాత్రమే ఆమె సర్దుకోవాలి. పెద్దవి తీసుకెళ్తే వాళ్లు ఊరూరా తిరిగేటప్పుడు కష్టమౌతుంది. వాళ్ల దగ్గరున్న చాలా వస్తువుల్ని అమ్మేసి ఉంటారు లేదా ఎవరికైనా ఇచ్చేసి ఉంటారు. ఇకమీదట, జీవితం ఇప్పుడున్నట్టు ఉండదు. కావల్సినప్పుడల్లా మార్కెట్‌కు వెళ్లి ధాన్యాన్ని, మాంసాన్ని, పండ్లను, బట్టల్ని అవసరమైన వాటిని తెచ్చుకోవడం ఇంక కుదరదు.
అన్నిటికీ మించి, బహుశా ఆ ఇంటిని వదిలేసి రావడం శారాకు ఇంకా కష్టమై ఉంటుంది. పురావస్తు తవ్వకాల్లో ఊరు నగరంలోని కొన్ని ప్రాచీన ఇళ్లు బయటపడ్డాయి. ఆ ఇళ్లలో సకల సౌకర్యాలు ఉండేవి. కొన్ని ఇళ్లల్లో 12 కంటే ఎక్కువ గదులు ఉండేవి, నీళ్ల కోసం పైపులైన్లు ఉండేవి, ఫౌంటెయిన్లు కూడా ఉండేవి. శారా ఇప్పుడు అవన్నీ వదులుకోవాల్సిందే. ఊరు నగరంలోని మామూలు ఇళ్లలో కూడా మంచి గోడలు, పైకప్పు, గడి వేసుకునేలా తలుపులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆమె గుడారాల్లో ఉండాలి. మరి దొంగల నుండి భద్రత ఉంటుందా? దానికితోడు ఆ రోజుల్లో వాళ్లు వెళ్లేచోట సింహాలు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, తోడేళ్లు కూడా ఉండేవి.
మరి ఇంట్లోవాళ్లు, చట్టాల సంగతేంటి? దేవుడు ఏం చెప్పాడో ఒకసారి గుర్తుచేసుకోండి: ‘నీ దేశాన్ని, నీ బంధువుల్ని విడిచిపెట్టి వెళ్లు.’ వాళ్లందర్నీ విడిచి రావడం శారా మనసుకు ఇంకా భారంగా అనిపించి ఉంటుంది. ఊరు నగరంలో శారాకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, వాళ్ల పిల్లలు, పిన్ని-బాబాయ్‌లు, అత్తామామలు ఉండుంటారు. ఇంతకాలం వాళ్లతో ప్రేమానురాగాలు పంచుకున్న శారా ఇకమీదట మళ్లీ వాళ్లను చూస్తుందో లేదో తెలీదు. అయినా గుండె రాయి చేసుకుని, బయల్దేరే రోజు కోసం మెల్లమెల్లగా సిద్ధమైంది.
ఎన్ని సవాళ్లున్నా వెనకడుగు వేయకుండా, శారా అన్నీ సర్దుకుంది. ఇప్పుడు ఆమె బయల్దేరాల్సిన రోజు వచ్చేసింది. వాళ్లతో పాటు వాళ్ల నాన్న తెరహు కూడా బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన వయసు దాదాపు రెండు వందల ఏళ్లు. (ఆదికాండం 11:31) ముసలితనంలో ఉన్న ఆయన్ని చూసుకోవడానికి శారా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లతో పాటు లోతు కూడా వస్తున్నాడు. వాళ్లంతా కలిసి యెహోవా చెప్పినట్టే, “కల్దీయుల దేశం నుండి” బయల్దేరారు.—అపొస్తలుల కార్యాలు 7:4.
వాళ్లంతా యూఫ్రటీసు నది పక్కనున్న దారిలో, వాయవ్య దిశలో (నార్త్ వెస్ట్) దాదాపు 960 కిలోమీటర్లు ప్రయాణించి హారానుకు చేరుకున్నారు. వాళ్లు అక్కడ కొంతకాలం పాటు ఉన్నారు. బహుశా వృద్ధాప్యం వల్ల ఆరోగ్యం క్షీణించడంతో, తెరహు ఇక ప్రయాణం చేయలేకపోయుంటాడు. 205 ఏళ్ల వయసులో తెరహు చనిపోయాడు. అప్పటిదాకా వాళ్లు అక్కడే ఉన్నారు. వాళ్లు హారానులో ఉన్నప్పుడు యెహోవా అబ్రాహాముతో మళ్లీ మాట్లాడి, ఆ దేశాన్ని విడిచి పెట్టి తను చూపించబోయే దేశానికి వెళ్లమని చెప్పాడు. ఈసారి, దేవుడు వాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తే ఒక మాటిచ్చాడు: “నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను.” (ఆదికాండం 12:2-4) కానీ హారాను నుండి బయల్దేరే సమయానికి వాళ్లకు ఇంకా పిల్లలు లేరు. అబ్రాహాము వయసేమో 75ఏళ్లు, శారా వయసేమో 65ఏళ్లు. మరి అబ్రాహాము నుండి ఒక గొప్ప జనం ఎలా వస్తుంది? ఆయన ఇంకొకర్ని పెళ్లి చేసుకుంటాడా? ఆ రోజుల్లో మగవాళ్లు ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. అబ్రాహాము కూడా అలా ఇంకో పెళ్లి చేసుకుంటాడా ఏంటి అని శారా ఆలోచించి ఉంటుంది.
ఏదేమైనా వాళ్లు హారాను నుండి బయల్దేరారు. అయితే ఈసారి వాళ్లతో ఎవరెవరు ఉన్నారో గమనించండి. వాళ్లు ‘హారానులో తాము సమకూర్చుకున్న వస్తువులన్నిటినీ, తాము సంపాదించుకున్న సేవకుల్ని తీసుకొని బయల్దేరారు’ అని బైబిలు చెప్తుంది. (ఆదికాండం 12:5) ఇంతకీ ఈ సేవకులు ఎవరు? వినడానికి ఇష్టపడే వాళ్లందరితో అబ్రాహాము, శారా తమ నమ్మకాల గురించి చెప్పే ఉంటారు. ఈ వచనంలో ఉన్న సేవకులు అనే మాట, విగ్రహారాధన విడిచి పెట్టి అబ్రాహాము, శారాలతో కలిసి యెహోవాను ఆరాధించిన ప్రజల్ని సూచిస్తుందని కొన్ని యూదా రచనలు చెప్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే, తన దేవుని గురించి, నిరీక్షణ గురించి శారా బలమైన విశ్వాసంతో మాట్లాడి ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అదే ఆ ప్రజల్ని యెహోవాకు దగ్గర చేసి ఉంటుంది. ఈ విషయంలో శారా నిజంగా మనకు మంచి ఆదర్శం. నేడు, విశ్వాసం-నిరీక్షణ కరువైపోయిన లోకంలో మనం జీవిస్తున్నాం. మీరు బైబిల్లో ఏదైనా ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నప్పుడు, దాన్ని ఇతరులతో పంచుకుంటారా?
‘ఐగుప్తు వైపు ప్రయాణించారు’
బహుశా క్రీస్తు పూర్వం 1943, నీసాను 14న వాళ్లు యూఫ్రటీసు నది దాటి, దక్షిణం వైపు యెహోవా మాటిచ్చిన దేశంలోకి అడుగుపెట్టారు. (నిర్గమకాండం 12:40, 41) శారా అక్కడ రకరకాల ప్రకృతి అందాల్ని చూస్తూ మైమరచి పోవడాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడాన్ని ఒకసారి ఊహించుకోండి. మోరే మహా వృక్షాల సమీపంలో, షెకెము దగ్గర యెహోవా మళ్లీ అబ్రాహాముకు కనిపించి ఇలా అన్నాడు: “నేను ఈ దేశాన్ని నీ సంతానానికి ఇవ్వబోతున్నాను.” ఇక్కడ, “సంతానం” అనే మాట వినగానే అబ్రాహాముకు ఒక ముఖ్యమైన విషయం గుర్తొచ్చి ఉంటుంది! యెహోవా ఏదెను తోటలో, సాతానును నాశనం చేయబోయే ఒక సంతానం గురించి చెప్పాడు. అంతేకాదు ఇంతకుముందు హారానులో, భూమ్మీది ప్రజలందరూ అబ్రాహాము నుండి వచ్చే జనం ద్వారా దీవెనలు పొందుతారని యెహోవా చెప్పాడు.—ఆదికాండం 3:15; 12:2, 3, 6, 7.
యెహోవా అలా మాటిచ్చినంత మాత్రాన, వాళ్లకు ఇక ఏ కష్టాలూ రావని కాదు. కనాను దేశంలో కరువు వచ్చింది. దాంతో అబ్రాహాము తన కుటుంబాన్ని తీసుకుని దక్షిణం వైపున్న ఐగుప్తుకు వెళ్లాలనుకున్నాడు. అయితే ఒక ప్రమాదం పొంచి ఉందని ఆయన పసిగట్టాడు. అందుకే శారాతో ఇలా అన్నాడు: “దయచేసి నా మాట విను! నువ్వు ఎంత అందంగా ఉంటావో నాకు తెలుసు. ఐగుప్తీయులు నాతోపాటు నిన్ను చూసినప్పుడు ఖచ్చితంగా, ‘ఈమె ఇతని భార్యే’ అని అంటారు. తర్వాత నన్ను చంపేసి, నిన్ను మాత్రం బ్రతకనిస్తారు. కాబట్టి నీ వల్ల నాకు ఏ హానీ కలగకుండా ఉండేలా, దయచేసి నువ్వు నా చెల్లెలివని చెప్పు. అలా చేస్తే నువ్వు నా ప్రాణాన్ని కాపాడినదానివి అవుతావు.” (ఆదికాండం 12:10-13) అదేంటి! అబ్రాహాము ఎందుకు అలా అన్నాడు?
అబ్రాహాము పిరికివాడని లేదా ఆయన అబద్ధమాడాడని కొంతమంది తప్పుపడుతుంటారు, కానీ అది నిజం కాదు. శారా అబ్రాహాముకు వరుసకి చెల్లెలు అవుతుంది. అబ్రాహాము అలా జాగ్రత్తపడడానికి కారణం లేకపోలేదు. దేవుడు మాటిచ్చినట్టు అబ్రాహాము నుండి ఒక ప్రత్యేకమైన సంతానం, అలాగే ఒక జనం రావడమే అన్నిటికన్నా ముఖ్యమని వాళ్లిద్దరికి తెలుసు. కాబట్టి అబ్రాహాము క్షేమమే ఇప్పుడు వాళ్లకు చాలా ముఖ్యం. ఐగుప్తులో, అధికారంలో ఉన్నవాళ్లు ఒక వ్యక్తి భార్యను తీసుకెళ్లిపోయి ఆమె భర్తను చంపేయడం ఎన్నో సార్లు జరిగిందని చరిత్ర రుజువు చేస్తుంది. అందుకే అబ్రాహాము తెలివిగా నడుచుకున్నాడు. శారా కూడా ఆయన చెప్పిన మాటకు వినయంగా ఒప్పుకుంది.
చివరికి అబ్రాహాము అనుకున్నట్టే జరిగింది. ఆ వయసులో కూడా శారా ఎంతో అందంగా ఉండడం ఫరో ఉన్నతాధికారుల్లో కొంతమంది గమనించారు. వాళ్లు ఆ విషయం ఫరోకు చెప్పినప్పుడు, వెంటనే ఆమెను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడు అబ్రాహాము ఎంత ఆందోళనపడి ఉంటాడో, శారా ఎంత భయపడి ఉంటుందో ఒకసారి ఊహించండి! అయితే అక్కడ ఆమెను ఒక బందీగా చూడకుండా, రాచమర్యాదలు చేశారు. తన ఐశ్వర్యమంతా చూపించి ఆమె మనసు దోచుకోవాలని, తర్వాత అబ్రాహాముతో మాట్లాడి ఆమెను తన భార్యగా చేసుకోవాలని ఫరో అనుకుని ఉంటాడు.—ఆదికాండం 12:14-16.
ఆ రాజభవనం కిటికీలో నుండి లేదా బాల్కనీలో నుండి శారా ఐగుప్తు దేశాన్ని చూడడం ఒకసారి ఊహించండి! ఇంతకాలం గుడారాల్లో ఉండి, ఇప్పుడు ఈ అందమైన రాజభవనంలో ఉన్నప్పుడు శారాకు ఎలా అనిపించి ఉంటుంది? ఇక్కడ ఆమెకు మంచి విందు భోజనం పెడుతున్నారు. ఇంతకుముందు ఊరు నగరంలో ఆమె గడిపిన జీవితం కన్నా ఎన్నో రెట్లు విలాసవంతమైన జీవితం ఆమె కళ్ల ముందు ఉంది. మరి, శారా ఆ రాజభోగాలపై మనసుపడి ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి: శారా వీటన్నిటికి ఆశ పడి అబ్రాహామును వదిలేసి, ఫరోను పెళ్లి చేసుకుని ఉంటే సాతాను ఎంత సంతోషపడి ఉండేవాడు! కానీ శారాకు అలాంటి ఆలోచన కలలో కూడా రాలేదు. ఆమె తన భర్తకు, తన దేవునికి నమ్మకంగా ఉంది. విలువలు అనేవి పూర్తిగా పడిపోయిన మనకాలంలో, భార్యాభర్తలందరూ అలా నమ్మకంగా ఉంటే ఎంత బాగుంటుంది! మీరు ఎంతగానో ప్రేమించే కుటుంబానికి, స్నేహితులకు మీరు కూడా శారాలాగే నమ్మకంగా ఉంటారా?
ఫరో శారాను తీసుకెళ్లినప్పుడు, యెహోవా చూస్తూ ఊరుకోలేదు. ఆమెను కాపాడడం కోసం ఫరోను, అతని ఇంటివాళ్లను తీవ్రమైన జబ్బులతో బాధించాడు. శారా అబ్రాహాము భార్య అని ఫరోకు తెలిసిపోయింది. అతను వెంటనే ఆమెను తన భర్త దగ్గరకు పంపించేసి, వాళ్లందర్నీ ఐగుప్తు నుండి వెళ్లిపొమ్మన్నాడు. (ఆదికాండం 12:17-20) తను ప్రాణంగా ప్రేమించిన తన భార్య తిరిగి వచ్చినప్పుడు అబ్రాహాము ఎంత సంతోషించి ఉంటాడో కదా! ఇంతకుముందు అబ్రాహాము తన భార్యతో ఏమన్నాడో గుర్తు చేసుకోండి: “నువ్వు ఎంత అందంగా ఉంటావో నాకు తెలుసు.” శారాది, పైపైన కనిపించే అందం మాత్రమే కాదు, ఆమె మనసు కూడా ఎంత అందమైందో అబ్రాహాముకు తెలుసు. అందుకే ఆమె అంటే ఆయనకు అంత ఇష్టం! మనుషులు పైకి ఎంత అందంగా ఉన్నారు అనేది కాదు, వాళ్ల హృదయం ఎంత అందంగా ఉందన్నదే యెహోవా చూస్తాడు. (1 పేతురు 3:1-5) మనం కూడా ఆ అందాన్నే సంపాదించుకోవాలి. ఆస్తిపాస్తుల కన్నా దేవునికి సంబంధించిన విషయాలకే ఎక్కువ విలువిస్తూ, దేవుని గురించి మనకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటూ, ఎలాంటి ఆశలకు లొంగి పోకుండా దేవుడు కోరుకున్నట్లు మంచి విలువల్ని పాటిస్తే మనం కూడా శారా లాంటి విశ్వాసాన్ని చూపించిన వాళ్లమౌతాం.
a మొదట్లో వాళ్ల పేర్లు అబ్రాము, శారయి. తర్వాత యెహోవా వాళ్లకు అబ్రాహాము, శారా అనే పేర్లు పెట్టాడు. అందరికీ ఆ పేర్లే బాగా తెలుసు.—ఆదికాండం 17:5, 15.
b అబ్రాహాముకు శారా చెల్లి వరుస అవుతుంది. వాళ్ల ఇద్దరి నాన్న ఒక్కరే కానీ అమ్మలు వేరు. వాళ్ల నాన్న పేరు తెరహు. (ఆదికాండం 20:12) అబ్రాహాము, శారా పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పు అని మనకు అనిపించవచ్చు, కానీ వాళ్ల కాలంలో పరిస్థితులు వేరుగా ఉండేవని మనం గుర్తుంచుకోవాలి. ఆదాము హవ్వలు కోల్పోయిన పరిపూర్ణతకు అప్పటి ప్రజలు చాలా దగ్గరగా ఉండేవాళ్లు. దానివల్ల వాళ్లు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్లు. అందుకే రక్తసంబంధీకులు పెళ్లి చేసుకున్నా పిల్లలకు వారసత్వంగా ఎలాంటి లోపాలు వచ్చేవి కావు. కానీ దాదాపు 400 ఏళ్ల తర్వాత పరిస్థితులు ఇప్పుడున్నట్లే తయారయ్యాయి. మనుషులు నూరేళ్లు బ్రతకడమే గొప్ప అయిపోయింది. అందుకే అప్పుడు, మోషే ధర్మశాస్త్రం రక్తసంబంధీకుల మధ్య లైంగిక సంబంధాన్ని నిషేధించింది.—లేవీయకాండం 18:6.