కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రాచీనకాల కుండపెంకులు బైబిలు వివరాలను ధృవీకరిస్తున్నాయి

ప్రాచీనకాల కుండపెంకులు బైబిలు వివరాలను ధృవీకరిస్తున్నాయి

ప్రాచీనకాల కుండపెంకులు బైబిలు వివరాలను ధృవీకరిస్తున్నాయి

బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యం. (2 తిమోతి 3:16) ప్రజల గురించి, స్థలాల గురించి, ప్రాచీనకాల మత, రాజకీయ పరిస్థితుల గురించి అది చెప్పే విషయాలు ఖచ్చితమైనవి. బైబిలు ప్రామాణికత పురావస్తు శాస్త్రం కనుగొన్నవాటిపై ఆధారపడిలేదు, అయితే అవి బైబిల్లోని విషయాల గురించిన మన అవగాహనను ధృవీకరిస్తాయి లేదా మరింత స్పష్టం చేస్తాయి.

పురావస్తు శాస్త్రజ్ఞులు ప్రాచీన ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపినప్పుడు వారికి కుండపెంకులే ఎక్కువగా దొరికాయి. ఐగుప్తు, మెసొపొతమియ లాంటి అనేక ప్రాచీన మధ్యప్రాచ్య దేశాల్లో వివరాలు రాసుకునేందుకు చవకగా లభించే కుండపెంకులను ఉపయోగించేవారు. మనం నేడు కాగితాలను ఉపయోగిస్తున్నట్లే ఒప్పందాలు, జమాఖర్చులు, అమ్మకాల వివరాల వంటి తదితర విషయాలు రాసుకోవడానికి పూర్వకాలంలో కుండపెంకులను ఉపయోగించేవారు. సాధారణంగా వాటిపై సిరాతో రాసేవారు, కొన్నిసార్లు ఒకే పదం, మరికొన్నిసార్లు చాలా వాక్యాలు రాసేవారు.

పురావస్తు శాస్త్రజ్ఞులు ఇస్రాయేల్‌లో జరిపిన త్రవ్వకాల్లో బైబిలు కాలాలకు చెందిన అనేక కుండపెంకులను వెలికితీశారు. సా.శ.పూ. ఏడు, ఎనిమిది శతాబ్దాలకు చెందిన ఆ కుండపెంకులు ప్రత్యేకంగా ఆసక్తికరమైనవి ఎందుకంటే అవి బైబిల్లోని చారిత్రక సమాచారానికి సంబంధించిన అనేక వివరాలను ధృవీకరిస్తున్నాయి. అవి, షోమ్రోను కుండపెంకులు, అరాదు కుండపెంకులు, లాకీషు కుండపెంకులు. మనమిప్పుడు వీటిలో ఒక్కోదాన్ని నిశితంగా పరిశీలిద్దాం.

షోమ్రోను కుండపెంకులు

షోమ్రోను పది గోత్రాల ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజధాని, సా.శ.పూ. 740లో అష్షూరీయులు దానిని నాశనం చేసేంతవరకు ఆ పట్టణం రాజధానిగానే ఉంది. షోమ్రోను ఎలా ఉనికిలోకి వచ్చిందనే విషయాన్ని వివరిస్తూ 1 రాజులు 16:23, 24 ఇలా చెబుతోంది: “యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియొకటవ సంవత్సరమున [సా.శ.పూ. 947లో], ఒమ్రీ ఇశ్రాయేలువారికి రాజై . . . షెమెరునొద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండమీద పట్టణమొకటి కట్టించి, . . . తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను.” ఆ పట్టణం రోమా పరిపాలనా కాలంలో కూడా ఉనికిలో ఉంది, అప్పుడు దానికి సెబాస్ట్‌ అనే పేరు పెట్టబడింది. అది చివరకు సా.శ. ఆరవ శతాబ్దంలో ఉనికిలో లేకుండాపోయింది.

పురావస్తు శాస్త్రజ్ఞుల ఒక బృందం 1910లో ప్రాచీనకాల షోమ్రోను ప్రాంతంలో జరిపిన త్రవ్వకాల్లో కొన్ని కుండపెంకులు బయటపడ్డాయి. అవి సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దానికి చెందినవని వారు గుర్తించారు. వాటిపై, షోమ్రోనుకు ఇరుగుపొరుగునున్న అనేక ప్రాంతాల నుండి ఓడల్లో వచ్చిన నూనె, ద్రాక్షారసాన్ని గురించిన వివరాలు రాయబడివున్నాయి. వాటి గురించి ఏన్షియంట్‌ ఇన్‌స్క్రిప్షన్స్‌—వాయిసెస్‌ ఫ్రమ్‌ ద బిబ్లికల్‌ వరల్డ్‌ అనే పుస్తకంలో ఇలా చెప్పబడింది: “1910లో దొరికిన 63 కుండపెంకులు . . . ప్రాచీన ఇశ్రాయేలు నాశనమైనప్పుడు పాడవకుండా మిగిలిన అత్యంత ప్రాముఖ్యమైన రాతపూర్వక సమాచారమని సముచితంగానే పరిగణించబడుతున్నాయి. వాటిలోని సమాచారంవల్ల కాదుగానీ . . . వాటిలో పేర్కొనబడిన అనేకమంది ఇశ్రాయేలీయుల పేర్లు, వారి వంశాల పేర్లు, వారు నివసించిన స్థలాల గురించిన వివరాలనుబట్టి వాటికి ఆ ప్రాముఖ్యత ఇవ్వబడుతోంది.” ఈ పేర్లు బైబిల్లోని వివరాలను ఎలా ధృవీకరిస్తున్నాయి?

ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకుని దానిని వివిధ గోత్రాల మధ్య విభజించినప్పుడు, షోమ్రోను పట్టణం మనష్షే గోత్రానికి కేటాయించబడిన ప్రాంతంలో ఉంది. యెహోషువ 17:1-6 నివేదిస్తున్న ప్రకారం, మనష్షే మనవడైన గిలాదుకు కలిగిన పదిమంది కుమారుల ద్వారా వృద్ధిచెందిన పది వంశాలవారికి ఈ ప్రాంతంలో స్థలాలు ఇవ్వబడ్డాయి. వారిలో కొందరు అబీయెజెరు, హెలకు, అశ్రీయేలు, షెకెము, షెమీదా. ఆరవవాడైన హెపెరుకు మనవళ్ళు లేరు కానీ ఐదుగురు మనవరాళ్లు ఉండేవారు, వారు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. వారిలో ప్రతి ఒక్కరికీ స్థలాలు ఇవ్వబడ్డాయి.—సంఖ్యాకాండము 27:1-7.

షోమ్రోను కుండపెంకుల్లో వీరిలో మొత్తం ఏడుగురి వంశాలపేర్లు అంటే గిలాదు ఐదుమంది కుమారుల వంశాల పేర్లు, హెపెరు మనవరాళ్ళల్లో హొగ్లా, నోయాల వంశాల పేర్లు పేర్కొనబడ్డాయి. “బైబిలు మనష్షే వంశాలవారు స్థిరపడ్డారని చెబుతున్న స్థలాల్లోనే వారు నివసించారని చెప్పడానికి షోమ్రోను కుండపెంకులపై ఉన్న వంశాల పేర్లు బైబిలేతర ఆధారంగా ఉన్నాయి” అని ఎన్‌ఐవి ఆర్కియోలాజికల్‌ స్టడీ బైబిల్‌ చెబుతోంది. అలా, బైబిల్లో వర్ణించబడిన ఇశ్రాయేలీయుల తొలి గోత్రాల చరిత్రకు సంబంధించిన ఈ అంశాన్ని షోమ్రోను కుండపెంకులు ధృవీకరిస్తున్నాయి.

షోమ్రోను కుండపెంకులు, బైబిల్లో వర్ణించబడిన ఇశ్రాయేలీయుల మత పరిస్థితిని కూడా ధృవీకరిస్తున్నట్లు అనిపిస్తోంది. అవి రాయబడే సమయానికి ఇశ్రాయేలీయులు యెహోవా ఆరాధనను కనాను దేవుడైన బయలు ఆరాధనతో కలుషితం చేశారు. అదే సమయంలో అంటే సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో రాయబడిన హోషేయ ప్రవచనం, ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపంతో యెహోవాను, “బయలు” లేదా “నా యజమానుడు” అని కాక “నా భర్త” అని పిలిచే సమయం వస్తుందని ముందుగానే వెల్లడిచేసింది. (హోషేయ 2:16, 17, అధస్సూచి) షోమ్రోను కుండపెంకులపై రాయబడిన పేర్లలో కొన్నింటికి “బయలు నా తండ్రి” “బయలు పాడతాడు” “బయలు బలవంతుడు” “బయలు గుర్తుంచుకుంటాడు” లాంటి తదితర అర్థాలున్నాయి. వాటిపై రాయబడిన పేర్లలో ఏదోక రూపంలో యెహోవా అనే నామం కలిగిన పేర్లు 11 ఉంటే, బయలు అనే పేరు కలిగిన పేర్లు 7 ఉన్నాయి.

అరాదు కుండపెంకులు

అరాదు అనే ప్రాచీన నగరం నెగెబు ప్రాంతంలో ఉండేది, వర్షపాతం తక్కువగా ఉండే నెగెబు యెరూషలేముకు దక్షిణంవైపున ఉండేది. అరాదులో జరిపిన త్రవ్వకాల్లో ఆరు కోటలు బయటపడ్డాయి, అవి సొలొమోను పరిపాలన (సా.శ.పూ. 1037-998) నుండి సా.శ.పూ. 607లో బబులోను యెరూషలేమును నాశనం చేసేంతవరకు ఒకదాని తర్వాత మరొకటిగా నిర్మించబడ్డాయి. త్రవ్వకాలు జరిపినవారు అరాదులో బైబిలు కాలాలకు చెందిన కుండపెంకులను పెద్ద మొత్తంలో వెలికితీశారు. అక్కడ వారికి దొరికినవాటిలో హెబ్రీ, అరామిక్‌, మరితర భాషల్లో రాయబడిన 200 కన్నా ఎక్కువ కుండపెంకులున్నాయి.

అరాదు కుండపెంకులు కొన్ని, యాజక కుటుంబాల గురించి బైబిల్లో ఉన్న సమాచారాన్ని ధృవీకరిస్తున్నాయి. ఉదాహరణకు, ఒక దానిపై నిర్గమకాండము 6:24లో, సంఖ్యాకాండము 26:11లో ప్రస్తావించబడిన “కోరహు కుమారుల” గురించి రాయబడింది. కీర్తనల పుస్తకంలోని 42, 44-49, 84, 85, 87, 88 కీర్తనల పైవిలాసములో వీటిని “కోరహు కుమారులు” రాశారని స్పష్టంగా తెలియజేయబడింది. అరాదు కుండపెంకులపై పసూరు, మెరేమోతు లాంటి మరితర యాజక కుటుంబాల గురించిన ప్రస్తావన కూడా ఉంది.—1 దినవృత్తాంతములు 9:12; ఎజ్రా 8:33.

మరో ఉదాహరణను పరిశీలించండి. బబులోను యెరూషలేమును నాశనం చేయడానికి కొంతకాలం ముందు ఉండిన కోట శిథిలాల్లో త్రవ్వకాలు జరిపినవారికి, ఆ కోట సైన్యాధిపతికి పంపించబడిన కుండపెంకు దొరికింది. ద కాంటెక్స్‌ట్‌ ఆఫ్‌ స్క్రిప్చర్‌ అనే ప్రచురణ ప్రకారం, ఆ కుండపెంకులోని కొంత సమాచారం ఇలా ఉంది: “నా ప్రభువైన ఎల్యాషీబుకు వ్రాయునది. యావే [యెహోవా] మీకు క్షేమాభివృద్ధి కలుగజేయునుగాక. . . . మీరు నాకు ఆజ్ఞాపించిన విషయానికి సంబంధించిన వివరాలు: ఇప్పుడు అంతా సవ్యంగానే ఉంది: ఆయన యావే ఆలయంలో ఉంటున్నాడు.” ఇందులో ప్రస్తావించబడిన ఆలయం సొలొమోను కాలంలో నిర్మించబడిన యెరూషలేములోని ఆలయమేనని అనేకమంది విద్వాంసులు నమ్ముతున్నారు.

లాకీషు కుండపెంకులు

ప్రాచీనకాల పట్టణమైన లాకీషు, యెరూషలేముకు నైరుతి దిశలో 43 కిలోమీటర్ల దూరంలో ఉంది, అది ప్రాకారముగల పట్టణము. అక్కడ 1930లో జరిపిన త్రవ్వకాల్లో కొన్ని కుండపెంకులు దొరికాయి, వాటిలో కనీసం 12 ఇతరులకు రాయబడిన ఉత్తరాలు. అవి, “నెబుకద్నెజరు [బబులోను రాజు] చేసే అనివార్య దాడి కోసం యూదా సిద్ధపడుతుండగా, చుట్టూవున్న రాజకీయ పరిస్థితుల గురించి, జరిగిన అల్లకల్లోలం గురించి వివరిస్తున్నాయి కాబట్టి . . . అవి అత్యంత ప్రాముఖ్యమైనవి” అని వర్ణించబడ్డాయి.

వాటిలో అతి ప్రాముఖ్యమైన ఉత్తరాలు బహుశా అప్పట్లో లాకీషు సైన్యాధిపతిగావున్న యాయోషుకు, అతని క్రింది అధికారికి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలై ఉండవచ్చు. ఆ ఉత్తరాల్లోని భాష, అదే కాలానికి చెందిన యిర్మీయా ప్రవక్త తన పుస్తకాల్లో రాసిన భాషలాగే ఉంది. వాటిలోని రెండు ఉత్తరాలు, ఆ కీలకమైన కాలం గురించిన బైబిలు వర్ణనను ఎలా ధృవీకరిస్తున్నాయో చూడండి.

యిర్మీయా 34:6, 7లో ఆ ప్రవక్త, “యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములుగల పట్టణములుగా మిగిలియున్నవి, బబులోనురాజు దండు యెరూషలేముమీదను మిగిలిన యూదా పట్టణములన్నిటిమీదను యుద్ధము” చేస్తున్న కాలం గురించి వర్ణించాడు. లాకీషు ఉత్తరాల్లో ఒకదానిని రాసిన వ్యక్తి అవే సంఘటనలను వివరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయనిలా రాశాడు: “మేము లాకీషులో (అగ్ని) ధ్వజము కోసం కనిపెట్టుకునివున్నాం . . . ఎందుకంటే అజేకా కనుమరుగైపోయింది.” బబులోనీయులు అప్పటికే అజేకాను వశం చేసేసుకున్నారనీ, దాని తర్వాత లాకీషు నేలమట్టం కాబోతోందనీ ఆ వాక్యం సూచిస్తున్నట్లు అనేకమంది విద్వాంసులు నమ్ముతున్నారు. ఆ వాక్యంలో “ధ్వజము” గురించిన ప్రస్తావన ఆసక్తికరమైంది. సమాచారాన్ని అందించడానికి అలా ధ్వజం నిలబెట్టడం వంటి పద్ధతులను ఉపయోగించేవారని యిర్మీయా 6:1 కూడా చెబుతోంది.

బబులోనుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి యూదా రాజు ఐగుప్తును ఆశ్రయించే ప్రయత్నాల గురించి యిర్మీయా, యెహెజ్కేలు ప్రవక్తలు చెప్పిన విషయాలను లాకీషులో దొరికిన మరో ఉత్తరం ధృవీకరిస్తోందని నమ్మబడుతోంది. (యిర్మీయా 37:5-8; 46:25, 26; యెహెజ్కేలు 17:15-17) ఆ ఉత్తరంలో ఇలా ఉంది: “మీ సేవకుడనైన నాకు ఇప్పుడు ఈ సమాచారం అందింది: ఎల్నాతాను కుమారుడు, సైన్యాధిపతియైన కొన్యాహు ఐగుప్తులోకి ప్రవేశించడానికి దక్షిణంవైపు ప్రయాణించాడు.” ఐగుప్తునుండి సైనిక సహకారం పొందే ప్రయత్నంలోనే అలా చేయడం జరిగిందని విద్వాంసులు చెప్పారు.

లాకీషు కుండపెంకుల్లో యిర్మీయా పుస్తకంలోని అనేక పేర్లు పేర్కొనబడ్డాయి. ఆ పేర్లలో కొన్ని నేరీయా, యజన్యా, గెమర్యా, ఎల్నాతాను, హోషేయాలవి. (యిర్మీయా 32:12; 35:3; 36:10, 12; 42:1) ఆ పేర్లు యిర్మీయా పుస్తకంలో రాయబడిన వ్యక్తులవేనా కాదా అనేది ఖచ్చితంగా తెలియదు. అయితే యిర్మీయా కూడా అదేకాలంలో జీవించాడు కాబట్టి ఆ పేర్లు ఒకేలా ఉండడం గమనార్హం.

సారూప్యంగా ఉన్న అంశం

షోమ్రోను, అరాదు, లాకీషు కుండపెంకులన్నీ బైబిల్లోని అనేక వివరాలను అంటే కుటుంబాల పేర్లు, వారు నివసించిన ప్రాంతాల పేర్లు, ఆ కాలాల్లోని మతాచారాల గురించిన, రాజకీయ పరిస్థితుల గురించిన వివరాలను ధృవీకరిస్తున్నాయి. అయితే వాటన్నింటిలో ఒక ప్రాముఖ్యమైన అంశం సారూప్యంగా ఉంది.

అరాదు, లాకీషు కుండపెంకుల్లో “యెహోవా మీకు శాంతి కలుగజేయును గాక” వంటి వాక్యాలున్నాయి. లాకీషు కుండపెంకుల్లోని ఏడింటిలో దేవుని పేరు మొత్తం 11 సార్లు ప్రస్తావించబడింది. అంతేకాదు, ఆ కుండపెంకులన్నింటిపై ఉన్న పేర్లలో అనేక హెబ్రీ పేర్లు యెహోవా నామంయొక్క సంక్షిప్త రూపాన్ని కలిగివున్నాయి. కాబట్టి ఆ కాలంలోని ఇశ్రాయేలీయులు దేవుని నామాన్ని రోజువారీ సంభాషణలో ఉపయోగించేవారని ఈ కుండపెంకులు ధృవీకరిస్తున్నాయి.

[13వ పేజీలోని చిత్రం]

ఎల్యాషీబు అనే వ్యక్తికి రాయబడిన, అరాదు పట్టణపు శిథిలాల్లో దొరికిన కుండపెంకు

[చిత్రసౌజన్యం]

Photograph © Israel Museum, Jerusalem; courtesy of Israel Antiquities Authority

[14వ పేజీలోని చిత్రం]

దేవుని నామం ఉన్న లాకీషు ఉత్తరం

[చిత్రసౌజన్యం]

Photograph taken by courtesy of the British Museum