సంఖ్యాకాండం 27:1-23

  • సెలోపెహాదు కూతుళ్లు (1-11)

  • మోషే తర్వాతి నాయకుడిగా యెహోషువ నియమించబడడం (12-23)

27  తర్వాత యోసేపు కుమారుడైన మనష్షే కుటుంబాల్లో నుండి సెలోపెహాదు కూతుళ్లు+ మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా వచ్చారు. ఈ సెలోపెహాదు హెపెరు కుమారుడు, హెపెరు గిలాదు కుమారుడు, గిలాదు మాకీరు కుమారుడు, మాకీరు మనష్షే కుమారుడు.  సెలోపెహాదు కూతుళ్లు ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర మోషే ముందు, యాజకుడైన ఎలియాజరు ముందు, ప్రధానుల+ ముందు, సమాజమంతటి ముందు నిలబడి ఇలా అన్నారు:  “మా నాన్న ఎడారిలో చనిపోయాడు. యెహోవాకు వ్యతిరేకంగా ఒక్కటైన కోరహు మద్దతుదారుల+ గుంపులో అతను లేడు. అతను తన సొంత పాపం వల్లే చనిపోయాడు; అయితే అతనికి కుమారులు లేరు.  అతనికి కుమారులు లేనంత మాత్రాన మా నాన్న పేరు అతని కుటుంబంలో నుండి చెరిగిపోవాలా? మా నాన్న సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వండి.”  మోషే ఆ వివాదాన్ని యెహోవా ముందు పెట్టాడు.+  అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు:  “సెలోపెహాదు కూతుళ్లు అడిగింది సరైనదే. నువ్వు ఖచ్చితంగా వాళ్ల నాన్న సహోదరుల మధ్య వాళ్లకు స్వాస్థ్యాన్ని వారసత్వంగా ఇచ్చి, వాళ్ల నాన్న స్వాస్థ్యాన్ని వాళ్ల పేరు మీదికి మార్చాలి.+  నువ్వు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ఒక వ్యక్తి కుమారులు లేకుండా చనిపోతే, అతని స్వాస్థ్యాన్ని అతని కూతుళ్లకు వెళ్లేలా చేయాలి.  ఒకవేళ అతనికి కూతుళ్లు కూడా లేకపోతే, అతని స్వాస్థ్యాన్ని అతని సహోదరులకు ఇవ్వాలి. 10  ఒకవేళ అతనికి సహోదరులు కూడా లేకపోతే, అతని స్వాస్థ్యాన్ని వాళ్ల నాన్న సహోదరులకు ఇవ్వాలి. 11  ఒకవేళ వాళ్ల నాన్నకు కూడా సహోదరులు లేకపోతే, అతని స్వాస్థ్యాన్ని అతని రక్తసంబంధీకుల్లో అందరికన్నా దగ్గరి బంధువుకు ఇవ్వాలి, అది అతని సొంతమౌతుంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే, ఈ న్యాయనిర్ణయం ఇశ్రాయేలీయులకు ఒక శాసనంలా పని చేస్తుంది.’ ” 12  తర్వాత యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: “నువ్వు అబారీములోని ఈ కొండ పైకి వెళ్లి,+ నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చే దేశాన్ని చూడు.+ 13  నువ్వు దాన్ని చూశాక, నీ అన్న అహరోనులాగే నువ్వు కూడా నీ ప్రజల దగ్గరికి చేర్చబడతావు.*+ 14  ఎందుకంటే, సీను ఎడారిలో ఇశ్రాయేలు సమాజం నాతో గొడవ పడుతున్నప్పుడు, ఆ నీళ్ల ద్వారా వాళ్ల ముందు నన్ను పవిత్రపర్చమనే నా ఆదేశాన్ని మీరు పాటించలేదు.+ (ఇవి సీను ఎడారిలో+ కాదేషు+ దగ్గరున్న మెరీబా నీళ్లు.)”+ 15  అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు: 16  “యెహోవా, అందరికీ ప్రాణం* ఇచ్చే దేవా, దయచేసి ఈ సమాజం మీద ఒక మనిషిని నియమించు; 17  అతను అన్ని విషయాల్లో వాళ్లను నడిపిస్తాడు, వాళ్లు అన్ని విషయాల్లో అతన్ని అనుసరిస్తారు; దానివల్ల యెహోవా ప్రజలు కాపరిలేని గొర్రెల్లా అవ్వకుండా ఉంటారు.” 18  కాబట్టి యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: “నువ్వు నూను కుమారుడూ, సమర్థుడూ అయిన యెహోషువను తీసుకొని, అతని మీద నీ చెయ్యి ఉంచు.+ 19  తర్వాత నువ్వు యాజకుడైన ఎలియాజరు ముందు, సమాజమంతటి ముందు అతన్ని నిలబెట్టి, వాళ్ల కళ్లముందు అతన్ని నాయకుడిగా నియమించాలి.+ 20  ఇశ్రాయేలీయుల సమాజమంతా అతని మాట వినేలా,+ నీ అధికారంలో* కొంచెం అతనికి ఇవ్వు.+ 21  అతను యాజకుడైన ఎలియాజరు ముందు నిలబడతాడు, ఎలియాజరు యెహోవా నిర్ణయం ఏమిటో తెలుసుకోవడానికి ఊరీము ద్వారా అతని తరఫున దేవుని దగ్గర విచారణ చేస్తాడు.+ సమాజమంతా, అంటే యెహోషువ, అలాగే ఇశ్రాయేలీయులందరూ అతని ఆదేశాన్ని పాటిస్తారు.” 22  కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే చేశాడు. అతను యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ముందు, సమాజమంతటి ముందు నిలబెట్టి, 23  అతని మీద చేతులు ఉంచి, అతన్ని నాయకుడిగా నియమించాడు.+ మోషే సరిగ్గా యెహోవా తనకు చెప్పినట్టే చేశాడు.+

అధస్సూచీలు

మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “ఘనతలో.”