కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

49వ పాఠం

మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయవచ్చు?—1వ భాగం

మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయవచ్చు?—1వ భాగం

పెళ్లి చేసుకుంటున్న ఒక అబ్బాయి, అమ్మాయి తమ పెళ్లి రోజున ఉన్న సంతోషం జీవితాంతం ఉండాలని కోరుకుంటారు. కానీ, అది సాధ్యమేనా? పెళ్లయి చాలా సంవత్సరాలైన క్రైస్తవులు అది సాధ్యమేనని చూపించారు. వాళ్లు బైబిలు సలహాల్ని పాటించి సంతోషంగా ఉన్నారు.

1. భర్తలకు బైబిలు ఏ సలహా ఇస్తుంది?

భర్తను కుటుంబానికి శిరస్సుగా యెహోవా నియమించాడు. (ఎఫెసీయులు 5:23 చదవండి.) భర్త కుటుంబానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. బైబిలు భర్తలకు ఈ సలహా ఇస్తుంది: “మీ భార్యల్ని ప్రేమిస్తూ ఉండండి.” (ఎఫెసీయులు 5:25) దానర్థం ఏంటి? మంచి భర్త తన భార్యను ఇంట్లో ఉన్నా, నలుగురిలో ఉన్నా ప్రేమగా చూసుకుంటాడు. ఆమెను కాపాడతాడు, ఆమె భావాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, ఆమె అవసరాలు తీరుస్తాడు. (1 తిమోతి 5:8) అన్నిటికంటే ముఖ్యంగా, తన భార్యకు యెహోవాతో దగ్గరి స్నేహం ఉండేలా సహాయం చేస్తాడు. (మత్తయి 4:4) ఉదాహరణకు, ఆమెతో కలిసి ప్రార్థించడం, బైబిలు చదవడం లాంటివి చేస్తాడు. భర్త తన భార్యను ప్రేమగా చూసుకున్నప్పుడు, యెహోవాతో ఆయనకున్న స్నేహం కూడా బలంగా ఉంటుంది.—1 పేతురు 3:7 చదవండి.

2. భార్యలకు బైబిలు ఏ సలహా ఇస్తుంది?

భార్యకు “తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి” అని బైబిలు చెప్తుంది. (ఎఫెసీయులు 5:33) మంచి భార్య ఆ సలహాను ఎలా పాటిస్తుంది? తన భర్తలో ఏ మంచి లక్షణాలు ఉన్నాయో, కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఆమె ఆలోచిస్తుంది. అలాగే తన భర్త తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇవ్వడం ద్వారా, ఆయనతో దయగా మాట్లాడడం ద్వారా, ఆయన గురించి వేరేవాళ్లతో మంచిగా మాట్లాడడం ద్వారా ఆయన మీద గౌరవం చూపిస్తుంది. భర్త సత్యంలో ఉన్నా, లేకపోయినా ఆమె అలా చేస్తుంది.

3. భార్యాభర్తలు తమ బంధాన్ని ఎలా బలంగా ఉంచుకోవచ్చు?

భార్యాభర్తల గురించి బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు.” (మత్తయి 19:5) అంటే వాళ్లిద్దరి మధ్య దూరం పెంచే దేనికీ వాళ్లు చోటు ఇవ్వకూడదు. కాబట్టి వాళ్లు కలిసి సమయం గడుపుతారు, మనసువిప్పి మాట్లాడుకుంటారు, వాళ్ల ఆలోచనల్ని-భావాల్ని ప్రేమగా పంచుకుంటారు. వాళ్ల జీవితంలో యెహోవా తర్వాత ముఖ్యమైన స్థానం, వాళ్ల వివాహజతదే. ఆ స్థానాన్ని వేరే దేనికీ లేదా ఎవ్వరికీ ఇవ్వరు. మరిముఖ్యంగా, పరాయి వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతూ, మరీ చనువుగా ఉండకుండా జాగ్రత్తపడతారు.

ఎక్కువ తెలుసుకోండి

మీ వివాహ బంధాన్ని బలంగా ఉంచుకోవడానికి సహాయం చేసే బైబిలు సలహాల్ని చూడండి.

4. భర్తలారా మీ భార్యను ప్రేమించండి, శ్రద్ధగా చూసుకోండి

‘భర్తలు తమ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్టు తమ భార్యల్ని ప్రేమించాలి’ అని బైబిలు చెప్తుంది. (ఎఫెసీయులు 5:28, 29) దానర్థం ఏంటి? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • భర్త ఏయే విధాలుగా తన భార్య మీద ప్రేమ, శ్రద్ధ చూపించవచ్చు?

కొలొస్సయులు 3:12 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • భర్త తన భార్య పట్ల ఈ లక్షణాల్ని ఎలా చూపించవచ్చు?

5. భార్యలారా మీ భర్తను ప్రేమించండి, గౌరవించండి

భర్త యెహోవాను ఆరాధించినా, ఆరాధించకపోయినా భార్య ఆయన్ని గౌరవించాలని బైబిలు చెప్తుంది. 1 పేతురు 3:1, 2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ఒకవేళ మీ భర్త యెహోవాసాక్షి కాకపోతే, ఆయన కూడా యెహోవాను ఆరాధించాలని మీరు ఖచ్చితంగా కోరుకుంటారు. దానికోసం మీరు పదేపదే ఆయనకు బైబిలు గురించి చెప్తే బాగుంటుందా, లేక మంచి లక్షణాలు చూపిస్తూ ఆయన్ని గౌరవిస్తే బాగుంటుందా? ఎందుకు?

భార్యాభర్తలు కలిసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అయితే, కొన్నిసార్లు భర్త తీసుకున్న నిర్ణయం భార్యకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు ఆమె తన అభిప్రాయాన్ని ప్రశాంతంగా, గౌరవపూర్వకంగా చెప్పవచ్చు. కానీ, కుటుంబ మేలు కోసం నిర్ణయాలు తీసుకునే బాధ్యతను యెహోవా భర్తకు ఇచ్చాడని ఆమె గుర్తుంచుకోవాలి. భర్త ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి మద్దతు ఇవ్వడానికి ఆమె కృషిచేయాలి. అప్పుడు, కుటుంబం సంతోషంగా ఉండడానికి ఆమె తన వంతు ప్రయత్నం తాను చేసినట్లు అవుతుంది. 1 పేతురు 3:3-5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • భార్య భర్తను గౌరవించినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

6. వివాహ జీవితంలో వచ్చే సమస్యల్ని మీరు పరిష్కరించుకోవచ్చు

భార్యాభర్తలు అన్నాక సమస్యలు వస్తుంటాయి. కాబట్టి, సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వాళ్లిద్దరు కలిసికట్టుగా కృషిచేయాలి. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • ఈ వీడియోలోని భార్యాభర్తల మధ్య దూరం పెరిగిందని ఎలా చెప్పవచ్చు?

  • వాళ్ల బంధాన్ని బలంగా ఉంచుకోవడానికి వాళ్లు ఏం చేశారు?

1 కొరింథీయులు 10:24; కొలొస్సయులు 3:13 చదవండి. ప్రతీ వచనం చదివిన తర్వాత, ఈ ప్రశ్నను చర్చించండి:

  • భార్యాభర్తల బంధం బలపడడానికి ఈ సలహా ఎలా ఉపయోగపడుతుంది?

మనం ఒకరినొకరం ఘనపర్చుకోవాలని బైబిలు చెప్తుంది. అంటే మనం ఎదుటి వ్యక్తితో దయగా, గౌరవపూర్వకంగా ప్రవర్తించాలి. రోమీయులు 12:10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ముందు నా వివాహజత నన్ను గౌరవిస్తే, తర్వాత నేను తనను గౌరవిస్తాను అని అనుకోవడం సరైనదేనా? ఎందుకు?

కొంతమంది ఇలా అంటారు: “మేము భార్యాభర్తలం అన్న మాటేగానీ, మా మధ్య అసలు ప్రేమే లేదు.”

  • బైబిలు వాళ్లకు సహాయం చేయగలదని మీరు ఎలా వివరిస్తారు?

ఒక్కమాటలో

భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు, గౌరవించుకున్నప్పుడు, బైబిలు సలహాల్ని పాటించినప్పుడు సంతోషంగా ఉండవచ్చు.

మీరేం నేర్చుకున్నారు?

  • కుటుంబం సంతోషంగా ఉండడానికి భర్త ఏం చేయవచ్చు?

  • కుటుంబం సంతోషంగా ఉండడానికి భార్య ఏం చేయవచ్చు?

  • మీకు పెళ్లయి ఉంటే, మీ బంధాన్ని బలంగా ఉంచుకోవడానికి ఏ బైబిలు సలహా ఉపయోగపడుతుంది?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

మీ కుటుంబం సంతోషంగా ఉండడానికి సహాయం చేసే సలహాల్ని తెలుసుకోండి.

ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం . . . (బ్రోషురు)

దేవుడు చెప్పే సలహాల్ని పాటిస్తే భార్యాభర్తలు ఎంత సంతోషంగా ఉంటారో ఈ పాటలో చూడండి.

నీతో ప్రేమలో పడ్డాక . . . (4:26)

భార్య తన భర్త శిరస్సత్వానికి లోబడి ఉండడం అంటే ఏంటో పరిశీలించండి.

“స్త్రీలారా, మీరెందుకు శిరస్సత్వానికి లోబడాలి?” (కావలికోట, మే 15, 2010)

భార్యాభర్తలకు బైబిలు ఇచ్చే సలహాలు ఎంత బాగా ఉపయోగపడతాయో చూడండి.

బైబిలు మా వివాహ బంధాన్ని బలపర్చింది (7:12)