కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

35వ పాఠం

మనం మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?

మనం మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?

మనందరం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మనం తీసుకునే చాలా నిర్ణయాల వల్ల మనకు మంచి జరగవచ్చు లేదా చెడు జరగవచ్చు, అలాగే మనం యెహోవాకు దగ్గరవ్వవచ్చు లేదా దూరం అవ్వవచ్చు. ఉదాహరణకు మనం ఎక్కడ ఉండాలి, ఏ పని చేయాలి, పెళ్లి చేసుకోవాలా వద్దా వంటి నిర్ణయాలు తీసుకుంటాం. మంచి నిర్ణయాలు తీసుకుంటే మనం సంతోషంగా జీవించవచ్చు, అలాగే యెహోవాను సంతోషపెట్టవచ్చు.

1. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు బైబిల్ని ఎలా ఉపయోగించవచ్చు?

ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు యెహోవా సహాయం కోసం ప్రార్థించండి, బైబిల్ని బాగా పరిశీలించి ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకోండి. (సామెతలు 2:3-6 చదవండి.) కొన్నిసార్లు, బైబిల్లో యెహోవా సూటైన ఆజ్ఞను ఇస్తాడు. అలాంటప్పుడు ఆ ఆజ్ఞను పాటించాలని నిర్ణయించుకోవడమే తెలివైన పని.

ఒకవేళ మీరు ఏం చేయాలో చెప్పే సూటైన ఆజ్ఞ బైబిల్లో లేకపోతే అప్పుడేంటి? అప్పుడు కూడా ‘మీరు నడవాల్సిన దారిలో’ యెహోవా మిమ్మల్ని నడిపిస్తాడు. (యెషయా 48:17) ఎలా? సూటైన ఆజ్ఞ లేకపోయినా మీకు సహాయం చేసే సూత్రాలు బైబిల్లో ఉండవచ్చు. బైబిలు సూత్రాలు అంటే దేవుని ఆలోచనల్ని, భావాల్ని తెలియజేసే ప్రాథమిక సత్యాలు. ఏదైనా ఒక విషయం గురించి దేవునికి ఎలా అనిపిస్తుందో మనం బైబిలు చదివి తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్నప్పుడు, మనం దేవుణ్ణి సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

2. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు ఏ విషయాల గురించి ఆలోచించాలి?

“వివేకం గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 14:15) అంటే నిర్ణయం తీసుకునే ముందు, మన ముందు ఏయే దారులు ఉన్నాయో సమయం తీసుకుని ఆలోచించాలి. అలా ఆలోచిస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు వేసుకోవడం మంచిది: ‘దీనికి సంబంధించి ఏ బైబిలు సూత్రాలు ఉన్నాయి? ఏ దారిని ఎంచుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను? నా నిర్ణయం వల్ల వేరేవాళ్లు ఇబ్బందిపడతారా? అన్నిటికన్నా ముఖ్యంగా, నేను ఈ నిర్ణయం తీసుకుంటే యెహోవా సంతోషిస్తాడా?’—ద్వితీయోపదేశకాండం 32:29.

ఏది మంచో, ఏది చెడో మనకు చెప్పే హక్కు యెహోవాకు ఉంది. మనం ఆయన నియమాల్ని, సూత్రాల్ని తెలుసుకుని వాటిని పాటించాలని బలంగా కోరుకోవడం ద్వారా మన మనస్సాక్షికి శిక్షణ ఇవ్వవచ్చు. మనస్సాక్షి అనేది మన లోపల ఉండే ప్రత్యేకమైన సామర్థ్యం, అది తప్పొప్పుల్ని గుర్తించడానికి సహాయం చేస్తుంది. (రోమీయులు 2:14, 15) మన మనస్సాక్షికి శిక్షణ ఇచ్చినప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

ఎక్కువ తెలుసుకోండి

మంచి నిర్ణయాలు తీసుకోవడానికి బైబిలు సూత్రాలు, అలాగే మన మనస్సాక్షి ఎలా సహాయం చేస్తాయో తెలుసుకోండి.

3. బైబిలు సహాయం తీసుకోండి

నిర్ణయాలు తీసుకోవడానికి బైబిలు సూత్రాలు మీకు ఎలా సహాయం చేస్తాయి? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • స్వేచ్ఛాచిత్తం అంటే ఏంటి?

  • యెహోవా మనకు స్వేచ్ఛాచిత్తాన్ని ఎందుకు ఇచ్చాడు?

  • మంచి నిర్ణయాలు తీసుకునేలా మనకు సహాయం చేయడానికి యెహోవా ఏమేం ఇచ్చాడు?

ఉదాహరణకు ఒక బైబిలు సూత్రాన్ని పరిశీలిద్దాం. ఎఫెసీయులు 5:15, 16 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి. “మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా” ఎలా ఉపయోగించవచ్చు . . .

  • రోజూ బైబిలు చదవడానికి?

  • మంచి భర్తగా లేదా భార్యగా, తండ్రిగా లేదా తల్లిగా, కొడుకుగా లేదా కూతురిగా తయారవ్వడానికి?

  • మీటింగ్స్‌కి హాజరవడానికి?

4. మీ మనస్సాక్షికి శిక్షణ ఇవ్వండి

ఏదైనా విషయం గురించి బైబిల్లో సూటైన ఆజ్ఞ ఉన్నప్పుడు, సరైన నిర్ణయం తీసుకోవడం తేలిగ్గా ఉండవచ్చు. కానీ సూటైన ఆజ్ఞ లేకపోతే అప్పుడెలా? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • ఈ సహోదరి తన మనస్సాక్షికి శిక్షణ ఇవ్వడానికి, యెహోవాను సంతోషపెట్టే నిర్ణయం తీసుకోవడానికి ఏం చేసింది?

మనం ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పమని వేరేవాళ్లను అడగడం ఎందుకు సరైనది కాదు? హెబ్రీయులు 5:14 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మనం ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పమని వేరేవాళ్లను అడగడం తేలిగ్గా అనిపించినా, మనం సొంతగా ఏం చేయగలగాలి?

  • వీడియోలో చూసినట్టు మీ మనస్సాక్షికి శిక్షణ ఇవ్వడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఏవి సహాయం చేస్తాయి?

మ్యాప్‌లాగే, మన మనస్సాక్షి కూడా జీవితంలో ఎటు వెళ్లాలో నిర్ణయించుకోవడానికి సహాయం చేస్తుంది

5. వేరేవాళ్ల మనస్సాక్షిని గౌరవించండి

ఒక్కొక్కరు ఒక్కోలా నిర్ణయాలు తీసుకుంటారు. వేరేవాళ్ల మనస్సాక్షిని మనమెలా గౌరవించవచ్చు? ఈ రెండు సందర్భాల గురించి ఆలోచించండి:

1వ సందర్భం: ఒక సహోదరికి మేకప్‌ వేసుకోవడం అంటే ఇష్టం. ఆమె ఒక కొత్త సంఘానికి మారింది. అక్కడ చాలామంది సహోదరీలు మేకప్‌ వేసుకోవడం తప్పు అని అనుకుంటారు.

రోమీయులు 15:1 అలాగే 1 కొరింథీయులు 10:23, 24 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ఈ వచనాల ప్రకారం, ఆ సహోదరి ఏ నిర్ణయం తీసుకోవచ్చు? మీ మనస్సాక్షికి సరైనది అనిపించింది వేరేవాళ్ల మనస్సాక్షికి తప్పు అనిపిస్తే, మీరేం చేస్తారు?

2వ సందర్భం: మితంగా మందు తాగడాన్ని బైబిలు తప్పుబట్టడం లేదని ఒక సహోదరునికి తెలుసు, కానీ ఆయన అస్సలు మందు తాగకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే ఆయన్ని ఒకరు భోజనానికి ఆహ్వానించారు. అక్కడ సహోదరులు మందు తాగడం ఆయన చూశాడు.

ప్రసంగి 7:16 అలాగే రోమీయులు 14:1, 10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ఈ వచనాల ప్రకారం, ఆ సహోదరుడు ఏ నిర్ణయం తీసుకోవచ్చు? మీ మనస్సాక్షికి తప్పు అనిపించింది వేరేవాళ్ల మనస్సాక్షికి సరైనది అనిపిస్తే, మీరేం చేస్తారు?

 మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం చేయాలి?

1. ప్రార్థించండి. సరైన నిర్ణయం తీసుకునేలా సహాయం చేయమని యెహోవాను అడగండి.—యాకోబు 1:5.

2. పరిశోధన చేయండి. మీ పరిస్థితికి సరిపోయే సూత్రాల్ని బైబిల్లో, బైబిలు ప్రచురణల్లో వెతకండి. అనుభవంగల క్రైస్తవులతో కూడా మీరు మాట్లాడవచ్చు.

3. ఫలితాల గురించి ఆలోచించండి. మీరు తీసుకునే నిర్ణయం మీ మనస్సాక్షిని, వేరేవాళ్ల మనస్సాక్షిని సంతోషపెడుతుందా లేక బాధపెడుతుందా అని ఆలోచించండి.

కొంతమంది ఇలా అంటారు: “నాకు నచ్చింది చేసే హక్కు నాకు ఉంది. ఎవరు ఏమనుకుంటే నాకేంటి?”

  • మన నిర్ణయాల గురించి దేవునికి, వేరేవాళ్లకు ఎలా అనిపిస్తుందో ఎందుకు ఆలోచించాలి?

ఒక్కమాటలో

ఏదైనా ఒక విషయం గురించి యెహోవాకు ఎలా అనిపిస్తుందో తెలుసుకున్నప్పుడు, అలాగే మన పనులు వేరేవాళ్లకు మేలు చేస్తాయా లేక హాని చేస్తాయా అని ఆలోచించినప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

మీరేం నేర్చుకున్నారు?

  • మీరు యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?

  • మీ మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చు?

  • మీరు వేరేవాళ్ల మనస్సాక్షిని ఎలా గౌరవించవచ్చు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

దేవునితో మీకున్న స్నేహాన్ని బలపర్చే నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?

“దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోండి” (కావలికోట, ఏప్రిల్‌ 15, 2011)

యెహోవా మనకు ఎలా సలహా ఇస్తాడో వివరంగా తెలుసుకోండి.

యెహోవా తన ప్రజల్ని నిర్దేశిస్తాడు (9:50)

ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఒకతనికి ఏ విషయాలు సహాయం చేశాయో చూడండి.

మంచి జీవితాన్ని ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు (5:46)

బైబిల్లో సూటైన ఆజ్ఞ లేనప్పుడు యెహోవాను సంతోషపెట్టే నిర్ణయం ఎలా తీసుకోవచ్చో వివరంగా తెలుసుకోండి.

“మీకు ప్రతి విషయంలోను ఒక బైబిలు ఆజ్ఞ అవసరమా?” (కావలికోట, డిసెంబరు 1, 2003)