కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“అప్రమత్తంగా ఉండండి”—తీర్పు తీర్చే గడియ వచ్చింది!

“అప్రమత్తంగా ఉండండి”—తీర్పు తీర్చే గడియ వచ్చింది!

“అప్రమత్తంగా ఉండండి”​—⁠తీర్పు తీర్చే గడియ వచ్చింది!

“మీ ప్రభువు ఏ రోజున వస్తాడో మీకు తెలియదు కాబట్టి సదా అప్రమత్తంగా ఉండండి.”​—⁠మత్తయి 24:​42, Nw.

ఒక దొంగ మీ చుట్టుప్రక్కల ఇళ్లను దోచుకుంటున్నాడని తెలిస్తే మీరేమి చేస్తారు? మీ ప్రియమైనవారిని, మీ విలువైన వస్తువులను కాపాడుకునేందుకు మీరు మెలకువగా, అప్రమత్తంగా ఉంటారు. ఎందుకంటే, ఆ దొంగ తానెప్పుడు వస్తాడో చెప్పడానికి మీకు ఉత్తరమేమీ వ్రాయడు. బదులుగా, అతడు గుట్టుగా మీరు ఊహించని సమయంలో వస్తాడు.

2 దొంగ వచ్చే తీరును యేసు చాలాసార్లు ఉపమానంగా ఉపయోగించాడు. (లూకా 10:30; యోహాను 10:​10) అంత్యకాలములోనూ, తాను తీర్పు అమలుచేసేందుకు రావడానికి ముందూ జరిగే సంఘటనల గురించి యేసు ఈ హెచ్చరికను ఇచ్చాడు: “ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా [‘సదా అప్రమత్తంగా,’ NW] నుండుడి. ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.” (మత్తయి 24:​42, 43) కాబట్టి యేసు తన రాకడను, దొంగ వచ్చే తీరుతో, అంటే ఊహించని సమయంలో రావడంతో పోల్చాడు.

3 ఆ ఉపమానం సమంజసమైనదే, ఎందుకంటే యేసు రాకడకు సంబంధించిన ఖచ్చితమైన తేదీ ఎవరికీ తెలియదు. అంతకుముందు అదే ప్రవచనంలో యేసు ఇలా చెప్పాడు: “ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.” (మత్తయి 24:​36) కాబట్టి యేసు తన శ్రోతలకు “సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి” అని ఉద్బోధించాడు. (మత్తయి 24:​44, NW) యేసు హెచ్చరికను లక్ష్యపెట్టేవారు, యెహోవా తీర్పును అమలుచేసే ప్రతినిధిగా ఆయన ఎప్పుడు వచ్చినా మంచి నడవడితో సిద్ధంగా ఉంటారు.

4 కాబట్టి ఉత్పన్నమయ్యే కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఏవంటే: యేసు ఇచ్చిన ఆ హెచ్చరిక కేవలం లోకస్థులకేనా లేక నిజ క్రైస్తవులు కూడా ‘అప్రమత్తంగా ఉండాలా’? ‘అప్రమత్తంగా ఉండడం’ ఇప్పుడెందుకు అత్యవసరం, దీనిలో ఏమి ఇమిడివుంది?

ఎవరికి హెచ్చరిక?

5 అవును, రాబోయే విపత్తు గురించిన హెచ్చరిక విషయంలో తమ చెవులు మూసుకున్న లోకస్థులకు ప్రభువు రాకడ ఖచ్చితంగా ఒక దొంగ రావడంలాగే ఉంటుంది. (2 పేతురు 3:​3-7) అయితే నిజ క్రైస్తవుల విషయమేమిటి? అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులకు ఇలా వ్రాశాడు: “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.” (1 థెస్సలొనీకయులు 5:2) ‘యెహోవా దినము వస్తుంది’ అనే విషయంలో మనకు అపనమ్మకం లేదు. అయితే మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని అది తగ్గిస్తుందా? ‘మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును’ అని యేసు చెప్పింది తన శిష్యులకేనని గమనించండి. (మత్తయి 24:​44) అంతకుముందు ‘రాజ్యమును వెదకుడి’ అని తన శిష్యులను ప్రోత్సహించినప్పుడు కూడా యేసు వారిని ఇలా హెచ్చరించాడు: ‘మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి.’ (లూకా 12:​31, 40) కాబట్టి ‘అప్రమత్తంగా ఉండండి’ అని యేసు తన అనుచరులను హెచ్చరించినప్పుడు ఆయన మదిలో వారే ఉన్నారని స్పష్టమవడం లేదా?

6 మనమెందుకు ‘అప్రమత్తంగా,’ ‘సిద్ధంగా ఉండాలి’? యేసు ఇలా వివరించాడు: “ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసికొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును; ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొనిపోబడును, ఒకతె విడిచిపెట్టబడును.” (మత్తయి 24:​40, 41) భక్తిహీన ప్రపంచం నాశనం చేయబడినప్పుడు, తాము సిద్ధంగా ఉన్నట్లు రుజువు చేసుకునేవారు ‘తీసుకుపోబడతారు’ లేదా రక్షించబడతారు. తమ సొంత జీవన విధానాన్ని స్వార్థపూరితంగా అనుసరించిన కారణంగా ఇతరులు నాశనానికి ‘విడిచిపెట్టబడతారు.’ వీరిలో ఒకప్పుడు సత్యం తెలుసుకున్నా అప్రమత్తంగా ఉండనివారు కూడా ఉండవచ్చు.

7 ఈ పాత వ్యవస్థ అంతమయ్యే ఖచ్చితమైన తేదీ తెలియకపోవడం, మనం దేవుణ్ణి పవిత్రమైన ఉద్దేశంతోనే సేవిస్తున్నామని నిరూపించుకునే అవకాశాన్ని మనకిస్తుంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? అంతం రావడానికి ఇంకా చాలా సమయమున్నట్లు అనిపించవచ్చు. విచారకరంగా, అలా భావించిన కొందరు క్రైస్తవులు యెహోవా సేవలో తమ ఆసక్తి చల్లబడిపోవడానికి అనుమతించారు. అయితే, మన సమర్పణ ద్వారా యెహోవాను సేవించేందుకు ఎలాంటి షరతులు లేకుండా మనల్ని మనం ఆయనకు అర్పించుకున్నాం. యెహోవాను ఎరిగినవారికి, ఆఖరి నిమిషంలో ఆసక్తి చూపించడం ఆయనను సంతోషపెట్టదని తెలుసు. ఆయన మన హృదయంలో ఏముందో చూస్తాడు.​—⁠1 సమూయేలు 16:⁠7.

8 మనం యెహోవాను నిజంగా ప్రేమిస్తాం కాబట్టి, ఆయన చిత్తం చేయడానికి మనమెంతో సంతోషిస్తాం. (కీర్తన 40:8; మత్తయి 26:​39) మనం నిరంతరం యెహోవాను సేవించాలని కోరుకుంటాం. మనం ఆశించిన దానికన్నా కాస్త ఎక్కువ సమయం వేచి ఉన్నందువల్ల ఆ భావి నిరీక్షణకున్న విలువేమీ తగ్గిపోదు. అతి ప్రాముఖ్యంగా, యెహోవా దినం ఆయన సంకల్పాలను ఎలా నెరవేరుస్తుందో చూసేందుకు ఆత్రుతతో ఎదురుచూస్తూ మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాం. దేవుణ్ణి సంతోషపెట్టాలనే మన మనఃపూర్వక కోరిక, ఆయన వాక్యంలోని ఉపదేశాన్ని అన్వయించుకుంటూ మన జీవితాల్లో ఆయన రాజ్యానికి మొదటి స్థానమిచ్చేలా మనల్ని పురికొల్పుతుంది. (మత్తయి 6:33; 1 యోహాను 5:3) అప్రమత్తంగా ఉండడం మనం తీసుకునే నిర్ణయాలను, మన దైనందిన జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేయాలో పరిశీలిద్దాం.

మీ జీవితం ఎటు వెళుతోంది?

9 నేడు చాలామంది గంభీరమైన సమస్యలు, దిగ్భ్రాంతికరమైన సంఘటనలు సర్వసాధారణమైపోయాయని గుర్తిస్తూ, తమ జీవితాలు వెళ్తున్న దిశనుబట్టి సంతోషిస్తూ ఉండకపోవచ్చు. అయితే లోక పరిస్థితుల అసలు భావమేమిటో వారికి తెలుసా? మనం ‘యుగసమాప్తిలో’ జీవిస్తున్నామని వారు గ్రహిస్తున్నారా? (మత్తయి 24:⁠3) స్వార్థం, దౌర్జన్యం, అలాగే భక్తిహీన వైఖరులు, ఈ కాలాలను ‘అంత్యదినములుగా’ గుర్తిస్తున్నాయని వాళ్ళు గ్రహిస్తున్నారా? (2 తిమోతి 3:​1-5) వారు వీటన్నిటి విశేషతను గ్రహించి తమ జీవితపు దిశను పరిశీలించుకోవడం అత్యవసరం.

10 మరి మన విషయమేమిటి? ప్రతీరోజు మనం మన ఉద్యోగానికి, ఆరోగ్యానికి, కుటుంబానికి, ఆరాధనకు సంబంధించి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. బైబిలు చెప్పేదేమిటో మనకు తెలుసు, మనం దానిని అన్వయించుకోవడానికి కృషి చేస్తాం. కాబట్టి మనల్ని మనమిలా ప్రశ్నించుకోవాలి: ‘జీవితపు చింతలు నన్ను పక్కదారి పట్టించేందుకు అనుమతించానా? ఈ లోకపు తత్త్వాలు, దాని ఆలోచనా విధానం నా నిర్ణయాల్ని నిర్దేశించేందుకు అనుమతిస్తున్నానా?’ (లూకా 21:34-36; కొలొస్సయులు 2:⁠8) మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, పూర్ణహృదయంతో యెహోవాను నమ్ముతున్నామని నిరూపించుకోవడంలో మనం కొనసాగాలి. (సామెతలు 3:5) ఆ విధంగా మనం “వాస్తవమైన జీవమును” అంటే దేవుని నూతనలోకంలో నిరంతర జీవితాన్ని పొందగలుగుతాం.​—⁠1 తిమోతి 6:12, 18.

11 మనం అప్రమత్తంగా ఉండేందుకు సహాయపడగల అనేక హెచ్చరికా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. నోవహు కాలంలో ఏమి జరిగిందో పరిశీలించండి. దేవుడు చాలాకాలం ముందుగానే హెచ్చరిక ఇవ్వబడేలా చూశాడు. నోవహు ఆయన కుటుంబం తప్ప మిగతావాళ్ళెవ్వరూ దానిని పట్టించుకోలేదు. (2 పేతురు 2:⁠5) యేసు దాని గురించే చెబుతూ ఇలా అన్నాడు: “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.” (మత్తయి 24:​37-39) దీనినుండి మనమేమి నేర్చుకోవచ్చు? మనలో ఎవరమైనా లోకసంబంధ వ్యవహారాలు అంటే జీవితపు సాధారణ విషయాలు, దేవుడు మొదటిస్థానం ఇమ్మని మనకు ఉద్బోధించిన ఆధ్యాత్మిక కార్యకలాపాల స్థానాన్ని ఆక్రమించేందుకు అనుమతిస్తుంటే, మన పరిస్థితి గురించి మనం గంభీరంగా ఆలోచించవలసిందే.​—⁠రోమీయులు 14:⁠17.

12 లోతు కాలం గురించి కూడా ఆలోచించండి. లోతు, ఆయన కుటుంబం నివసించిన సొదొమ పట్టణం సంపన్నమైనదే, అయితే అది నైతికంగా ఎంతో దిగజారిపోయింది. ఆ పట్టణాన్ని నాశనం చేసేందుకు యెహోవా తన దూతలను పంపించాడు. ఆ దూతలు, లోతును ఆయన కుటుంబాన్ని అక్కడనుండి పారిపొమ్మని, వెనక్కి తిరిగి చూడవద్దని త్వరపెట్టారు. ఆ దేవదూతల ప్రోత్సాహంతో వారు ఆ పట్టణాన్ని విడిచివెళ్ళారు. అయితే లోతు భార్య సొదొమ పట్టణంలో ఉన్న తమ ఇంటి గురించే అదేపనిగా ఆలోచించినట్లు స్పష్టమవుతోంది. ఆమె అవిధేయతతో వెనక్కి తిరిగి చూసింది, ఫలితంగా ఆమె తన ప్రాణాలనే కోల్పోయింది. (ఆదికాండము 19:​15-26) యేసు ప్రవచనార్థకంగా ఇలా హెచ్చరించాడు: “లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి.” మరి మనం ఆ హెచ్చరికకు తగినట్టుగా ప్రవర్తిస్తున్నామా?​—⁠లూకా 17:⁠32.

13 దైవిక హెచ్చరికలను లక్ష్యపెట్టినవారు రక్షించబడ్డారు. నోవహు ఆయన కుటుంబం విషయంలో, లోతు ఆయన కుమార్తెల విషయంలో అలాగే జరిగింది. (2 పేతురు 2:⁠9) ఈ ఉదాహరణల్లో ఉన్న హెచ్చరికను మనం గంభీరంగా తీసుకుంటుండగా, నీతిని ప్రేమించేవారి కోసం వాటిలోవున్న విడుదల సందేశాన్నిబట్టి కూడా మనం ప్రోత్సహించబడతాం. అది ‘నీతినివసించే’ ‘క్రొత్త ఆకాశముల, క్రొత్త భూమి కొరకైన’ దేవుని వాగ్దాన నెరవేర్పుకు సంబంధించిన బలమైన నిరీక్షణతో మన హృదయాలను నింపుతుంది.​—⁠2 పేతురు 3:⁠13.

‘తీర్పుతీర్చే గడియ వచ్చింది’!

14 మనం అప్రమత్తంగా ఉంటూ దేనికోసం ఎదురుచూడవచ్చు? దేవుని సంకల్ప నెరవేర్పులో భాగంగా క్రమేణా చోటుచేసుకునే సంఘటనల గురించి ప్రకటన గ్రంథం స్పష్టంగా వివరిస్తోంది. మనం సిద్ధంగా ఉన్నామని నిరూపించుకోవాలంటే, అది చెప్పే విషయాలకు తగ్గట్టు ప్రవర్తించడం ఆవశ్యకం. ఆ ప్రవచనం “ప్రభువు దినమందు” జరిగే సంఘటనలను స్పష్టంగా వర్ణిస్తోంది, 1914లో యేసు పరలోకంలో రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు ఆ దినం ఆరంభమైంది. (ప్రకటన 1:​10) ప్రకటన మన దృష్టిని, “ప్రకటించునట్లు నిత్యసువార్త” అప్పగించబడిన దేవదూతవైపు మళ్లిస్తోంది. ఆయన గొప్ప స్వరంతో ఇలా ప్రకటిస్తున్నాడు: “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను.” (ప్రకటన 14:​6, 7) ఆ తీర్పు “గడియ” స్వల్ప కాలవ్యవధి; దానిలో ఆ ప్రవచనంలో వర్ణించబడిన తీర్పుల ప్రకటన, తీర్పు అమలుచేయడం కూడా ఉన్నాయి. మనమిప్పుడు ఆ కాలంలోనే జీవిస్తున్నాం.

15 ఇప్పుడు, ఆ తీర్పుతీర్చే గడియ ముగియక ముందే మనమిలా ఉద్బోధించబడుతున్నాం: “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి.” దీనిలో ఏమి ఇమిడివుంది? దేవునిపట్ల ఉండే సరైన భయం మనం చెడుతనానికి దూరంగా ఉండేలా మనల్ని పురికొల్పాలి. (సామెతలు 8:​13) మనం దేవుణ్ణి గౌరవిస్తే, ఆయన చెప్పే విషయాలను ప్రగాఢ గౌరవంతో వింటాం. ఆయన వాక్యమైన బైబిలును చదవడానికి తీరిక దొరకనంతగా ఇతర పనుల్లో మునిగిపోం. క్రైస్తవ కూటాలకు హాజరవమని ఆయన ఇచ్చిన ఉపదేశాన్ని మనం తేలికగా తీసుకోం. (హెబ్రీయులు 10:​24, 25) దేవుని మెస్సీయ రాజ్య సువార్తను ప్రకటించే ఆధిక్యతను విలువైనదిగా పరిగణిస్తూ, ఆసక్తిగా ఆ పని చేస్తాం. మనం ఎల్లప్పుడూ పూర్ణ హృదయంతో యెహోవాను విశ్వసిస్తాం. (కీర్తన 62:⁠8) యెహోవాయే విశ్వసర్వాధిపతి అని గుర్తిస్తూ, మన జీవితాలకూ ఆయనే సర్వాధిపతి అని ఇష్టపూర్వకంగా ఆయనకు లోబడుతూ ఆయనను గౌరవిస్తాం. మీరు నిజంగా దేవునికి భయపడుతూ, అలాంటి వాటన్నింటిలో ఆయనను మహిమపరుస్తున్నారా?

16ప్రకటన 14వ అధ్యాయం తీర్పు గడియలో జరిగే ఇతర సంఘటనలను కూడా వర్ణిస్తోంది. ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను మొదట ప్రస్తావించబడింది: “వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి . . . మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను.” (ప్రకటన 14:⁠8) అవును, దేవుని దృష్టిలో మహాబబులోను ఇప్పటికే కూలిపోయింది. వేలాది సంవత్సరాలుగా ప్రజలను, జనాంగాలను గుప్పిట్లో పెట్టుకున్న బబులోను సిద్ధాంతాల, అభ్యాసాల దాసత్వం నుండి 1919లో యెహోవా అభిషిక్త సేవకులు విడుదల చేయబడ్డారు. (ప్రకటన 17:​1, 15) దానితో సత్యారాధనకు తోడ్పడేలా తమను తాము అర్పించుకునే అవకాశం వారికి లభించింది. అప్పటినుండి ప్రపంచవ్యాప్త సువార్త ప్రకటనా పని జరుగుతోంది.​—⁠మత్తయి 24:⁠14.

17 మహాబబులోనుకు విధించబడిన దేవుని తీర్పు అంతటితోనే ముగిసిపోలేదు. దాని అంతిమ నాశనం త్వరలో జరగనుంది. (ప్రకటన 18:​21) అందుకే మంచి కారణంతోనే ప్రజలందరికీ బైబిలు ఇలా ఉద్బోధిస్తోంది: “మీరు దాని [మహాబబులోను] పాపములలో పాలివారుకాకుండునట్లు . . . దానిని విడిచి రండి.” (ప్రకటన 18:​4, 5) మనం మహాబబులోనును విడిచి బయటకు ఎలా వస్తాం? దీనిలో అబద్ధమతంతో తెగతెంపులు చేసుకోవడం మాత్రమే లేదు. జనసమ్మతమైన అనేక వేడుకల్లో, ఆచారాల్లో, లైంగిక దుర్నీతిని ఆమోదించే ప్రాపంచిక దృక్పథంలో, విస్తరిస్తున్న అభిచార సంబంధ వినోదంలో, ఇంకా ఇతరత్రా అనేక విషయాల్లో బబులోను ప్రభావం ఉంది. అప్రమత్తంగా ఉండేందుకు, మన క్రియల్లో, మన హృదయ కోరికల్లో మనం అన్ని విధాలుగా మహాబబులోనును నిజంగా విడిచిపెట్టామని నిరూపించడం ఆవశ్యకం.

18ప్రకటన 14:​9, 10లో ‘తీర్పుతీర్చు గడియకు’ సంబంధించిన మరో అంశముంది. మరో దూత ఇలా చెబుతున్నాడు: “ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతిమీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల . . . దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును.” ఎందుకు? ఎందుకంటే, “ఆ క్రూరమృగము . . . దాని ప్రతిమ” యెహోవా సర్వాధిపత్యాన్ని అంగీకరించని మానవ పరిపాలనకు చిహ్నాలుగా ఉన్నాయి. మెలకువగా ఉండే క్రైస్తవులు తమ దృక్పథంలో లేదా చర్యల్లో, సత్య దేవుడైన యెహోవా మహోన్నత సర్వాధిపత్యాన్ని అంగీకరించని వారికి తాము దాసోహమనే ముద్ర వేయబడకుండా లేదా వారి ప్రభావం తమపై పడకుండా జాగ్రత్త పడతారు. దేవుని రాజ్యం ఇప్పటికే పరలోకంలో స్థాపించబడిందనీ, అది మానవ పరిపాలనలన్నింటినీ అంతమొందించి, నిరంతరం నిలుస్తుందనీ క్రైస్తవులకు తెలుసు.​—⁠దానియేలు 2:⁠44.

మీ అత్యవసర భావాన్ని పోగొట్టుకోకండి!

19 మనం అంతానికి దగ్గరయ్యేకొద్దీ ఒత్తిళ్లు, శోధనలు ఇంకా తీవ్రమవుతాయి. మనం ఈ పాత విధానంలో నివసిస్తున్నంత కాలం మన అపరిపూర్ణతలు మనల్ని పీడించడమే కాక, అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రియమైనవారు చనిపోవడం, ఆయాస భావాలు, దేవుని వాక్యం ప్రకటిస్తుండగా మనకెదురయ్యే ఉదాసీనతనుబట్టి కలిగే నిరుత్సాహం, వంటి ఇంకా అనేకమైనవాటి ప్రభావం కూడా మనపై ఉంటుంది. సాతాను మనకొచ్చే ఒత్తిళ్లను, మనం విరమించుకునేలా అంటే సువార్తను ప్రకటించకుండా లేదా దేవుని ప్రమాణాల ప్రకారం జీవించకుండా ఉండేలా చేసేందుకు ఉపయోగించుకోవడానికి ఇష్టపడతాడని మనం మరచిపోకూడదు. (ఎఫెసీయులు 6:​11-13) మనం నివసిస్తున్న కాలం విషయంలో మన అత్యవసర భావాన్ని పోగొట్టుకోవడానికి ఇది సమయం కాదు!

20 మనం విరమించుకోవాలనే తీవ్రమైన ఒత్తిడికి గురవుతామని యేసుకు తెలుసు, అందుకే ఆయన మనకు ఇలా ఉపదేశించాడు: “ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా [‘అప్రమత్తంగా,’ NW] నుండుడి.” (మత్తయి 24:​42) కాబట్టి కాలప్రవాహంలో మనమెక్కడున్నామనే విషయంలో మనం సదా అప్రమత్తంగా ఉందాం. మనం సత్యం విషయంలో కుంటుపడేలా లేదా విడిచిపెట్టేలా చేయగల సాతాను కుతంత్రాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాజ్య సువార్తను మరింత ఆసక్తిగా, తీర్మానపూర్వకంగా ప్రకటించడానికి నిర్ణయించుకుందాం. మన అత్యవసర భావాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ, ‘అప్రమత్తంగా ఉండండి’ అని యేసు ఇచ్చిన హెచ్చరికను లక్ష్యపెడదాం. అలా అప్రమత్తంగా ఉండడంవల్ల మనం యెహోవాకు ఘనతను తీసుకురావడమే కాక, నిత్యాశీర్వాదాలు పొందేవారిలో కూడా ఒకరమై ఉంటాం.

మీరెలా సమాధానమిస్తారు?

“అప్రమత్తంగా ఉండండి” అని యేసు ఇచ్చిన హెచ్చరిక నిజ క్రైస్తవులకు అన్వయిస్తుందని మనకెలా తెలుసు?

‘అప్రమత్తంగా ఉండేందుకు’ బైబిల్లోని ఏ హెచ్చరికా ఉదాహరణలు మనకు సహాయం చేయగలవు?

తీర్పుతీర్చు గడియ అంటే ఏమిటి, అది ముగియక ముందు మనమేమి చేయడానికి ఉద్బోధించబడ్డాం?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. యేసు తన రాకడను సమంజసమైన విధంగా దేనితో పోల్చాడు?

3, 4. (ఎ) యేసు రాకడకు సంబంధించిన హెచ్చరికను లక్ష్యపెట్టడంలో ఏమి ఇమిడివుంది? (బి) ఏ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి?

5. ‘అప్రమత్తంగా ఉండండి’ అనే హెచ్చరిక నిజ క్రైస్తవులకు వర్తిస్తుందని మనకెలా తెలుసు?

6. మనమెందుకు ‘అప్రమత్తంగా ఉండాలి?’

7. అంతం ఎప్పుడు వస్తుందో తెలియని కారణంగా మనమేమి చేసే అవకాశముంది?

8. యెహోవాపట్ల మనకున్న ప్రేమ అప్రమత్తంగా ఉండేలా మనల్ని ఎలా పురికొల్పుతుంది?

9. లోకంలోని ప్రజలు మన కాలాల విశేషతను గుర్తించడం ఎందుకు అత్యవసరం?

10. మనం అప్రమత్తంగా ఉన్నామని నిరూపించుకునేందుకు మనమేమి చేయాలి?

11-13. (ఎ) నోవహు కాలంలో, (బి) లోతు కాలంలో సంభవించిన ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

14, 15. (ఎ) తీర్పు ‘గడియలో’ ఏమి ఇమిడివుంది? (బి) ‘దేవునికి భయపడి, ఆయనను మహిమపరచడంలో’ ఏమి ఇమిడివుంది?

16. ప్రకటన 14:8లో మహాబబులోనుకు వ్యతిరేకంగా ప్రకటించబడిన తీర్పు ఇప్పటికే అమలు చేయబడిందని మనమెందుకు చెప్పవచ్చు?

17. మహాబబులోనును విడిచిపెట్టి రావడంలో ఏమి ఇమిడివుంది?

18. ప్రకటన 14:9, 10లో వర్ణించబడిన దాని దృష్ట్యా మెలకువగా ఉండే క్రైస్తవులు జాగ్రత్తగా దేనికి దూరంగా ఉంటారు?

19, 20. (ఎ) మనం అంతానికి దగ్గరయ్యేకొద్దీ, సాతాను ఏమి చేయడానికి ప్రయత్నిస్తాడని మనం నమ్మవచ్చు? (బి) మనమేమి చేయడానికి తీర్మానించుకోవాలి?

[23వ పేజీలోని చిత్రం]

యేసు తన రాకడను ఒక దొంగ రాకతో పోల్చాడు

[24వ పేజీలోని చిత్రం]

మహాబబులోను నాశనం సమీపించింది

[25వ పేజీలోని చిత్రాలు]

మరింత ఆసక్తితో, నిశ్చయతతో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలని నిర్ణయించుకుందాం