యోబు 36:1-33

 • దేవుని గొప్పతనాన్ని ఎలీహు ఘనపర్చాడు (1-33)

  • లోబడితే వర్ధిల్లుతారు; భక్తిహీనులు తిరస్కరించబడతారు (11-13)

  • ‘దేవుని లాంటి ఉపదేశకుడు ఎవరు?’ (22)

  • యోబు దేవుణ్ణి ఘనపర్చాలి (24)

  • “మనం గ్రహించగలిగే దానికన్నా దేవుడు చాలా గొప్పవాడు” (26)

  • దేవుడు వర్షాన్ని, ఉరుముల్ని అదుపుచేస్తాడు (27-33)

36  ఎలీహు ఇంకా ఇలా అన్నాడు:   “ఇంకాసేపు నేను చెప్పేది ఓపిగ్గా విను,దేవుని తరఫున నేను మాట్లాడాల్సింది ఇంకా ఉంది.   నాకు తెలిసింది నేను సవివరంగా చెప్తాను,నన్ను తయారుచేసిన వ్యక్తి నీతిమంతుడని ప్రకటిస్తాను.+   నా మాటలు అబద్ధం కాదు;నువ్వు పరిపూర్ణ జ్ఞానం కలిగిన దేవుని+ ముందు ఉన్నావు.   దేవుడు చాలా శక్తిమంతుడు,+ ఆయన ఎవ్వర్నీ తిరస్కరించడు;ఆయన అవగాహనా* శక్తి చాలా గొప్పది.   దుష్టుల ప్రాణాల్ని ఆయన కాపాడడు,+అయితే కష్టాల్లో ఉన్నవాళ్లకు న్యాయం చేస్తాడు.+   నీతిమంతుల నుండి ఆయన తన కళ్లు పక్కకు తిప్పుకోడు;+వాళ్లను రాజులతో పాటు* సింహాసనం మీద కూర్చోబెడతాడు,+ వాళ్లు శాశ్వతంగా హెచ్చించబడతారు.   కానీ వాళ్లు సంకెళ్లతో బంధించబడి ఉంటే,కష్టాల తాళ్లలో చిక్కుకొని ఉంటే,   వాళ్లు చేసిన పనిని,గర్వంతో వాళ్లు చేసిన అపరాధాల్ని వాళ్లకు తెలియజేస్తాడు. 10  దిద్దుబాటును వినేలా వాళ్ల చెవులు తెరుస్తాడు,చెడ్డపనులు మానేయమని చెప్తాడు.+ 11  వాళ్లు లోబడి ఆయన్ని సేవిస్తే,తమ జీవితకాలమంతా వర్ధిల్లుతారు,వాళ్ల సంవత్సరాలు ఆహ్లాదకరంగా సాగిపోతాయి.+ 12  కానీ వాళ్లు లోబడకపోతే, కత్తి* చేత నశిస్తారు,+జ్ఞానం లేకుండా చనిపోతారు. 13  భక్తిహీనులు* లోపల కోపం పెట్టుకుంటారు.దేవుడు వాళ్లను బంధించినప్పుడు కూడా వాళ్లు సహాయం కోసం మొరపెట్టరు. 14  వాళ్లు ఆలయ వేశ్యల*+ మధ్య జీవితం గడుపుతూ,*చిన్నవయసులోనే చనిపోతారు.+ 15  కానీ దీనులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన* వాళ్లను కాపాడతాడు;వాళ్లు అణచివేతకు గురౌతున్నప్పుడు వాళ్ల చెవులు తెరుస్తాడు. 16  ఆయన నిన్ను విపత్తు అంచు నుండి దూరంగా,+విశాలమైన స్థలంలోకి, ఎలాంటి ఆంక్షలూ లేని చోటికి తీసుకెళ్తాడు;+నీ బల్ల మీద కొవ్విన ఆహారం పెట్టి నీకు ఊరట దయచేస్తాడు.+ 17  తర్వాత తీర్పు తీర్చబడి న్యాయం స్థాపించబడినప్పుడు,+దుష్టుల మీదికి వచ్చిన తీర్పును బట్టి నువ్వు సంతృప్తి చెందుతావు. 18  అయితే జాగ్రత్త, కోపంతో నువ్వు ద్వేషం పెంచుకుని చెడుగా ప్రవర్తించకు,*+పెద్దపెద్ద లంచాల వల్ల తప్పుదారి పట్టకు. 19  సహాయం కోసం నువ్వు పెట్టే మొర గానీ,నువ్వు చేసే తీవ్రమైన ప్రయత్నాలు గానీ విపత్తు నుండి నిన్ను కాపాడతాయా?+ 20  ప్రజలు తమ స్థలాల నుండి కనుమరుగైపోయే రాత్రి కోసం ఎదురుచూడకు. 21  చెడు మార్గంలోకి వెళ్లే బదులు,కష్టాలు సహించడాన్నే ఎంచుకో.+ 22  చూడు! దేవుడు తన శక్తిని బట్టి హెచ్చించబడుతున్నాడు;ఆయన లాంటి ఉపదేశకుడు ఎవరు? 23  ఆయన మార్గాన్ని నిర్దేశించింది* ఎవరు?+‘నువ్వు చేసింది తప్పు’ అని ఆయనతో అన్నది ఎవరు?+ 24  ఆయన పనుల్ని ఘనపర్చడం మర్చిపోకు,+ప్రజలు వాటి గురించి పాటలు పాడారు.+ 25  మానవజాతి అంతా వాటిని చూసింది,మనుషులు దూరం నుండి వాటిని గమనిస్తున్నారు. 26  అవును, మనం గ్రహించగలిగే దానికన్నా దేవుడు చాలా గొప్పవాడు;+ఆయన సంవత్సరాల్ని లెక్కపెట్టడం అసాధ్యం.+ 27  ఆయన నీటి బిందువుల్ని పైకి చేదుతాడు;+అవి ఘనీభవించి వర్షంలా మారతాయి; 28  మేఘాలు వాటిని కుమ్మరిస్తాయి;+అవి మనుషుల మీద జల్లులా కురుస్తాయి. 29  మబ్బుల పొరల్ని, ఆయన డేరా*+ నుండి వచ్చే ఉరుముల్నిఎవరైనా అర్థం చేసుకోగలరా? 30  ఆయన తన మెరుపుల్ని*+ దానిమీద ఎలా పరుస్తున్నాడో,సముద్రపు అడుగుభాగాన్ని ఎలా కప్పుతున్నాడో చూడు. 31  వీటితో ఆయన దేశదేశాల ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాడు;*వాళ్లకు సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడు.+ 32  ఆయన తన చేతులతో మెరుపుల్ని కప్పుతాడు,వాటిని లక్ష్యం మీదికి పంపిస్తాడు.+ 33  ఆయన ఉరుము ఆయన గురించి చెప్తుంది,పశువులు కూడా ఎవరు వస్తున్నారో* చెప్తాయి.

అధస్సూచీలు

అక్ష., “హృదయం.”
లేదా “రాజుల్ని” అయ్యుంటుంది.
లేదా “ఆయుధం (విసిరే ఆయుధం).”
లేదా “భ్రష్ట హృదయంగల వాళ్లు.”
లేదా “మగవేశ్యల.”
లేదా “ముగిస్తూ” అయ్యుంటుంది.
లేదా “దేవుడు.”
లేదా “ఎగతాళిగా చప్పట్లు కొట్టకు.”
లేదా “విమర్శించింది; లెక్క అడిగింది” అయ్యుంటుంది.
అక్ష., “పర్ణశాల.”
అక్ష., “వెలుగును.”
లేదా “వ్యాజ్యాన్ని వాదిస్తున్నాడు” అయ్యుంటుంది.
లేదా “ఏం వస్తుందో” అయ్యుంటుంది.