50వ పాఠం
మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయవచ్చు?—2వ భాగం
పిల్లలు యెహోవా ఇచ్చిన బహుమానం. తల్లిదండ్రులు వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకోసం యెహోవా తల్లిదండ్రులకు మంచి సలహాలు ఇస్తున్నాడు. తల్లిదండ్రులకే కాదు, పిల్లలకు కూడా ఆయన మంచి సలహాలు ఇస్తున్నాడు. వాటిని పాటించినప్పుడు కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది.
1. తల్లిదండ్రులకు యెహోవా ఏ సలహా ఇస్తున్నాడు?
తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలని, వాళ్లతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని యెహోవా కోరుకుంటున్నాడు. అంతేకాదు తల్లిదండ్రులు తమ పిల్లల్ని కాపాడాలని, బైబిలు సూత్రాల్ని ఉపయోగించి వాళ్లకు శిక్షణ ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. (సామెతలు 1:8) తండ్రులకు ఆయన ఇలా చెప్తున్నాడు: ‘మీ పిల్లలకు యెహోవా నిర్దేశాల ప్రకారం ఉపదేశాన్ని ఇస్తూ పెంచండి.’ (ఎఫెసీయులు 6:4 చదవండి.) తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో తన నిర్దేశాల్ని పాటించాలని, పిల్లల్ని పెంచే బాధ్యతను వాళ్లు వేరేవాళ్లకు అప్పగించకూడదని ఆయన కోరుకుంటున్నాడు.
2. పిల్లలకు యెహోవా ఏ సలహా ఇస్తున్నాడు?
పిల్లలకు యెహోవా ఈ సలహా ఇస్తున్నాడు: “మీ అమ్మానాన్నల మాట వినండి.” (కొలొస్సయులు 3:20 చదవండి.) పిల్లలు అమ్మానాన్నల మాట వింటూ వాళ్లను గౌరవించినప్పుడు యెహోవా సంతోషిస్తాడు, అమ్మానాన్నలు కూడా సంతోషిస్తారు. (సామెతలు 23:22-25) ఈ విషయంలో మనం యేసు నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన పరిపూర్ణుడైనా అమ్మానాన్నలకు లోబడ్డాడు, వాళ్లను గౌరవించాడు.—లూకా 2:51, 52.
3. మీరు కుటుంబంగా దేవునికి ఎలా దగ్గరవ్వవచ్చు?
ఒకవేళ మీకు పిల్లలు ఉంటే, వాళ్లు కూడా మీలాగే యెహోవాను ప్రేమించాలని మీరు ఖచ్చితంగా కోరుకుంటారు. మరి మీరు దాన్ని ఎలా చేయవచ్చు? బైబిలు ఇస్తున్న ఈ సలహాను పాటించవచ్చు: “నువ్వు వాటిని [అంటే, యెహోవా మాటల్ని] నీ కుమారుల హృదయాల్లో నాటాలి; నువ్వు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు . . . వాటి గురించి మాట్లాడాలి.” (ద్వితీయోపదేశకాండం 6:7) ఇక్కడ “నాటాలి” అనే మాటకు, మళ్లీమళ్లీ చెప్తూ నేర్పించడం అని అర్థం. సాధారణంగా, పిల్లలు ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని మళ్లీమళ్లీ చెప్తూ ఉండాలి. కాబట్టి ఈ వచనం ప్రకారం, మీ పిల్లలతో యెహోవా గురించి మళ్లీమళ్లీ మాట్లాడే అవకాశాల కోసం చూస్తూ ఉండాలి. కుటుంబంగా యెహోవాను ఆరాధించడానికి ప్రతీవారం కొంత సమయాన్ని పక్కన పెట్టుకోవడం మంచిది. ఒకవేళ మీకు పిల్లలు లేకపోయినా, బైబిల్ని అధ్యయనం చేయడానికి మీరు ప్రతీవారం కొంత సమయం తీసుకోవడం మంచిది.
ఎక్కువ తెలుసుకోండి
మీ కుటుంబం సంతోషంగా ఉండడానికి, మీ పిల్లల్ని కాపాడుకోవడానికి సహాయం చేసే మరిన్ని సలహాల్ని తెలుసుకోండి.
4. మీ పిల్లలకు ప్రేమతో శిక్షణ ఇవ్వండి
పిల్లలకు శిక్షణ ఇవ్వడం అంత తేలిక కాదు. ఈ విషయంలో బైబిలు ఎలా సహాయం చేస్తుంది? యాకోబు 1:19, 20 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
-
తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ప్రేమగా మాట్లాడవచ్చు?
-
తల్లిదండ్రులు కోపంగా ఉన్నప్పుడు పిల్లలకు క్రమశిక్షణ ఇవ్వకూడదు. ఎందుకు? a
5. మీ పిల్లల్ని కాపాడుకోండి
మీ పిల్లల్ని లైంగిక దాడుల నుండి కాపాడాలంటే, వాళ్లలో ప్రతీఒక్కరితో సెక్స్ గురించి మాట్లాడడం ప్రాముఖ్యం. అలా మాట్లాడడం కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.
-
కొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లలతో సెక్స్ గురించి మాట్లాడడం ఎందుకు కష్టంగా ఉంటుంది?
-
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సెక్స్ గురించి ఎలా వివరించారు?
బైబిలు ముందే చెప్పినట్టు, సాతాను లోకం అంతకంతకు చెడిపోతూ ఉంది. 2 తిమోతి 3:1, 13 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
-
13వ వచనంలో చెప్పిన కొంతమంది దుష్టులు పిల్లలపై లైంగిక దాడి చేస్తారు. దీన్నిబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలతో సెక్స్ గురించి మాట్లాడడం, లైంగిక దాడి చేసేవాళ్ల నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలో నేర్పించడం ఎందుకు ప్రాముఖ్యం?
మీకు తెలుసా?
తల్లిదండ్రులు తమ పిల్లలతో సెక్స్ గురించి మాట్లాడడానికి, లైంగిక దాడి చేసేవాళ్ల నుండి పిల్లల్ని కాపాడడానికి సహాయం చేసే చాలా వీడియోల్ని, ఆర్టికల్స్‌ని యెహోవాసాక్షులు తయారుచేశారు. ఉదాహరణకు ఇవి చూడండి:
-
మీ పిల్లల్ని కాపాడుకోండి (1:52)
-
గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి, 10 అలాగే 32 అధ్యాయాలు
-
“సెక్స్ గురించి మీ పిల్లలకు చెప్పండి” (తేజరిల్లు! నం. 4 2016)
6. మీ అమ్మానాన్నల్ని గౌరవించండి
పిల్లలు అమ్మానాన్నల మీద గౌరవం చూపించే ఒక విధానం ఏంటంటే, వాళ్లతో మర్యాదగా మాట్లాడడం. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.
-
పిల్లలు వాళ్ల అమ్మానాన్నలతో గౌరవపూర్వకంగా మాట్లాడడం ఎందుకు మంచిది?
-
పిల్లలు వాళ్ల అమ్మానాన్నలతో ఎలా గౌరవపూర్వకంగా మాట్లాడవచ్చు?
సామెతలు 1:8 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
-
అమ్మానాన్నలు ఏదైనా చెప్పినప్పుడు పిల్లలు ఏం చేయాలి?
7. కుటుంబమంతా కలిసి యెహోవాను ఆరాధించండి
యెహోవాసాక్షులు ప్రతీవారం కుటుంబమంతా కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి కొంత సమయాన్ని పక్కన పెట్టుకుంటారు. ఈ కుటుంబ ఆరాధన ఎలా జరుగుతుంది? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.
-
కుటుంబ ఆరాధన క్రమంగా జరగడానికి కుటుంబంలో ప్రతీఒక్కరు ఏం చేయవచ్చు?
-
అది కుటుంబమంతటికీ ఉపయోగపడేలా, అందరూ ఆనందించేలా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయవచ్చు?—ఈ పాఠం మొదట్లో ఉన్న చిత్రం చూడండి.
-
మీరు కుటుంబ ఆరాధన చేసుకోవడానికి ఏది సవాలుగా ఉండవచ్చు?
కుటుంబమంతా కలిసి లేఖనాల గురించి క్రమంగా మాట్లాడుకోవాలని యెహోవా ప్రాచీన ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6:6, 7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
-
ఈ సూత్రాన్ని మీరు ఎలా పాటించవచ్చు?
కుటుంబ ఆరాధనకు సలహాలు:
-
మీటింగ్స్‌కి సిద్ధపడండి.
-
మీ కుటుంబానికి నచ్చే ఏదైనా బైబిలు వృత్తాంతాన్ని చదివి, చర్చించండి.
-
మీకు చిన్నపిల్లలు ఉంటే, jw.orgలో “సరదాగా నేర్చుకుందాం” కింద ఉన్న వాటిని డౌన్లోడ్ చేసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి.
-
మీకు టీనేజీ పిల్లలు ఉంటే, jw.orgలో టీనేజర్ల కోసం ఉన్న ఏదైనా ఆర్టికల్‌ని చర్చించండి.
-
మీ పిల్లలతో కలిసి ఏదైనా బైబిలు కథను నాటకం వేయండి.
-
jw.orgలో ఏదైనా వీడియో చూసి, చర్చించండి.
కొంతమంది ఇలా అంటారు: “బైబిల్ని పెద్దవాళ్లు అర్థం చేసుకోవడమే కష్టం, ఇక పిల్లలకు ఏం అర్థమౌతుంది?”
-
మీరేమంటారు?
ఒక్కమాటలో
తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలని, శిక్షణ ఇవ్వాలని, కాపాడాలని; పిల్లలేమో తల్లిదండ్రుల్ని గౌరవించాలని, వాళ్లకు లోబడాలని; కుటుంబమంతా కలిసి తనను ఆరాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు.
మీరేం నేర్చుకున్నారు?
-
తల్లిదండ్రులు పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వవచ్చు, ఎలా కాపాడవచ్చు?
-
పిల్లలు అమ్మానాన్నల మీద ఎలా గౌరవం చూపించవచ్చు?
-
కుటుంబ ఆరాధన కోసం ప్రతీవారం కొంత సమయం పక్కన పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?
ఇవి కూడా చూడండి
మీ పిల్లలు పెద్దయ్యాక మంచిపేరు తెచ్చుకోవాలంటే, ఇప్పటి నుండే వాళ్లకు ఏ విషయాలు నేర్పించాలి?
“పిల్లలకు ముఖ్యంగా ఏమి నేర్పించాలి?” (తేజరిల్లు! నం. 2 2019)
వయసుపైబడిన తల్లిదండ్రుల్ని చూసుకునే వాళ్లకు బైబిలు ఏ సలహాలు ఇస్తుందో తెలుసుకోండి.
“వయసుపైబడిన తల్లిదండ్రుల్ని చూసుకోవడం గురించి బైబిలు ఏం చెప్తుంది?” (jw.org ఆర్టికల్)
పిల్లల్ని ఎలా పెంచాలో అస్సలు తెలియని ఒకాయన, ఎలా ఒక మంచి తండ్రి అయ్యాడో చూడండి.
తండ్రి, కొడుకుల మధ్య అనుబంధం పెరగాలంటే తండ్రులు ఏం చేయాలో తెలుసుకోండి.
“తండ్రి తన కొడుకుకు దగ్గరవ్వాలంటే . . .” (కావలికోట, ఏప్రిల్-జూన్ 2012)
a బైబిల్లో “క్రమశిక్షణ” అంటే తిట్టడం, కొట్టడం కాదుగానీ ఉపదేశించడం, నడిపించడం, సరిదిద్దడం.—సామెతలు 4:1.