ఆదికాండం 11:1-32

  • బాబెలు గోపురం (1-4)

  • యెహోవా భాషను తారుమారు చేయడం (5-9)

  • షేము నుండి అబ్రాము వరకు (10-32)

    • తెరహు కుటుంబం (27)

    • అబ్రాము ఊరును విడిచివెళ్లడం (31)

11  అప్పటికింకా భూమంతటా ఒకే భాష, ఒకే పదజాలం ఉంది.  ప్రజలు తూర్పు వైపుగా ప్రయాణిస్తూ షీనారు దేశంలో+ ఒక లోయ మైదానాన్ని కనుగొని, అక్కడే నివసించడం మొదలుపెట్టారు.  తర్వాత వాళ్లు, “రండి! మనం ఇటుకలు తయారు చేసి వాటిని మంటల్లో కాలుద్దాం” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. వాళ్లు రాళ్లకు బదులు ఇటుకల్ని, అడుసుకు* బదులు తారును* ఉపయోగించారు.  అప్పుడు వాళ్లు ఇలా అనుకున్నారు: “రండి! మనకోసం ఒక నగరాన్ని, ఆకాశాన్నంటే ఒక గోపురాన్ని కట్టుకుందాం; పేరుప్రఖ్యాతులు సంపాదించుకుందాం. దానివల్ల మనం భూమంతటా చెదిరిపోకుండా ఉంటాం.”+  మనుషులు కట్టిన ఆ నగరాన్ని, గోపురాన్ని చూడడానికి యెహోవా దిగివచ్చాడు.*  అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “ఇదిగో! ఈ ప్రజలు ఐక్యంగా ఉన్నారు, వాళ్ల భాష కూడా ఒక్కటే.+ ఇప్పుడేమో వాళ్లు ఈ పని చేయడం మొదలుపెట్టారు. వాళ్లు చేయాలనుకున్నది ఏదైనాసరే, దాన్ని చేయగలుగుతారు.  మనం+ ఇప్పుడు కిందికి వెళ్లి, వాళ్లకు ఒకరి భాష ఒకరికి అర్థంకాకుండా ఉండేలా వాళ్ల భాషను తారుమారు చేద్దాం.”  కాబట్టి యెహోవా వాళ్లను అక్కడి నుండి భూమంతటికీ చెదరగొట్టాడు,+ దాంతో వాళ్లు మెల్లమెల్లగా ఆ నగరాన్ని కట్టే పనిని ఆపేశారు.  అందుకే దానికి బాబెలు*+ అనే పేరు వచ్చింది. ఎందుకంటే అక్కడ యెహోవా భూమంతటా ఉన్న భాషను తారుమారు చేశాడు, అలాగే యెహోవా వాళ్లను అక్కడి నుండి భూమంతటికీ చెదరగొట్టాడు. 10  ఇది షేము+  చరిత్ర. జలప్రళయం వచ్చిన రెండేళ్ల తర్వాత షేముకు అర్పక్షదు+ పుట్టాడు. అప్పుడు షేము వయసు 100 ఏళ్లు. 11  అర్పక్షదు పుట్టిన తర్వాత షేము 500 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతనికి కుమారులు, కూతుళ్లు పుట్టారు.+ 12  అర్పక్షదు 35 ఏళ్లు బ్రతికి, షేలహును+ కన్నాడు. 13  షేలహును కన్న తర్వాత అర్పక్షదు 403 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు. 14  షేలహు 30 ఏళ్లు బ్రతికి, ఏబెరును+ కన్నాడు. 15  ఏబెరును కన్న తర్వాత షేలహు 403 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు. 16  ఏబెరు 34 ఏళ్లు బ్రతికి, పెలెగును+ కన్నాడు. 17  పెలెగును కన్న తర్వాత ఏబెరు 430 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు. 18  పెలెగు 30 ఏళ్లు బ్రతికి, రయూను+ కన్నాడు. 19  రయూను కన్న తర్వాత పెలెగు 209 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు. 20  రయూ 32 ఏళ్లు బ్రతికి, సెరూగును కన్నాడు. 21  సెరూగును కన్న తర్వాత రయూ 207 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు. 22  సెరూగు 30 ఏళ్లు బ్రతికి, నాహోరును కన్నాడు. 23  నాహోరును కన్న తర్వాత సెరూగు 200 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు. 24  నాహోరు 29 ఏళ్లు బ్రతికి, తెరహును+ కన్నాడు. 25  తెరహును కన్న తర్వాత నాహోరు 119 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు. 26  తెరహు 70 ఏళ్లు బ్రతికి, ఆ తర్వాత అబ్రామును,+ నాహోరును, హారానును కన్నాడు. 27  ఇది తెరహు చరిత్ర. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కన్నాడు; హారాను లోతును+ కన్నాడు. 28  తన తండ్రి తెరహు ఇంకా బ్రతికి ఉండగానే, హారాను తాను పుట్టిన కల్దీయుల దేశంలోని+ ఊరు+ నగరంలో చనిపోయాడు. 29  అబ్రాము, నాహోరు పెళ్లిళ్లు చేసుకున్నారు. అబ్రాము భార్య పేరు శారయి;+ నాహోరు భార్య పేరు మిల్కా,+ ఈమె హారాను కూతురు. హారాను మిల్కాకు, ఇస్కాకు తండ్రి. 30  శారయి గొడ్రాలు;+ ఆమెకు పిల్లలు లేరు. 31  తెరహు తన కుమారుడు అబ్రామును, హారాను కుమారుడూ తన మనవడూ అయిన లోతును, అబ్రాము భార్యయైన తన కోడలు శారయిని తీసుకొని కల్దీయుల దేశంలోని ఊరు నగరం నుండి బయల్దేరాడు. వాళ్లు అతనితో కలిసి కనాను దేశం+ వైపు ప్రయాణం మొదలుపెట్టారు. కొంతకాలానికి వాళ్లు హారానుకు చేరుకొని,+ అక్కడే నివసించడం మొదలుపెట్టారు. 32  తెరహు మొత్తం 205 ఏళ్లు బ్రతికి, హారానులో చనిపోయాడు.

అధస్సూచీలు

లేదా “బంకమన్నుకు; బురదకు.”
లేదా “కీలును; మక్కును.”
లేదా “అవధానాన్ని ఇచ్చాడు.”
అంటే, బబులోను. “తారుమారు” అని అర్థం.