“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను”
‘నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించాలనేదే రెండవ ఆజ్ఞ.’—మత్త. 22:39.
1, 2. (ఎ) యేసు చెప్పిన ఏ ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో రెండవ అతి ముఖ్యమైన ఆజ్ఞ? (బి) మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?
ఓ రోజు యేసును పరీక్షించడానికి ఒక పరిసయ్యుడు, “బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు. మనం ముందటి ఆర్టికల్లో గమనించినట్లు యేసు ఇలా జవాబిచ్చాడు, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ.” అయితే, యేసు ఇంకా ఇలా అన్నాడు, “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.”—మత్త. 22:34-39.
2 మనల్ని మనం ప్రేమించుకున్నట్లే ఎదుటివ్యక్తిని కూడా ప్రేమించాలని యేసు చెప్పాడు. అయితే, మనం ఇలా ప్రశ్నించుకోవాలి: నిజానికి మన ‘పొరుగు వాడెవడు?’ మనం పొరుగువాళ్ల పట్ల ప్రేమను ఎలా చూపించవచ్చు?
మన ‘పొరుగు వాడెవడు?’
3, 4. (ఎ) “నా పొరుగువాడెవడు?” అనే ప్రశ్నకు యేసు ఏ ఉపమానంతో జవాబిచ్చాడు? (బి) దెబ్బలు తగిలి, కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి సమరయుడు ఎలా సహాయం చేశాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)
3 మన వీధిలోనే నివసిస్తూ, మనకు సహాయం చేసే సన్నిహితుడే మన పొరుగువాడని మనం అనుకోవచ్చు. (సామె. 27:10) అయితే, “నా పొరుగువాడెవడు?” అని ఓ స్వనీతిపరుడైన వ్యక్తి యేసును అడిగినప్పుడు, ఆయన సమరయుని ఉపమానం చెప్పాడు. (లూకా 10:29-37 చదవండి.) దొంగలు ఓ వ్యక్తిని కొట్టి, అతని దగ్గర ఉన్నవి దోచుకొని, కొన ఊపిరితో వదిలేసినప్పుడు బహుశా ఓ ఇశ్రాయేలీయుడైన యాజకుడో లేక లేవీయుడో మంచి పొరుగువానిలా అతనికి సహాయం చేస్తారని మనం అనుకుంటాం. కానీ, వాళ్లు అతణ్ణి ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. యూదులు అసహ్యించుకునే సమరయుడు మాత్రం ఆ వ్యక్తికి సహాయం చేశాడు. సమరయులు మోషే ధర్మశాస్త్రాన్ని గౌరవించేవాళ్లు.—యోహా. 4:9.
4 పొరుగువాడైన సమరయుడు, ఆ వ్యక్తి తొందరగా కోలుకునేలా దెబ్బల మీద నూనె, ద్రాక్షారసం పోసి కట్టు కట్టాడు. అతని బాగోగులు చూసుకోవడానికి పూటకూళ్లవానికి రెండు దేనారాలు ఇచ్చాడు. అవి దాదాపు రెండు రోజుల కూలితో సమానం. (మత్త. 20:2) కాబట్టి, దెబ్బలు తగిలిన ఆ వ్యక్తికి నిజమైన పొరుగువాడు ఎవడో స్పష్టంగా తెలుస్తుంది. పొరుగువాళ్ల పట్ల ప్రేమ, దయ చూపించాలని యేసు ఉపమానం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది.
5. ఈ మధ్యకాలంలో ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు యెహోవాసాక్షులు పొరుగువాళ్ల పట్ల ప్రేమను ఎలా చూపించారు?
5 సమరయునిలాంటి దయగల మనుషులను కనుగొనడం కొంచెం కష్టమే. ముఖ్యంగా, ‘అనురాగరహితులు, క్రూరులు, సజ్జన ద్వేషులే’ ఎక్కువగా ఉన్న ఈ “అంత్యదినములలో” ఇంకా కష్టం. (2 తిమో. 3:1-3) ఉదాహరణకు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఘోరమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. న్యూయార్క్ నగరంలో 2012, అక్టోబరు నెల చివర్లో హరికేన్ శాండీ తుఫాను సంభవించినప్పుడు ఏమి జరిగిందో చూడండి. తుఫాను వల్ల బాగా దెబ్బతిన్న ఓ ప్రాంతంలో కరెంటు, మరితర సౌకర్యాలు లేక సతమతమౌతున్న ప్రజల దగ్గర కూడా దొంగలు దోపిడికి తెగబడ్డారు. అదే ప్రాంతంలో, యెహోవాసాక్షులు తమ తోటి సహోదరులకు, ఇతరులకు సహాయం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. క్రైస్తవులు పొరుగువాళ్ల మీదున్న ప్రేమను బట్టి అలా చేస్తారు. పొరుగువాళ్ల పట్ల ప్రేమను చూపించే కొన్ని మార్గాలు ఏమిటి?
పొరుగువాళ్ల పట్ల ప్రేమను ఎలా చూపించవచ్చు?
6. మనం మన పొరుగువాళ్లకు ఎలాంటి సహాయం అందిస్తాం?
6 ప్రజలకు ఆధ్యాత్మిక సహాయాన్ని అందించండి. మనం పరిచర్యలో పొరుగువాళ్లకు ‘లేఖనముల వల్ల కలిగే ఆదరణను’ అందిస్తాం. (రోమా. 15:4) మనం పరిచర్యలో బైబిలు సత్యాల్ని ఇతరులతో పంచుకున్నప్పుడు నిస్సందేహంగా వాళ్లకు మంచి పొరుగువాళ్లం అవుతాం. (మత్త. 24:14) “నిరీక్షణకర్తయగు దేవుడు” ఇచ్చిన రాజ్య సందేశాన్ని ప్రకటించడం ఎంత గొప్ప అవకాశమో కదా!—రోమా. 15:13.
7. బంగారు సూత్రం అంటే ఏమిటి? దాన్ని పాటిస్తే మనం ఎలాంటి ప్రయోజనం పొందుతాం?
7 బంగారు సూత్రాన్ని పాటించండి. యేసు కొండమీద ఇచ్చిన ప్రసంగంలో ఈ సూత్రాన్ని చెప్పాడు, “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది.” (మత్త. 7:12) యేసు చెప్పినట్లుగా మనం ప్రజలతో వ్యవహరిస్తే, “ధర్మశాస్త్రము” (ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము), “ప్రవక్తల ఉపదేశం” (హీబ్రూ లేఖనాల్లో ఉన్న ప్రవచన పుస్తకాలు) వెనక ఉన్న ఉద్దేశానికి అనుగుణంగా ప్రవర్తించిన వాళ్లమౌతాం. ఇతరుల మీద ప్రేమను చూపించేవాళ్లను దేవుడు దీవిస్తాడని ఆ పుస్తకాల్లో మనం స్పష్టంగా చూడవచ్చు. ఉదాహరణకు, యెషయా పుస్తకంలో యెహోవా ఇలా చెప్పాడు, ‘న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి . . . దాని రూఢిగా గైకొనువాడు ధన్యుడు.’ (యెష. 56:1, 2) మన పొరుగువాళ్లతో ప్రేమగా, నీతిగా ప్రవర్తిస్తాం కాబట్టి మనం దీవెనలు పొందుతున్నాం.
8. మనం శత్రువులను ఎందుకు ప్రేమించాలి? మనం అలా చేసినప్పుడు ఏమి జరగవచ్చు?
8 మీ శత్రువులను ప్రేమించండి. “నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి” అని యేసు చెప్పాడు. (మత్త. 5:43-45) అపొస్తలుడైన పౌలు ఆ విషయం గురించే ఇలా రాశాడు, “నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము.” (రోమా. 12:20; సామె. 25:21) మోషే ధర్మశాస్త్రం ప్రకారం శత్రువుకు చెందిన గాడిద, బరువు మోయలేక పడిపోతే దాన్ని తప్పించడానికి అతనికి సహాయం చేయాలి. (నిర్గ. 23:5) అలా కలిసి పనిచేస్తే ఒకప్పుడు శత్రువులుగా ఉన్న వ్యక్తులు మంచి స్నేహితులు అయ్యే అవకాశం ఉంది. క్రైస్తవులముగా మనం ప్రేమ చూపిస్తాం కాబట్టే, మన శత్రువుల్లో చాలామంది మన గురించి వాళ్లకున్న అభిప్రాయం మార్చుకున్నారు. మన శత్రువులపై, చివరికి మనల్ని తీవ్రంగా హింసించే వాళ్లపై కూడా మనం ప్రేమ చూపించినప్పుడు వాళ్లలో కొందరు క్రైస్తవులుగా మారితే మనకు ఎంత సంతోషం కలుగుతుందో ఆలోచించండి!
9. మన తోటి సహోదరులతో సమాధానపడే విషయంలో యేసు ఏమి చెప్పాడు?
9 ‘అందరితో సమాధానమును కలిగి ఉండండి’ (హెబ్రీ. 12:14) ఆ అందరిలో మన తోటి సహోదరులు కూడా ఉన్నారని వేరే చెప్పనక్కర్లేదు. యేసు ఇలా చెప్పాడు, “నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.” (మత్త. 5:23, 24) మనం మన తోటి సహోదరుల మీద ప్రేమ చూపించి, వాళ్లతో సమాధానపడడానికి సరైన చర్యలు తీసుకుంటే యెహోవా మనల్ని దీవిస్తాడు.
10. మనం ఎందుకు తప్పులు వెదకకూడదు?
10 తప్పులు వెదకకండి. యేసు ఇలా చెప్పాడు, “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? నీ కంటిలో దూలముండగా, నీవు సహోదరుని చూచి—నీ కంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల? వేషధారీ, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.” (మత్త. 7:1-5) మన దగ్గరే పెద్దపెద్ద తప్పులు పెట్టుకుని ఎదుటి వ్యక్తి చేసే చిన్నచిన్న పొరపాట్లను ఎత్తిచూపద్దని యేసు ఎంత శక్తిమంతంగా చెప్పాడో కదా!
పొరుగువాళ్ల పట్ల ప్రేమ చూపించే ఓ ప్రత్యేక విధానం
11, 12. మనం ఏ ప్రత్యేకమైన విధానంలో పొరుగువాళ్ల పట్ల ప్రేమను చూపిస్తాం?
11 మన పొరుగువాళ్ల పట్ల ఓ ప్రత్యేక విధానంలో ప్రేమ చూపిస్తాం. యేసులాగే మనం రాజ్యసువార్త ప్రకటిస్తాం. (లూకా 8:1) “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (మత్త. 28:19, 20) మన పొరుగువాళ్లు, నాశనానికి నడిపించే వెడల్పయిన, విశాలమైన మార్గాన్ని విడిచిపెట్టి జీవానికి నడిపించే ఇరుకైన, సంకుచితమైన మార్గంలో నడిచేలా సహాయం చేయాలంటే యేసు ఇచ్చిన ఆ ఆజ్ఞను మనం పాటించాలి. (మత్త. 7:13, 14) అలాంటి ప్రయత్నాల్ని యెహోవా దీవిస్తాడనడంలో సందేహం లేదు.
12 యేసులాగే మనం కూడా ప్రజలు తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించేందుకు సహాయం చేస్తాం. (మత్త. 5:3) సరిగ్గా స్పందించే వాళ్లతో “దేవుని సువార్త” పంచుకోవడం ద్వారా వాళ్ల ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చడంలో మన వంతు నిర్వహిస్తాం. (రోమా. 1:1) రాజ్య సందేశాన్ని అంగీకరించినవాళ్లు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడతారు. (2 కొరిం. 5:18, 19) అవును, సువార్త ప్రకటించడం ద్వారా మనం మన పొరుగువాళ్ల పట్ల ఓ ప్రాముఖ్యమైన విధానంలో ప్రేమను చూపిస్తాం.
13. రాజ్యప్రచారకులుగా మనం చేసే పనిలో పాల్గొనడం మీకెలా అనిపిస్తుంది?
13 సమర్థవంతమైన పునర్దర్శనాలు, బైబిలు అధ్యయనాలు చేయడం ద్వారా, ప్రజలు దేవుని నీతియుక్త ప్రమాణాలను పాటించేలా సహాయం చేస్తున్నామనే సంతృప్తి మనకుంటుంది. అలా పాటించడం, బైబిలు విద్యార్థి జీవిత విధానాన్ని మార్చేస్తుంది. (1 కొరిం. 6:9-11) ‘నిత్యజీవము పట్ల సరైన మనోవైఖరిగల’ వాళ్లు తమ జీవితాల్లో మార్పులు చేసుకునేలా, తనతో సన్నిహిత సంబంధం కలిగివుండేలా యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడో చూసినప్పుడు మనకు నిజంగా ఎంతో సంతోషం కలుగుతుంది. (అపొ. 13:48, NW) అలా చాలామంది, నిరాశలో మునిగిపోయే బదులు ఆనందంగా ఉన్నారు, అనవసరంగా ఆందోళన చెందే బదులు మన పరలోక తండ్రి మీద నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. కొత్తవాళ్లు అలా ఆధ్యాత్మిక ప్రగతి సాధించడాన్ని చూడడం ఎంత ఆనందాన్ని ఇస్తుందో! రాజ్య ప్రచారకులముగా మనం పొరుగువాళ్ల పట్ల ప్రేమను ఈ ప్రత్యేక విధానంలో చూపించడం నిజంగా ఓ ఆశీర్వాదం కాదంటారా?
ప్రేమ గురించి పౌలు ఇచ్చిన వివరణ
14. ప్రేమకు సంబంధించిన ఏయే అంశాలు 1 కొరింథీయులు 13:4-8లో ఉన్నాయో మీ సొంత మాటల్లో చెప్పండి.
14 పొరుగువాళ్లతో వ్యవహరించేటప్పుడు, ప్రేమ గురించి పౌలు రాసిన మాటల్ని పాటిస్తే మనం ఎన్నో సమస్యల్ని అరికట్టవచ్చు, ఎంతో సంతోషం పొందవచ్చు, దేవుని దీవెనలు కూడా సొంతం చేసుకోవచ్చు. (1 కొరింథీయులు 13:4-8 చదవండి.) ప్రేమ గురించి పౌలు ఏమి చెప్పాడో ఇప్పుడు క్లుప్తంగా పరిశీలించి, పొరుగువాళ్లతో మన వ్యవహారాల్లో ఆ మాటల్ని మనం ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం.
15. (ఎ) మనం ఎందుకు ఓపిగ్గా, దయగా ఉండాలి? (బి) మనం ఎందుకు అసూయపడకూడదు, గొప్పలు చెప్పుకోకూడదు?
15 “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును.” అపరిపూర్ణ మానవులతో దేవుడు ఓపిగ్గా, దయగా వ్యవహరిస్తాడు. మన విషయంలో ఎవరైనా పొరపాటు చేస్తే, అనాలోచితంగా లేదా దురుసుగా వ్యవహరిస్తే మనం కూడా యెహోవాలాగే ప్రవర్తించాలి. “ప్రేమ మత్సరపడదు,” కాబట్టి మనకు ప్రేమ ఉంటే ఎదుటివ్యక్తికి ఉన్నవాటిని చూసి లేదా సంఘంలో అతనికి ఉన్న సేవావకాశాలను బట్టి అసూయపడం. అంతేకాదు, మనకు ప్రేమ ఉంటే మన గురించి మనం గొప్పలు చెప్పుకోము లేదా గర్వంతో ఉప్పొంగిపోము. ఎందుకంటే, “అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు.”—సామె. 21:4.
16, 17. మనం 1 కొరింథీయులు 13:5, 6 చెప్తున్న ప్రకారం ఎలా ప్రవర్తించవచ్చు?
16 ప్రేమ ఉంటే మన పొరుగువాళ్లతో మర్యాదగా ప్రవర్తిస్తాం. వాళ్లకు అబద్ధాలు చెప్పం, వాళ్ల వస్తువులు దొంగతనం చేయం లేదా యెహోవా నియమాలను, సూత్రాలను ఉల్లంఘించే దేన్ని చేయం. ప్రేమ ఉంటే మనం కేవలం మన సొంత విషయాల్నే కాదుగానీ ఎదుటివాళ్ల విషయాలను కూడా పట్టించుకుంటాం.—ఫిలి. 2:4.
17 మనకు యథార్థమైన ప్రేమ ఉంటే త్వరగా కోపపడం, అంతేకాక ఎదుటివ్యక్తి మనల్ని బాధపెట్టిన ప్రతీసారి పుస్తకంలో రాసుకుంటున్నట్లుగా ‘అపకారాన్ని మనసులో ఉంచుకోం.’ (1 థెస్స. 5:15) మనం ఒకవేళ ఎదుటివ్యక్తి మీద పగపెట్టుకుంటే దేవుణ్ణి ప్రీతిపర్చలేం, మనలో అది అగ్నిలా మండుతూ మనకూ ఇతరులకూ హాని చేస్తుంది. (లేవీ. 19:18) ప్రేమ “సత్యమునందు సంతోషించును,” అయితే ప్రేమ ఉన్నప్పుడు మనం ‘దుర్నీతి విషయంలో సంతోషించం.’ చివరికి మనల్ని ద్వేషించే వ్యక్తికి ఏదైనా అవమానం, అన్యాయం జరిగినప్పుడు కూడా మనం సంతోషించం.—సామెతలు 24:17, 18 చదవండి.
18. మనం 1 కొరింథీయులు 13:7, 8లో ప్రేమ గురించి ఏమి నేర్చుకుంటాం?
18 ప్రేమ గురించి పౌలు ఇంకా ఏమన్నాడో చూడండి. ప్రేమ “అన్నిటికి తాళుకొనును” అని ఆయన అన్నాడు. మనల్ని నొప్పించినవాళ్లు క్షమాపణ అడిగితే ప్రేమతో మనం వాళ్లను క్షమిస్తాం. ప్రేమ ఉంటే దేవుని వాక్యంలో ఉన్న ‘అన్నిటిని నమ్ముతాం,’ మనకు అందే ఆధ్యాత్మిక ఆహారాన్నిబట్టి ఎంతో కృతజ్ఞత కలిగివుంటాం. ప్రేమ ఉంటే, బైబిల్లో ఉన్న ‘అన్నిటిని నిరీక్షిస్తాం,’ మన నిరీక్షణకు కారణాలను అందరికీ చెప్పడానికి ముందుంటాం. (1 పేతు. 3:15, 16) కష్టాలు ఎదురైనప్పుడు మనం ప్రార్థిస్తాం, చివరికి మంచి జరగాలని నిరీక్షిస్తాం. మనకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేసినా, హింసలు వచ్చినా లేదా ఇతర పరీక్షలు ఎదురైనా ప్రేమ ఉంటే ‘అన్నిటికి తాళుకొంటాం.’ అంతేకాదు, “ప్రేమ శాశ్వతకాలముండును.” విధేయులైన మానవులు నిరంతరం ప్రేమను చూపిస్తారు.
పొరుగువాళ్లను ప్రేమిస్తూనే ఉందాం
19, 20. పొరుగువాళ్ల మీద ప్రేమ చూపిస్తూనే ఉండాలని ఏ లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి?
19 బైబిలు ఇచ్చే ఉపదేశాన్ని పాటించడం ద్వారా, మనం ఎల్లప్పుడూ పొరుగువాళ్లను ప్రేమిస్తూ ఉండగలం. అలాంటి ప్రేమ ఉంటే జాతితో, నేపథ్యంతో సంబంధం లేకుండా అందరితో స్నేహంగా ఉంటాం. “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” అని యేసు చెప్పిన మాటల్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. (మత్త. 22:39) మనం పొరుగువాళ్లను ప్రేమించాలని యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఆశిస్తున్నారు. మనం పొరుగువాళ్లతో వ్యవహరిస్తున్నప్పుడు, ఫలానా పరిస్థితిలో ఏమి చేయాలో అర్థంకాకపోతే దేవుని పరిశుద్ధాత్మ నిర్దేశం కోసం ప్రార్థిద్దాం. అలా చేస్తే యెహోవా దీవెనలు పొందుతాం, పొరుగువాళ్లతో ప్రేమగా ప్రవర్తించగలుగుతాం.—రోమా. 8:26, 27.
20 ‘నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించుము’ అనే ఆజ్ఞ “ప్రాముఖ్యమైన ఆజ్ఞ.” (యాకో. 2:8) మోషే ధర్మశాస్త్రంలోని కొన్ని ఆజ్ఞల గురించి ప్రస్తావించాక పౌలు ఇలా రాశాడు, “మరి ఏ ఆజ్ఞయైన ఉన్నయెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.” (రోమా. 13:8-10) కాబట్టి, మనం పొరుగువాళ్ల పట్ల ప్రేమను చూపిస్తూనే ఉండాలి.
21, 22. దేవుణ్ణి, పొరుగువాణ్ణి ఎందుకు ప్రేమించాలి?
21 మనం పొరుగువాళ్ల మీద ఎందుకు ప్రేమ చూపించాలనే దానిగురించి ఆలోచించేటప్పుడు, యెహోవా “చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు” అని యేసు చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకోవడం మంచిది. (మత్త. 5:43-45) మన పొరుగువాడు నీతిమంతుడైనా కాకపోయినా మనం మాత్రం అతని పట్ల ప్రేమను చూపించాలి. మనం ముందే గమనించినట్లు అలాంటి ప్రేమ చూపించే ఓ ప్రాముఖ్యమైన మార్గం, వాళ్లకు రాజ్య సందేశం ప్రకటించడమే. మన పొరుగువాడు రాజ్య సువార్తకు చక్కగా స్పందించి, నిజమైన కృతజ్ఞత చూపిస్తే ఎన్ని దీవెనలు పొందుతాడో ఒక్కసారి ఆలోచించండి!
22 యెహోవాను సంపూర్ణంగా ప్రేమించడానికి మనకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అలాగే పొరుగువాళ్ల పట్ల ప్రేమ చూపించడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. దేవుని మీద, పొరుగువాళ్ల మీద ప్రేమను చూపించినప్పుడు, యేసు చెప్పిన రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలను మనం గౌరవిస్తున్నామని చూపిస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా, మన ప్రేమగల పరలోక తండ్రి యెహోవాను సంతోషపెడతాం.