యిర్మీయా 35:1-19

  • రేకాబీయుల ఆదర్శవంతమైన విధేయత (1-19)

35  యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము+ రోజుల్లో యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:  “నువ్వు రేకాబీయుల ఇంటివాళ్ల+ దగ్గరికి వెళ్లి, వాళ్లతో మాట్లాడి, వాళ్లను యెహోవా మందిరంలోని ఒక భోజనాల గదిలోకి తీసుకురా; తర్వాత, తాగడానికి వాళ్లకు ద్రాక్షారసం ఇవ్వు.”  కాబట్టి నేను హబజ్జిన్యా మనవడూ యిర్మీయా కుమారుడూ అయిన యజన్యాను, అతని సహోదరుల్ని, అతని కుమారులందర్నీ, రేకాబీయుల ఇంటివాళ్లందర్నీ  యెహోవా మందిరంలోకి తీసుకొచ్చాను. నేను వాళ్లను యిగ్దల్యా కుమారుడూ సత్యదేవుని సేవకుడూ అయిన హానాను కుమారుల భోజనాల గదిలోకి తీసుకొచ్చాను. ఆ గది అధిపతుల భోజనాల గదికి పక్కన, ద్వారపాలకుడైన షల్లూము కుమారుడు మయశేయా భోజనాల గదికి పైన ఉంది.  అప్పుడు నేను ద్రాక్షారసంతో నిండిన గిన్నెల్ని, పాత్రల్ని ఆ రేకాబీయుల ఇంటివాళ్ల ముందు పెట్టి, “ద్రాక్షారసం తాగండి” అన్నాను.  కానీ వాళ్లు ఇలా అన్నారు: “మేము ద్రాక్షారసం తాగం, ఎందుకంటే మా పూర్వీకుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు*+ మాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ‘మీరు గానీ మీ కుమారులు గానీ ఎప్పటికీ ద్రాక్షారసం తాగకూడదు.  మీరు ఇల్లు కట్టుకోకూడదు; విత్తనాలు విత్తకూడదు; ద్రాక్షతోట నాటకూడదు, అది మీకు ఉండకూడదు. మీరు ఎప్పుడూ డేరాల్లోనే నివసించాలి. అలాగైతేనే మీరు పరదేశులుగా నివసిస్తున్న దేశంలో ఎక్కువకాలం జీవిస్తారు.’  కాబట్టి మేము మా పూర్వీకుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాటకు లోబడి, అతను మాకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటిస్తూ మేము గానీ మా భార్యలు గానీ మా కుమారులు గానీ మా కూతుళ్లు గానీ ఎప్పటికీ ద్రాక్షారసం తాగం.  మేము నివసించడానికి ఇళ్లు కట్టుకోం, మా దగ్గర ద్రాక్షతోటలు గానీ పొలాలు గానీ విత్తనాలు గానీ లేవు. 10  మేము డేరాల్లోనే నివసిస్తూ, మా పూర్వీకుడైన యెహోనాదాబు* మాకు ఆజ్ఞాపించినవన్నీ పాటిస్తూ ఉన్నాం. 11  అయితే బబులోను రాజు నెబుకద్నెజరు* ఈ దేశం మీదికి వచ్చినప్పుడు+ మేము, ‘రండి, కల్దీయుల సైన్యం నుండి, సిరియన్ల సైన్యం నుండి తప్పించుకోవడానికి యెరూషలేముకు పారిపోదాం’ అని అనుకున్నాం. ఇప్పుడు మేము యెరూషలేములో ఉంటున్నాం. ” 12  యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది: 13  “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఏమంటున్నాడంటే, ‘నువ్వు వెళ్లి, యూదా ప్రజలతో, యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు: “నా మాటలకు లోబడమని నేను మిమ్మల్ని పదేపదే ప్రోత్సహించలేదా?”+ అని యెహోవా అంటున్నాడు. 14  “రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన వంశస్థులకు ద్రాక్షారసం తాగకూడదని ఆజ్ఞాపించాడు, వాళ్లు అతని మాటను పాటిస్తూ ఈ రోజు వరకు ద్రాక్షారసం తాగట్లేదు, అలా తమ పూర్వీకుడి ఆదేశానికి లోబడుతున్నారు.+ కానీ మీరు మాత్రం, నేను మీతో పదేపదే* మాట్లాడినా నాకు లోబడలేదు.+ 15  నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదేపదే* మీ దగ్గరికి పంపిస్తూ,+ ‘దయచేసి, మీరంతా మీ చెడ్డ మార్గాలు విడిచిపెట్టి సరైనది చేయండి!+ వేరే దేవుళ్లను అనుసరించకండి, వాటిని పూజించకండి. అప్పుడు మీకూ మీ పూర్వీకులకూ నేను ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తూ ఉంటారు’ అని చెప్తూ వచ్చాను.+ కానీ మీరు నా మాట వినలేదు, పట్టించుకోలేదు. 16  రేకాబు కుమారుడైన యెహోనాదాబు వంశస్థులు తమ పూర్వీకుడు ఇచ్చిన ఆదేశాన్ని పాటించారు,+ కానీ ఈ ప్రజలు నా మాట వినలేదు.” ’ ” 17  “కాబట్టి ఇశ్రాయేలు దేవుడూ సైన్యాల దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో, నేను యూదా మీదికి, యెరూషలేము నివాసులందరి మీదికి తెస్తానని హెచ్చరించిన విపత్తు అంతటినీ వాళ్లమీదికి రప్పిస్తున్నాను.+ ఎందుకంటే నేను వాళ్లతో మాట్లాడాను, కానీ వాళ్లు వినలేదు; నేను వాళ్లను పిలుస్తూ వచ్చాను, కానీ వాళ్లు పలకలేదు.’ ”+ 18  యిర్మీయా ఆ రేకాబీయులతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఏమంటున్నాడంటే, ‘మీరు మీ పూర్వీకుడైన యెహోనాదాబు ఆదేశానికి లోబడుతూ వచ్చారు, అతని ఆదేశాలన్నిటినీ పాటిస్తూ సరిగ్గా అతను ఆజ్ఞాపించినట్టే చేస్తున్నారు కాబట్టి 19  ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు: “నా సన్నిధిలో సేవచేయడానికి రేకాబు కుమారుడైన యెహోనాదాబు* వంశస్థుల్లో ఒకడు ఎప్పటికీ ఉంటాడు.” ’ ”

అధస్సూచీలు

అక్ష., “యోనాదాబు.” ఇది యెహోనాదాబుకు సంక్షిప్త రూపం.
అక్ష., “యోనాదాబు.” ఇది యెహోనాదాబుకు సంక్షిప్త రూపం.
అక్ష., “నెబుకద్రెజరు.”
అక్ష., “పెందలకడే లేచి.”
అక్ష., “పెందలకడే లేచి.”
అక్ష., “యోనాదాబు.” ఇది యెహోనాదాబుకు సంక్షిప్త రూపం.