యిర్మీయా 37:1-21

  • కల్దీయులు తిరిగొస్తారు (1-10)

  • యిర్మీయాను బంధించి ఉంచడం (11-16)

  • సిద్కియా యిర్మీయాతో మాట్లాడాడు (17-21)

    • యిర్మీయాకు రొట్టెలు ఇవ్వడం (21)

37  యెహోయాకీము కుమారుడైన కొన్యా*+ స్థానంలో యోషీయా కుమారుడైన సిద్కియా+ పరిపాలించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే, బబులోను రాజు నెబుకద్నెజరు* అతన్ని యూదా దేశంలో రాజుగా చేశాడు.+  అయితే అతను గానీ అతని సేవకులు గానీ దేశ ప్రజలు గానీ యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన మాటల్ని వినలేదు.  సిద్కియా రాజు, షెలెమ్యా కుమారుడైన యెహుకలునూ+ యాజకుడైన మయశేయా కుమారుడు జెఫన్యానూ+ యిర్మీయా ప్రవక్త దగ్గరికి పంపించి ఇలా చెప్పాడు: “దయచేసి మా తరఫున మన దేవుడైన యెహోవాకు ప్రార్థించు.”  అప్పటికింకా యిర్మీయాను చెరసాలలో వేయలేదు,+ కాబట్టి అతను ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.  ఫరో సైన్యం ఐగుప్తు నుండి బయల్దేరింది.+ యెరూషలేమును ముట్టడి వేస్తున్న కల్దీయులు ఆ సంగతి విని, యెరూషలేము నుండి వెనక్కి వెళ్లిపోయారు.+  అప్పుడు యెహోవా వాక్యం యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి ఇలా అంది:  “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, ‘నా దగ్గర విచారణ చేయమని మిమ్మల్ని పంపించిన యూదా రాజుకు మీరిలా చెప్పాలి: “ఇదిగో! మీకు సహాయం చేయడానికి వస్తున్న ఫరో సైన్యం తమ దేశానికి, అంటే ఐగుప్తుకు తిరిగెళ్లిపోతుంది.+  కల్దీయులు తిరిగొచ్చి, ఈ నగరంతో పోరాడి, దాన్ని జయించి, అగ్నితో కాల్చేస్తారు.”+  యెహోవా ఇలా అంటున్నాడు: “ ‘కల్దీయులు ఖచ్చితంగా మన దగ్గర నుండి వెళ్లిపోతారు’ అని అనుకుంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎందుకంటే, వాళ్లు వెళ్లిపోరు. 10  మీరు మీతో పోరాడుతున్న కల్దీయుల సైన్యమంతటినీ చంపేసి, కేవలం వాళ్లలో గాయపడ్డవాళ్లు మాత్రమే మిగిలినా, అప్పటికీ వాళ్లు తమ డేరాల్లో నుండి వచ్చి ఈ నగరాన్ని అగ్నితో కాల్చేస్తారు.” ’ ”+ 11  ఫరో సైన్యం వల్ల కల్దీయుల సైన్యం యెరూషలేము నుండి వెనక్కి వెళ్లినప్పుడు+ 12  యిర్మీయా తన ప్రజల మధ్య తన భాగాన్ని తీసుకోవడానికి యెరూషలేము నుండి బెన్యామీను ప్రాంతానికి+ బయల్దేరాడు. 13  కానీ అతను బెన్యామీను ద్వారం దగ్గరికి చేరుకున్నప్పుడు, కాపలాదారుల అధికారీ హనన్యా మనవడూ షెలెమ్యా కుమారుడూ అయిన ఇరీయా యిర్మీయా ప్రవక్తను పట్టుకుని, “నువ్వు కల్దీయుల దగ్గరికి పారిపోతున్నావు!” అన్నాడు. 14  అందుకు యిర్మీయా, “అది నిజం కాదు! నేను కల్దీయుల దగ్గరికి పారిపోవట్లేదు” అన్నాడు. కానీ ఇరీయా యిర్మీయా మాట వినకుండా అతన్ని బంధించి అధిపతుల దగ్గరికి తీసుకొచ్చాడు. 15  అధిపతులకు యిర్మీయా మీద చాలా కోపం వచ్చింది.+ అప్పుడు వాళ్లు అతన్ని కొట్టి, చెరసాలగా మార్చబడిన కార్యదర్శి యెహోనాతాను ఇంట్లో బంధించి ఉంచారు.+ 16  యిర్మీయాను నేలకింద ఉన్న చెరసాల గదుల్లో ఒకదానిలో ఉంచారు, అతను అక్కడ చాలా రోజులు ఉన్నాడు. 17  అప్పుడు సిద్కియా రాజు అతన్ని పిలిపించుకొని తన రాజభవనంలో రహస్యంగా ప్రశ్నించాడు.+ అతను, “యెహోవా నుండి ఏమైనా సందేశం ఉందా?” అని అడిగాడు. అందుకు యిర్మీయా, “ఉంది! నువ్వు బబులోను రాజు చేతికి అప్పగించబడతావు!” అన్నాడు.+ 18  యిర్మీయా సిద్కియా రాజుతో ఇంకా ఇలా అన్నాడు: “మీరు నన్ను చెరసాలలో వేయడానికి నేను నీకు, నీ సేవకులకు, నీ ప్రజలకు వ్యతిరేకంగా ఏం పాపం చేశాను? 19  ‘బబులోను రాజు మీ మీదికి, ఈ దేశం మీదికి రాడు’ అని ప్రవచించిన మీ ప్రవక్తలు ఏమయ్యారు?+ 20  నా ప్రభువా, రాజా, దయచేసి నా విన్నపం విను. దయచేసి నా మనవి అంగీకరించు. నన్ను తిరిగి కార్యదర్శి యెహోనాతాను+ ఇంటికి పంపించకు, పంపిస్తే నేను అక్కడే చనిపోతాను.”+ 21  కాబట్టి సిద్కియా రాజు యిర్మీయాను కాపలాదారుల ప్రాంగణంలో బందీగా ఉంచమని ఆజ్ఞాపించాడు.+ నగరంలో రొట్టెలు లేకుండా పోయేవరకు,+ రొట్టెలు కాల్చేవాళ్ల వీధి నుండి ప్రతీరోజు అతనికి ఒక గుండ్రటి రొట్టెను ఇచ్చారు.+ యిర్మీయా కాపలాదారుల ప్రాంగణంలోనే ఉండిపోయాడు.

అధస్సూచీలు

యెహోయాకీను, యెకొన్యా అని కూడా పిలవబడ్డాడు.
అక్ష., “నెబుకద్రెజరు.”