కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంఘంలో ఉన్న యౌవనస్థులతో సమయం గడపడం అంటే నాకు ఇష్టం

బైబిలు జీవితాల్ని మారుస్తుంది

ఒకప్పుడు బేస్‌బాల్‌ ఆడడం అంటే నాకు ప్రాణం!

ఒకప్పుడు బేస్‌బాల్‌ ఆడడం అంటే నాకు ప్రాణం!
  • పుట్టిన సంవత్సరం: 1928

  • దేశం: కోస్టరికా

  • ఒకప్పుడు: నాకు ఆటలు అన్నా, జూదం అన్నా పిచ్చి

నా గతం

నేను కోస్టరికా తీర ప్రాంతంలో ఉన్న, ప్యూర్టో లిమాన్‌ అనే నగరంలో పుట్టిపెరిగాను. మా అమ్మానాన్నలకు మేము ఎనిమిది మంది పిల్లలం, వాళ్లలో నేను ఏడోవాడిని. నాకు ఎనిమిది ఏళ్లు ఉన్నప్పుడు, మా నాన్న చనిపోయాడు. అప్పటినుండి, మా అమ్మ ఒంటరిగా మమ్మల్ని పెంచింది.

నాకు బేస్‌బాల్‌ (బ్యాట్‌తో, బాల్‌తో ఆడే ఒక ఆట) ఆడడం అంటే ప్రాణం. నా చిన్నతనంలో ఎప్పుడూ బేస్‌బాల్‌ ఆడుతూ ఉండేవాడిని. 18-19 ఏళ్ల వయసులో, నేను కొత్త ఆటగాళ్ల జట్టులో చేరాను. నాకు 20 ఏళ్లు వచ్చాక, ఒక స్కౌట్‌ (బాగా ఆడే క్రీడాకారుల కోసం వెతికే వ్యక్తి) నికరాగ్వా జట్టు కోసం ఆడతావా అని నన్ను అడిగాడు. కానీ అప్పుడు అమ్మకి బాలేదు, నేను ఆమెను దగ్గర ఉండి చూసుకోవాల్సి వచ్చింది. కాబట్టి, నికరాగ్వాలో ఉండడం కుదరక, నేను ఆడలేనని చెప్పాను. కొంతకాలం తర్వాత మరొక స్కౌట్‌, కొత్త ఆటగాళ్లతో ఎంపికచేసిన కోస్టరికా జాతీయ జట్టులో ఆడమని నన్ను అడిగాడు. ఈసారి, నేను ఆడతాను అని చెప్పాను. 1949 నుండి 1952 వరకు, నేను ఆ జాతీయ జట్టులో ఉన్నాను. క్యూబా, మెక్సికో, నికరాగ్వాలో చాలా మ్యాచ్‌లు ఆడాను. నేను మా జట్టులో మంచి ఆటగాణ్ణి. ఒకసారైతే, ఒక్క పొరపాటు కూడా చేయకుండా 17 మ్యాచ్‌లు ఆడాను. స్టేడియంలో జనాలు నా పేరును అరుస్తుంటే, వినడానికి ఎంతో బాగుండేది!

విచారకరంగా, నేను చెడు జీవితాన్ని కూడా గడిపాను. నాకు ఒక గర్ల్‌ ఫ్రెండ్‌ ఉన్నా, వేరే అమ్మాయిలతో కూడా తిరిగేవాణ్ణి. అంతేకాదు, నేను బాగా తాగేవాణ్ణి. ఒకరోజైతే, నేను తెల్లారి లేచి చూసుకునే సరికి నా బెడ్‌ మీద ఉన్నాను, ముందు రోజు ఎలా ఇంటికి వచ్చానో తెలియనంతగా తాగాను! నేను జూదం, లాటరీ కూడా ఆడేవాణ్ణి.

ఈలోపు మా అమ్మ ఒక యెహోవాసాక్షి అయ్యింది. తను నాతో బైబిలు గురించి మాట్లాడడానికి ప్రయత్నించేది. కానీ నేను మొదట్లో అంత పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు ఆట మీద తప్ప, దేనిమీదా ఆసక్తి ఉండేది కాదు. ప్రాక్టీస్‌ సమయంలోనైతే ఆకలి కూడా వేసేది కాదు! నా ధ్యాసంతా ఆట మీదే ఉండేది. నాకు బేస్‌బాల్‌ ఆడడం అంటే అంత ప్రాణం!

అయితే, నాకు 29 ఏళ్లు ఉన్నప్పుడు ఆట ఆడుతున్న సమయంలో బాల్‌ క్యాచ్‌ పట్టడానికి ప్రయత్నిస్తూ తీవ్రంగా గాయపడ్డాను. నేను కాస్త కోలుకున్న తర్వాత జట్టులో ఆడడం ఆపేశాను గానీ, కొత్త ఆటగాళ్లకు ట్రైనింగ్‌ ఇచ్చేవాణ్ణి.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

1957 లో నేను యెహోవాసాక్షుల సమావేశానికి వెళ్లాను. ఏ స్టేడియంలో అయితే నేను బేస్‌బాల్‌ ఆడానో, అదే స్టేడియంలో సమావేశం జరుగుతుంది. అక్కడ యెహోవాసాక్షులు చాలా మర్యాదగా ప్రవర్తించడం నేను చూశాను. అంతకుముందు అక్కడ నేను చూసిన జనాల ప్రవర్తనకు, వీళ్లకు చాలా తేడా ఉంది. దాంతో నాకు యెహోవాసాక్షుల దగ్గర బైబిలు గురించి నేర్చుకోవాలని, మీటింగ్స్‌కి వెళ్లాలని అనిపించింది.

నేను నేర్చుకుంటున్న బైబిలు బోధలు నాకు ఎంతో నచ్చాయి. ఉదాహరణకు, చివరి రోజుల్లో తన శిష్యులు దేవుని రాజ్యం గురించిన మంచివార్తను భూమంతటా ప్రకటిస్తారని యేసు ముందే చెప్పాడు. (మత్తయి 24:14) నిజక్రైస్తవులు ఆ పనిని డబ్బుల కోసం చేయరని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే, యేసు ఇలా చెప్పాడు: “మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి.”​—మత్తయి 10:8.

స్టడీ తీసుకుంటున్నప్పుడు బైబిలు ఏం చెప్తుందో, యెహోవాసాక్షులు ఏం చేస్తున్నారో పోల్చి చూసుకున్నాను. దేవుని రాజ్యం గురించిన మంచివార్తను భూమంతటా ప్రకటించడానికి యెహోవాసాక్షులు చేసే కృషి, వాళ్లు పడే ప్రయాస నాకు ఎంతో నచ్చాయి. క్రైస్తవులకు ఇచ్చే గుణం ఉండాలని కూడా యేసు చెప్పాడు. యెహోవాసాక్షుల్లో ఆ లక్షణం నేను చూశాను. మార్కు 10:21 లో, “నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అని యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని చదివినప్పుడు, నేను ఒక యెహోవాసాక్షి అవ్వాలని కోరుకున్నాను.

అయితే, మార్పులు చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. ఉదాహరణకు, నేను ప్రతీవారం జాతీయ లాటరీలో నా “లక్కీ” నంబరుతో లాటరీ ఆడేవాణ్ణి. నేను అలా చాలా సంవత్సరాలుగా చేస్తూ వచ్చాను. అయితే, ‘అదృష్ట దేవతను’ ఆరాధించేవాళ్లని, అత్యాశపరుల్ని దేవుడు ఇష్టపడడని నేను బైబిల్లో నేర్చుకున్నాను. (యెషయా 65:11; కొలొస్సయులు 3:5) కాబట్టి, నేను జూదం మానేయాలని నిర్ణయించుకున్నాను. నేను లాటరీ ఆడడం ఆపేసిన మొదటి ఆదివారమే, నా “లక్కీ” నంబరుకు లాటరీ తగిలింది. నేను ఆ వారం ఆడనందుకు జనాలు నన్ను ఎగతాళి చేశారు, మళ్లీ ఆడమని బాగా ఒత్తిడి చేశారు. కానీ నేను ఆడలేదు. అప్పుడే కాదు, ఇంకెప్పుడూ జూదం జోలికి పోలేదు.

నేను యెహోవాసాక్షుల సమావేశంలో బాప్తిస్మం తీసుకున్న రోజే, నా ‘కొత్త వ్యక్తిత్వానికి’ మరొక పరీక్ష ఎదురైంది. (ఎఫెసీయులు 4:24) ఆ రోజు సాయంత్రం నేను ఉంటున్న హోటల్‌కి వెళ్లాను. అక్కడ నా రూమ్‌ బయట, నా పాత గర్ల్‌ ఫ్రెండ్‌ నుంచొని ఉంది. “రా శామీ, మనిద్దరం కాసేపు ఎంజాయ్‌ చేద్దాం!” అంటూ తొందరపెట్టింది. కానీ నేను వెంటనే, “వద్దు!” అని సమాధానం ఇచ్చాను. అలాగే, నేను ఇప్పుడు బైబిలు ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నానని కూడా తనకు గుర్తుచేశాను. (1 కొరింథీయులు 6:18) “ఏంటీ?” అని అంటూ, సెక్స్‌ గురించి, పెళ్లి గురించి బైబిలు చెప్పేది అంత పట్టించుకోనవసరం లేదు అని ఎగతాళిగా మాట్లాడింది. మళ్లీ మన సంబంధాన్ని కొనసాగిద్దాం అని బలవంతపెట్టింది. కానీ నేను నా రూమ్‌లోకి వెళ్లి, లోపల నుండి గడి పెట్టుకున్నాను. 1958 లో నేను ఒక యెహోవాసాక్షి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, నేను వదిలేసిన జీవితం వైపు మళ్లీ తిరిగి చూడలేదు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

బైబిలు ప్రకారం జీవించడం వల్ల నేను పొందిన ప్రయోజనాల గురించి చెప్పాలంటే, ఒక పుస్తకమే రాయొచ్చు! కొన్ని ప్రయోజనాలు ఏంటంటే, ఇప్పుడు నాకు మంచి స్నేహితులు చాలామంది ఉన్నారు, నా జీవితానికి ఒక అర్థం ఉంది, నిజమైన సంతోషం అనుభవిస్తున్నాను.

నాకు ఇప్పటికీ బేస్‌బాల్‌ అంటే ఇష్టమే. కానీ, అంతకంటే ముఖ్యమైన విషయాలు నాకు వేరేవి ఉన్నాయి. బేస్‌బాల్‌ ఆడేటప్పుడు నేను పేరు, డబ్బు సంపాదించాను. కానీ అవి శాశ్వతకాలం ఉండవు. దేవునితో, సహోదరులతో నాకున్న బంధం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. “లోకం, దాని ఆశ నాశనం కాబోతున్నాయి, అయితే దేవుని ఇష్టాన్ని చేసే వ్యక్తి నిరంతరం జీవిస్తాడు” అని బైబిలు చెప్తుంది. (1 యోహాను 2:17) ఒకప్పుడు బేస్‌బాల్‌ ఆడడం అంటే నాకు ప్రాణం, కానీ ఇప్పుడు యెహోవా దేవుడన్నా, ఆయన ప్రజలన్నా నాకు ప్రాణం!