రాజులు మొదటి గ్రంథం 16:1-34

  • బయెషాకు వ్యతిరేకంగా యెహోవా తీర్పు (1-7)

  • ఏలా, ఇశ్రాయేలు రాజు (8-14)

  • జిమ్రీ, ఇశ్రాయేలు రాజు (15-20)

  • ఒమ్రీ, ఇశ్రాయేలు రాజు (21-28)

  • అహాబు, ఇశ్రాయేలు రాజు (29-33)

  • హీయేలు యెరికోను మళ్లీ నిర్మించడం (34)

16  అప్పుడు బయెషాకు వ్యతిరేకంగా యెహోవా వాక్యం హనానీ+ కుమారుడైన యెహూ+ దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:  “నేను నిన్ను మట్టిలో నుండి లేపి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకుణ్ణి చేశాను;+ కానీ నువ్వు యరొబాము మార్గంలో నడుస్తూ నా ప్రజలైన ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణం అయ్యావు; వాళ్లు తమ పాపాలతో నాకు కోపం తెప్పించారు.+  కాబట్టి నేను బయెషాను, అతని ఇంటిని పూర్తిగా నిర్మూలించబోతున్నాను, అతని ఇంటిని నెబాతు కుమారుడైన యరొబాము ఇంటిలా చేస్తాను.+  బయెషాకు చెందినవాళ్లు ఎవరైనా నగరంలో చనిపోతే కుక్కలు వాళ్లను తింటాయి; ఎవరైనా పొలంలో చనిపోతే ఆకాశపక్షులు తింటాయి.”  బయెషా మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులు, అతని పరాక్రమ కార్యాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడి​వున్నాయి.  తర్వాత బయెషా చనిపో​యాడు,* అతన్ని తిర్సాలో+ పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కుమారుడైన ఏలా రాజయ్యాడు.  అంతకుముందు, హనానీ కుమారుడైన యెహూ ప్రవక్త ద్వారా యెహోవా వాక్యం బయెషాకు, అతని ఇంటివాళ్లకు వ్యతిరేకంగా వచ్చింది. ఎందుకంటే బయెషా యరొబాము ఇంటివాళ్లలా తయారై, తన పనులతో యెహోవాకు కోపం తెప్పించి, ఆయన దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తించాడు, అంతేకాదు నాదాబును కూడా చంపాడు.+  యూదా రాజైన ఆసా పరిపాలనలోని 26వ సంవత్సరంలో బయెషా కుమారుడైన ఏలా తిర్సాలో ఇశ్రాయేలు మీద రాజయ్యాడు. అతను రెండు సంవత్సరాలు పరిపాలించాడు.  అతని సేవకుని పేరు జిమ్రీ, అతను ఏలాకు చెందిన యుద్ధరథాల దళంలో సగ​భాగానికి ​అధిపతి. రాజు ఒకరోజు తిర్సాలో, రాజభవ​నానికి అధికారైన అర్సా ఇంట్లో బాగా తాగి మత్తుగా ఉన్నప్పుడు, జిమ్రీ అతని మీద కుట్రపన్నాడు. 10  జిమ్రీ, ఇంట్లోకి వచ్చి ఏలాను చంపి,+ అతని స్థానంలో రాజయ్యాడు. యూదా రాజైన ఆసా పరిపాలనలోని 27వ సంవత్సరంలో ఇది జరిగింది. 11  అతను రాజై, సింహాసనం మీద కూర్చున్న వెంటనే అతను బయెషా ఇంటివాళ్లందర్నీ చంపేశాడు. అతను ప్రతీ మగవాణ్ణి చంపాడు, బయెషా బంధువుల్ని,* స్నేహితుల్ని ఎవ్వర్నీ వదల్లేదు. 12  అలా, యెహూ ప్రవక్త ద్వారా యెహోవా బయెషాకు వ్యతిరేకంగా చెప్పినట్టు+ జిమ్రీ బయెషా ఇంటివాళ్లం​దర్నీ నిర్మూ​లించాడు. 13  బయెషా, అతని కుమారుడైన ఏలా చేసిన పాపాలన్నిటి వల్ల, వాళ్లు తమ వ్యర్థమైన విగ్రహాలతో+ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం తెప్పించి ఇశ్రాయేలు ప్రజల చేత చేయిం​చిన పాపాలవల్ల అలా జరిగింది. 14  ఏలా మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి. 15  యూదా రాజైన ఆసా పరిపాలనలోని 27వ సంవత్సరంలో, జిమ్రీ ఏడురోజుల పాటు తిర్సాలో పరిపాలించాడు; ఆ సమయంలో ఇశ్రాయేలు సైనికులు ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోను+ ఎదురుగా దిగారు. 16  జిమ్రీ కుట్రపన్ని రాజును చంపాడనే వార్త ఆ సైనికులకు తెలిసింది. దాంతో ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ రోజున, సైన్యాధిపతైన ఒమ్రీని+ శిబిరంలో ఇశ్రాయేలు మీద రాజును చేశారు. 17  ఒమ్రీ, అతనితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ గిబ్బెతోను నుండి తిర్సాకు వెళ్లి దాన్ని ముట్టడించారు. 18  నగరం స్వాధీనం చేసుకోబడిందని గమనించిన జిమ్రీ రాజభవనంలోని పటిష్ఠమైన బురు​జులోకి వెళ్లి రాజభవనాన్ని తగలబెట్టాడు, అతను ఆ మంటల్లో చనిపోయాడు.+ 19  జిమ్రీ యరొబాము మార్గంలో నడుస్తూ, యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తిస్తూ చేసిన పాపాలవల్ల, అతను ఇశ్రాయేలీయులతో చేయించిన పాపాలవల్ల+ అతనికి అలా జరిగింది. 20  జిమ్రీ మిగతా చరిత్ర గురించి, అతను చేసిన కుట్ర గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. 21  అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గంవాళ్లు గీనతు కుమారుడైన తిబ్నీని రాజును చేయాలని అతన్ని అనుసరించారు, ఇంకో వర్గంవాళ్లు ఒమ్రీని ​అనుసరించారు. 22  అయితే గీనతు కుమారుడైన తిబ్నీ అనుచరుల్ని ఒమ్రీ అనుచరులు ​ఓడించారు. తిబ్నీ చనిపోయాడు, ఒమ్రీ రాజయ్యాడు. 23  యూదా రాజైన ఆసా పరిపాలనలోని 31వ సంవత్సరంలో, ఒమ్రీ ఇశ్రాయేలు మీద రాజయ్యాడు; అతను 12 సంవత్సరాలు పరిపాలించాడు. అతను తిర్సాలో ఆరు సంవత్సరాలు పరిపాలించాడు. 24  అతను షెమెరు నుండి సమరయ పర్వతాన్ని రెండు తలాంతుల* వెండికి కొని, ఆ పర్వతం మీద ఒక నగరాన్ని నిర్మిం​చాడు. అతను తాను కట్టిన నగరానికి, ఆ పర్వతం పాత యజమాని షెమెరు పేరునుబట్టి ​సమరయ*+ అనే పేరు పెట్టాడు. 25  ఒమ్రీ యెహోవా దృష్టికి చెడు చేస్తూ వచ్చాడు, అతను తనకు ముందున్న వాళ్లందరికన్నా ఘోరంగా ప్రవర్తించాడు.+ 26  అతను నెబాతు కుమారుడైన యరొబాము మార్గాలన్నిట్లో నడిచాడు, యరొబాము ఇశ్రాయేలీయులతో చేయించిన పాపాన్నే అతనూ చేశాడు. ఇశ్రాయేలీయులు తమ వ్యర్థమైన విగ్రహాలతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం తెప్పించారు.+ 27  ఒమ్రీ మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులు, అతని పరాక్రమ కార్యాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి. 28  తర్వాత ఒమ్రీ చనిపోయాడు,* అతన్ని సమరయలో పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కుమారుడు అహాబు+ రాజయ్యాడు. 29  యూదా రాజైన ఆసా పరిపాలనలోని 38వ సంవత్సరంలో, ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు మీద రాజయ్యాడు; అతను సమరయలో+ ఇశ్రాయేలును 22 సంవత్సరాలు పరిపాలించాడు. 30  ఒమ్రీ కుమారుడైన అహాబు తనకు ముందున్న వాళ్లందరికన్నా యెహోవా దృష్టికి ఘోరంగా ప్రవర్తించాడు.+ 31  అతను నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాల్ని+ చేయడం చాలదన్నట్టు, సీదోనీయుల+ రాజు ఎత్బయలు కూతురైన యెజెబెలును+ కూడా పెళ్లిచేసుకుని, బయలును సేవించడం,+ దానికి మొక్కడం మొదలుపెట్టాడు. 32  అంతేకాదు, అతను సమరయలో కట్టించిన బయలు గుడిలో+ బయలు కోసం ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. 33  అహాబు పూజా కర్రను* కూడా చేయించాడు.+ అతను తనకు ముందున్న ఇశ్రాయేలు రాజులందరికన్నా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం తెప్పించే పనులు ఎక్కువగా చేశాడు. 34  అతని రోజుల్లో బేతేలుకు చెందిన హీయేలు యెరికోను మళ్లీ నిర్మించాడు. అతను దానికి పునాది వేసినప్పుడు అతని పెద్ద కుమారుడు అబీరాము చనిపోయాడు, దాని తలుపులు నిలబెట్టినప్పుడు అతని చిన్న కుమారుడు సెగూబు చనిపోయాడు. యెహోవా నూను కుమారుడైన యెహోషువ ద్వారా చెప్పిన మాట ప్రకారం అలా జరిగింది.+

అధస్సూచీలు

అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
లేదా “అతని రక్తం విషయంలో ప్రతీకారం తీర్చుకునేవాళ్లను.”
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
“షెమెరు వంశానికి చెందినది” అని అర్థం.
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
పదకోశం చూడండి.