యిర్మీయా 36:1-32
36 యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము+ పరిపాలన నాలుగో సంవత్సరంలో యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది:
2 “ఒక గ్రంథపు చుట్టను తీసుకుని, యోషీయా రోజుల్లో నేను నీతో మాట్లాడిన మొదటి రోజు నుండి+ ఈ రోజు వరకు ఇశ్రాయేలుకు, యూదాకు,+ దేశాలన్నిటికీ వ్యతిరేకంగా నేను నీతో చెప్పిన మాటలన్నీ రాయి.+
3 నేను వాళ్లమీదికి తీసుకురావాలని అనుకుంటున్న విపత్తు అంతటి గురించి విన్నప్పుడు, యూదా ఇంటివాళ్లు బహుశా తమ చెడ్డ మార్గాల్ని విడిచిపెడతారేమో; అప్పుడు నేను వాళ్ల దోషాన్ని, పాపాన్ని క్షమిస్తాను.”+
4 అప్పుడు యిర్మీయా, నేరీయా కుమారుడైన బారూకును+ పిలిపించి యెహోవా తనకు చెప్పిన మాటలన్నీ అతనికి చెప్పాడు, బారూకు వాటిని ఆ గ్రంథపు చుట్టలో రాశాడు.+
5 తర్వాత యిర్మీయా బారూకుకు ఇలా ఆజ్ఞాపించాడు: “నేను బంధించబడి ఉన్నాను, యెహోవా మందిరంలోకి వెళ్లలేను.
6 కాబట్టి నువ్వు మందిరంలోకి వెళ్లి, నేను చెప్తుండగా నువ్వు గ్రంథపు చుట్టలో రాసిన యెహోవా మాటల్ని చదివి వినిపించు. ఉపవాస రోజున యెహోవా మందిరంలో ప్రజలు వింటుండగా వాటిని చదువు; అలా నువ్వు తమ నగరాల నుండి అక్కడికి వచ్చే యూదా ప్రజలందరికీ వాటిని చదివి వినిపిస్తావు.
7 అనుగ్రహం కోసం వాళ్లు చేసే విన్నపం యెహోవాను చేరుకుంటుందేమో, ప్రతీ ఒక్కరు తమ చెడ్డ మార్గాల్ని విడిచిపెడతారేమో; ఎందుకంటే యెహోవా ఈ ప్రజలకు వ్యతిరేకంగా చాలా భయంకరమైన కోపాన్ని, ఉగ్రతను ప్రకటించాడు.”
8 కాబట్టి నేరీయా కుమారుడైన బారూకు యిర్మీయా ప్రవక్త తనకు ఆజ్ఞాపించినదంతా చేశాడు; అతను యెహోవా మందిరంలో గ్రంథపు చుట్ట నుండి యెహోవా మాటల్ని బిగ్గరగా చదివాడు.+
9 యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము+ పరిపాలన ఐదో సంవత్సరం తొమ్మిదో నెలలో యెరూషలేము ప్రజలందరూ, యూదా నగరాల నుండి యెరూషలేముకు వచ్చిన ప్రజలందరూ యెహోవా ముందు ఉపవాసం ఉండడం మొదలుపెట్టారు.+
10 అప్పుడు బారూకు యెహోవా మందిరంలోని గెమర్యా గదిలో* ప్రజలందరూ వింటుండగా గ్రంథపు చుట్ట నుండి యిర్మీయా మాటల్ని బిగ్గరగా చదివాడు. ఈ గెమర్యా,+ శాస్త్రి* అయిన షాఫాను+ కుమారుడు; ఆ గది యెహోవా మందిరంలోని కొత్త ద్వారం ప్రవేశం దగ్గర+ ఉన్న పై ప్రాంగణంలో ఉంది.
11 షాఫాను మనవడూ గెమర్యా కుమారుడూ అయిన మీకాయా గ్రంథపు చుట్టలోని యెహోవా మాటలన్నిటినీ విన్నప్పుడు
12 అతను యూదా రాజు రాజభవనంలోని కార్యదర్శి గదిలోకి వెళ్లాడు. అధిపతులు* అందరూ, అంటే కార్యదర్శి అయిన ఎలీషామా,+ షెమయా కుమారుడు దెలాయ్యా, అక్బోరు+ కుమారుడు ఎల్నాతాను,+ షాఫాను కుమారుడు గెమర్యా, హనన్యా కుమారుడు సిద్కియా, మిగతా అధిపతులందరూ అక్కడ కూర్చొని ఉన్నారు.
13 బారూకు ప్రజల ముందు గ్రంథపు చుట్టలో నుండి చదువుతుండగా తాను విన్న మాటలన్నిటినీ మీకాయా వాళ్లకు చెప్పాడు.
14 అప్పుడు అధిపతులందరూ కూషీ మునిమనవడూ షెలెమ్యా మనవడూ నెతన్యా కుమారుడూ అయిన యెహూదిని బారూకు దగ్గరికి పంపించి, “నువ్వు ప్రజలకు చదివి వినిపించిన గ్రంథపు చుట్టను తీసుకుని రా” అని చెప్పమన్నారు. అప్పుడు నేరీయా కుమారుడైన బారూకు గ్రంథపు చుట్టను చేతితో పట్టుకుని వాళ్ల దగ్గరికి వెళ్లాడు.
15 వాళ్లు అతనితో, “దయచేసి కూర్చో, దాన్ని మాకు చదివి వినిపించు” అన్నారు. బారూకు వాళ్లకు చదివి వినిపించాడు.
16 వాళ్లు ఈ మాటలన్నీ విన్న వెంటనే, భయంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుని, “మేము ఈ మాటలన్నీ ఖచ్చితంగా రాజుకు చెప్పాలి” అని బారూకుతో అన్నారు.
17 తర్వాత వాళ్లు, “దయచేసి, నువ్వు ఈ మాటలన్నీ ఎలా రాశావో చెప్పు. యిర్మీయా చెప్తుంటే రాశావా?” అని బారూకును అడిగారు.
18 దానికి బారూకు, “అవును, అతనే ఈ మాటలన్నీ నాకు చెప్పాడు, నేను వాటిని సిరాతో ఈ గ్రంథపు చుట్టలో రాశాను” అని చెప్పాడు.
19 అప్పుడు అధిపతులు బారూకుతో ఇలా అన్నారు: “వెళ్లి నువ్వూ యిర్మీయా దాక్కోండి; మీరు ఎక్కడున్నారో ఎవరికీ తెలియనివ్వకండి.”+
20 తర్వాత ఆ అధిపతులు ప్రాంగణంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్లి, గ్రంథపు చుట్టను కార్యదర్శి అయిన ఎలీషామా గదిలో పెట్టి, తాము విన్నదంతా రాజుకు చెప్పారు.
21 కాబట్టి రాజు గ్రంథపు చుట్టను తీసుకురావడానికి యెహూదిని పంపించాడు,+ అతను కార్యదర్శి అయిన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకొచ్చాడు. రాజూ, రాజు దగ్గర నిల్చున్న అధిపతులందరూ వింటుండగా యెహూది దాన్ని చదవడం మొదలుపెట్టాడు.
22 తొమ్మిదో నెలలో* రాజు, చలికాలపు ఇంటిలో కూర్చొని ఉన్నాడు, అతని ముందు కుంపటిలో అగ్ని మండుతోంది.
23 యెహూది మూడునాలుగు వరుసలు చదవగానే, కార్యదర్శి కత్తితో రాజు గ్రంథపు చుట్టలోని ఆ భాగాన్ని కోసేసి, కుంపటిలో మండుతున్న అగ్నిలో వేశాడు. ఆ గ్రంథపు చుట్ట అంతా కుంపటిలో కాలిపోయే వరకు అతను అలా చేశాడు.
24 వాళ్లు ఏమాత్రం భయపడలేదు; రాజు గానీ, ఆ మాటలన్నీ విన్న అతని సేవకులు గానీ తమ బట్టలు చింపుకోలేదు.
25 గ్రంథపు చుట్టను కాల్చేయవద్దని ఎల్నాతాను,+ దెలాయ్యా,+ గెమర్యా+ వేడుకున్నా రాజు వాళ్ల మాట వినలేదు.
26 అంతేకాదు అతను కార్యదర్శి అయిన బారూకును, యిర్మీయా ప్రవక్తను పట్టుకోమని రాజు కుమారుడైన యెరహ్మెయేలుకు, అజ్రీయేలు కుమారుడైన శెరాయాకు, అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యాకు ఆజ్ఞాపించాడు, కానీ యెహోవా వాళ్లను దాచివుంచాడు.+
27 యిర్మీయా చెప్తుండగా బారూకు రాసిన గ్రంథపు చుట్టను రాజు కాల్చేసిన తర్వాత, యెహోవా వాక్యం మళ్లీ యిర్మీయా దగ్గరికి వచ్చి+ ఇలా అంది:
28 “ఇంకొక గ్రంథపు చుట్ట తీసుకుని, యూదా రాజైన యెహోయాకీము కాల్చేసిన మొదటి గ్రంథపు చుట్టలో+ ఉన్న మాటలన్నిటినీ మళ్లీ దానిలో రాయి.
29 యూదా రాజైన యెహోయాకీముకు ఇలా చెప్పు: ‘యెహోవా ఇలా అంటున్నాడు: “ ‘ “బబులోను రాజు తప్పకుండా వస్తాడు, మనుషులు గానీ జంతువులు గానీ లేకుండా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు”+ అని నువ్వు దీనిలో ఎందుకు రాశావు?’ అంటూ ఈ గ్రంథపు చుట్టను కాల్చేశావు కదా,
30 కాబట్టి యూదా రాజైన యెహోయాకీము గురించి యెహోవా ఇలా అంటున్నాడు: ‘దావీదు సింహాసనం మీద కూర్చోవడానికి అతని వంశస్థుల్లో ఎవ్వరూ మిగలరు,+ అతని శవం పగలు ఎండకు ఎండుతుంది, రాత్రి మంచుకు తడుస్తుంది.+
31 నేను అతన్ని, అతని వంశస్థుల్ని, అతని సేవకుల్ని వాళ్ల దోషాన్ని బట్టి లెక్క అడుగుతాను; వాళ్లమీదికి, యెరూషలేము నివాసుల మీదికి, యూదా ప్రజల మీదికి నేను తీసుకొస్తానన్న విపత్తు అంతటినీ తీసుకొస్తాను,+ ఎందుకంటే వాళ్లు నా మాట వినలేదు.’ ” ’ ”+
32 అప్పుడు యిర్మీయా ఇంకో గ్రంథపు చుట్టను తీసుకుని నేరీయా కుమారుడూ కార్యదర్శీ అయిన బారూకుకు ఇచ్చాడు.+ యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చేసిన గ్రంథపు చుట్టలో+ ఉన్న మాటలన్నీ యిర్మీయా చెప్తుండగా అతను అందులో రాశాడు. అలాంటి ఇంకా చాలా మాటలు అందులో చేర్చబడ్డాయి.
అధస్సూచీలు
^ లేదా “భోజనాల గదిలో.”
^ లేదా “నకలు రాసే వ్యక్తి.”
^ లేదా “ఆస్థాన అధికారులు.”
^ నవంబరు మధ్య నుండి డిసెంబరు మధ్య వరకు. అనుబంధం B15 చూడండి.