యిర్మీయా 34:1-22

  • సిద్కియాకు తీర్పు సందేశం (1-7)

  • బానిసలకు విడుదల దయచేసే ఒప్పందాన్ని మీరడం (8-22)

34  బబులోను రాజు నెబుకద్నెజరు,* అతని సైన్యమంతా, భూమ్మీద అతని ఆధిపత్యం కింద ఉన్న రాజ్యాలన్నీ, జనాలన్నీ యెరూషలేముతో, దాని నగరాలన్నిటితో పోరాడుతున్నప్పుడు+ యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు వెళ్లి, యూదా రాజు సిద్కియాతో+ ఇలా చెప్పు: “యెహోవా ఏమంటున్నాడంటే, ‘ఇదిగో, నేను ఈ నగరాన్ని బబులోను రాజు చేతికి అప్పగిస్తున్నాను, అతను దాన్ని అగ్నితో కాల్చేస్తాడు.+  నువ్వు అతని చేతిలో నుండి తప్పించుకోవు, ఖచ్చితంగా నిన్ను పట్టుకొని అతనికి అప్పగిస్తారు.+ నువ్వు బబులోను రాజును కళ్లారా చూస్తావు, ముఖాముఖిగా అతనితో మాట్లాడతావు, నువ్వు బబులోనుకు వెళ్తావు.’+  అయితే యూదా రాజైన సిద్కియా, యెహోవా చెప్పే మాట విను, ‘నీ గురించి యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు ఖడ్గం వల్ల చనిపోవు.  నువ్వు ప్రశాంతంగా చనిపోతావు,+ వాళ్లు నీ తండ్రుల కోసం, అంటే నీకు ముందున్న రాజుల కోసం కాల్చినట్టే నీ కోసం పరిమళ ద్రవ్యాల్ని కాలుస్తారు, ‘అయ్యో, మా యజమానీ!’ అంటూ నీ కోసం ఏడుస్తారు. ఎందుకంటే ‘నేనే ఈ మాట చెప్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.” ’ ” ’ ”  తర్వాత యిర్మీయా ప్రవక్త యెరూషలేములో ఈ మాటలన్నిటిని యూదా రాజైన సిద్కియాతో చెప్పాడు.  అప్పుడు బబులోను రాజు సైన్యాలు యెరూషలేముతో, మిగిలిన యూదా నగరాలన్నిటితో అంటే లాకీషుతో,+ అజేకాతో+ పోరాడుతున్నాయి;+ ఎందుకంటే ప్రాకారాలుగల యూదా నగరాల్లో మిగిలినవి అవే.  విడుదలను ప్రకటించమని+ చెప్తూ సిద్కియా రాజు యెరూషలేములో ఉన్న ప్రజలందరితో ఒప్పందం చేసిన తర్వాత యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది.  ఆ ఒప్పందం ప్రకారం ప్రతీ వ్యక్తి హెబ్రీయులైన తన దాసుల్ని, దాసురాళ్లను విడుదల చేయాలి, ఎవరూ తోటి యూదుణ్ణి దాసునిగా ఉంచుకోకూడదు. 10  దానికి అధిపతులందరూ, ప్రజలందరూ లోబడ్డారు. ప్రతీ వ్యక్తి తన దాసుల్ని, దాసురాళ్లను విడుదల చేయాలి, వాళ్లను ఇక నుండి దాసులుగా ఉంచుకోకూడదు అనే ఒప్పందంలో వాళ్లు చేరారు. వాళ్లు దానికి లోబడి వాళ్లను విడిచిపెట్టారు. 11  కానీ ఆ తర్వాత, తాము విడిచిపెట్టిన దాసుల్ని, దాసురాళ్లను వెనక్కి తెచ్చుకొని, వాళ్లను మళ్లీ బానిసల్ని చేసుకున్నారు. 12  కాబట్టి యెహోవా నుండి యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 13  “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను మీ పూర్వీకుల్ని దాస్య గృహమైన ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చిన రోజున+ వాళ్లతో ఇలా ఒప్పందం చేశాను:+ 14  “మీలో ప్రతీ ఒక్కరు మీకు అమ్మబడి, ఆరు సంవత్సరాలు మీకు సేవచేసిన హెబ్రీయుడైన మీ సహోదరుణ్ణి ఏడు సంవత్సరాల చివర్లో విడిచిపెట్టాలి. మీరు ఖచ్చితంగా అతన్ని విడుదల చేయాలి.”+ అయితే మీ పూర్వీకులు నా మాట వినలేదు, పట్టించుకోలేదు. 15  ఈ మధ్యే మీరు మనసు మార్చుకుని మీ తోటివాళ్లకు విడుదల ప్రకటించి నా దృష్టిలో సరైనది చేశారు, నా పేరు పెట్టబడిన మందిరంలో నా ముందు ఒక ఒప్పందం చేశారు. 16  అయితే మీరు మళ్లీ మనసు మార్చుకున్నారు; మీ దాసుల్ని, దాసురాళ్లను వాళ్ల ఇష్టప్రకారం వెళ్లనిచ్చిన తర్వాత మళ్లీ వాళ్లను వెనక్కి తెచ్చుకుని బానిసల్ని చేసుకున్నారు; అలా నా పేరును అపవిత్రపర్చారు.’+ 17  “కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘తన సహోదరునికి, తోటివానికి విడుదల ప్రకటించే విషయంలో మీరు నాకు లోబడలేదు.+ కాబట్టి ఇప్పుడు నేను మీకు విడుదల ప్రకటిస్తాను’ అని యెహోవా చెప్తున్నాడు; ‘నేను మిమ్మల్ని ఖడ్గానికి, తెగులుకు, కరువుకు అప్పగిస్తాను;+ భూమ్మీదున్న రాజ్యాలన్నీ మిమ్మల్ని చూసి భయపడేలా చేస్తాను.+ 18  దూడను రెండు ముక్కలు చేసి వాటి మధ్య నడిచినప్పుడు నా ముందు చేసిన ఒప్పంద మాటల్ని+ పాటించకుండా ఎవరైతే నా ఒప్పందాన్ని మీరారో వాళ్లకు ఇలా జరుగుతుంది, 19  అంటే దూడ రెండు ముక్కల మధ్య నడిచిన యూదా అధిపతులకు, యెరూషలేము అధిపతులకు, ఆస్థాన అధికారులకు, యాజకులకు, దేశ ప్రజలందరికీ ఇలా జరుగుతుంది: 20  నేను వాళ్లను వాళ్ల శత్రువుల చేతికి, వాళ్ల ప్రాణాలు తీయాలని చూస్తున్నవాళ్ల చేతికి అప్పగిస్తాను, వాళ్ల శవాలు ఆకాశపక్షులకు, భూమ్మీది జంతువులకు ఆహారమౌతాయి.+ 21  యూదా రాజు సిద్కియాను, అతని అధిపతుల్ని వాళ్ల శత్రువుల చేతికి, వాళ్ల ప్రాణాలు తీయాలని చూస్తున్నవాళ్ల చేతికి, మీతో పోరాడడం ఆపి వెనక్కి వెళ్లిపోతున్న+ బబులోను రాజు సైన్యాల చేతికి అప్పగిస్తాను.’+ 22  “యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను ఆజ్ఞ ఇచ్చి వాళ్లను మళ్లీ ఈ నగరానికి రప్పిస్తాను, వాళ్లు దీనితో పోరాడతారు, దీన్ని ఆక్రమించి, అగ్నితో కాల్చేస్తారు;+ నేను యూదా నగరాల్ని నివాసులు లేని పాడుబడ్డ భూమిలా చేస్తాను.’ ”+

అధస్సూచీలు

అక్ష., “నెబుకద్రెజరు.”