కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ జీవితం ఎంత విలువైనది?

మీ జీవితం ఎంత విలువైనది?

మీ జీవితం ఎంత విలువైనది?

మొదటి ప్రపంచ యుద్ధకాలంలో యూరప్‌లో లెక్కలేనన్ని ప్రాణాలు బలవుతుంటే, మరోవైపు అంటార్కిటికాలో ప్రాణాలను కాపాడడానికి అసాధారణమైన ప్రయత్నాలు చేయబడ్డాయి. ఆంగ్లో-ఐరిష్‌ పరిశోధకుడైన ఎర్నెస్ట్‌ షాకిల్టన్‌, ఆయన సహచరులు ప్రయాణిస్తున్న ఎండ్యూరెన్స్‌ అనే ఓడ మంచులో ఇరుక్కుని ముందుకు వెళ్ళలేక బ్రద్దలై మునిగిపోయినప్పుడు వాళ్ళకు కష్టాలు ప్రారంభమయ్యాయి. షాకిల్టన్‌ తన సహచరులను కొంతమేరకు సురక్షిత ప్రాంతమైన దక్షిణ అట్లాంటిక్‌ మహాసముద్రంలోని ఎలిఫెంట్‌ ద్వీపానికి చేరవేయగలిగాడు. ఆ ద్వీపానికి చేరుకున్న తర్వాత కూడా వాళ్ళు ఘోరమైన ప్రమాద స్థితిలోనే ఉన్నారు.

దక్షిణ జార్జియా ద్వీపంలో వాణిజ్య ఉత్పత్తులను సేకరించడానికి తిమింగలాలను వేటాడే స్టేషన్‌నుండి సహాయం పొందడం కోసం కొంతమందిని పంపించడమే తాము బ్రతికి బయటపడడానికున్న ఒకే ఒక్క మార్గమని షాకిల్టన్‌ గ్రహించాడు. ఆ స్టేషన్‌ 1,100 కిలోమీటర్ల దూరంలో ఉంది, తన దగ్గరేమో మునిగిపోతున్న ఎండ్యూరెన్స్‌ నుండి తాను కాపాడగలిగిన 7 మీటర్ల లైఫ్‌బోట్‌ మాత్రమే ఉంది. వాళ్ళు సురక్షితంగా గమ్యం చేరుకోగలిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపించాయి.

అయితే షాకిల్టన్‌, ఆయన బృందంలోని కొందరు 17 రోజులపాటు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించిన తర్వాత 1916, మే 10న దక్షిణ జార్జియాకు చేరుకున్నారు, కానీ తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండడంవల్ల వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ద్వీపానికి మరోవైపు దిగవలసి వచ్చింది. అందువల్ల వాళ్ళు తమ గమ్యాన్ని చేరుకోవడానికి మరో 30 కిలోమీటర్లు మంచుతో కప్పబడిన గుర్తు తెలియని కొండల్లోనుండి ప్రయాణించవలసి వచ్చింది. ఒకవైపు ఎముకలు కొరికే చలి బాధిస్తుంటే, మరోవైపు కొండలు ఎక్కడానికి సరైన సాధనాలు లేకుండా షాకిల్టన్‌, ఆయన సహచరులు ఎన్నో కష్టాలుపడి ఎట్టకేలకు తమ గమ్యాన్ని చేరుకున్నారు, చివరకు ఆయన ఎలిఫెంట్‌ ద్వీపంపై వదిలి వచ్చిన తన మిగతా సహచరులను కూడా కాపాడాడు. షాకిల్టన్‌ అంత పట్టుదలతో ఎందుకు ప్రయత్నించాడు? “తన బృందంలోని ప్రతి ఒక్కరూ ప్రాణాలతో బయటపడేలా చేయాలన్నదే ఆయన లక్ష్యం” అని జీవిత చరిత్రకారుడైన రోలాండ్‌ హంట్‌ఫోర్డ్‌ వ్రాశాడు.

“ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు”

షాకిల్టన్‌ సహచరులు “ముప్పై కిలోమీటర్లు ఆ చివరినుండి ఈ చివరి వరకూ రాళ్ళతో మంచుతో కప్పబడి, చేరడానికి వీల్లేని నిస్తేజమైన ప్రాంతంలో” ముడుచుకుని కూర్చొని వేచిచూస్తున్నప్పుడు ఆశ వదులుకోకుండా ఎలా ఉండగలిగారు? తమ నాయకుడు తమని రక్షిస్తానని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడన్న నమ్మకంతోనే.

నేడు మానవజాతి, ఎలిఫెంట్‌ ద్వీపంపై వదిలేయబడిన ఆ మనుష్యుల్లాగే ఉంది. చాలామంది నమ్మశక్యంకానంత ఘోరమైన పరిస్థితుల్లో జీవిస్తూ కేవలం బ్రతికి ఉండడానికే ఎన్నో కష్టాలు పడుతున్నారు. అయినా కూడా దేవుడు ‘శ్రమపడేవారిని’ అణచివేతనుండి బాధలనుండి ‘విడిపిస్తాడని’ వారికి పూర్తి నమ్మకం ఉంది. (యోబు 36:15) దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని విలువైనదిగా పరిగణిస్తున్నాడనే నమ్మకంతో ఉండండి. “ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను” అని సృష్టికర్తయైన యెహోవా దేవుడు చెబుతున్నాడు.​—⁠కీర్తన 50:15.

భూమిపైనున్న వందల కోట్లమంది ప్రజల్లో సృష్టికర్త మిమ్మల్ని వ్యక్తిగతంగా విలువైన వ్యక్తిగా పరిగణిస్తున్నాడని నమ్మడం కష్టంగా ఉందా? అలాగైతే మన చుట్టూ ఉన్న సువిశాల విశ్వంలోని వందల కోట్ల నక్షత్ర వీధుల్లోవున్న కోటానుకోట్ల నక్షత్రాల గురించి యెషయా ప్రవక్త ఏమి వ్రాశాడో గమనించండి. మనమిలా చదువుతాము: “మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.”​—⁠యెషయా 40:26.

దాని భావమేమిటో మీకు అర్థమయ్యిందా? మన సౌరమండలం కేవలం ఒక సూక్ష్మ భాగంగా ఉన్న మన పాలపుంత నక్షత్ర వీధిలోనే కనీసం 10,000 కోట్ల నక్షత్రాలున్నాయి. అలాంటి నక్షత్ర వీధులు ఇంకా ఎన్ని ఉన్నాయి? వాటి సంఖ్య ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియదు, అయితే వాటి సంఖ్య 12,500 కోట్లు ఉండవచ్చని కొంతమంది అంచనా వేశారు. అంటే విశ్వంలో మన మతిపోయేటన్ని నక్షత్రాలున్నాయి! కానీ విశ్వ సృష్టికర్త ఆ నక్షత్రాల్లో ప్రతి దానిని పేరు పెట్టి పిలుస్తాడని బైబిలు మనకు చెబుతోంది.

“మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి”

‘కానీ కేవలం కోటానుకోట్ల నక్షత్రాల పేర్లు లేదా కోట్లాదిమంది ప్రజల పేర్లు తెలిసివుండడం అంటే వారిపట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవడమని కాదు’ అని కొందరు అనవచ్చు. మెమరీ ఎక్కువగావున్న కంప్యూటర్‌ కూడా కోట్లాదిమంది పేర్లను గుర్తు పెట్టుకోగలదు. అంతమాత్రాన, ఆ కంప్యూటర్‌కు ఆ ప్రజలపట్ల శ్రద్ధ ఉందని ఎవ్వరూ అనుకోరు. అయితే యెహోవా దేవునికి కోట్లాదిమంది పేర్లు తెలియడమే కాదు, ఆయనకు వారిపట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ ఉంది అని కూడా బైబిలు చెబుతోంది. “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు.​—⁠1 పేతురు 5:⁠7.

యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనుపడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.” (మత్తయి 10:​29-31) పిచ్చుకలకు, మనుష్యులకు ఏమి జరుగుతుందో దేవునికి తెలుసు అని యేసు చెప్పలేదని గమనించండి. “మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు” అని ఆయన చెప్పాడు. మీరు ఎందుకు పిచ్చుకలకంటే శ్రేష్ఠులు? ఎందుకంటే మీరు “దేవుని స్వరూపమందు” చేయబడ్డారు, అంటే దేవుని ఉన్నత లక్షణాలను ప్రతిబింబించే నైతిక, మేధాసంబంధమైన, ఆధ్యాత్మిక లక్షణాలను పెంపొందించుకొని వాటిని ప్రదర్శించే సామర్థ్యంతో చేయబడ్డారు.​—⁠ఆదికాండము 1:26, 27.

“బుద్ధిసూక్ష్మతతో చేసిన కార్యాల ఫలితం”

సృష్టికర్త లేడని వాదించే ప్రజల అభిప్రాయాలతో మోసపోకండి. వారి అభిప్రాయం ప్రకారం మిమ్మల్ని ఎలాంటి వ్యక్తిత్వమూ లేని అదుపు చేయలేని శక్తులు సృష్టించాయి. మీరు ‘దేవుని స్వరూపములో’ చేయబడలేదనీ, నిజానికి పిచ్చుకలతో సహా ఈ గ్రహంపైవున్న ఇతర జంతువులకూ మీకు తేడా లేదని వారు చెబుతారు.

కేవలం యాదృచ్ఛికంగానో ఎలాంటి వ్యక్తిత్వమూ లేని శక్తి మూలంగానో జీవం ప్రారంభమయ్యిందని నమ్మడం సహేతుకమేనా? సూక్ష్మాణువుల జీవశాస్త్రవేత్త మైకెల్‌ జె. బెహె ప్రకారం, జీవాన్ని నియంత్రించే “అత్యంత సంక్లిష్టమైన జీవరసాయన ప్రక్రియలను” చూసిన తర్వాత అలా నమ్మడం పూర్తిగా నిర్హేతుకమైనదవుతుంది. జీవరసాయనశాస్త్ర రుజువులను చూస్తే “భూమిపైనున్న జీవం అత్యంత ప్రాథమిక స్థాయిలో కూడా . . . బుద్ధిసూక్ష్మతతో చేసిన కార్యాల ఫలితమే” అనే ముగింపుకు రావడం తప్ప మరో మార్గం లేదని ఆయన అంటున్నాడు.​—⁠డార్విన్స్‌ బ్లాక్‌ బాక్స్‌​—⁠ద బయోకెమికల్‌ ఛాలెంజ్‌ టు ఎవల్యూషన్‌.

భూమిపైవున్న జీవం అన్ని స్థాయిల్లోనూ బుద్ధిసూక్ష్మతతో చేసిన కార్యాల ఫలితమేనని బైబిలు మనకు చెబుతోంది. ఆ బుద్ధిసూక్ష్మతతో చేసిన కార్యాలన్నింటికి మూలం ఈ విశ్వ సృష్టికర్తయైన యెహోవా దేవుడని బైబిలు మనకు చెబుతోంది.​—⁠కీర్తన 36:9; ప్రకటన 4:10.

మనం బాధలతో నిండివున్న లోకంలో జీవించవలసి వస్తున్నందుకు, ఈ భూమిని దానిలో ఉన్న సమస్తాన్ని ఎవరూ సృష్టించలేదు అనే ముగింపుకు రాకండి. రెండు ప్రాథమిక సత్యాలను గుర్తుంచుకోండి. మొదటిది, మన చుట్టూ ఉన్న అపరిపూర్ణతను దేవుడు కలిగించలేదు. దానిని తాత్కాలికంగా అనుమతించడానికి మన సృష్టికర్తకు బలమైన కారణాలు ఉన్నాయి. ఈ పత్రిక తరచూ చర్చించినట్లుగా యెహోవా దేవుడు కేవలం పరిమితమైన సమయం వరకే దుష్టత్వాన్ని అనుమతించాడు, మానవులు ఆయన విశ్వసర్వాధిపత్యాన్ని మొదటిసారిగా నిరాకరించినప్పుడు లేవదీయబడిన నైతిక వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడానికే ఆయన అలా చేశాడు. *​—⁠ఆదికాండము 3:1-7; ద్వితీయోపదేశకాండము 32:4, 5; ప్రసంగి 7:29; 2 పేతురు 3:8, 9.

“దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును”

నేడు అనేకమంది ప్రజలు ఎన్నో దయనీయమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తున్నా కూడా జీవితం ఒక అద్భుతమైన వరమే. మనం దానిని కాపాడుకోవడానికి సాధ్యమైనదంతా చేయాలి. దేవుడు వాగ్దానం చేసిన భవిష్యత్తు జీవితం, ఎలిఫెంట్‌ ద్వీపంపై షాకిల్టన్‌ సహచరుల్లా క్రూరమైన బాధాకరమైన పరిస్థితుల్లో కేవలం బ్రతికి ఉండడానికి చేసే పోరాటంలాంటిది కాదు. దేవుడు మానవ సృష్టి కోసం మొదట సంకల్పించినట్లు మనం ‘వాస్తవమైన జీవమును సంపాదించుకునేలా’ ప్రస్తుతం మనం అనుభవిస్తున్న బాధాకరమైన వ్యర్థమైన పరిస్థితులనుండి మనల్ని కాపాడాలన్నదే దేవుని సంకల్పం.​—⁠1 తిమోతి 6:18.

దేవుని దృష్టిలో మనలో ప్రతి ఒక్కరమూ విలువైనవారము కాబట్టే ఆయన మన కోసం వాటన్నింటిని చేస్తాడు. మనం మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలనుండి వారసత్వంగా పొందిన పాపం, అపరిపూర్ణత, మరణంనుండి మనల్ని విడిపించడానికి కావలసిన విమోచన క్రయధన బలిని అర్పించడానికి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. (మత్తయి 20:28) “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును . . . నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని యేసుక్రీస్తు చెప్పాడు.​—⁠యోహాను 3:16.

బాధలతో, అణచివేతతో నాశనం చేయబడిన జీవితాలను గడుపుతున్నవారి కోసం దేవుడు ఏమి చేస్తాడు? దేవుని కుమారుని గురించి దేవుని ప్రేరేపిత వాక్యం మనకు ఇలా చెబుతోంది: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును.” దేవుడు అలా ఎందుకు చేస్తాడు? ఎందుకంటే “వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.”​—⁠కీర్తన 72:12-14.

ఎన్నో శతాబ్దాలుగా మానవజాతి ఎంతో బాధతో నొప్పితో ‘మూలుగుతున్నట్లు’ పాపమరణాలకు బానిసగా కష్టపడుతోంది. దానివల్ల కలిగే ఎలాంటి నష్టాన్నైనా తాను పూడ్చగలననే నమ్మకంతోనే దేవుడు అలా జరగడానికి అనుమతించాడు. (రోమీయులు 8:18-22) ఇప్పుడు త్వరలోనే ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు చేతుల్లో ఉన్న తన రాజ్య ప్రభుత్వం ద్వారా ‘అన్నిటికీ కుదురుబాటు’ చేస్తాడు.​—⁠అపొస్తలుల కార్యములు 3:21; మత్తయి 6:9, 10.

అప్పుడు గతంలో బాధలనుభవించి చనిపోయినవారు పునరుత్థానం చేయబడతారు. వారందరిని దేవుడు జ్ఞాపకముంచుకున్నాడు. (యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:14) త్వరలోనే వారికి ‘జీవము సమృద్ధిగా కలుగుతుంది’ అంటే నొప్పి గానీ బాధలు గానీ లేని పరదైసు భూమిపై పరిపూర్ణులుగా నిత్యం జీవించే అవకాశం వారికి లభిస్తుంది. (యోహాను 10:10; ప్రకటన 21:3-5) అప్పుడు జీవిస్తున్న ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తూ “దేవుని స్వరూపమందు” చేయబడిన వారికి గుర్తింపు చిహ్నంగా ఉండే అద్భుతమైన లక్షణాలను, సామర్థ్యాలను పెంపొందించుకుంటారు.

యెహోవా వాగ్దానం చేసిన ఆ జీవితాన్ని అనుభవించడానికి మీరు బ్రతికే ఉంటారా? అది మీ చేతుల్లోనే ఉంది. ఈ ఆశీర్వాదాలన్నింటిని తీసుకురావడానికి దేవుడు చేసిన ఏర్పాట్లనుండి ప్రయోజనం పొందమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. అలా చేయడానికి మీకు సహాయం చేసేందుకు ఈ పత్రిక ప్రచురణకర్తలు సంతోషిస్తారు.

[అధస్సూచి]

^ పేరా 17 ఈ విషయం గురించి మరిన్ని వివరాల కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలో, “దేవుడెందుకు బాధను అనుమతిస్తున్నాడు?” అనే అంశాన్ని చర్చించే 8వ అధ్యాయాన్ని చూడండి.

[4, 5వ పేజీలోని చిత్రం]

ద్వీపంపై వదిలివేయబడ్డ షాకిల్టన్‌ సహచరులు, ఆయన తమను కాపాడతానని చేసిన వాగ్దానంపై నమ్మకముంచారు

[చిత్రసౌజన్యం]

© CORBIS

[6వ పేజీలోని చిత్రం]

“మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు”