ఎజ్రా 8:1-36

  • ఎజ్రాతోపాటు బయల్దేరిన వాళ్ల జాబితా (1-14)

  • ప్రయాణ ఏర్పాట్లు (15-30)

  • బబులోను నుండి బయల్దేరి, యెరూషలేముకు చేరుకోవడం (31-36)

8  రాజైన అర్తహషస్త పరిపాలనలో బబులోను నుండి నాతోపాటు బయల్దేరిన పూర్వీకుల కుటుంబాల పెద్దల వంశావళి ఇదే:+  ఫీనెహాసు+ కుమారుల్లో గెర్షోము, ఈతామారు+ కుమారుల్లో దానియేలు, దావీదు కుమారుల్లో హట్టూషు;  షెకన్యా కుమారుల్లో, పరోషు కుమారుల్లో జెకర్యా, అతనితోపాటు నమోదైన 150 మంది పురుషులు;  పహత్మోయాబు కుమారుల్లో+ జెరహ్యా కుమారుడైన ఎల్యోయేనై, అతనితోపాటు 200 మంది పురుషులు;  జత్తూ కుమారుల్లో+ యహజీయేలు కుమారుడైన షెకన్యా, అతనితోపాటు 300 మంది పురుషులు;  ఆదీను కుమారుల్లో+ యోనాతాను కుమారుడైన ఎబెదు, అతనితోపాటు 50 మంది పురుషులు;  ఏలాము కుమారుల్లో+ అతల్యా కుమారుడైన యెషాయా, అతనితోపాటు 70 మంది పురుషులు;  షెఫట్య కుమారుల్లో+ మిఖాయేలు కుమారుడైన జెబద్యా, అతనితోపాటు 80 మంది పురుషులు;  యోవాబు కుమారుల్లో యెహీయేలు కుమారుడైన ఓబద్యా, అతనితోపాటు 218 మంది పురుషులు; 10  బానీ కుమారుల్లో యోసిప్యా కుమారుడైన షెలోమీతు, అతనితోపాటు 160 మంది పురుషులు; 11  బేబై కుమారుల్లో+ బేబై కుమారుడైన జెకర్యా, అతనితోపాటు 28 మంది పురుషులు; 12  అజ్గాదు కుమారుల్లో+ హక్కాటాను కుమారుడైన యోహానాను, అతనితోపాటు 110 మంది పురుషులు; 13  అదొనీకాము కుమారుల్లో+ మిగిలినవాళ్లు; వాళ్ల పేర్లు: ఎలీపేలెటు, యెహీయేలు, షెమయా, వాళ్లతోపాటు 60 మంది పురుషులు; 14  బిగ్వయి కుమారుల్లో+ ఊతై, జబ్బూదు, వాళ్లతోపాటు 70 మంది పురుషులు. 15  నేను అహవా వైపు పారే నది దగ్గర వాళ్లను సమకూర్చాను.+ అక్కడ మేము మూడు రోజులు డేరాలు వేసుకొని ఉన్నాం. కానీ నేను ప్రజల్ని, యాజకుల్ని పరిశీలించినప్పుడు లేవీయుల్లో ఒక్కరు కూడా నాకు అక్కడ కనిపించలేదు. 16  అప్పుడు నేను నాయకులైన ఎలీయెజెరును, అరీయేలును, షెమయాను, ఎల్నాతానును, యారీబును, ఎల్నాతానును, నాతానును, జెకర్యాను, మెషుల్లామును, వాళ్లతోపాటు ఉపదేశకులైన యోయారీబును, ఎల్నాతానును పిలిపించాను. 17  నేను కాసిప్యా అనే ప్రాంతంలో ఉన్న నాయకుడైన ఇద్దో విషయంలో వాళ్లకు ఒక ఆజ్ఞ ఇచ్చాను. మన దేవుని మందిరం కోసం పరిచారకుల్ని తీసుకురమ్మని కాసిప్యాలో ఉన్న ఇద్దోకు, ఆలయ సేవకులైన* అతని సహోదరులకు చెప్పమన్నాను. 18  మన దేవుడు మాకు సహాయం చేశాడు కాబట్టి, వాళ్లు షేరేబ్యా అనే తెలివిగల* వ్యక్తిని తీసుకొచ్చారు. అతను మహలి+ కుమారుల్లో ఒకడు. మహలి ఇశ్రాయేలు కుమారుడైన లేవికి మనవడు. షేరేబ్యాతోపాటు+ అతని కుమారుల్ని, అతని సహోదరుల్ని మొత్తం 18 మంది పురుషుల్ని తీసుకొచ్చారు. 19  అలాగే హషబ్యాను, అతనితోపాటు మెరారీయుల్లో+ నుండి యెషాయాను, అతని సహోదరుల్ని, వాళ్ల కుమారుల్ని మొత్తం 20 మంది పురుషుల్ని తీసుకొచ్చారు. 20  వాళ్లతోపాటు, తమ పేర్లు నమోదు చేయబడిన 220 మంది ఆలయ సేవకులు* ఉన్నారు; దావీదు, అధిపతులు లేవీయులకు సహాయం చేయడానికి ఆ ఆలయ సేవకుల్ని ఇచ్చారు. 21  అప్పుడు నేను, మన దేవుని ముందు మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి, మా ప్రయాణం కోసం, మా కోసం, మా పిల్లల కోసం, మా వస్తువులన్నిటి కోసం ఆయన నిర్దేశం కోరడానికి ఉపవాసం ఉందామని అహవా నది దగ్గర ఒక ప్రకటన చేయించాను. 22  “మా దేవుడు తనను వెదికే వాళ్లందరికీ సహాయం చేస్తాడు.+ కానీ తనను విడిచిపెట్టే వాళ్లందరికీ వ్యతిరేకంగా ఆయన తన శక్తిని, కోపాన్ని చూపిస్తాడు”+ అని మేము రాజుతో అన్నాం కాబట్టి దారిలో శత్రువుల నుండి మమ్మల్ని కాపాడడానికి సైనికుల్ని, గుర్రపురౌతుల్ని ఇవ్వమని రాజును అడగడానికి నాకు సిగ్గేసింది. 23  అందుకే ఈ విషయం గురించి మేము ఉపవాసం ఉండి, మన దేవుణ్ణి వేడుకున్నాం. ఆయన మా మొర విన్నాడు.+ 24  తర్వాత నేను యాజకుల ప్రధానుల్లో 12 మందిని, అంటే షేరేబ్యాను, హషబ్యాను,+ వాళ్లతోపాటు వాళ్ల పదిమంది సహోదరుల్ని ఎంచుకున్నాను. 25  రాజు, అతని సలహాదారులు, అతని అధిపతులు, ఆ ప్రాంతంలోని ఇశ్రాయేలీయులందరూ మన దేవుని మందిరం కోసం విరాళంగా ఇచ్చిన వెండిబంగారాల్ని, పాత్రల్ని తూచి వాళ్లకు అప్పగించాను.+ 26  అలా నేను 650 తలాంతుల* వెండిని, 2 తలాంతుల బరువున్న 100 వెండి పాత్రల్ని, 100 తలాంతుల బంగారాన్ని తూచి వాళ్ల చేతికి అప్పగించాను. 27  అందులో 1,000 డారిక్‌​ల* విలువగల 20 చిన్న బంగారు గిన్నెలు, ఎర్రగా మెరిసే 2 నాణ్యమైన రాగి పాత్రలు కూడా ఉన్నాయి. ఇవి బంగారమంత అమూల్యమైనవి. 28  నేను వాళ్లతో ఇలా అన్నాను: “మీరు యెహోవాకు ప్రతిష్ఠించబడినవాళ్లు;+ పాత్రలు కూడా ప్రతిష్ఠించబడినవి. వెండిబంగారాలు మీ పూర్వీకుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణ. 29  యెరూషలేములోని యెహోవా మందిర గదుల్లో* యాజకుల-లేవీయుల ప్రధానుల ముందు, ఇశ్రాయేలు పూర్వీకుల కుటుంబాల అధిపతుల ముందు మీరు వాటిని తూచే వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోండి.”+ 30  అప్పుడు యాజకులు, లేవీయులు యెరూషలేములోని మన దేవుని మందిరానికి తీసుకురావడం కోసం తమకు తూచి ఇచ్చిన వెండిబంగారాల్ని, పాత్రల్ని తీసుకున్నారు. 31  చివరికి మేము మొదటి నెల+ 12వ రోజున అహవా నది దగ్గర నుండి యెరూషలేముకు బయల్దేరాం.+ మన దేవుడు మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల్లో నుండి, దారిలో మాటువేసే వాళ్ల నుండి మమ్మల్ని కాపాడాడు. 32  మేము యెరూషలేముకు వచ్చి+ అక్కడ మూడు రోజులు ఉన్నాం. 33  నాలుగో రోజున మన దేవుని మందిరంలో మేము వెండిబంగారాల్ని, పాత్రల్ని తూచి+ యాజకుడైన ఊరియా కుమారుడు మెరేమోతుకు+ అప్పగించాం. ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు అతనితో ఉన్నాడు. వాళ్లతోపాటు లేవీయులైన యేషూవ కుమారుడు యోజాబాదు,+ బిన్నూయి+ కుమారుడు నోవద్యా ఉన్నారు. 34  అన్నిటినీ లెక్కపెట్టి, తూచి, వాటి మొత్తం బరువెంతో రాశారు. 35  చెర నుండి వచ్చినవాళ్లు, అంటే అంతకుముందు చెరలో ఉన్నవాళ్లు ఇశ్రాయేలు దేవునికి దహనబలులు అర్పించారు. ఇశ్రాయేలీయులందరి కోసం 12 ఎద్దుల్ని,+ 96 పొట్టేళ్లను,+ 77 మగ గొర్రెపిల్లల్ని, పాపపరిహారార్థ బలిగా 12 మేకపోతుల్ని+ అర్పించారు; ఇదంతా యెహోవాకు దహనబలి.+ 36  తర్వాత మేము రాజు ఆదేశాల్ని+ రాజు ప్రాంత పాలకులకు,* నది+ అవతలి ప్రాంత* అధిపతులకు అందించాం. వాళ్లు ప్రజలకు, సత్యదేవుని మందిరానికి మద్దతు ఇచ్చారు.+

అధస్సూచీలు

లేదా “నెతీనీయులైన.” అక్ష., “ఇవ్వబడినవాళ్లయిన.”
లేదా “బుద్ధిగల.”
లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
డారిక్‌ ఒక పారసీక బంగారు నాణెం. అనుబంధం B14 చూడండి.
లేదా “భోజనశాలల్లో.”
మూలపాఠంలో, “రాజ్య సంరక్షకులు” అనే అర్థం ఉన్న పారసీక బిరుదును ఉపయోగించారు. ఇక్కడ అది పారసీక సామ్రాజ్యంలోని సంస్థాన అధిపతుల్ని సూచిస్తుంది.
ఇది యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న ప్రాంతాల్ని సూచిస్తుంది.